'శారదకి పెళ్ళి చేసి రండి - దాన్ని అలా వదిలివేస్తే' -
'అయ్యో శాంతా - శారద పెళ్ళిచేయగలనా - దానికి నేను శత్రువుని -నేనూ వచ్చేస్తా నీ దగ్గరికి - వస్తున్నా' రాజారావు నిద్రలో పక్కకి ఒరిగాడు - ఒక్కసారి గట్టుమీద నుంచి కిందపడ్డాడు.
'అయ్యో, అయ్యో - అదేమిటి బావా - అలాపడిపోయావు' - రాజమ్మ వచ్చి రెక్క పట్టిపైకి లేవనెత్తింది గట్టుమీద కూచోపెట్టింది - మంచి నీళ్ళు తాగించింది.
'ఏమైంది - కళ్ళు తిరిగాయా' అంది పక్కన కూచుంటూ.
'ఏమిటోనమ్మా మీ అక్క"
"అక్కా - కలలో కొచ్చిందా"
"ఊ -నేనూ వెళ్ళిపోతా - రాజమ్మా - ఎవరికీ అక్కర్లేని నేను ఇక్కడెందుకూ - రాజమ్మా శాంత ఎంత బావుందనుకున్నావు - ఇంత కుంకుమ ముఖాన పెట్టుకుని, నవ్వుతూ నన్ను నిద్రలేపిందమ్మా పిల్లలు మన శత్రువులా శారదని కనిపెట్టి చూడండి అంది - రాజమ్మా నేను వెళ్ళిపోతా ఇక్కడ నా పని అయిపోయింది - 'కళ్ళు తుడుచుకున్నాడు రాజారావు'.
'ఊరుకోబావా - ఏదోకల అంతే - మనం ఎక్కడికెడుతాం - దేముడు పిలవద్దూ - నువ్వు రెస్టుతీసుకో - తొందరగా అన్నం వండిపెడతాను - మనసు బాగోలేకపోతే మరి ఆరోగ్యం చెడదూ - లోపలకెళ్ళిపడుకో - రాజారావు రాజమ్మ మాట ప్రకారం లోపలకి వెళ్ళిపోయాడు. "నానాటి బతుకూ నాటకమూ కనపడనున్నది కైవల్యమూ, కైవల్యమూ అంతే, రాజమ్మ పాటలు బాగా పాడుతుంది.
రాజమ్మ తండ్రికి సంగీతమంటే ఇష్టం. మేష్టార్ని పెట్టించి శాంతమ్మ కి, రాజమ్మకీ సంగీతం నేర్పించాడు. శాంతమ్మ సంగీతం పెళ్ళి సంగీతమే అయింది. కానీ రాజమ్మ ఎలా ఏళ్ళు నేర్చుకుంది నూరుకృతులు నేర్చుకుంది. రామదాసుకీర్తనలు, అన్నమయ్యకీర్తనలు బాగా పాడుతుంది. రాజమ్మ చిన్నప్పటి నుంచీ చాలా తెలివైంది చురుకైంది. అల్లికలు, కుట్లు రాజమ్మకి బాగా వచ్చు. ముగ్గులుపెట్టడం రాజమ్మకి చాలా యిష్టం....పచ్చగా, పొడుగ్గా వుండే రాజమ్మ చాలా అందగత్తెగా అనుకునేవారంతా. శారదకి పిన్ని పోలిక వచ్చిందనేవారు అంతా. రాజమ్మ పాటపాడుకుంటూ వంటపనిపూర్తి చేసుకుంది.....పూజ చేసుకోటం అయింది.
* * *
యశోదమ్మ బస్సుదిగింది.....రెండుచీరలు, రవికెలు కాక ఆ సంచిలో అరడజను అరటిపళ్ళు, గోంగూరపచ్చడి, వడియాలుకూడా ఉన్నాయి కొడుక్కి ఇష్టమని జాగ్రత్తగా తెచ్చింది అవి. బస్ స్టాండుకి రామం వచ్చాడు.
రామం, తల్లితో ఇంట్లోకి వెడుతుంటే లలిత గుమ్మంలో నుంచున్నది. లోపలకెళ్ళిపోయింది. యశోదమ్మ మనసుఖంగారుగావుంది - అంత అర్జంటుగా ఎందుకు రమ్మన్నాడోనని. భోజనాలు చేస్తున్నారు.
అమ్మా - నా విడాకుల వ్యవహారం తేలిపోయింది - ఇక నేనూ వెళ్ళి చేసుకోవచ్చు, ఆ అమ్మాయీ పెళ్ళి చేసుకోవచ్చు అన్నాడు తలొంచుకుని.
'ఆ అమ్మాయి విషయం మనకెందుకు - నీకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకొస్తారూ. ఒకసారి విడాకులు తీసుకున్నారని తెలిసాక, తప్పుఎవరిదయినా అది ఒక మచ్చే - తల్లి అంది నీళ్ళుతాగి.
రామానికి తల్లిమీద కోపమొచ్చింది. ఈ పెళ్ళి చెడిపోడానికి కారణం శారదేనని, ఆ అమ్మాయే ముందుగా కోర్టులో కేసుపడేసింది. అని చెప్తే నమ్మటంలేదు ఇంకా.
"ఇంతకీ ముఖ్యమయిన విషయమన్నావు - ఏదీ అది' అంది
'ఇదే - ఇంతకన్నా ముఖ్యవిషయమేమిటి - నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను' - నెమ్మదిగా అన్నాడు.
"తొందరపడకు - ఇవన్నీ తెలిసినవాళ్ళే యిష్టపడిరావాలిగానీ' "తెలిసినవాళ్ళే - అడిగారు" రామం గొంతు బాగా తగ్గించాడు. 'ఎవరూ అంది యశోదమ్మ.
'కృష్ణమూర్తి మేష్టారు' - ఆ మాట వినేసరికి యశోదమ్మ చేతిలోవున్న ముద్దకిందపడింది. కృష్ణమూర్తిగారింట్లో పెళ్ళి కావలసిన పిల్లలెవరున్నారూ -
"ఏమిటీ - గాయత్రి, అదెందుకు మళ్ళీ పెళ్ళి చేసుకుంటుందీ. ఎవరైనా వింటే కూడా బాగుండదు. భర్త పోయిన దుఃఖంలో అది వుంటే, పెళ్ళేమిటి నీ మొఖం - యశోదమ్మకి రామం మాటలు ముళ్ళలా గుచ్చుకున్నాయి - గాయత్రిని పెళ్ళి చేసుకుంటాడా అయ్యో, అయ్యో, ఓ బిడ్డ తల్లి అది, మేష్టారు ఈ మాట వింటే ఎంత బాధపడతారూ - దాని బావ వింటే వీడి కాళ్ళు చేతులు విరక్కొడతాడు - గాయత్రికి పెళ్ళేమిటీ - యశోదమ్మ మనసు అంగీకరించటం లేదు.
'కృష్ణమూర్తిగరే వచ్చారు - నన్ను అడిగారు - సరే అన్నాను' - మూడుముక్కలో తేల్చేశాడు విషయం, యశోదమ్మ మాట్లాడలేదు.
'ఆ పిల్లాడు'-
'తల్లి ఎక్కడుంటే పిల్లాడక్కడే' రామం మెల్లగా అన్నాడు -
అంటే, మేష్టారు తనతో ఒక్కమాట కూడా చెప్పకుండా, ఇక్కడికొచ్చి కొడుకుతో మాట్లాడి వెళ్లాడని అనుకుంది తనకొడుకే ఆయనకి ఉత్తరం రాశాడని ఆమెకేం తెలుసు!!
'ఆ రోజు రెండోసారి నువ్వు వెళ్ళినపుడే వద్దని చెబుదామానుకున్నా - ఆ మేష్టారు అసాధ్యుడు - అయినా ఆయనకి అంత దురాశ ఏమిటీ - ఆమొగుడు చచ్చిన దానికి రెండోపెళ్ళి చేయమను - కానీ నువ్వే దొరికావా ఆయనకి, ఇంకెవరూ లేరా లోకంలో - ఈ విషయం చెప్పడాని కానన్ను పిలిపించావూ యశోదమ్మ కోపం ఆపుకోలేకపోయింది. "తనకి ఒక్కకొడుకా - ఆ కొడుక్కి పెళ్ళి చేసి పిల్లాపాపలతో వాణ్ణి చూసి ఆనందిద్దామనంటే, ప్రేమ వివాహమని రిజిస్టరు పెళ్ళి చేసుకుని - ఆ కాపురం అలా కూలబడింది - ఇప్పుడేమో వితంతు వివాహం - వీడి వలన తనుపొందే ఆనందం ఇదా - ఏం చేస్తాను - నాతో చెబితే కాదంటానని ఆ మేష్టారు తిన్నగా నీదగ్గరకే వచ్చాడా - ఉండు, ఈ రాత్రే వెళ్ళిపోయి ఆయన ముఖాన ఇన్నిపేడనీళ్ళు చల్లుతా - తండ్రికి బుద్ధిలేకపోతే పిల్లకన్నా వుండద్దూ - యశోదమ్మ కొడుకుపైన అరుస్తోంది - తలుపు పక్కన నిలబడి ఎవరో కదులుతున్నట్టు అయింది -
రామంతలుపు తీసాడు - లలిత 'పిన్నిగారికి కొద్దిగా ఊరగాయ ఇద్దామని, తెమ్మంటారా అని అడుగుధామని నసిగింది లలిత. రామం నవ్వేసి ఊరుకున్నాడు. రామనికి చిరాగ్గా వుంది.
మేష్టారుగారు తన్నేమీ మోసం చేయలేదు - తనే ఆయన్ని అడిగాడు గాయత్రిని తనుపెళ్ళి చేసుకుంటే అభ్యంతరం లేదా అని - మధ్యలో అమ్మగొడవేమిటీ -
'అమ్మా -మేష్టారునన్నడగలేదు - నేనే మేష్టార్ని అడిగాను - ఈ విషయం నీకు చెప్పకపోతే బాధ పడతావని చెప్పానంతే - నువ్వు వద్దన్నా కూడా నేను జానకిని చేసుకుందుకు నిశ్చయించుకున్నా. ఆ పసివాణ్ణి మాతోనే వుంచుకుందుకు కూడా సిద్దంగావున్నా నువ్వు ఈ విషయం గురించి ఇంకేమీ మాట్లాడకు - అంతే' రామం తలుపేసి బయటకి వెళ్ళి పోయాడు. యశోదమ్మ ఏం మాట్లాడుతుందిక - రేపు పొద్దున్నే మొదటి బస్సుకెళ్ళి పోడానికి నిశ్చయించుకుంది. కృష్ణమూర్తి గారి కుటుంబానికి ఎంత దూరంగా అబ్బాయిని వుంచాలనుకుందో, అంత దగ్గరపోయిపోయాడే - వాడి అదృష్టం అంతేలావుంది - ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు వెళ్ళిపోదామా అనుకుంటూ నడుం వాల్చింది యశోదమ్మ. యశోదమ్మకి నిద్రపట్టలేదు - వీధి గుమ్మంలో నిలబడింది.
