Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 38


    నాతో పాటుగానే నీవు, నీతో పాటుగానే నేను. మైత్రి మరో రూపంగా మనమనిద్దరం.
    కుల, మత, జాతి, భాష, ప్రాంతీయ తత్వాలకు అతీతంగా సన్నిహితంగా జీవిద్దాం.
    ఆర్ధికమయిన బాధలులేనివాళ్ళం మైత్రికోసం నాతో పాటుగా ఉండిపోతావా?" అని అడిగిందామె. ఆ మాటలు వాటి వెనకవున్న మధురమైన మైత్రీభావం, అభిమానం అన్నీ అర్ధం చేసుకున్న ఫిజో బాగా విచలితుడయినాడు.
    కదిలిపోయినాడు. కన్నీరు మున్నీరుగా కరిగిపోయి నాడు. "సోదరీ! నీకోసం నేను బ్రతుకుతాను. నా జీవితంలోని అర్ధమంతా నీతో మైత్రిని నిలుపుకోవటం ఒక్కటే! నీ అభిమానం స్నేహం నా బ్రతుకు దారిని మళ్ళించినాయి. నీతో పాటుగా ఉండి స్నేహమనే స్వర్గాన్ని దక్కించుకుంటాను. అర్ధమానవుడిని గురించి నీవు చేస్తున్న ప్రయోగంలో పాలుపంచుకుంటాను." అన్నాడతడు నిండుమనసుతో.
    కంటనీరు తుడుచుకుంది కెప్టెన్ మాలతి.
    "ఇప్పుడు నీవు చాలా మంచివాడివి అనిపించుకున్నావు. నీకు ఒక్కవారం దినాలు సమయం కేటాయిస్తున్నాను. నీవు ఖట్మండు వెళ్ళిపోయి నీస్వంత పనులు చూచుకుని వచ్చెయ్యి. ఎలాంటి స్థితిలో అయినా ఈనాటికి ఎనిమిదవరోజున నీవిక్కడ ఉంటున్నావు.
    వెంటనే బయలుదేరు." అన్నది మాలతి.
    అమితమయిన ఆనందంతో ఖట్మండుకి ప్రయాణమై వెళ్ళిపోయినాడు ఫిజో.
    ఫిజో వెళ్ళి పోయింతర్వాత అర్ధమానవుడికి చాల సుఖంగా స్వేచ్చగా అనిపించింది. మాలతి సాహచర్యంతో అతడు పొందగలిగిన అపూర్వమైన అనుభూతిని ఫిజో మైత్రిలో పొందలేక పోయేవాడు.
    కారణం చాల మౌలికమయినా మానసిక వికారం. దాని పేరే స్వార్ధం. ప్రాణుల్లో చాలా పురాతనమయిన ఎలిమెంట్ స్వార్ధం.
    అది మనుషుల సాహచర్యం వలన ఎదుగుతున్న అర్ధమానవుని మనోగతిలో  ప్రత్యక్షమయింది.
    మాలతి అనే తేనె పట్టునించి మృదులము, మందారము అయిన స్నేహమనే మధువు లభిస్తోంది.
    అదంతా తానొక్కడే దక్కించుకోవాలన్న స్వార్ధం మనిషి కాబట్టి అతనిలోనూ ఉంది.
    ఫిజో వెళ్ళిపోవటం అతనికి హాయిగా అన్పించింది. నాలుగయిదు రోజులు వెంట తిప్పుతూ మాటలు నేర్పుతూ మధ్య మధ్య మనుషులతో మాట్లాడిస్తూ గడిపివేసింది మాలతి. అయినా అన్ని నాళ్ళు ఆమెకు ఎటువంటి సమస్యలూ ఎదురు కాలేదు.
    అర్ధమానవుడిప్పుడు మోకాళ్ళ కిందికి ఉండేలా ఒక వస్త్రాన్ని దరించగలుగుతున్నాడు. చాలా మాటలు చెప్ప గలుగుతున్నాడు. కాని ఆ మాటలకు నిర్దిష్టమై ఉన్న అర్ధాలను అతడెరుగడు.
    అవి అర్ధం చేసుకునేలా అతడిని తీర్చిదిద్దేందుకు ఒక విచిత్రమైన మార్గాన్ని అనుసరిస్తోంది మాలతి.
    ఒక వస్తువు పేరు చెప్పటం అతడు ఆ పేరు మారగానే ఆ వస్తువుని గుర్తించేలా చేయటం ప్ర్రారంభించిందామె ప్రధమంలో అర్ధమానవుడు ఈ ప్రయోగాన్ని క్రీడగా స్వీకరించాడు.
    ఆ క్రీడలో అతనికి అపరిమితమయిన ఆనందం లభ్యమవుతూ ఉంది. మాలతిని చనువుగా అతనితోమసలుకోవటం ఈ క్రీడలో అతనికి బాగా నచ్చిన అంశం.
    ఎవరయినా కొత్తమనిషికనిపించగానే గుడ్ మార్నింగ్ చెప్పడం షేక్ హాండ్ ఇవ్వటం నేర్పిందామె. వస్త్రధారణ అనేది అర్ధమానవుడు నిమిత్తమాత్రంగా మాత్రమే చేస్తూ ఉండేవాడు:
    ఆ స్థితినించి అతడిప్పుడు మరికొంత ఎదిగాడు. ప్రతి క్షణం ముఖ్యంగా ఇతరులున్నప్పుడు వస్త్రధారణ విషయం లో జాగ్రత్తపడటం ఇప్పుడు అలవాటయింది.
    ప్రధమంగా అతని శిరోజాలు క్రమబద్దం చేయబడి నాయి. ఇతఃపూర్వం అట్టలు కట్టిపోయి జడల్లా అల్లుకుపోయినాయి. శిరోజాలు షాంపుతో వాటిని శుభ్రపరిచాక విడిపడినాయి.
    ఇప్పుడు క్రమబద్ధం చేశాక అతనికి సుఖంగా అన్పించింది. గడ్డం కూడా గీయించేసింది మాలతి, ఆ తరువాత మొదటి సరిగా అతన్ని నిలువెత్తు అద్దం ముందు నిలబెట్టింది.
    అద్దంలో ఉన్నది మరొక మనిషి అనుకున్నాడతడు. తన ప్రతిబింబానికి గుడ్ మార్నింగ్ చెప్పి షేక్ హాండ్ ఇవ్వబోయాడతడు.
    అద్దంలో ప్రతిబింబం కూడాచేయి ముందుకు చాచింది కాని అతని చేయిని స్పృశించలేక తికమకపడిపోయినాడతడు. అర్ధమానవుడు ఒకటి రెండు సార్లు అలా తబ్బిబ్బు పడిపోయిన తరువాత మాలతి వచ్చి అతని ప్రక్కనే నిలబడింది.
    తన ఎదుట ఉన్న మాలతికాక మరొకమాలతి కన్పించటంతో అతడు విభ్రాంతుడయినాడు. ఆమెను పట్టుకోవాలని ముందుకు ఉరికి అద్దంమీదికి పోయినాడు.
    అది అడ్డు రావటంతో ఆగిపోయినాడు.
    క్రమంగా ఆ విచిత్రం అతనికి అర్ధమయింది. నిముషానికొకసారి మాలతిని పిలిచి అద్దం ముందు నిలబెట్టటం ప్ర్రారంభించాడు.
    ప్రతిసారి తమ ఇద్దరినీ అద్దంలో చూచి చేతులు త్రిప్పి నాలుక జాపటం మొదలు పెట్టాడు. మాటలు  నేర్చుకోవటం లాగే అది కూడా ఒక క్రీడ అయిందతనికి.
    మాలతి సాహచర్యంలో ఎన్నో అద్భుతాలు అతని అనుభవంలోకి వచ్చినాయి. జీవితంలో నాగరిక మైన లక్షణాలు ఏర్పడటం ప్రారంభించినాయి. ఈ మార్పు అంతా అతనికి ఇష్టమైన రీతిలో ఒక క్రీడలా కొనసాగించుతూ వచ్చింది మాలతి.
    అందునించి ఎంతో వేగంగా ఆ జీవితంలా పురోగమించసాగాడు. మూడు రోజుల తరువాత చెంపలమీద మళ్ళి వెంట్రుకలు మొలుచుకు వచ్చాయి వాటిని తీసి వేయించవలసిందిగా సూచనలు చేయటం మొదలు పెట్టాడు అర్ధమానవుడు.
    అద్దం ముందు నిలబడి చెంపలు తడుముకోవటం సాగించాడు. అటువంటి పురోగమనం కోసం ఎదురు చూస్తున్న మాలతికి తన ప్రయత్నాలు ఫలిస్తాయన్న ఆశ మొలకెత్తింది కత్తి తీసుకుని మంగలి రాగానే ఈ మారు అర్ధమానవుడు రవంత అయినా కంగారు పడలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS