"బ్రహ్మాజీ! పాతికేళ్ళు కలిసికాపురం చేశాం" అంది ప్రమీల.
ఆమె చేతికి వున్న వుంగరాలు.
వేడెక్కిపోతున్నాయి. మంగళసూత్రాలు సెగతగిలినట్లు తగులుతున్నాయి ఒంటికి.
"అవును ప్రమీలా!" అన్నాడు బ్రహ్మాజీ నెమ్మదిగా.
"నాకు చనిపోవాలని లేదు బ్రహ్మాజీ!"
"మనం బతుకుతాం ప్రమీలా బతకాలి" అన్నాడు బ్రహ్మాజీరావు దృడంగా. అతని చేతిని తనచేత్తో ఒత్తి విషాదంగా నవ్వింది ప్రమీల హెలికాఫ్టర్ గాల్లో నిలబడి వుంది. బ్రహ్మాండమైన ఫానులా వున్న దాని రెక్కలు తిరుగుతూ వుంటే మంటలు మరింతగా ప్రజ్వరిల్లుతున్నాయి. హెలికాఫ్టర్ ని ఉపయోగించడంవల్ల లాభంకంటే నష్టమే జరుగుతోందని గుర్తించారు అధికారులు. హెలికాఫ్టర్ ని వెనక్కి పిలిపించెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కొద్దిసెకండ్ల తర్వాత ఫైలట్ కి ఆదేశాలు అందాయి. హెలికాఫ్టర్ కొద్దిగా కదిలింది.
"మనం బతకాలి ప్రమీల! పద! అన్నాడు బ్రహ్మాజీరావు భార్య చేతిని అందుకుంటూ.
మళ్ళీ జనంలో కలవరం కెరటంలా ముందుకుసాగారు జనం. ప్రమీల చెయ్యి బ్రహ్మాజీచేతిలో నుంచి జారిపోయింది. అతి ప్రయత్నంమీద మళ్ళీ భార్యచేతిని చేజిక్కించుకుని హెలికాఫ్టర్ కి వేలాడుతున్న త్రాటి నిచ్చెన వైపు పరుగెత్తాడు బ్రహ్మాజీ. హెలికాఫ్టర్ పైకిలేవటం మొదలెట్టింది.
ప్రమీల నడుము ఒకచేత్తో గట్టిగా పట్టుకుని రెండోచేత్తో నిచ్చెన అందుకున్నడు బ్రహ్మాజీ.
కొద్ది అడుగులు పైకి లేచిన హెలికాఫ్టరు పక్కకు తిరిగి సాగిపోయింది.
"మనం బతికాం ప్రమీల!" అని భార్య మొహంలోకి చూశాడు బ్రహ్మాజీ.
కానీ అతని చేతుల్లో వున్న స్త్రీ అతని భార్య ప్రమీల కాదు!
కదిలిపోతున్న హెలికాఫ్టరు త్రాటినిచ్చెననిపట్టుకుని వేలాడుతున్నాడు బ్రహ్మాజీరావు. రక్షించింది ప్రమీలనికాదు! సీతని!
"మీరు....మీరా?" అన్నాడు బ్రహ్మాజీరావు ఆశ్చర్యంనుంచి తేరుకుంటూ.
పాలిపోయివున్న సీత నీరసంగా కళ్ళుతెరవగానే బ్రహ్మాజీరావు మొహం కనబడింది. చటుక్కున కిందకు చూసింది సీత. నాలుగొందల అడుగుల క్రింది కనబడుతోంది భూమి. కుడిచేత్తో త్రాటి నిచ్చెన తాలూకు చివరిమెట్టుని పట్టుకుని వున్నాడు బ్రహ్మాజీరావు. అతని ఎడమ చెయ్యి తన నడుముచుట్టూ బిగుసుకుని వుంది. ఏ క్షణాన అయినా తన బరువుకి అతని ఎడమ చెయ్యి వదలవచ్చు. అప్పుడు తను కిందపడి ముక్కలు ముక్కలయిపోతుంది. లేదాతమ ఇద్దరి బరువుకీ అతని కుడిచేతిపట్టు సడలవచ్చు.
అప్పుడు ఇద్దరూ కిందపడి తనను రక్షించబోయి అతనూమరణించడంకంటే తనొక్కతే చనిపోవడం మేలుకాదూ?
"దయచేసినన్ను వదిలెయ్యండి. లేకపోతే మీకు కూడా ప్రాణాపాయం తప్పదు" అంది సీత.
ఆమె మాటలు అతని చెవికెక్కలేదు. అతని కళ్ళు టెర్రస్ మీద ప్రమీలకోసం వెదుకుతున్నాయి.
ఎక్కడవుంది ప్రమీల? కనబడదేం?
గుండెనీరయిపోతోంది అతనికి.
హెలికాఫ్టర్ వేగం అందుకుంది!
కొద్దిక్షణాల తర్వాత కొలిమిలావేడిగా వున్న ఆ వాతావరణం దూరమైంది. చల్లటిగాలులు శరీరానికి సోకడం మొదలెట్టాయి! రెండు నిమిషాల సేపు పయనించి ఒక పల్చటి తివాచీలాగా వున్న మైదానాన్ని సమీపించింది హెలికాఫ్టర్ నెమ్మదిగా కిందికి దిగింది.
పాదాలునేలకు ఆనీఆనకముందే మళ్ళీ తగలబడిపోతున్న ఆ హోటలువైపు పరుగెత్తడం మొదలెట్టాడు బ్రహ్మాజీరావు. అతని వెనకే పెరిగెత్తింది సీత.
అగ్నిగుండంలా మండిపోతోంది హోటలు బిల్డింగు అంతా. ఫెళఫెళార్భాటాలతో దూసుకువచ్చి పడుతున్నాయి. తగులబడిపోయిన శకలాలు. మంటలు అదుపులోకి తేవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక దళం సిబ్బంది.
ఆక్సిజన్ టాంకులు తీసుకుని, స్పెషల్ మాస్కులు వేసుకుని ఆ స్బెస్టాస్ తో చేసిన దుస్తులు ధరించి మెట్లమీదుగా పైకి ఉరికారు కొంతమంది ఫైర్ ఫైటర్లు.
టెర్రస్ మీదకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ చిక్కుకుపోయినవాళ్ళెవరూ వాళ్ళతోబాటు మెట్లమీదకు కిందికి దిగిరావడానికి సాహసించలేదు. మెట్లమీదంతా భయంకలిగించేలా కమ్ముకుని వుంది నల్లటిచిక్కటి పొగ. ఆ పొగలో నుంచి మంటలు నాల్కలు చాస్తున్నాయి. నలుగు మెట్లుదిగాక ఆ మరుక్షణాన ఉంటాయో లేదో తెలియదు.
నలభై అంతస్తుల భవంతి అది! పడితే మొత్తం ఇరవై సార్లు పైకి వెళ్లారు ఆ బృందం సభ్యులు. అయినా టెర్రస్ మీద చిక్కుపడిన ఒక్కళ్ళను కూడా కిందికి తీసుకురాలేకపోయారు. రావడంలేదు ఎవరూ ప్రాణభయంతో పెనుకేకలు పెడుతూ అక్కడే వుండిపోతున్నారు అంతే!
వాళ్ళు కిందకు వచ్చినప్పుడల్లా వాళ్ళతోబాటు తన భార్య ప్రమీల వస్తుందేమోనని ఆత్రుతతో చూస్తున్నాడు బ్రహ్మాజీరావు.
ఇరవయ్యోసారిపైకి వెళ్ళి తిరిగివచ్చి ఇంక ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు వాళ్ళు చెప్పగానే నిస్పృహ ఆవరించింది బ్రహ్మాజీరావుని.
ఆ నిస్పృహనుంచి కోలుకోడానికి ఒక నిమిషం పట్టింది అతనికి.
అప్పుడు వచ్చింది వెర్రిధయిర్యం!
"సీతగారూ! నాకో సాయం చెయ్యాలి!" అన్నాడు సీతతో.
"చెప్పండి!" అంది సీత.
"మా అబ్బాయి మనోహర్ ని లిప్టులో కిందకి పంపాను ఇందాక. అతను ఎక్కడవున్నాడో కాస్త కనిపెట్టి వుండండి. హీ ఈజ్ వెరీ సెన్సిటివ్. పానిక్ అయిపోతాడేమో! నేను ఇప్పుడే వస్తాను" అంటూ పక్క బిల్డింగువైపు పరిగెత్తాడు బ్రహ్మాజీరావు.
వ్వవ్వవ్వ
త్వరత్వరగా లిఫ్టు దగ్గరికి వెళ్ళింది సీత.
దీనిలోనుంచే మనోహర్ కిందికి వచ్చి వుండాలి. ఏడీ అతను?
సీతపాదాలు ఆగిపోయాయి.
ఆమె కళ్ళు ఎదురుగా కనబడుతోంది పగిలి చిన్నాభిన్నమైపోయిన గ్లాస్ లిఫ్టు.
దానిదగ్గరే పడివున్నారు కొంతమంది.
వాళ్ళలో వున్నాడు మనోహర్.
చటుక్కున వెళ్ళిపోయి అతనిపక్కన కూర్చుండిపోయింది సీత.
"మనోహర్" అంది వణుకుతున్న గొంతుతో.
అతను అతికష్టంమీద కళ్ళు తెరిచాడు.
"మనోహర్! హౌ ఆర్యూ?"
అతను నీరసంగా చిరునవ్వు నవ్వి కాలుని చూపించాడు!