Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 38


    "అయితే నన్నెందుకు కట్టుదిట్టాల్లో వుంచటానికి ప్రయత్నిస్తున్నావు" అనడిగారు.
    "నేను మిమ్మల్ని కట్టుదిట్టాల్లో వుంచడమా? గట్టిగా అనకండి ఎవరైనా వింటే నవ్విపోతారు. మిమ్మల్ని నేనేమిటి, కట్టుదిట్టం చేశాను?" అనడిగాను.
    "ఆడవాళ్ళతో మాట్లాడనివ్వవు. తాగడానికి ఒప్పుకోవు. పని విషయంలో కాల్చుకుతిని పని చేయిస్తావు. వీటన్నిటికీ అర్ధం ఏమిటి" అనడిగారు.
    "నాలుగు డబ్బులు సంపాదించి, మంచి పేరు తెచ్చుకోవాలని అర్ధం. అంత గొడవ చేస్తున్నాను కనకే ఉన్న పిక్చర్లు త్వరగా అవుతున్నాయి. కొత్త పిక్చర్లు వస్తున్నాయి అయినా ఈ డిస్కషన్ అంతా ఎందుకండీ, ఇదివరలో మన మైసూరు ప్రయాణం ఎలాగయిందో ఈ సారీ అలాగే అవుతుంది" అన్నాను.
    "అంటే హోటల్ లో రూమ్ కూడా ఇదివరలో లాగేనా?".
    "ఆ మాట మీ ఆవిడని అడగండి".
    "ఆమె ఒప్పుకుంటే.....?".
    "నేను ఒప్పుకోను. పక్క పక్కనే రెండు రూమ్ లు బుక్ చేయించండి" అన్నాను.
    "నువ్వూ గయ్యాళివే" అన్నారు.
    "అయినా నాతో మీరు పడాల్సిన అవసరం లేదుగా".
    "పడుతున్నానుగా".
    "ఏం చెయ్యను? నేను మీ దగ్గర పనిచేసినంత కాలం కొంచెం కష్టమే. అది కూడా మీ వల్లే. మీరు చక్కగా పనిచేసుకుంటూ పోతే, నేను నోరు ఎత్తాల్సిన అవసరం ఎందుకుంటుంది"
    "అంటే - నా దగ్గర పని మానేసే ఉద్దేశం కూడా వుందన్న మాట" అన్నారు.
    "మీరు అవకాశం ఇచ్చినన్నాళ్ళు తప్పకుండా చేస్తాను. నాకుగా నేను మానను"
    "మరి రాత్రి స్టేషన్ కి రావడం గురించి ఎలా?".
    "మీరెలా చెప్తే అలాగే".
    "మధ్యాహ్నం కంపెనీకి వెళదామా, వద్దా?".
    "ఈ రోజుకిక వద్దులెండి. ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవాలి" కదా అన్నాను.
    "స్టేషన్ కి వచ్చే విషయం నేను సాయంకాలం వచ్చి చెప్తానన్నారు.
    ఇంటికొచ్చి పెట్టె సర్దుకున్నాం. 'తలవంచని వీరుడు' పుస్తకాలు, స్క్రిప్ట్ వగైరాలు కూడా పట్టుకున్నాను. 'గంధర్వ కన్య' సెన్సార్ కాపీ వేరే రాయాలి. చాలా పని వుందనుకున్నాను.
    సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో శ్రీశ్రీగారు వచ్చారు. "మేము అలా తిన్నగా స్టేషన్ కి వచ్చేస్తాం. మీరిలా వచ్చెయ్యండి....ఇవిగో టిక్కెట్లు" అని ఇచ్చేశారు.
    "గాయత్రి హోటల్లోనేగా దిగడం," అనడిగాను.
    "ఎందుకలా అడుగుతున్నావు?".
    మధ్యలో మనం కలుసుకోలేకపోయినా అక్కడికి కరెక్టుగా వచ్చి చేరుకోవచ్చని అడిగాను".
    "ఆఁ అక్కడే దిగడం" అన్నారు.
    రాత్రి పది గంటలకి స్టేషన్ లో అంతా కలిశాం. ఆవిడతో అయిదు నిముషాలు బాతాఖానీ కొట్టి బండి ఎక్కిపోయాం.
    రెండుసార్లు వెళ్ళి వచ్చాం గనక ధైర్యంగానే కూర్చున్నాం.
    
                            *    *    *
    
                                           ఆవిడ పిలుపు
    
    మర్నాడు మేము మైసూరులో దిగేసరికి కంపెనీ బాయ్ స్టేషన్ కి వచ్చున్నాడు. గాయత్రి హోటల్లో ఫస్టు ఫ్లోర్ లో, లోగడ మేం దిగిన రూమ్ శ్రీశ్రీగారికీ, వారి భార్యకీ దాని పక్కరూం మాకు బుక్ చేశారు.
    హాయిగా స్నానాలు చేసి మధ్యాహ్నం భోజనాలు చేశాం. ఆ రోజే 'గంధర్వకన్య' తెలుగు పిక్చర్ వేస్తున్నాం అని కారు పంపారు. అందరం వెళ్ళి చూశాం. డబ్బింగ్ బాగా వచ్చింది. సెన్సార్ స్క్రిప్ట్ రాయడానికి ఒరిజినల్ స్క్రిప్ట్, కార్బన్లు, పేపర్లూ వగైరాలు కావాలన్నారు. రడీగా వున్నాయని ఇచ్చేశారు.
    స్టూడియో అంతా చుట్టేసి మళ్ళీ కాఫీలు తాగి లాడ్జికి వచ్చేసరికి దగ్గర దగ్గర ఎనిమిది  గంటలు కావచ్చింది. భోజనాలకి అందహ్రికీ ఆర్డర్ ఇచ్చారు. మేం మా రూమ్ లోకి వెళ్ళిపోయాం. నేను స్క్రిప్ట్ అంతా తిరగేస్తూ కూర్చున్నాను.
    అరగంట తర్వాత ఆవిడొచ్చి వారు పిలుస్తున్నారని చెప్పారు. ఆయన రూమ్ లోకి వెళ్ళాను.
    "ఏం చేస్తున్నావు సరోజా" అనడిగారు.
    "స్క్రిప్ట్ చూస్తున్నానండీ" అన్నాను.
    "ఏది? కన్నడందా, తెలుగుదా?"
    "కన్నడంది"
    "దేనికి?"
    "షాట్స్ కావాలి కదా?"
    "తెలుగు పుస్తకం ఇచ్చారా?"
    "ఇచ్చారు"
    "భోంచేశావా? లేదా?"
    "లేదు"
    నా సమాధానం వినగానే, "నువ్వు మనిషివేనా?" ని అడిగారు.
    ఆ ప్రశ్నకి తెల్లబోయి, "ఏవిటలా అడుగుతున్నారు? మీ కంటికి నేను మనిషిలా కనిపించడం లేదా?" అన్నా ఆ మాటకి ఆవిడ నవ్వుతున్నారు.
    "లేకపోతే ఏమిటి? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాఁమా? రాగానే ప్రొజక్షన్ వేసి ప్రాణం తీశారు. హాయిగా రెస్ట్ తీసుకోకుండా గాడిదలా ఆ చాకిరీ ఏఁమిటి?" అనడిగారు.
    "లేదండీ భోజనం చేసేదాకానే. తరువాత నిద్రపోతాను".
    "రెస్ట్ అంటే నిద్ర పోవడం అని కాదు వెళ్ళి భోంచేసిరా!".
    అమ్మా, నేనూ భోజనాలు చేశాం. నేను మళ్ళీ వారి గదిలోకి వెళ్ళలేదు.
    ఆయన వుంటారా, మోకాళ్ళ వరకూ లాగుతూ బనీనైనా లేకుండా, "సరోజా"! అంటూ వచ్చేశారు. ఆవిడ కూడా వెనకాలే వచ్చారు.
    ముగ్గురం కలిసి వాళ్ళ గదిలోకి వెళ్ళాం.
    "కూర్చో" అన్నారు. ఆయన మంచం మీద పడుకున్నారు. ఆవిడ వారి పక్కన కూర్చున్నారు. నాకా గదిలో వుండడానికి ఏడుపొస్తోంది.
    "పుస్తకం ఇస్తాను చదువుతావా? వింటాను" అన్నారు.
    "ఇదేనేమిటి రెస్ట్ అంటే?" అనడిగాను.
    ఇంతలో మా అమ్మ గుమ్మం దాకా వచ్చి, "సరోజా! నేను పడుకుంటానే" అంది.
    "నేనూ వచ్చేస్తానమ్మా! నువ్వు పడుకో తలుపు గడియమాత్రం వేసెయ్యకుమా. చచ్చిపోతానన్నాను.
    "చావడం ఎందుకు? మా గదిలో పడుకుంటావు" - అన్నారావిడ.
    ఆవిడ ఆ మాట అన్నందుకు నాకెంత చిరాకు వేసిందంటే, వెంటనే లేచి "గుడ్ నైట్" అని బయలుదేరిపోయాను.
    "ఏమిటి వెళ్ళిపోతున్నావా?" ని శ్రీశ్రీగారడిగారు.
    "అవునండీ నిద్రవస్తోంది".
    "నిద్ర పోవడానికా ఇక్కడికి వచ్చావు?" అనడిగారు.
    "మరేం చెయ్యమంటారన్నాను.
    "నేను వెళ్ళమన్నంత వరకూ ఇక్కడుంటే చాలన్నారు.
    అక్కడే కుర్చీలో చతికిలపడ్డాను.
    'మా గదిలోనే పడుకుమ్తవు' అన్న ఆవిడ మాటలే నా చెవులో గింగురు మంటున్నాయి. నా ఒంటిమీద తేళ్ళూ, జెర్రులూ పకుతున్నట్టు వుంది. ఇప్పుడీ గది నుండి బైటపడతానా అనిపించింది.
    "ఏమిటాలోచిస్తున్నావు?" అనాదిగారాయన.
    "ఏం లేదు. ఈరోజు మీరింకా మధు స్వీకరించలేదేమిటా అని".
    "మా ఆవిడ సంగతి నీకు తెలీదు. బాటిల్ బాత్ రూమ్ లో పెట్టింది" అన్నారు.
    "అదేమిటండీ ఖర్మం! బాత్ రూమ్ లో బాటిల్ పెట్టడం ఏమిటి? ఇందులో రహస్యం ఏం వుంది?"
    "ఆవిడంతేలే" అన్నారు.
    "ఈయన తాగుతారని నీకు తెలుసాని?" అడిగారావిడ.
    "అందుకనే దాచారన్నమాట. భలేవారే! అన్నీ తెలుసుకొనే వీరి దగ్గర అసిస్టెంట్ గా చేరాను. మరేం ఫరవాలేదు. వారిని ఫ్రీగా తాగనివ్వండి" అన్నాను.
    "కిందటిసారి మీరు మైసూరు వచ్చినప్పుడు తాగేరా?".
    'అమ్మబాబోయ్ - ఈవిడ మళ్ళీ ప్రారంభించారురా' అనుకొని, "వారినే అడిగి తెలుసుకోండి, నేను వెళ్ళివస్తాన"ని ఆ సాకుతో చల్లగా అక్కడనుండి జారుకున్నాను.
    తలుపులు బిడాయించి పడుకున్నాను. నిద్ర రాలేదు. వాళ్ళగదిలో నుండి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS