శీతల్ చాలాసేపు లాభ నష్టాలు బేరీజు వేసుకుని చివరికి ఈ విషయం లోకేశ్వరరావుకి చెప్పాలనే అనుకుంది.
శీతల్ కి తృప్తిగా అనిపించింది. అప్పుడు నిశ్చిలంగా నిద్రపోయింది.
22
శీతల్ ది తండ్రి పోలిక
శీతల్ ఏదైనా ఒకపని చేసేముందు మంచిచెడ్డలు గురించి కొద్దిసేపు ఆలోచిస్తుంది.
మంచిగాని చెడుగాని ఒక నిర్ణయానికి వచ్చింతరువాత ఇంక వెనక్కి తిరిగేది లేదు.
శీతల్ ఒక నిర్ణయానికి వచ్చిం తరువాత తన్ని తానే పరీక్ష చేసుకుంది. ఆ రోజు వేలిలో గాజుపెంకు గుచ్చుకుంటే లాగి పారేసింది. ఆ చిన్న గాయం అలాగే వుంది. పైగా వేలు నొప్పిచేసింది. తను ధరించిన లంగాకి, బ్రాసరీకి ఏ ఆకారంతో చిన్న కొర్రులు (చింపటం) బాత్ రూమ్ లోకి వెళ్ళి పెట్టింది.
ఇప్పుడు చూసుకుంటే ఆ కొర్రులు అలాగే వున్నాయి.
కనుక ఇది కలకాదు.
జరిగిందేదో నిజంగానే జరిగింది.
డాక్టర్ తనకి ఇంజక్షన్ జబ్బకి ఇచ్చాడు. మరి చేయి మడతలో (మోచేయి మడత) వెయిన్ లోకి ఇంజక్షన్ ఇచ్చిన గుర్తుగా బెజ్జం వుంది.
వెయిన్ లోకి సూది గుచ్చి ఏదైనా ఇంజక్షన్ ఇచ్చారా?
అది ఏ రకం ఇంజక్షను? తెలివి తప్పిపోవటానికి తెలివి రావటానికా!
ఈ రెండూ కాని ఇంజక్షను...
తను చాలా వీక్ గా వున్నట్లు శీతల్ కి గుర్తుకొచ్చింది బెడ్ మీద నుంచి లేవబోయే సరికి కళ్ళు తిరిగాయి.
కళ్ళు ఎందుకు తిరుగుతాయి?
తన శరీరం లోంచి బ్లెడ్ తీశారా?
తన కొచ్చిన ఆలోచనకి తానే ఉలిక్కిపడింది శీతల్.
సరీగా అప్పుడే "ఏమ్మా లేచావా! ఎలా వుంది" అంటూ లోకేశ్వరరావు గదిలోకి వచ్చాడు.
అప్పటికి శీతల్ బెడ్ మీద నుంచి లేచివీల్ చైర్ లో కూర్చుని వుంది.
"రండి అంకుల్!" అంటూ శీతల్ లేచి సరిగ్గా కూర్చుని సాదరంగా ఆహ్వానించింది.
"నీరసం తగ్గిందా?" తానూ కూర్చుంటూ అడిగాడు.
"పూర్తిగా తగ్గింది. ఇంక డాక్టర్ అవసరం లేదు.
"ఆ మాట చెప్పాల్సింది ఆయన కదా?"
లోకేశ్వరరావు నవ్వుతూ అనే సరికి శీతల్ కూడా నవ్వింది.
"చాలా పెద్ద ప్రమాదం తప్పింది నీకు తొందరగా తెలివి రావాలని దేముడికి మొక్కుకున్నాను."
"తల నీలాలా అంకుల్!"
"కాదు పది కొబ్బరి కాయలు"
"నా విలువ పది కొబ్బరి కాయలేనా!" కావాలని అల్లరిగా నవ్వుతూ అడిగింది శీతల్.
"నేను మొక్కే దేముడు ఎవరో తెలుసా? బోళా కంకరుడు. ఆయన అల్ప సంతోషి. ఒక్క కొబ్బరికాయే చాలు పోనీలే సంతోషిస్తాడని ఒకటి పక్కసున్నా చేర్చాను" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
వాళ్ళలా నవ్వుకుంటూ వుండగా డాక్టర్ పరంజ్యోతి గదిలో అడుగు పెట్టాడు.
"ఎలా వుండమ్మా!" డాక్టర్ పరంజ్యోతి అడిగాడు.
"నీరసం తగ్గింది" శీతల్ చెప్పింది.
"తల నొప్పి వళ్ళు నొప్పులు..."
"అలాంటివి చెప్పుకో తగ్గ బాధతో లేవు. అనుమానం బాధ మాత్రం చాలా ఎక్కువగా వుంది."
"అనుమానం బాధా? అదేమిటి?" పరంజ్యోతి తెల్లబోయాడు.
"మా శీతల్ మిమ్మల్ని జోక్ చేస్తున్నది" లోకేశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
"జోక్ కాదు అంకుల్!"
"మరి?"
"నేను కొన్ని చూశాను అంకుల్! అది నిజమో అబద్దమో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామనుకున్నాడు మాటల్లో పడి మరిచిపోయాను. డాక్టర్ గారు చూడగానే గుర్తుకొచ్చింది. అడగనా అంకుల్?"
"అడుగు ఎప్పుడు ఏదో దాచుకోకూడదు. అనుమానం పెద్ద బాధ అయితే దాన్ని దాచుకోవటం మరీ బాధ. డాక్టర్ దగ్గర ఏదీ దాయకూడదు" లోకేశ్వరరావు అన్నాడు.
"ఎస్....ఎస్" అంటూ తల ఆడించాడు డాక్టర్ పరంజ్యోతి.
శీతల్ కళ్ళుమూసుకుని కొద్దిసేపు వుంది. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరచి "కోమాలోకి వెళ్ళి నప్పుడు పేషెంట్ కి కలలు వస్తాయా డాక్టర్? అనడిగింది.
"కోమాలో కలలేమిటి?" తెల్లబోయి తిరిగి ప్రశ్నించాడు డాక్టర్ పరంజ్యోతి.
"నిద్రలో కలలొచ్చినట్లు కోమాలో వునంప్పుడు కలలు వస్తాయా అని అడుగుతున్నది. అదే కదా శీతల్ నీవడిగే ప్రశ్న నీ అనుమానమూను?" లోకేశ్వరరావు అడిగాడు.
"అంకుల్ కరెక్టుగా చెప్పారు" అంది శీతల్.
"ఇంతకీ విషయం మాత్రం నా కర్ధం కాలేదు" డాక్టర్ పరంజ్యోతి అనేశాడు.
"నాకు కారు యాక్సిడెంట్ అయింది కదా?"
"అయింది అందులో మాత్రం అణు మాత్రం సందేహం లేదు."
