Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 37

 

    "నిజమా?" చెంగున ఆమె పక్కకు దూకి--"చెప్పు. ఏం తెలిసింది? అన్నాడు అణువంత వుత్సాహంతో.


    "ఇప్పుడు కాదు.....సమయం వచ్చినప్పుడు చెబుతాను."


    "అంటే.....రాత్రికి నేను దగ్గరకు తీసుకున్నప్పుడా?" అంతలోనే ఏదో గుర్తు కొచ్చినట్లు అన్నాడు---" తెలుసు కిన్నూ! ఈ రాత్రికి నన్ను దగ్గరకు రానివ్వకుండా అప్పుడే సీను మొదలు పెట్టావు."


    పంటి బిగువున నవ్వాపుకుంది. ఆడపిల్లను ఎలా ఓడించాలో తెలిసిన అసాధ్యుడు ఈ పెద్దమనిషి.


    "ఓ పని చేయండి.'


    "చెప్పు."


    "నా దగ్గర మాంచి కాశ్మీర్ శాలువా వుంది.'


    "అది కప్పుకుని పడుకోమంటావా?"


    "కాదు.....అది ఒంటికి చుట్టుకుని ఆ కిటికీ ఊచల్ని పట్టుకుని సేధటిక్ గా పది పేజీల డైలాగ్స్ చెప్పండి.'


    "పది పేజీల డైలాగులే?"


    "అవును. మీ సుబ్బులు గురించి."


    ఉలికిపాటుగా పైకి లేచాడు. "బామ్మ బెండ్ వేసిందన్న మాట, అర్ధమైంది."


    "ఏమిటి?"


    "నీ అలక్కి కారణం."


    "అసలు మీ సంగతేమిటో నాకూ అర్ధం కావాలి."


    "నీ మీద ఒట్టు!" అమాంతం ఆమె తలపై చేయి వేశాడు. "అవన్నీ వట్టి మాటలే తప్ప ఇంకొక్క అంగుళము ముందుకు జరగలేదు.


    "కుదరకా?"


    "నువ్వలా సీరియస్ గా అడక్కు" 'అమ్మ బామ్మో!" అనుకుంటూ మోతాదు మించిన బాధను అభినయిస్తూ అన్నాడు -"వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ అని, నేనో 'మేల్' నన్న విషయం మరిచి సుబ్బులు గట్టిగా పట్టుకుంది కాని, నా శీలం చెడిపోకుండా నన్ను నేను కాపాడుకున్నాను. ఒట్టు....నన్ను నమ్ము. కావాలంటే డాక్టర్ చేత నన్ను చెక్ చేయించు."


    పకాల్న నవ్వేసింది. "మగాళ్ళ విషయంలో , అందులోనూ మీ మరదల్ని వదిలిపెట్టిన యింత కాలం తర్వాత మీ శీలాన్ని చెక్ చేసే సాధనం వైద్య శాస్త్రంలో వున్నట్టు లేదు."


    "ఎలా? మరి నా నిజాయితిని నిరూపించుకునేదేలా అని నిన్ను నిలదిస్తున్నాను. ప్రశ్నిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను."


    "అవసరానికి మించి అల్లరి చేస్తున్నారు కూడా. పదండి"

    "డాక్టర్ దగ్గరికా?"


    "కాదు, బొజ్జన్న కొండకు

    "ఎందుకు?" ఉత్సాహంగా అన్నాడు.


    "అక్కడ గుహలో కొంతసేపు గడుపుదామా?"


    "పళ్ళు రాలగొడతాను. మనం వెళుతున్నది గడపటానిక్కాదు-- మీరు కారు నడపటానికి."


    "అవును కదూ! ఆ విషయమే మరిచిపోయాను.


    పది నిమిషాలలో స్నానం చేసి వచ్చాడు.


    పైజమా, లాల్చిలో మరీ అకర్షణియంగా కనిపిస్తుంటే ఎక్కువసేపు అతడ్ని చూడలేనట్టు బయటకు వచ్చింది కిన్నెర.


    కాంటేస్సా క్లాసిక్ ని ఊరి పొలిమేర దాకా తనే నడిపింది.


    ఊరి జనమంతా పక్కనే కూర్చున్న రాఘవను చూస్తుంటే-


    "ఎంతయినా అదృష్టవంతురాలివి" అన్నాడు ఉన్నట్టుండి.


    "దేనికి?" అంది నిర్జీవంగా ఉన్న చోట కారాపుతూ.


    "చూశావా? జనం నిన్ను చూసి ఎంత అసూయపడిపోతున్నారో?"


    "మరేం.......మీరు నాకు మొగుడయినందుకు."


    "కరెక్ట్....అందులో అందగాడ్ని.....తెలివైనవాడ్ని"


    "టైం లేదు. స్టిరింగ్ ముందుకు రండి....." అంది అతడి మాటలకు అడ్డం పడుతూ. "కమాన్.....' తలుపు తెరవబోయింది.


    "ఎందుకు తలుపు తెరవటం? నువ్వు నా మీదనుంచి ఇలా పక్కకు రావచ్చు." ఉచితంగా సలహా అందించాడు.


    అతని కళ్ళలో ఏ చిలిపి ఆలోచనలు కనిపించాయో, "తెలివి చూపించాల్సింది డ్రైవింగ్ లో. ఇలాంటి వాటిల్లో కాదు" అంటూ తనే తలుపు తీసుకుని బయటికి వచ్చింది.


    స్టిరింగ్ ముందుకు జరిగాడు ఉడుకు మొత్తనంగా.


    కిన్నెర అతడి పక్కగా వచ్చి కూర్చుంది.


    "ప్రిన్సిపుల్ రిత్యా ఆలోచిస్తే స్కూటర్ కూ, కారుకూ పెద్ద తేడా వుండదు. ముందు ఇగ్నిషన్, ఇంజన్ అన్ చేశాక క్లచ్ ప్రెస్ చేస్తూ గేరు మార్చడం ఇలా స్టిరింగ్ పట్టుకుని మలుపులు వచ్చిన చోట....." తలతిప్పి చూసింది రెప్ప వాల్చకుండా తననే గమనిస్తున్న రాఘవను. "చెప్పింది వినరేం?"


    "క్లియర్ గా అర్ధమైంది.'


    "ఏమిటో?' దీర్ఘం తీసింది.


    "నువ్వు చెప్పిన దాన్ని బట్టి కారుకూ, స్కూటర్ కూ మాత్రమే కాదు, దాంపత్య జీవితానికి అప్లయ్ చేయాల్సిన మెకానిజం అదే."


    ముందు అర్ధం కాలేదామెకు. అర్ధం కాగానే పెదవుల్ని అరచేత్తో మూసుకుని పకాల్న నవ్వింది. "ఈ తెలివికేం తక్కువ లేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS