చెప్పకపోతే అటు సురేంద్ర పరిస్థితి రోజురోజుకి ఇబ్బందికరంగా తయారవుతుంది. అప్పటికి పాపం పరోక్షంగా హెచ్చరిస్తున్నాడు. అయినా జయంతి అర్ధం చేసుకోలేకపోయింది. ఎలా అర్ధం చేసుకుంటుంది?
గిరిజ ఆ విధంగా ఆలోచిస్తుందని అసలు ఉహించదుకదా! నేనే ఏదో విధంగా జయంతిని నెమ్మదిగా హెచ్చరించాలి. లేకపోతే గిరిజ కటువుగా చెపుతుంది. అది మరి తట్టుకోలేదు. ఈ విషయం కస్తురక్కకు తెలిస్తే ఎంత బాధపడుతుంది? బాధపడుతుందా? లేక గిరిజను నిలదీసి బయటకు పంపుతుందా? ఎంతైనా తల్లి మనసు కదా? కూతుర్ని ఆ విధంగా అవమానపరిస్తే ఏ తల్లయినా ఎలా తట్టుకుంటుంది? తట్టుకోవటం కష్టం అందుకే ఈ విషయం కస్తూరక్కకు తెలికపోవటమే అందరికీ మంచిది. వీళ్ళ సంభాషణ నా చెవిలో పడింది కనక సరిపోయింది, అదే కస్తూరక్క విన్నట్లయితే ఈపాటికి ఇంట్లో పెద్ద తగువు జరిగేది. అవును! పాపం సొంత కూతురిలా భావించి ఎంత ఘనంగా జరిపించారు పెళ్ళి. గిరిజ ఇంత కృతజ్ఞురాలా?
గిరిజతో కూడా మాట్లాడాలి. ఆమె కళ్ళకు కమ్మిన పొరలను తొలగించటం అందరికి క్షేమకరం. చ....ఎంటో అసలు నిన్నటినుంచి చిరగ్గానే వుంది. అయన నిన్నంతా మనసు బాలేదని నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ పడుకున్నారు. ఇప్పుడు నాకు ఈ సమస్య ఎదురైంది. పోనీ ఈ విషయం ఆయనకు చెపితే....వద్దు పాపం అసలే ఏదో సమస్యతో బాధపడుతున్నారు. మళ్ళి ఈ కొత్త సమస్యను ఆయనకు చెప్పి మరింత క్షోభకు గురిచేయటం భావ్యంకాదు. ఒకవేళ అయన బాధపడేది కూడా ఈ విషయమేనేమో! అయన కూడా గిరిజ మాటలు చాటునుంచి విన్నారేమో! అలా జరగడానికి కూడా ఆస్కారం వుంది. అసలు ఆ పిల్ల ఎవరికైనా వింటారేమో అనే భయం కూడా లేకుండా సురెంద్రతో ఎంత గట్టిగా మాట్లాడుతూ నిలదిస్తుంది? అయన కూడా ఇదే విషయం గూర్చి ఆలోచిస్తున్నారా? పోనీ ఆయన్నే అడిగితే? వద్దు...వద్దు ఈరోజు కూడా అయన అలానే ముభావంగా వుంటే అప్పుడు నిలదియాలి. మీరెందుకు బాధపడుతున్నారో చెప్పండని. భార్యగా నేను ఆయన బాధలో పాలుపంచుకోవలసినదానినే కదా! అలా ఒంటరిగా ఆయనలో ఆయనే బాధపడుతూ వుంటే ఎలా? అవును! ఈరోజు తేల్చివేయాలి అసలు.
"ఏంటక్కా ఒక్కదానివే పడుకుండిపోయావు? ఒంట్లో బాలేదా శివపార్వతి ఆమె పక్కనే మంచంపైన కూర్చుని చేయి నుదుటిమీద చూస్తూ అడిగింది ఆప్యాయంగా.
"ఏంలేదు పార్వతీ! ఒంట్లో కాస్త నలతగా వుంటేను" అంది కూర్చోబోతూ.
"అరెరె ....పడుకో అక్కా! ఎందుకు లేస్తావు? అగు కాస్త కాఫీ పెట్టి ఇస్తాను" అంటూ వంటగిలోకి వెళ్ళింది పార్వతి.
ఈ విషయం పార్వతికి చెపితే....?! ఆమె ఏ విధంగా అనుకుంటుందో? ఏమనుకుంటుంది. గిరిజను నిలదీసి అడుగుతుంది. ఎవరయినా అదే చేస్తారు. ఈ విషయం ఎవరికయినా చెప్పాలనిపిస్తుంది. చెపితే కానీ నా మనసులో భారం తగ్గుతుంది కదా! పార్వతికి చెప్పేకంటే ఆయనకు చెప్పటమే మంచిదేమో. అయన తట్టుకోగలరా? మొన్ననేగా ఏంతో ఘనంగా పెళ్ళిచేసింది.....వాళ్ళ పెళ్ళి పారాణి ఆరకముందే వాళ్ళ కాపురం జయంతి మూలంగా కలతలు వస్తున్నాయంటే ఎంత భాధపడతారు? బాధపతారని ఈ విషయాన్నీ చెప్పకుండా దాయటం కూడా మంచిది కాదు. ఇదేమైనా చిన్న విషయమా? రేపేదైనా జరగరానిది జరిగితే నాకా విషయం ముందే ఎందుకు చెప్పలేదని నన్ను నిలదీస్తే? అది కూడా నిజమే చెప్పకపోవటం నాదే పొరపాటు అవుతుంది.
"ఇదిగో అక్కా! కాఫీ తాగు, కాస్త బడలిక పోతోంది" అంటూ కాఫీ గ్లాసుతో వచ్చింది పార్వతి.
దాక్షాయణి నవ్వుతూ "నీకు శ్రమ ఇచ్చినట్లున్నానే" అంది.
"ఏంటి శ్రమ. కొత్తగా మాట్లాడుతున్నావు? కాఫీ పెట్టివ్వటం శ్రమవుతుందా?" అంది నవ్వుతూ.
"ఏంటి పార్వతీ విశేషాలు ? కస్తూరక్కా ఏం చేస్తుంది?" అంది దాక్షాయణి.
"పడుకుంది" అంది పార్వతి.
"జయంతి స్కూలుకు వెళ్ళిందా?" అడిగింది దాక్షాయణి.
"వెళ్ళిందక్కా! ఏదో పరిక్షలు జరుగుతున్నాయటదానికి!" అంది శివపార్వతి.
"అలాగా నాకు చెప్పలేదే!" అంది దాక్షాయణి నవ్వుతూ.
"జయంతి, విషయం నీతో మాట్లాడాలక్కా....అందుకే వచ్చాను" అంది శివపార్వతి.
"జయంతి విషయమా!" అంది ఆశ్చర్యంగా.
"అవునక్కా" అంది శివపార్వతి సీరియస్ గా.
ఏం వినాల్సివస్తుందోనని భయంతో ఆమె వేపు చూసింది.
* * * *
"ఏంది మావా! అట్టా తాగుతున్నావు...ఏమైంది నీకు ఇయ్యాలా?" అంది కాళమ్మ.
"ఇయ్యాల నా మనసేమీ బాగోలేదు...ఎంత తాగినా ఎక్కటం లేదే....గొప్ప ఘోరం జరిగిపోతావుందే కాళీ! నా కాళ్ళు, చేతులు అట్టం లేదే" అన్నాడు వెంకటేశం.
"అదేంది మావా! ఏమైంది...." అంది కాళమ్మ ఆందోళనగా.
వెంకటేశం కల్లు సీసా ఎత్తి గటగటా సగం ఖాళి చేసి కింద పెట్టాడు. ఇద్దరూ వాళ్ళ గుడిసెలో కూర్చుని వున్నారు.
"ఏంది మావా! ఏమైందో సెప్పరా....ఎందుకు అట్టా తగుతున్నావ్ ఇది రెండో సీసా....నేను అయ్యగారితో సెప్తా" అంటూ లేవబోయింది కాళమ్మ.
"సెత్ నోర్ముసుకుని కుకోవే....నేను అయన కోసమేనే తాగేది. దేముడిలాంటి అయ్యగోరిమీద మచ్చ పడిందే....అందుకే తట్టుకోలేకపోతున్నాను" అంటూ బీడి తీసి వెలిగించాడు.
"ఓళమ్మో, అయ్యగోరిమీద మచ్చ పడిందా? ఏంట్రా నువ్వనేది కల్లు తాగి కళ్ళునెత్తికెక్కినాయా ఏంది? అంది కాళమ్మ.
"కళ్ళు నెత్తికెక్కింది నాక్కదే చినబాబుకి....ఆరికి ఏట్టాటి కుటుంబం. ఏట్టాటి వంశం? పెద్దయ్యగోరు వున్నప్పటినుంచి మనము ఇదే పంచన పడివుండి అళ్ళ ఉప్పు తింటూ పనిచేస్తున్నాం కదా! అన్నాడు వెంకటేశం.
