Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 38


    "ఏమిటీ కోడలుగారుకూడా ప్రయాణమయారా? ఇంకేం కొడుకూ, కోడలూ దగ్గిరుండి జబ్బు నయం చేయిస్తార్లే!" అన్నాడు కనకయ్య గుక్కతిప్పుకోకుండా.
    "ఎవడికయ్యా రోగం? నీదొక పిచ్చి! బస్తీలెక్కటం మరిగి ఇంట్లో కాలు నిలవక కళ్ళు పొగర్లకమ్మి వాళ్ళు చస్తుంటేను?"
    సాంబయ్య వాస్తవాన్ని తృటికాలంలోనే అర్ధంచేసుకొన్నాడు. కొడుకుని గురించి కొద్ధిక్షణలు క్రితమే తను కల్పించుకొన్న ఆశలూ, ఊహలూ పటాపంచలైనయ్. తనగురించీ, తన ఆరోగ్యం గురించీ కొడుకు శ్రద్దతీసుకొన్నాడనుకొని ఆనందశిఖరాలను అందుకొన్న సాంబయ్య, బిళ్ళబీటుగా నేలమీదపడ్డాడు. అతడ్ని ముసురుకొన్న భ్రమా-మమకారం-అదృశ్యమైనాయి. మనిషి నీరుకారిపోయాడు. అసలు కొడుకుమీద అన్ని ఆశలు అల్లుకోకపోతే సాంబయ్యకు అంత బాధ కలిగివుండేది కాదేమో!    
    "డబ్బు! డబ్బు కా-వా-లి!"
    సాంబయ్య తలవిరుచుకొని కొడుకని చూశాడు.
    "రెండువేలు కావాలి!" అన్నాడు కొడుకు.
    "ఎందుకూ?" సాంబయ్య కళ్ళు ప్రశ్నించాయి.
    "రెండువారాలన్నా పడ్తుంది." ఏమిటోగా అన్నాడు వెంకటపతి.
    తండ్రి పెదవులు వణకాయి. నోట్లకట్టలను పట్టుకొనివున్న అతని వేళ్ళు కొంకర్లు పోయినై.
    "అవును! బాబుగారూ! లేడీడాక్టరమ్మగారితో అన్ని పరీక్షలూ చేయించుకోవాలంట, పదిరోజులకు పైగానే పడ్తుందట. అమ్మాయిగారు వట్టిమనిషికాదు!" వెంకటపతి చెప్పలేనిది బుచ్చమ్మ చెప్పింది.
    సాంబయ్య కళ్ళు పెద్దవిచేసి చూశాడు. కనకయ్య ఎగిరి గంతేసినట్టు అన్నాడు!
    "శుభం సాంబయ్యా! తాతయ్యవు అవుతున్నావయ్యా, తాతయ్యవి! మనవడే పుడ్తాడు. నీ వంశాన్ని ఉద్దరిస్తాడు. చూస్తావేం? ఇవ్వూ!" అంటూ కనకయ్య రెండు వెయ్యిరూపాయల కట్టలుతీసి వెంకటపతి చేతికిచ్చాడు.
    "పనిలోపని! ఎటుదిరిగీ పట్నంలోనే వుంటున్నారుగా? మీ నాన్ననుకూడా తీసుకెళ్ళి డాక్టరుకు చూపించకూడదూ?" సలహాగా అన్నాడు కనకయ్య. అక్కడకు తనే సాంబయ్యకు ఏదో మేలుచేస్తున్నట్టు ముఖంపెట్టాడు. కనకయ్య సాంబయ్య ముఖంలోని భావాలను కనిపెట్టడానికి చూస్తుండగానే, కాన్పూరు ఆకు  జోళ్ళు చటచట లాడించుకుంటూ మామముందునుంచే నడిచివెళ్ళి కారు ఎక్కింది వరూధిని. అంత దైర్యంగా మామగారి ముందునుంచి వెళ్ళిన వరూథిన్ని చూసి కనకయ్య నోరు బిగిసిపోయింది. ముక్కుమీద పడబోతున్న వేలును బలవంతంగా ఆపుచేసి ఇంటికెప్పుకేసి చూడసాగాడు.
    "నువ్వుకూడా వస్తే డాక్టరుకు చూపించుకోవచ్చు." ఆరుసార్లు మననం చేసుకున్న తర్వాత  ఆ మాట పైకి అనగలిగాడు వెంకటపతి. వాళ్ళముందుగా వెళ్తున్నప్పుడు కోడలుపెట్టిన ముఖం సాంబయ్యకేకాదు కనకయ్యకు కూడా గుర్తుంది.  
    "మామ తమతో వస్తాడంటేనే అట్టా అయిపోయిందే? నిజంగా వస్తే?" బుచ్చమ్మ అనుకొంది.
    వెంకటపతి తండ్రికోసం నిలబడ్డాడు. వరూధిని కారెక్కి డ్రైవర్ చేత హారన్ కొట్టించింది.
    "ఎందుకురా ఇంకా నిలబడ్డావ్? ఫో! ముందు నా కళ్ళముందునుంచి ఫో!" కసిగా అరిచాడు సాంబయ్య. ఆయన ముఖంలో కలిగిన మార్పుల్ని చూసిన కనకయ్యకు అక్కడ కూర్చునే ధైర్యం లేకపోయింది.
    "వస్తా! సాంబయ్యా!" అంటూ లేచాడు.
    "మళ్ళీ ఈ గడపతొక్కొద్దు!" పురుగును చూసినట్టు కనకయ్యను చూస్తూ అన్నాడు సాంబయ్య. కనకయ్య గుండెల్లో బల్లెంగుచ్చుకున్నట్టు బాధపడ్డాడు.
    ఇందులో తన తప్పేముంది? అసలు తను చేసిందేముంది? కొడుకుమీది కోపం, కోడలిమీది అక్కసూ తనమీద చూపిస్తాడేం?
    అంత కఠినంగా సాంబయ్య లోగడ చాలాసార్లు మాట్లాడాడు. కాని తనెప్పుడూ ఇంత బాధపడలేదు. దానికి కారణాలున్నాయ్. అకారణంగా, ఒట్టి పుణ్యానికి తనను అంత నీచంగా చూస్తాడా? తను ఈరోజు సాంబయ్య మేలుకోరి, అతనిమీద అభిమానంతోనే చెప్పాడు. ఏమనుకొంటున్నాడు సాంబయ్య? తను ఇంకా అతని మోచేతినీళ్ళు తాగి బతికే కనకయ్యే అనుకుంటున్నాడేం? తన అల్లుడు ఒహడు ప్లీడరు, మరొకడు రెవిన్యూ ఇన్ స్పెక్టర్. తను మిల్లులో వాటాదారు. ధాన్యం వ్యాపారి. తనకొడుకు పెద్దవకీలు. అటు బస్తీలో, ఇటు ఊళ్ళో పెద్దపరపతివున్నవాడు. తన సలహా సంప్రదింపులకోసం మహా మహావాళ్ళే తనచుట్టూ తిరుగుతున్నారు. ఈ సాంబయ్యదేం లెక్క? ఆస్తివుండగానే సరా? అతని పలుకుబడి ఎంత? అతని పరువెంత?
    "ఇదుగో సాంబయ్యా!"
    ---కనకయ్య తారాజువ్వలా లేచాడు సాంబయ్య మీదకు. "మళ్ళీ నీ గడపలో కాలుపెడితే చెప్పుచ్చుక్కొట్టు!" అని ధుమధుమలాడుతూ వెళ్ళిపోయాడు.
    "నా కొంప కూల్చావుగాగదరా కనకయ్యా!" అనుకున్నాడు సాంబయ్య.
    చెరువుగట్టుమీద కారాపి డ్రైవర్ ఇంజన్ లో తలదూర్చాడు. వైర్లూ, ప్లగ్గులూ లాగి వూది మళ్ళీ పెట్టాడు. కారుచుట్టూ చేరిన జనాన్ని క్లీనర్ తిట్టేస్తున్నాడు.
    "ఏమిటీ కారు మాటిమాటికి ఆగిపోతుంది?" చిరాకుపడింది వరూధిని. వచ్చే పోయేవాళ్ళు, వెంకటపతికేసి, వరూధినికేసీ వ్యంగ్యంగా చూస్తూ పోతున్నారు. బస్సుకోసం పరుగెత్తుకొస్తున్న కనకయ్య కారు ఇంకా ఊళ్ళోనే వుండటం చూసి ఆనందపడిపోయాడు.
    "ఏఁ విటి రాయుడూ? పెట్రోలు అయిపోయిందా ఏం?" అంటూ కనకయ్య కారుదగ్గిరకు వచ్చాడు.
    "చిన్నట్రబుల్ వచ్చింది" అని డ్రైవర్ తలెత్తి క్లీనర్ తో "హాండిల్ వెయ్యి" అన్నాడు.
    ఇంజన్ స్టార్టయింది. కనకయ్య ఎగిరి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు వెనక్కూ ముందుకూ వూగి ఒక్కసారిగా కదిలింది.
    "హమ్మయ్య!" నుకోంది వరూధిని. వెంకటపతి ముఖం చాటంత అయింది. కారు వేగాన్ని అందుకొంది.
    "వెంకటపతీ! మీ అయ్యకు చాదస్తం ఎక్కువయిందయ్యా! ఏం కట్టుకుపోతాడు? కొడుక్కు ఇవ్వటానికికూడా ఏడుస్తాడు?" అని మొదలుపెట్టాడు కనకయ్య.
    వెంకటపతి బెల్లంకొట్టినరాయిలా మాట్లాడకుండా కూర్చున్నాడు. వరూధినికి కనకయ్య మాటలు ఇంకా వినాలనిపించింది.
    మిట్టమధ్యాహ్నం చిన్నకారు కొత్తపేటలో బలరామయ్య అద్దెకుంటున్న ఇంటిముందుకొచ్చి ఆగింది. వరూధిని వెంకటపతితో కారు దిగి లోపలకు నడిచింది. కనకయ్య కారుదిగి, సామాన్లు లోపలపెట్టించి, బలరామయ్యను పరామర్సించి వెళ్ళిపోయాడు.
    వెంకటపతిని మామగార్ని "ఎట్లావుంది?" అని పలకరించాడు.
    "ఇక నాపని అయిపోయింది. ఎక్కువరోజులు బతకను." హీనస్వరంతో చెప్పాడు బలరామయ్య. మామను చూస్తుంటే ఆయన చెప్పిన మాట నిజమేననిపించి, వెంకటపతి దిగులుపడిపోయాడు. ఏం మాట్టాట్టానికీ తోచక దిక్కులు చూడసాగాడు.
    "మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నా! కమలమ్మా! బాబుగారికి పళ్ళరసం ఇచ్చావా?" అంటూ భర్తకేసి చూసింది. వెంకటపతి లేచి పక్కగదిలోకి వెళ్ళిపోయాడు.
    సాయంకాలం ఆరుగంటలకల్లా వరూధిని చక్కగా ముస్తాబయి బయలుదేరింది. పనిపిల్ల కమల మల్లెపూలదండతెచ్చి వరూధిని తలలో తురిమింది.
    "కమలా! ఓ జట్కా పిలవ్వే!" అద్దంముందు నిలబడి పూలు సర్దుకొంటూ అంది వరూధిని. గుర్రంబండివచ్చి గుమ్మంముందు ఆగింది. వరూధిని మెరుపులా జట్కా ఎక్కి కూర్చుంది. వెంకటపతి వెనక, కాళ్ళు వేలాడేసుకొని అంచుకు కూర్చున్నాడు.
    జట్కావాడు పట్టెనొక్కి "ముందుకు రండమ్మా!" అన్నాడు.
    'జరిగి కూర్చోండి' అంది వరూధిని చిరునవ్వులు ఒలకబోస్తూ వెంకటపతి అమాంతం ఎగిరి దగ్గిరకు జరిగాడు. గుర్రం నడకలోనుంచి గేలప్ లో పడింది. సిమెంటురోడ్డుమీద గుర్రపుడెక్కలశబ్దం లయయుక్తంగా వినబడుతోంది. బండి వెనక్కూ ముందుకూ తూగుటుయ్యాల్లాగ వూగిసలాడుతోంది. బండి వూపులకు వెంకటపతి వరూధినిమీద కొరిగిపోతూ, లేస్తూ వున్నాడు. సాయంకాలపు ఎండకు వరూధిని ముఖం ఎర్ర మాతాబాలాగ వెలిగిపోతోంది. వెంకటపతికి తనేదో కొత్త లోకంలోకి వెళ్ళిపోతున్నట్టుగా వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS