Previous Page Next Page 
అర్ధరాత్రి ఆర్తనాదం పేజి 38


    కిరణ్ మాట్లాడలేదు.
    "కిరణ్! నేను అడిగే ప్రతి ప్రశ్నకీ నీ దగ్గర జవాబు వుంది. కాని, నీవు నోరు మెదపటం లేదు అవునా!"
    "అదేం లేదు డాడీ" కిరణ్ నెమ్మదిగా అన్నాడు.
    "ఏదీ! ఒకసారి తలఎత్తి సూటిగా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ మాట చెప్పు."
    కిరణ్ ఆ పని చేయలేక మొహం ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
    "కిరణ్! ఈ ప్రశ్న చాలాసార్లు వేశాను. దానికి వెంటనే జవాబు కూడా ఇచ్చావ్. మళ్ళీ అదే ప్రశ్న వేస్తున్నాను" బహుశా ఈ తఫా కూడా అదే జవాబు ఇస్తాననుకుంటాను. మళ్ళీ మళ్ళీ అడగను. అబద్దం ఆడకుండా నీ తండ్రిమీద గౌరవంతో సరి అయిన సమాధానం సూటిగా ఇవ్వు."
    "అడగండి డాడీ!" భయపడుతూనే అన్నాడు కిరణ్.
    "నీ పెళ్ళయి రెండునెలలు దాటింది. కామినీకి అప్పుడు ఐదోనెలో, ఆరోనెలో అనుకుంటాను. కామినీ కడుపులో బిడ్డకి తండ్రివి నీవేనా!"
    "ఇతను నీ తండ్రిరా! అని తల్లి బిడ్డడకీ తన తండ్రి ఎవరో తెలియదు. బిడ్డల విషయంలో భార్యకు భర్త మీద నమ్మకం కన్నా, భర్తకి భార్యమీద నమ్మకం వుండాలి. లేకపోతే, ఆ జీవితం నరకప్రాయం అవుతుంది. ఈ చిన్న సత్యం మీకు తెలిసిందే కదా! డాడీ!"
    రావుగారు ఆ జవాబు విని నిశ్చేష్టుడై పోయి అలా ఉండిపోయారు.
    కిరణ్ అంత చక్కగా ఒక విధంగా చెప్పాలంటే దెబ్బ తీసేలా అలా సమాధానం చెబుతాడని అనుకోలేదు. కొద్ది సేపటి వరకూ ఆయన నోటి నుండి ఎలాంటి సమాధానం రాలేదు.
    ఒక్కోసారి కిరణ్ కి తండ్రితో అంతా చెప్పేయాలని పిస్తుంది. మగవాడు కాబట్టి ధైర్యంగా తన తిరుగుడు వ్యవహారం చెప్పగలడు. కాని, హత్య గురించి చెప్పలేడు. ఆ సంఘటనవల్ల తనకి చావు తప్పి కన్ను లొట్టపోయింది అని చెప్పుకోలేడు. తన పంచ ప్రాణాలు కామినీ గుప్పెట్లో బంధించబడి వున్నాయని, తన కాళ్ళకి చేతులకీ తాళ్ళుకట్టి తోలు బొమ్మని ఆడించినట్టు కామినీ తనని ఆడిస్తుందని అసలే చెప్పలేడు. తండ్రి తిడతాడని కాదు తనని రక్షించలేడూ అని. కామిని, ఆమె బాబాయ్ సామాన్యులు కారు. తండ్రినికూడా చిక్కుల్లో పడవేయవచ్చు. అని భయం ఇలాంటి నేరం నుంచి తనని తన తండ్రి తప్పించగలడో లేదో! గట్టి నమ్మకం లేదు. ఆ నమ్మకంలేకనే ఎప్పటి కప్పుడు చెప్పకుండా దాట వేస్తున్నాడు. పైగా ఈ విషయం తనే ఛాలెంజ్ గా తీసుకున్నాడు. కామినీ అంతుచూడదలచుకున్నాడు.
    కిరణ్! నేను ఇది వరకు చెప్పానా! మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి చెబుతున్నాను. నువ్వు లక్షాధికారికి ఏకైక పుత్రుడివి. ఇలాంటి వాళ్ళ మీదకు గాలం వేయడానికి చాలా మంది చూస్తూంటారు. కామిని, దామోదరం కలసి నీ మీద గాలం వేశారు. ప్రేమ మైకంలో ఆ గాలానికి చిక్కుకున్నావు నీవు. అంతవరకూ నేను ఊహించగలను. ఆ తరువాత వాళ్ళిద్దరూ కలసి నిన్ను దేంట్లోనో ఇరికించారు. "ఊబిలో ఇరుక్కున్న నీవు పైకి రాలేక గిలగిల లాడుతున్నావు. వాళ్ళిద్దరూ ఒడ్డున నుంచొని వినోదం చూస్తున్నారు. నీవా ఊబిలోంచి పైకి రావటానికి వాళ్ళు కర్రముక్క కాని, త్రాడుముక్క గాని నీకు అందించరు. ఎందుకంటే నీవు పైకి వస్తే వాళ్ళకి నష్టం కాబట్టి. ఏ బిడ్డ నైనా తండ్రి అందలం ఎక్కించటానికి చూస్తాడు కాని, అగాధంలోకి త్రొయ్యటానికి చూడడు. నీవు అవునన్నా కాదన్నా నీవు విషమ పరిస్థితులలో ఇరుక్కున్నావని నాకు గట్టిగా తెలుసు. ఒక్కోసారి ఆలస్యం కూడా అమృతాన్ని విషంగా మారుస్తుంది. నీవు ఇప్పుడు చెప్పినా సరే! నీవు బాగా ఆలోచించుకుని చెప్పినా సరే. నిన్ను ఇంతగా దిగజార్చిన ఆ విషయమేదో చెప్పు. నిన్ను ఆ విషవలయం నుంచి నా శాయశక్తులూ ధారపోసి తప్పిస్తాను" అన్నారు రావుగారు!
    జరిగినదంతా చెప్పేయాలనిపించింది కిరణ్ కి. కాని, చెప్పలేకపోయాడు. "మీరనవసరంగా అపోహ పడుతున్నారు డాడీ. అయినా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పండి. నేను కసితో కావాలని ఒకడిని చంపుతాను. ఆ విషయం తెలిసి పోలీసులు నన్ను పట్టుకెళ్ళతారు. నేను హత్యచేసినట్టు అందరికీ తెలిసిపోతుంది. ఆ పరిస్థితులలో మీరు నన్ను రక్షించగలరా!" నవ్వుతూ అడిగాడు కిరణ్.
    "రక్షించగలనో లేదో చెప్పలేను. కాని నా సర్వశక్తులూ ధారపోసి, నా సర్వం పణంగాపెట్టి, నా ప్రాణాలు కూడా లెక్క చెయ్యకుండా నేను నిన్ను రక్షించుకోటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నీవు నా బిడ్డవి కాబట్టి. మైండిట్!" రావుగారు గాంభీర్యంగా అన్నారు.
    డాడీ! మీరామాట అన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. కానీ, నేనే హత్య చేయలేదు. మీరేం జవాబు చెబుతారో అని అలా అన్నాను" చిరునవ్వుతో అన్నాడు కిరణ్.
    కిరణ్, ఎన్ని విధాల త్రిప్పి త్రిప్పి మార్చి అడిగినా ప్రస్తుతం నిజం చెప్పడని రావుగారు గ్రహించారు. "ఏదన్నా వుంటే నాతో చెప్పు భయపడాల్సిన అవసరం లేదు" వుత్తరోత్రా ఉపయోగపడుతుందని ఆ మాట అన్నారు.
    అక్కడితో ఆ విషయం వదిలేశారు రావుగారు.
    తండ్రి తనకి అభయం ఇచ్చాడు. ఈ విషయం బాగా ఆలోచించి, మరీ ప్రాణం మీదకి వచ్చినపుడు చూసుకుందాం అనుకున్నాడు కిరణ్.
    కొద్దిసేపు వారిరువురు మామూలు విషయాలు గురించి మాట్లాడుకున్నారు.
    కామినీ రావడంతో కిరణ్ లేచి వెళ్ళి పోయాడు.
    కిరణ్ నవ్వుతూ చెప్పినా, హత్య గురించి చెప్పాడు. అది నిజమో అబద్దమో అది తర్వాత విషయం. రావుగారి బుర్రలో ఆ క్షణానే హత్య అనే ఆ మాట పురుగులా ప్రవేశించింది.
    ఆ పురుగు అలానే ఆయన బుర్రని తొలుస్తూనే వుంటుంది.
    
                                  23
    
    "ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టావో తెలుసా!" కామిని అంది.
    "ఎంత ఖర్చుపెడితే ఏంటి? మనది కానపుడు" దామోదరం చిద్విలాసంగా నవ్వుతూ అన్నాడు.
    దామోదరం అలా అనంగానే "అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు" అనే సామెత గుర్తుకు వచ్చింది కామినికి.
    కిరణ్ తననుంచి నిజం లాగటానికి చిన్న నాటకం ఆడాడు. అదీ ఒకందుకు మంచిదే అయింది. అటు కిరణ్ బుద్దీ తెలిసింది. ఈ యావదాస్తికి కిరణ్ తరువాత, తను, తన బిడ్డ వారసులని తెలిసింది. ఒక అమ్మాయిని హత్య చేశాడు. తనని మోసగించాడు అనే కోపంతో కిరణ్ రోగం కుదర్చటానికి కిరణ్ ఏడిపించటానికి, తను, తన బాబాయ్ కలసి డబ్బంతా పాడు చేయటం మొదలుపెట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS