Previous Page Next Page 
పగలే వెన్నెల పేజి 38


    
    ఈ నలభై ఎనిమిది గంటల్లో ఆమె ఆ అనుభవాన్ని తప్ప మరో  దాని గురించి ఆలోచించలేకపోయింది. తనకొక్కదానికే పండగ వచ్చినట్లుంది.


     మూడోరోజు సాయంకాలం వచ్చాడతను.


    ఆత్మబంధువు ఇంటికి వచ్చినట్లనిపించింది. నులకమంచం వాల్చింది. అప్పుడు తల్లీ  దండ్రీకూడా వున్నారు.


    "నారు దొరికింది. పనికి ఒక్కరొస్తే చాలు నాటెయ్యచ్చు....." అన్నాడు సుధాకర్.


    అలాగే వస్తానన్నట్లు తల వూపింది.


    రెండోరోజు మళ్ళీ ఉదయం వచ్చి తీసుకెళ్లాడు.


    నాటే కార్యక్రమం  పదకొండుగంటలకల్లా పూర్తయిపోయింది.


    సుబ్బారెడ్డి ఈ రోజు రాలేదు.


    "నాన్న వుంటే పొలానికి వచ్చేస్తాడు. నిన్ను ఒంటరిగా కలుసుకో వచ్చనే ఉద్దేశ్యంతోనే నాన్న లేనప్పుడు నాటు పెట్టుకున్నాను" అన్నాడు.


    ఇద్దరూ షెడ్ లో కాసేపు సేదతీర్చుకుంటూ ఏవేవో మాట్లాడుకున్నారు.


    అతని కళ్ళల్లో కోరిక క్రమక్రమంగా పెరుగుతోంది. ఆమెకీ ఇష్టంగానే వుంది. అతను వెనక్కి జరగబోయి ఎవరన్నా వస్తున్నారేమోనని బయటికి వచ్చి చూశాడు.


    వెంటనే లోపలికొచ్చి "మా నాన్న ఇక్కడికి వస్తున్నాడు...." అని చెప్పి గబగబా బయటపడ్డాడు.


     అతనితోపాటు ఆమెకూడా బయటికి వచ్చింది.


    సుబ్బారెడ్డి  నాటంతా పరికించిచూసి -


    "నాటు అయిపోయిందన్నమాట ...."స్వగతంలా అని "నేను లేకపోయినా నారు మాట్లాడుకుని, నాటు పూర్తిచేశావంటే నువ్వు ప్రయోజకుడివేరా" అంటూ కొడుకును తెగ మెచ్చుకున్నాడు.


    అసలు విషయం తెలిస్తే మహానుభావుడు బడితపూజ చేసేవాడేమో అనుకున్నాడు మనసులో.


    అందరూ కలిసి ఊర్లోకి వచ్చేశారు.


    తర్వాత మూడోరోజో, నాలుగోరోజో పనికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో ఎవరో చెప్పారు "సుధాకర్  - అదే సుబ్బారెడ్డి కొడుక్కి జ్వరం. మనూరి  ఆచారి చెప్పడం చూస్తుంటే అదేదో విషజ్వరంలాగా వుందంట."


    ఆ మాటలు వింటుంటే ఉమకి పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపించింది. కొంపదీసి జన్నెక్కలేదు కదా! ఆమెకి వచ్చిన మొదటి అనుమానం అదే!


     ఇంటికి దూరమైన అమ్మాయిని కలిస్తే వచ్చే జ్వరాన్నే 'జన్నెక్కడం' అంటారు.


     మరి ఆచారి అలా చెప్పలేక విషజ్వరమన్నాడా?ఏమైంది? ఆమెలో ఆతృత హెచ్చింది.


     ఎవరు తనకు ఖచ్చితమైన సమాచారం ఇస్తారో తెలియడంలేదు. అప్పటికే ఆమె పదేపదే జ్వరాన్ని గురించి అడగడంతో సక్కూబాయి అననే అంది.


    "ఏమిటేమిటే  - అతనికి జ్వరంవస్తే నువ్వు ఇంజెక్షన్ చేసుకుంటే నయమైపోతుంది. అన్నలెవెల్లో  మాట్లాడుతున్నావ్. అసలు ఏమిటి కథ?"


      సాయంకాలం  వరకు ఎలానో గడిపిందిగానీ ఆ తరువాత మరింక వుండలేకపోయింది ఉమ.


    సక్కూబాయినే తనకు తోడుగా రమ్మంది. ఈ సక్కూబాయి చాలా మంచిపిల్ల. ఇలాంటి వాటిల్లో ఆరితేరిన  తెలివయిన పిల్ల.


    "అతన్ని ఇప్పుడే వెళ్లిచూడాలి. ముందు అతనికొచ్చిన జబ్బేమిటో తెలుసుకోవాలి" ఆదుర్దాపడుతున్నట్టుగా అందామె.


    "ఎందుకే?" అని అడిగింది ఆ పిల్ల.


    "తర్వాత చెబుతాలే" అని మెల్లగా తప్పించుకుని సక్కుబాయిని బయల్దేరదీసింది ఉమ.


    ఇద్దరూ వెళ్లేటప్పటికి బాగా చీకట్లుపడ్డాయి.


    "ఎవరూ వచ్చింది?" సుబ్బారెడ్డి ఇంటివరండాలోనే తీరిగ్గా కూర్చుని వున్నాడు.


    "అమ్మతో పనుంది" అని మరోమాటకి తావివ్వకుండా లోనికి దారితీసింది సక్కుబాయి.


    ఇద్దరూ లోపల్నుంచి దొడ్లోకెళ్ళారు.


      సుధాకర్ అమ్మ సరస్వతమ్మ "ఎవరూ" అంటూ వచ్చి చూసి "ఏమిటి సక్కూ?" అని అడుగుతూ వంటగదిలోకి వెళ్ళిపోయింది.


    బహుశా పొయ్యిమీద ఏదైనా పెట్టేసి  వచ్చుంటుందనిపించింది సక్కుబాయి. అందుకే ఆమె వెనకే తనూ వెళుతూ "ఒక చిన్నపని వుంది" అంది.


    "ఏమిటే?" అడిగిందామె.


    "వెనకబడ్డ కులాల ఆడపిల్లలకి గవర్నమెంటోళ్లు కుట్టుపని నేర్పిస్తారట. దాని గురించి సుధాకర్ బాబు దగ్గర రాయించుకుంటానమ్మా" చెప్పింది.


    "ఇప్పుడు వీలుకాదె. వాడికి జ్వరం."


    "జ్వరమా?"ఆశ్చర్యపోతున్నట్లు అందామె.


     "ఆ బిడ్డకు ఒళ్లు కాలిపోతోందనుకో. నాకైతే ఏమీ అర్దంకావడం లేదు." అంది సరస్వతమ్మ.


    "అయితే చూసొస్తాను -  ఏ రూమ్ లో వున్నాడమ్మా?"


    "అదిగో - అదే రూమ్."


    సరస్వతమ్మ చూపించిన గదిలోకి నడిచారు ఇద్దరూ.


    సుధాకర్ కళ్లు తెరవలేదు.  బహుశా నిద్రపోతున్నాడేమోననుకుంది ఉమ. అలా చేయిపెట్టి ఒళ్లు కాలుతోందో లేదో చూడాలనిపించింది  గానీ ధైర్యం చాలలేదు.


    "బాబూ!" సక్కూబాయి పిలిచింది. ఆ పిల్లకు భయంలేదు. ఎక్కడికయినా దూసుకెళుతుంది.


    అతను కళ్లువిప్పలేదు.


    ఉమకు కన్నీళ్లు తన్నుకొస్తున్నాయి. తమ మూర్ఖత్వంవల్లే అతనికి జబ్బుచేసింది. అది జన్నెక్కడం తప్ప మరొకటి కాదని ఆమెకి నమ్మకంగా అనిపిస్తోంది.


    మగాడు ఆవేశం అణుచుకోలేకపోయినా తను సహకరించి పెద్ద   తప్పుచేసిందని లోపల్నుంచి దుఃఖం పొంగుకొస్తోంది. తన తప్పును ఆ భగవంతుడు కూడా క్షమించలేడని అనుకుంది మనసులో.


    సక్కూబాయి మరోసారి  అతన్ని పిలిచిందిగానీ అతను కళ్లు కూడా విప్పలేదు. మగతగా పడుకున్నాడు.


    "నిద్రపోతున్నాడు - పద వెళదాం."


    సక్కూబాయి వెనక్కి తిరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS