లీల తల వెనక్కివాల్చి నవ్వుతూ "అలాగే! పద కానీ మా అమ్మ గారిని నువ్వు మిస్ అవుతున్నావు అంటూ వుంటే..."
"మళ్ళీ ఇంకోసారి వస్తాలే.....ముందు పద" అంటూ తొందరచేసింది ధృతి.
"ఉవ్వ....ఉవ్వా" అంటూ భయంకరమైన చప్పుళ్ళూ; అరుపులూ వాటిని వెన్నంటి ఏవో వస్తువులు పగిలిన చప్పుళ్ళు అయ్యాయి లీల తమ్ముడి గదిలోంచి.
వెంటనే వాళ్ళ తాతయ్య "ఎవరది? కాల్చేస్తా, పేల్చేస్తా" అంటూ ఓ చిన్న పిస్టల్ తో బైటికి రావడం చూసి గబగబా గుమ్మందాటి ఇవతలకొచ్చి పడింది ధృతి.
"భయపడకు! అది దీపావళి పిస్టలేలే" అంటూ తనూ ఆమెననుసరించింది లీల.
* * *
"బాబోయ్! ఆ ఇంట్లో మనం అయితే ఒక్కక్షణం కూడా వుండలేము" అని చెప్తూ ఆ సంగతులు గుర్తుతెచ్చుకుని పడిపడీ నవ్వుతున్న ధృతినే కన్నార్పకుండా గమనించసాగాడు నవీన్.
"ఏమిటి చూస్తున్నావ్?"
"నీకెంత నవ్వెలా వస్తోందా అని?"
"నీకు రావడం లేదా? డిటెక్టివ్ పుస్తకాల పిచ్చి తాతనీ, అస్తమనం బ్రేక్ డాన్స్ చేస్తూ, అన్నింటినీ బ్రేక్ చేస్తున్న తమ్ముడినీ తలచుకుంటుంటే..."
"నువ్వు ఒక్క గంటే వున్నావు కాబట్టి ఇలా నవ్వగల్గుతున్నావు. కానీ పాపం ఆ అమ్మాయి పరిస్థితేమిటి? ప్రతిరోజూ ఇంతమంది పిచ్చివాళ్ళతో వేగుతూ ఎంత నరకం అనుభవిస్తోందో కదా!"
"ఆ అమ్మాయి సంగతి నీకు తెలియదు కాబట్టి అలా అంటున్నావ్ తను అసలు ఏమీ పట్టించుకోదు. అక్కని భర్త వదిలేసిన విషయం, తమ్ముడ్ని పోలీసులు పట్టుకుని జుట్టు కత్తిరించి చితకతన్నిన విషయం, ఒకేలా చెపుతూ నవ్వగలదు. ఆమె ఏ విషయం గురించయినా మధనపడడం, బాధపడటం అసలు జరగదట."
"నిజంగా! అలాంటివాళ్ళు కూడా వుంటారా? శుభ్రంగా సంపాదించి పెడుతుంటే ఇంట్లో కూర్చుని తిన్నదరగక, నిర్లిప్తంగా జీవితం మీద నిరాసక్తత అనే ఆడవాళ్ళని చూశాను. అన్నీ వున్నా ఏదో తక్కువైపోయిందనీ, షారూఖ్ ఖానో, కమలహాసనో వచ్చి తమని వరించలేదని బాధపడే ఆడపిల్లలు నాకు తెలుసు. తల్లి విసుక్కుందనో, తండ్రి మందలించాడనో ఇల్లువదిలి వెళ్ళిపోయేవాళ్ళనీ, ఆత్మహత్యా ప్రయత్నాలు చేసేవాళ్ళనీ గూర్చి పేపర్లో చూస్తాము. అటువంటిది జీవితంలో కష్టాలు అని ఎవరితోనూ చెప్పుకోలేని ఇటువంటి కష్టాలు వుండి కూడా అంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ అమ్మాయి వుండగలుగుతోంది అంటే చాలా "గ్రేట్" అన్నాడు.
ధృతి కూడా నవ్వు మానేసి ఆలోచించింది. "నిజమే! ఇవి చెప్పుకోలేని కష్టాలు. నాలాంటిది అయితే వాళ్ళందర్నీ కలలు విరగ్గొట్టి ఓమూల కూర్చోబెట్టేది లేదా పిచ్చెక్కిపోయేది. ఆలోచించి.....ఆలోచించీ....."
"ఇప్పటినుంచీ చాలా బాధలలో వున్నానూ అనిపించినప్పుడల్లా లీలా వాళ్ళింటికి వెళ్ళి ఓ గంట గడిపిరా."
"అమ్మో! అంత శిక్ష వద్దు" అని నవ్వేసి "ఇంతకీ ఉట్టి మాటలేనా లేక పార్టీ యిచ్చేది ఏమైనా వుందా?" అడిగింది.
అతను వెంటనే జేబులు తడుముకుని జేబులోంచి ఓ స్ట్రాంగ్ పిప్పర్ మెంట్ తీసిస్తూ "ఇదే ప్రస్తుతానికి నేనివ్వగలిగే పార్టీ అనుకో" అన్నాడు.
"థాంక్యూ!" అంది ధృతి దానిని అపురూపంగా అందుకుంటూ.
వికారాబాద్ నుండి ప్రేమ్ వచ్చీ రాగానే ధృతి కోసం వాళ్ళ ఇంటి కొచ్చేశాడు. అతనితోపాటు "ద్రాక్షపళ్ళ బుట్టలు" కూడా తెచ్చాడు.
అతన్ని చోదోఅగానే సుభద్రకీ, సీతారామయ్యకీ మొహాలే చేటంత అయ్యాయి.
కృతి కాఫీ తెచ్చింది.
"అమ్మా, నాన్నగారూ కూడా ఈ నెలాఖరుకి వస్తామని రాశారు" అన్నాడు ప్రేమ్ కాఫీ తాగుతూ.
అతను చెప్పాలనే చెప్పాడో, లేక యధాలాపంగా అన్నాడో ధృతికి అర్ధంకాలేదు.
అతను వెళ్ళిపోయాక ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి.
"చూశారా! అబ్బాయి చూచాయిగా తల్లీ, తండ్రీ వస్తున్నారని తెలియచేశాడు. అంటే మనసులో ఉద్దేశం అన్నమాటేగా" అంది తల్లి.
"అవును! లేకపోతే యింత అర్జెంటుగా ఎందుకు వస్తారూ?" అన్నాడు తండ్రి,
"ఈ నెల ఏం కొన్నా కొనకపోయినా మంచి కుర్చీలు రెండు కొనాలి" అని తేల్చేసింది సుభద్ర.
ధృతి అంతా వింటూనే వుంది. కానీ ఏమీ మాట్లాడదల్చుకోలేదు. తల్లితో వాదించడం, ఆమెని దేనికైనా ఒప్పించడం అంత వ్యర్ధమైన పని ఇంకొకటి లేదు. తను గట్టిగా విదిలిస్తే ఆమె వెక్కి వెక్కి ఏడవడమో, ఆయాసం తెచ్చుకోవడమో చేస్తుంది. నవీన్ చెప్పినట్లు ఉద్రేకపడవలసి వచ్చినప్పుడు ఎలాగో తప్పదు. ఇప్పట్నుంచీ ఎందుకు? అనుకుంది.
* * *
"ధృతి! బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ కి వెళ్ళాలి మనం" అని చెపుతూనే ధర్మానందరావుగారు బ్రీఫ్ కేస్ లో అవసరమైన కాగితాలూ, ఫైల్సూ సర్ధసాగారు.
ధృతి, ఆయన బయటికి రాగానే నవీన్ కారు తీసుకొచ్చి సిద్దంగా వుంచాడు.
ధృతి వెనక సీట్లో ధర్మానందరావుగారి పక్కన కూర్చుని నవీన్ వేపే చూడసాగింది.
నవీన్ కి కూడా అద్దంలో ఆమె కనిపించసాగింది. అతను కనీ కనిపించకుండా నవ్వాడు.
సాయంత్రందాకా మీటింగ్ లోనే గడిచిపోయింది. ధృతి 'మినిట్స్' నోట్ చేయడంలో బిజీ అయిపోయింది. మధ్యలో లంచ్ బ్రేక్ లో నవీన్ కోసం చూసింది. అతను కనపడలేదు.
ఇంటికొచ్చేసరికి చీకటి పడిపోతోంది. "అసలేమైనా తిన్నాడో లేదో!" ఆమె నవీన్ గురించే ఆలోచించసాగింది.
ఇంటి దగ్గర కారు ఆపగానే, నవీన్ వచ్చి డోరు తెరిచి నిలబడ్డాడు. మొదట ధర్మానందరావుగారు దిగారు. తర్వాత ధృతిదిగుతూ చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకుంది.
