"ఈ రోజు శుక్రవారం తల్లి. మీ నాన్నగారికి పాదపూజ వుంది. టిఫిన్ చేయడానికి కాస్త లేటవుతుందేమో. అక్కడే తినెయ్యరాదే" అంది సమీర తల్లి.
"వాళ్ళు టిఫినెందుకు పెడతారే? యాంకరింగ్ చేసి రావాలంతే" విసుగ్గా అంది సమీర.
"బట్టలు, సొమ్ములు ఇస్తారు గానీ, టిఫిన్ ఇవ్వడానికేం రోగం? చక్కగా టిఫిన్ పెట్టి చావోచ్చుగా?"
"మా అమ్మ చెప్పిందని అడుగుతాలే" సమీర తయారవుతూ అంది.
"అది సరే గానీ సమీరా! ఈరోజు ఏదైనా చీర కట్టుకుని యాంకరింగ్ చేయి ఎప్పుడూ ఆ వెధవ డ్రెస్సులేనా? చక్కగా శుక్రవారం మహాలక్ష్మిలా ఏదో ఓ పట్టుచీర కట్టుకుని చెయ్యాలిగానీ?"
"ఆ! మరే. మనకిష్టమున్న పట్టుచీరలు, కంచి చీరలు ఇవ్వరే. వాళ్ళేది ఇస్తే అదే కట్టుకుని యాంకరింగ్ చేయాలి"
"ప్చ్" అని నిట్టూర్చింది సమీర తల్లి.
ఆవిడకి కూతుర్ని అన్నీ రకాల డ్రెస్సుల్లో చీరల్లో నగలతో టీవిలో చూసుకోవాలని కోరిక.
సమీర యాంకరింగ్ చేసే ప్రోగ్రాం వచ్చే టైమ్ కి ఎంత పనిలో ఉన్నా వదిలేసి టివీ ముందు సెటిలైపోతుంది. పైగా పక్కింటి పిన్నిగారికి, ఎదురింటి వదినగారికి, పై వాటా బామ్మగారికి అందరికి చెప్పి మరి వస్తుంది. తన కూతుర్ని టివీ ఛానల్ లో చూసుకుని తెగ మురుసిపోతుంది ఆ తల్లి.
నిజానికి అవకాశం లేక తను ఊరుకుందిగానీ, టివీ చానల్స్ వాళ్లు ఒప్పుకుంటే తను కూడా యాంకరింగ్ చేయాలని తెగ సరదా ఆమెకు.
ఈలోగా పక్కింటి ఫ్రెండ్ సుశీల వచ్చిందిఓ కవర్ తీసుకుని.
"రా....సుశీలా! ఏంటి సంగతులు?" అంది సమీర ఆప్యాయంగా.
"ఏమో తల్లి! తమరికి ఈ యాంకరింగ్ జాబ్ వచ్చాక బొత్తిగా నల్లపూసయిపోయావు" అంది నిష్టూరంగా సుశీల.
"మా అమ్మ మెడలో వున్నాను కదా" అంది సమీర జడ వేసుకుంటూ.
"అమ్మ మెడలో ఉండడమేంటే?" అర్ధం కాలేదు సుశీలకు.
"అదే మరి, నల్లపూసయ్యాన్నావు కదా. నల్లపూస ఎక్కడుంటుంది? పుస్తెల తాడులో వుంటుంది. పుస్తెల తాడు ఎక్కడుంటుంది? మా అమ్మ మెడలో వుంటుంది. అందుకే అలా అన్ననన్నమాట" వివరించింది సమీర.
"తమరికి గ్లామర్ తో పాటు తెలివి తేటలు పెరిగిపోతున్నాయి."
"కదా. నిక్కొన్ని కావాలా?" చిలిపిగా అంది సమీర.
"ఏం అక్కర్లేదు" రోషంగా అంది సుశీల.
"ఇంతకీ ఏంటో విశేషం?"
"మా పిన్నత్తగారి చెల్లెలి మేనకోడలి బావగారి వదిన మనవరాలి పుట్టిన్రోజుట పదహారో తేదిన. కాస్త నీ ప్రోగ్రామ్ లో చదివి విషెస్ చెప్తావేమోనని....."
"హూ....తప్పకుండా. ఆ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేయ్ కవరు" అంది సమీర.
సుశీల అక్కడే టేబుల్ మీదున్న హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. తన చేతిలో వున్న కవర్ లోపల పెట్టడానికి పెడుతూ అప్పుడు చూసింది లోపల వున్న ఫోటోస్ ని. కుతూహలంగా బయటకి తీసిచూస్తూ "ఇవెప్పటివీ సమీ" అంది.
సమీర చటుక్కున అటువైపు చూసి ఒక్కదుటున వచ్చి ఫోటోలని లాక్కోబోయింది సుశీల చేతిలో నుండి.
కానీ అప్పటికే సుశీల ఫోటోలు మొత్తం బయటకి తీసి మహా ఇంట్రెస్టుగా చేసేసింది.
"ఇటివ్వవే" అంది సమీర కంగారుగా.
"ఏమ్మో! అంత సిక్రేట్టా?"
"కాదు గానీ ఇటివ్వు."
"నేనివ్వను. తప్పకుండా చూడాల్సిందే" అంది ఫొటోలతో సహా చెయ్యి వెనక్కి చాచిపెడుతూ.
"ప్లీజ్ సుశీ ఇటివ్వు అమ్మా నాన్న చూస్తే మళ్ళీ లేని పోనీ గొడవ."
"ఏంటి! లవ్ ట్రాకా?"
"కాదు. కామెడి ట్రాక్ గానీ ఆ ఫోటోలిచ్చి నన్నొదిలెయ్ తల్లి" చేతులు జోడిస్తూ అంది సమీర.
"నెవ్వర్. ఫ్రెండ్ దగ్గర సీక్రెట్స్ దాచే వాళ్ళని ఏం అంటారో తెలుసా?"
"తెలిదు"
"మిత్రద్రోహి అంటారు."
"టైటిల్స్ చాలు గానీ నన్నొదిలెయ్"
"నేనెవరికి చెప్పను డార్లింగ్. నన్ను నమ్ము."
"అమ్రిష్ పురి నన్నా నమ్ముతాను, కోట శ్రీనివాసరావు నన్నా నమ్ముతాను, రఘువరన్ నన్నా నమ్ముతాను గానీ నిన్ను నమ్మనే బాబూ!"
"ష్.....చూడని ముందు" అంటూ మొత్తం మంచం మీద అన్నీ పరిచేసిచూడసాగింది.
"అబ్బ.....ఎవరే ఈ హీరో? ఎంత బాగున్నాడే....లక్కు తల్లి లక్కు....మమ్మల్ని షూటింగ్ కోసం ఒక్కసారి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు గానీ నీ బాయ్ ఫ్రెండ్ తో పార్క్ కి వెళ్లి ఫోటోలు దిగి వస్తావా?"
"సారీ సుశీ! ఈసారి నిన్ను తీసుకెళ్తాలే. ముందు అవన్నీ బ్యాగ్ లో పెట్టు. అమ్మ చూస్తుండి.
"మరి నన్ను నిజంగా తీసుకెళ్తావా?"
"తప్పకుండాను."
"ప్రామిస్"
"ప్రామిస్"
'అయితే సరే. అన్నట్టు ఆపాటల ప్రోగ్రాం లో పార్టిసిపేట్ చేయాలి దానిక్కుడా రికమెండ్ చేయాలి."
"నువ్వంత పెర్ ఫెక్టుగా పాడగలవా మరి?"
"బ్రహ్మాండంగా పాడతా."
"క్లిప్పింగ్స్ చూసి ఫాస్ట్ గా ఏ పిక్చరో చెప్పేయాలి మరి చెప్తావా?"
"వై నాట్. చెప్పేస్తా"
"అలా అయితే రికమెండ్ చేస్తాలే."
"అన్నట్టు నా పార్టనర్ గా మా చేల్లెల్నే వుంచుతా. అదయితే ఇంకా ఫాస్ట్ గా పాడుతుంది.
"ఆ....ఉంచుకో. మీ చెల్లెల్ని, మీ పిన్నిని, మీ అత్తని, మీ వదినని, మీ మరదల్ని అందర్నీ తీసుకురా, అప్పుడుగాని దూల తీరదు."
"అదేంటే అలా అంటావ్?"
"మరి. లేకపోతే ఏంటే? ఎవరు పడితే వాళ్ళని తీసుకోరు. ఏదో నిన్నంటే రికమెండ్ చేస్తాగాని మీ వాళ్ళందర్నీ ఎలా కుదురుతుంది చెప్పు."
"సరే గానీ ఇంతకీ ఆ అబ్బాయి ఎవరే ఫోటోలో? చెప్పవా ప్లీజ్" సమీర మాటల్లో పెట్టి మరిపించాలని చూసిన సుశీల మళ్ళీ మొదటికొచ్చింది.
"నువ్వా టాపిక్ వదలవా సుశీ?"
"చెప్పెస్తే వదిలేస్తా!":
"అబ్బ.....మహా జిడ్డు దానివి."
"మరే! కాస్త విమ్ వేసి తోము" చెప్పలేదనే ఉక్రోషంతో అంది.
"ఎవరంటే ఎలా చెప్పేదే?' కాస్త సిగ్గుగా అంది సమీర.
