Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 38


    
    మాటకి శిక్ష విధించే మౌనం అంటే ఏమిటో ధన్వికి తెలిసిన తొలి క్షణం అది.

 

    భూత భవిష్యత్తుల్ని విడదీస్తున్న అంధకారం పల్లెని కప్పిన 'అపరాత్రి' సమయంలో క్షణాల అంపశయ్యపై కాలం భారంగా ఒత్తిగిలి నెత్తుటి ఆవిరిలో బ్రతుకు వ్యాఖ్యానాల్ని నింపుతున్న నిరవనిశిదిలో......

 

    ఒదిగిపోతున్న ఏ విషాది జంత్ర సంగీతమో కలవరపరుస్తున్నట్టు దినవదనంతో సుమిత్ర మాట్లాడుతుంది ధన్విని చూస్తూ.


        

    "మా సంబంధానికి కారణం కాలమో లేక దేవుడు రాయని నాటకంలో నేనూహించని సన్నివేశమో నాకు తెలీదు ధన్వి! మీ నాన్నగారూ నేనూ భార్యా భర్తలమైంది చాలా చిత్రమైన పరిస్థితుల్లో. అసలు నేను మీ నాన్న గారికి భార్యనవ్వాలనిగానీ మరో ఆడదానికి అన్యాయం చెయ్యాలనిగానీ ఏనాడూ కోరుకోలేదు."

 

    దూరంగా నేలమీద బొంతపై పడుకున్న క్షితిజ పక్కకి ఒత్తిగిలుతుంటే చెప్పడం ఆపింది సుమిత్ర.

 

    "నాటక రంగానికి సంబంధించినంతవరకూ నేను పేరున్న నటినే అయినా తరచూ మీ నాన్నగారితో కలిసి నటిస్తూ పరిషత్తుల్లో పాల్గొనేదాన్నే తప్ప ఏరోజు మరో దృషితో మీ నాన్నగారిని చూడలేదు. అయితే మీ నాన్నగార్ని అందరూ అభినందిస్తుంటే ఆనందించేదాన్ని, నటరాజు అంటూ ఆయన్ని మేధావులు సైతం పొగుడుతుంటే పోగిపోయేదాన్ని, నేను కోరింది ఆయనతో కలిసి నటించటం అంతే....."

 

    ఆమె కంటనుంచి రాలుతున్న కన్నీళ్ళు కాల్లోచ్చిన అక్షరాల్లా చీకటి మాటున దాగి వున్న చిన్ని నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి.

 

    "కానీ మా జంటని చూసి యితర సమాజాల వాళ్ళు అసూయపడేవారు. ఏ నాటక పోటిల్లో అయినా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి బహుమతుల్ని మేము సాధిస్తుంటే ఓర్వలేకపోయేవారు. ఒకనాడు రాజమండ్రి లలితా కళానికేతన్ నాటకపోటిల్లో ఉత్తమ నటి బహుమతి నేను గెలుచుకోగానే మా ప్రత్యర్ధులు నా మిద ఓ అపవాదు వేశారు. దానికి కారణం మాకు పోటిగా నాటకం ప్రదర్శించిన ఓ సమాజంలోని అమ్మాయికి ఉత్తమ నటిగా బహుమతి రాకపోవడం. ఆ అపవాదు నా శీలానికి సంబంధించింది ధన్వి. నేను పరిషత్తు నిర్వహుకులతో కలిసిపోయానట. న్యాయనిర్ణేతల దగ్గర దిగాజారి బహుమతి గెలుచుకున్నానట. నేను డబ్బు కోసం మొహానికి రంగుపూసుకునే ఆడదాన్ని మాత్రమే తప్ప వేశ్యని కాదుగా.....నాలో నేనే కుమిలిపోయాను తప్ప ఎవరికి చెప్పుకోలేదు. కానీ ఆ రాత్రి ఆలస్యంగా హోటలకి వచ్చిన మీ నాన్నగారికి ఈ విషయం తెలిసింది."

 

    కళ్ళు ఒత్తుకుంటు ఆగింది సుమిత్ర.

 

    "అంతకాలము మా మేనమామల దగ్గర అనాధగా బ్రతుకుతున్న నామీద మీ నాన్నగారు సానుభూతి చూపించడం తెలుసు. ఒక అత్మియుడిగా గురువుగా నన్ను గైడ్ చేయడం తెలుసు. అలాంటి వ్యక్తీ బాగా తాగి వుండడంతో సరాసరి ప్రత్యర్ధుల హోటల్ గదికి వెళ్ళారు. మిగతా సమాజం సభ్యులు చూస్తుండగానే నన్ను కామెంట్ చేసిన వ్యక్తిని అందరి ముందు చితకబాదారు. సమస్య అక్కడితో ఆగలేదు ధన్వి. సుమిత్రనే ఓ స్టేజి నటి విషయంలో అంతగా రియాక్ట్ అవటానికి కారణం దానికీ తనకూ వున్న సంబంధమని ఎవరో అంటే" గొంతు సన్నగా కంపిస్తుంటే తల దించుకుంది సుమిత్ర.

 

    "అవమానంగా భావించిన మీ నాన్నగారు ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నది మరచిపోయారు. అందరిముందు ఆవేశంగా ఆ క్షణంలోనే నా మెడలో పసుపుతాడు కట్టేశారు."

 

    నిర్లిప్తంగా వింటున్నాడు ధన్వి.

 

    "స్వాభిమానం కల నేను ఒకవేళ మీ నాన్నగారు నా మర్యాదని అలా కాపాడి వుండకపోతే బహుశా ఆత్మహత్య చేసుకునేదాన్నేమో ధన్వి, కానీ బ్రతికించారు. అలా తొందరపాటుతో ఒక పొరపాటు చేసి తనూ సమస్యల్లో యిరుక్కుపోయారు. నిషా తగ్గాక జరిగింది తలుచుకుని ఆయన ఎంత కలవరపడింది నాకు యిప్పటికి గుర్తేధన్వి! కానీ జరగాల్సిన అనర్ధం అప్పటికే జరిగిపోయింది. ఇంత వరకూ చెప్పాక నా బిడ్డలాంటి నీకు మరో విషయాన్ని సిగ్గువిడిచి చెప్పటానికి నేను సంకోచించను ధన్వి. మీ నాన్నగారు అలా నాకు తాళి కట్టింది నా మీద కోరికతో కాదు, నా బిడ్డ మీద , నా తాళిబొట్టు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అవమానం నుంచి నన్ను గట్టెక్కించలనుకున్నారే తప్ప అవకాశం తీసుకోలేదు. ఆ తర్వాత ఇక నేను నాటకాలు మానేశాను. అందరికి దూరంగా ఈ మారుమూల పల్లెలో యిలా బ్రతుకుతున్నాను. అయినా నేనీ జీవనాన్ని శాపంగా అనుకోలేదు. మీ అమ్మగారి నుంచి దొంగతనంగా నేను దాచుకున్న అదృష్టంగా భావించాను"

 

    ఆమె ఆగింది నరాల వాయులినంతో ఎదిగిన కొడుక్కి తన తప్పిదం లేదని శృతిబద్దంగా చెప్పిన తల్లిలా.....

 

    ఈ ప్రపంచంలో ప్రతి సంఘటనకి ఓ కారణం వుంటుంది.

 

    మంచి చెడుల నిర్ణయం వ్యక్తుల దృష్టికి సంబంధించింది.

 

    కసాయివాడి ప్రయత్నాన్ని మేక హర్షించదు.

 

    మేక ఆక్రందన కసాయివాడికి నచ్చదు.

 

    అసలు నాన్న చివరిగా తనకు చెప్పాలనుకున్నదేమిటి?

 

    ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రాధేయపడలనుకున్నడా?

 

    ఆదుకోవడానికయినాగానీ ఆర్ధికంగా తను అంత పటిష్టంగా లేడే.

 

    ఆలోచనల వేకువలో వున్నాడా లేక దూరాకాశపు తీరాలోచనల్లో అడుగుపెట్టి నిశ్శబ్దంలో దాగి వున్న శబ్దంగా మారాలనుకుంటున్నాడా?

 

    "నాన్నగారు ఏమైనా చెప్పారా?" అడిగింది సుమిత్ర. తొట్రుపడ్డాడు ధన్వి. ఇప్పటిదాకా తెలియచేయని నిజం అది.

 

    "ఎప్పుడోచ్చేది అదైనా చెప్పారా?"

 

    సుమిత్ర గొంతులో ఎందుకు రాడన్నా ప్రశ్నలేదు.

 

    ఎప్పటికయినా రావడమంటు జరిగితే చాలు అన్న ఆర్తి వుంది.

 

    "ఆఫీసులో శలవు దొరకడం లేదు. అందుకే నన్ను పంపారు."

 

    "అంటే డబ్బు ఏర్పాటు గురించి....."

 

    నీళ్ళునములుతున్నట్టుగా అడిగింది సుమిత్ర.

 

    వాళ్ళిద్దరూ పూర్వం చర్చించుకున్నదేమిటో అతనికి తెలీదు.

 

    ధన్వి చూపులో ఏ భావానికి ఆమె అందోళన పడిందో మరి, గిల్టిగా జవాబు చెప్పింది. "అప్పటికి మనకి తలకిమించిన భారం వద్దని చెబుతూనే వున్నాను నాన్నా. వింటేగా ఎలాగయినా అనుకున్న సంబంధం ఖాయం చేయాలన్నారు, వారికీ మాటిచ్చేశారుకూడా."

 

    "అబ్బాయి హైదరాబాదులో వుంటున్నాడా" ఆమె మాట్లాడేది క్షితిజ పెళ్ళి విషయమని గ్రహించడంతో తెలివిగా ఆమెనుంచే అన్ని వివరాల్ని రాబట్టాలనుకున్నాడు.

    "బాంబే లో వుంటున్నాడు.....కంప్యుటర్ ఇంజనీర్ కాబట్టి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నాడట....దానికి రెండు లక్షలు కట్నంగా అడుగుతున్నారు."

 

    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు ధన్వి.

 

    పాతిక సంవత్సరాల ఉద్యోగ పర్వంలో పాతిక వేలైనా వెనకేయలేని నాన్న రెండు లక్షల కట్నం ఇవ్వటానికి నిర్ణయించడంతో బాటు అవతలి వాళ్ళకి చెప్పేశాడట కూడా.

 

    అంటే....

 

    ఇది కూడా తాగిన మైకంలో చేసిన నిర్వకమా?

 

    లేకపోతే ఒక సమర్ధుడైన తండ్రిగా నటించే ప్రయత్నమా?

 

    అసలు రెండు లక్షలంటే ఏమనుకున్నాడు?

 

    వచ్చింది ఎందుకో అయితే ఇప్పుడు కోరని సమస్యలో ఇరుక్కుంటున్నట్టుగా నచ్చ చెప్పాడు "మీకున్నది ఒక్క బిడ్డ.....ఆ బిడ్డని అంత దూరం పంపితే మీరు వంటరిగా వుండగలరా?"

 

    "నాన్నగారితో నేను ఈ మాటా అన్నాను బాబూ....ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఓంతరివాడే సుమిత్రా అంటూ నా నోరు మూయించటానికి ప్రయత్నించారు."

 

    అయితే ఆ క్షణంలో అయన ఖచ్చితంగా తాగే వుంటారు.

 

    "మీ నాన్నగారి బాధ అది కూడా కాదు ధన్వి......రెండో భార్యనని తక్కువ చేసి చూస్తున్నానన్న బాధ నుంచి తను ముందు తెరుకోవాలి అంటే క్షితజకి ఘనంగా పెళ్ళి చేయాలనుకున్నారు. అయినా రెండు లక్షలంటే మాటలా.....ఎక్కడి నుంచి తేగలరు.....కనీసం నువ్వయినా చెప్పి చూడాల్సింది ధన్వి."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS