Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 38


    "వ్యవహర్త!" అనుకున్నాడు లాయర్. నా ప్లీడర్ వీడి ముందు ఆగటం లేదనీ అనుకున్నాడు.
    "అంతే! అంతే!" అన్నాడు డాక్టర్ కృష్ణ.
    దాంతో ఆ సమస్య పరిష్కారమైనట్టుగా లేచారు.
    వెంకట్రామయ్యకి పట్టరానంత సంతోషంగా వుంది.
    స్వప్న మనస్సులో ఏముందో ఎవరికీ తెలియలేదు. కానీ లాయర్ కి మాత్రం ఈ నిర్ణయం బాధా కరంగా వుంది.
    
                                       27
    
    ఆ రాత్రే వెంకట్రామయ్య పారిజాతం యింట్లో వుంటే అక్కడికి వెళ్ళేడు మోహన్. అతనికి రవ రవ లాడుతోంది మనస్సు.
    "చూడు పిన్నీ! ఆ ముసల్ది చస్తూ అరవిగాడి చేతిలో పెట్టిపోయిందట దాన్ని. ఆ మాటని ఖాయం చేసి పెళ్ళి చేస్తారట వీళ్ళు-ఇన్నాళ్ళు నాకు రాసిపెట్టింది అంటూ వచ్చిన అమ్మాయి నాకు కాకుండా పోతే ఎలా వుంటుంది? నువ్వే చెప్పు తల్లి మారు తల్లివి. స్వప్న లక్షలు చేస్తుంది. దాని ఆస్తి యింకా ఖరీదు. అంత ఐశ్వర్యాన్నీ, అంత అందమైన భార్యని పోగొట్టుకోమంటావా?"
    అతనే నాడూ నా యింటికి రాడు. అలాటిది వచ్చాడు. అతనికి ఆమె అన్నా. ఆమె కూతురన్నా ఎంతో అసహ్యం. అనుకుంటూ వుండేది ఆమె. అలాటిది నేరుగా వచ్చి బాంధవ్యం కలిపేసి పిన్నీ అనేసరికి తబ్బిబ్బై పోయింది. వెంకట్రామయ్య తన మెళ్ళో తాళి కట్టినట్టుగా సంబర పడిపోయింది.
    వెంకట్రామయ్యకి మాత్రం చిర్రెత్తు కొచ్చినట్టుగా వుంది. అతనికి మోహన్ అక్కడికి రావటం సుతరాం ఇష్టంలేదు. తఃను చెడ్డాడు. తన విషయం కొడుక్కి తెలియటం నామోషీ కాదూ? పైగా నేరుగా ఆ యింటికే వచ్చి చుట్టరికం కలపటం? అతనికి పుండుపై కారం రాచినట్టుగా వుంది.
    కొడుకు వైపు మిర్రి మిర్రి చూశాడు.
    "అవునా,  బాబు చెప్పింది నిజమేనా?"
    ఇబ్బందిగా కదిలాడు వెంకట్రామయ్య.
    "పలకరేం?" రెట్టించింది పారిజాతం.
    "నువ్వు నోర్మూసుకోరాదూ?" కసురుకున్నాడు.
    కయ్ మని లేచింది ఆమె "ఎందుకు నోర్ముయ్యాలి? నువ్వు చేస్తున్న నిర్వాకం యిదేనా? అమ్మాయికి మంచి సంబంధం తేలేదు. ఇప్పుడు అబ్బాయికి వస్తున్న మంచి ఛాన్సునీ పోగొట్టేవు."
    "ఛాన్స్ ఎక్కడికి పోయింది."
    "ఇంకేం కావాలి? రేపో మాపో పెళ్ళిజరుగుతుంది!" అన్నాడు మోహన్.
    "ఊఁ జరుగుతుంది. నువ్వు దగ్గరుండి జరిపిస్తావా?" వెటకారంగా అన్నాడతను.
    "అబ్బాయికేం ఖర్మ? అన్నిటికి నీవున్నావుగా?"
    "ఉన్నాను కాబటి ఎప్పుడో జరగాల్సిన పెళ్లిని జరక్కుండా ఆపుతున్నాను."
    "ఏం లాభం?"
    "ఇద్దరి మధ్యా వైషమ్యాలు పుడతాయి."
    "పుట్టకపోతేనో?"
    "పుట్టిస్తాను లేదా ఆ స్వప్నని బలవంతంగా ఎత్తుకొచ్చి వీడితో పెళ్ళి జరిపిస్తా!"
    "హార్నీ ముండా కొడుకా? ఇదా నీ ఎత్తు?" అనుకుందామె. "అది సాధ్యమా?" అడిగింది.
    "ఎత్తుకొచ్చి రాక్షసంగా పెళ్ళి చేస్తా. ఇద్దర్నీ ఓ గదిలో వేసి తాళం వేస్తా. ఇక చచ్చిన కుక్కలా అవుతుందది!"
    ఆ ఊహకి మోహన్ బాబు సంతోషించాడు.
    ఆమె అసహ్యించుకుంది.
    "కొన్ని రోజులాగి చూద్దాం. తర్వాత వీలు చూసి ఆచరణలో పెడదాం!"
    "ఎందుకాగాలి. మన చేయిజారిపోయి పెళ్ళయిపోతే! "ఊహలూ యీ వారంలోనే ఎత్తుకొద్దాం!" అన్నాడు మోహన్.
    "నోర్ముయ్యరా సన్నాసీ!" కసురుకున్నాడు.
    "ఎందుకేమిటి?" ఉక్రోషంగా అడిగాడు మోహన్.
    "దేనికయినా సమయం సందర్భం ఉండాలి రా! కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్టుగా వాళ్ళ మధ్య వైషమ్యాలు పుట్టిద్దాం! తర్వాత అవి ఫలించకపోతే ఈ మార్గం వుండనే వుంది."
    "నీకు తెలియదు నువ్వూరుకో -నేనీ వారంలో ఎత్తుకెళ్ళే మార్గం ఆలోచిస్తా!"
    "ఒరే! ఒరే!" గాబరాగా అరిచాడు అతను.
    "అదంతే!" చప్పున లేచి వెళ్ళాడు మోహన్.
    ఉస్సురుమని కూలబడిపోయాడు వెంకట్రామయ్య. పారిజాతంకి మండిపోతోంది వాళ్ళ వరసజూసి.
    
                                      28
    
    ఆ రోజు ఆ ఇంటి ప్రాంగణంలో చాలా అల్లరి జరిగిపోయింది. దాదాపు సాయంకాలం ఏడు గంటల వేళ ఇంటి ముందున్న తోటలో ఏదో ఆలోచిస్తూ తిరుగుతోంది స్వప్న. ఆలోచనల్లో మునిగిపోయిన ఆమె తన చుట్టూ నలుగురు మనుషులు చేరటం గమనించనే లేదు.
    హఠాత్తుగా నలుగురూ ప్రత్యక్షమయ్యేసరికి ఆమె గాబరాపడింది. నోరెత్తి కెవ్వున అరవబోయింది. కానీ ఆ కిరాయి రౌడీలు ఆమెకి ఆ అవకాశం యివ్వలేదు. చప్పున నోరుమూసి, నోట్లో కర్చీఫ్ కుక్కేరు. తర్వాత వెంటనే ముసుగు కప్పేశారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS