Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 38

   

     వెంకట్రామయ్య ఒక్క నిముషం ఆలోచించాడు.
   
    తప్పు అనేది వేరే విషయం - ఒకసారి తల్లి అయిన ఆడది దాని మనసంతా పిల్లలపైనే పెడుతుంది - పైగా ఆ పిల్లల్ని వదులుకుని మరోడితో కాపురం చేయటానికి ఇష్టపడుతుందనుకోను - మన చతుర్విద పురుషార్దాలలో కామం మూడోది. సాధారణ పిల్లలున్నదెవతే మళ్ళీ పెళ్ళికి అంగీకరించదు, ఒకవేళ అంగీకరించినా ఎంత బుద్దిలేనివాడయినా అలాటి పెళ్ళికి సిద్దపడడు - ఈ విషయంలో నీతో ఏకీ భవించలేను బాబూ -నువ్వూ ఆలోచించు - వెంకట్రామయ్యకీ, రామానికి రెండు కప్పులతో కాఫీ తెచ్చి బల్లమీదుంచి వెళ్ళిపోయింది లలిత. కాఫీ తాగిగ్లాసు కింద పెట్టాడు వెంకట్రామయ్య రామం అడిగిన ఆ విషయమే ఆయన మనసులో ఇంకా తిరుగుతోంది "ఇటు విను బాబూ - ఆరోజు నీకాత్తరం చూపించా - గుర్తుందా - భార్యపోయింది - ఇద్దరు చిన్నపిల్లలు - మా  అబ్బాయి తెచ్చిన సంబంధం - మా లలిత తోసి పారేయలేదూ - అది ఊ అంటే ఈ పాటికి పెళ్ళి అయిపోయివుండేది"
   
    "మీ లలిత పొరబాటే చేసిందండీ - జీవితంలో కొంత రాజీ అవసరం" అన్నాడు పేపరుచూస్తూ రామం.
   
    గది ఊడుస్తున్న లలిత చీపురుకిందపడేసింది. "తనుపొరబాటు చేసిందా. ఇద్దరు పిల్లల తండ్రిని చేసుకోక పోటం" - చూస్తాగా, ఎందరు పిల్లలున్న తల్లిని రామం చేసుకుంటాడో - ఇష్టమొచ్చినట్టు అటు ఇటు గది ఊడ్చేసింది లలిత కోపంగా.
   
    రామం ఆఫీసుకి సెలవు పెట్టాడు. ఎందుకోచాలా చిరాగ్గావుంది అమ్మ ఏమంటుందో ననే భయం ఒకటి మనసులో పీడిస్తోంది - అంతా తన రెండోపెళ్ళి గురించే మాట్లాడుకుంటారేమో ఇంక అనే బాధ ఒకటి - రామానికి గుర్తొచ్చింది- తను దాచిన ఫోటో -రామనాథంగారికి ఏదో సమాధానం చెప్పాలి - మళ్ళీ ఆ ఫోటో చూసాడు -లలితదే అది! భ్రమరాంబ అని ఆయన చెప్పాడుగా. ఒకవేళ కజిన్స్ అయివుండచ్చా- రామం తలుపుతీసుకుని బయటనిలబడ్డాడు లలిత కనిపిస్తుందేమోనని వెంకట్రామయ్య మళ్ళీ నిద్రపోతున్నాడు, ఈ మధ్య ఆయన ఆరోగ్యం బాగుండటంలేదు. పనిమనిషి నాలుగురోజులుగా రావటంలేదు. లలిత లోపల పనిలోవుంది.
   
    తలుపు కొట్టాడు - చేతులు చీరకి తుడుచుకుంటూ లలిత వచ్చింది.
   
    'ఆ నీపేరేమిటీ' అన్నాడు రామం.
   
    లలితకి అర్ధం కాలేదు 'ఏమిటీ' అంది గట్టిగా   
   
    'నీ పేరు' -
   
    లలిత నవ్వింది - పకపకానవ్వింది - విరగబడి నవ్వింది - రామనికి అర్ధంకాలేదు ఎందుకు!! నవ్వుతోందో.
   
    "ఏం, నా పేరు కూడా మరచిపోయావా వెనకటికి ఒక ఈగ ఇల్లలుక్కుంటూ తనపేరు తనుమర్చిపోయిందట - పేదరాశి పెద్దమ్మనడిగిందట నాపేరేమిటీ అని - ఆ పెద్దమ్మ నా కొడుకు నడుగూ అందిట. పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకానాపేరేమిటి అందిట - కానీ ఇక్కడో చిత్రం చూశావా ఈగ దానిపేరు మరిచిపోయిందంతే - ఇంకొకరిపేరు కాదు. నువ్వు దానికన్నా"
   
    "మతి మరపువాణ్ణి - సరే - నీ పేరు చెప్పు" -
   
    "లలిత - ల-లి-త 'సరేనా' ఇంకేమైనా చెప్పాలా -
   
    'పూర్తి పేరు చెప్పు'
   
    'నా పూర్తిపేరు లలితా భ్రమరాంబ - అందరూ మా చుట్టాలంతా నన్ను భ్రమరాంబ అనిపిలుస్తారు - కానీ, నాన్నగారు, నాస్నేహితులు లలితా అంటారు - నేను లలితనే - భ్రమరాంబనుకాను' అంది నవ్వుతూ.
   
    "ఆ నాక్కావలసింది అదే" రామం హాయిగా నవ్వాడు.
   
    "ఈ రోజు ఆఫీసులేదా" -
   
    "ఆఫీసు ఎందుకుండదూ - అక్కడే వుంటుంది - నేను వెళ్ళను -బోర్ గా వుంది" రామం అన్నాడు. ఫోటో చూపించాలా వద్దా అనే ఆలోచన చేస్తూన్నాడు రామం.
   
    "అయితే మాయింట్లో భోజనం చేయి ఇవాళ" -
   
    'వద్దు - వద్దు - మొన్న నా కోసం వచ్చిన కృష్ణమూర్తి మేష్టారు మీయింట్లోనే భోజనం, రేపుమరెవరో -వద్దులే -
   
    'ఆ మేష్టారి గురించి ఒక్కమాట కూడా మాట్లాడకు - ఆయనంటే నాకెందుకుకోపం' - అంది లలిత.
   
    'ఎందుకూ - ఆయన నిన్నేమయినా అన్నాడా'
   
    'నన్నేమంటాడూ - కాకపోతే ఆయన దురాశ చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది' -
   
    'దురాశా - అదేమిటీ'
   
    'దురాశ కాక -నువ్వేమో లక్షణమైన పెళ్ళికొడుకువి. తన కూతురికి పెళ్ళి సంబంధంటా - ఎవరైనా వింటే నవ్వుతారు - అలాంటి సంబంధం చేసుకోవాల్సినది నువ్వా - ఛీ, ఆ రోజే, ఆయన నోరు మూయిద్దామనుకున్నా కానీ నాన్నకి కోపం వస్తుంది, ఇంటి కొచ్చిన మనిషిని అగౌరవపరుస్తానని, ఊరుకున్నా - లలిత ముఖం ఎర్రపడింది కళ్ళల్లో కోపం ప్రవహిస్తోంది "వస్తామరి -స్నానం చెయ్యాలి - పంపుపోతుంది ఇంకాసేపైతే అంటూలోపల కెళ్ళిపోయాడు రామం.
   
    'ఆ ఫోటో లలితదే - ఇంకా తన దగ్గర ఉంచుకోటం మర్యాదకాదు అనుకున్నాడు రామం.
   
    ఆ రోజే ఆఫోటో కవర్లో పెట్టి 'క్షమించాలి, నాకు మరో సంబంధం కుదిరింది, రామం' - అని రాసి రామనాథం ఎడ్రసుకి పోస్టు చేసి ఊపిరి పీల్చుకున్నాడు రామం.
               
                                 *    *    *
   
                                        16
   

    రాజారావు, రాజమ్మ పిన్నీ నరసాపురం వెళ్ళారు కానీ, రాజారావుకి శారదపై కోపం పోలేదు. మనసు విరిగిపోయింది. కొడుకులు, కొడుకులనుకుంటే వాళ్ళలావున్నారు. కాస్త పెద్దాడునయం, చిన్నాడు అసలు పట్టించుకోడు. ఇక ఆడపిల్లలనుకుంటే, ఆ ఇద్దరూ వాళ్ళ సంసారం. వాళ్ళకి సరిపోతుంది. పోనీ ఒంటరిది చిన్నదికదా అని శారదపైనే ఎన్నాళ్ళనుంచో కొంత ఆశపెట్టుకున్నాడు - అది నిర్మొహమాటంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టింది - ఈ రాజమ్మ మాత్రం ఏంచేస్తుందీ - ఏ మనుమరాలో రమ్మందని తుర్రుమంటే - తనకి దిక్కెవరూ - పంతులుగారూ, భార్యా ఆరుగురుపిల్లలున్న తండ్రిని ఒక్కరయినా ఆదరించరా ఈ శరీరంలో వున్న శక్తి అంతా ఖర్చుపెట్టడం వాళ్ళకోసమే - సంపాదించిన డబ్బంతా ఖర్చుపెట్టింది వాళ్ళకోసమే -అనుక్షణం వాళ్ళమంచే ఆలోచించాడు వాళ్ళకోసమే జీవించాడు. అయితే తనకోసం ఒక్కరు, ఒక్కరు కూడా బాధ్యత వహించలేరా తన వృద్దాప్యం ఎలా గడుస్తుందో !! - తను పొరబాటు చేసాడు - కొబ్బరితోట అమ్మి పిల్లలకి యిచ్చేయటం - తన భార్య ముందుగా ఈలోకాన్ని వదిలి వెళ్ళిపోయింది, అదృష్టవంతురాలు - రాజారావుకి ఇంట్లోకి రావాలనిపించలేదు. దొడ్లో అరుగుమీదే కూచున్నాడు. తను ఏ ఆశ్రమంలోనో వెళ్ళి చేరిపోతాడు - వాళ్ళే రెండు పూటలా ఇంత తిండి పెడతారు - చాలు - 'ఋణాను సంబంధం రూపేణా పశుపత్నీ సుతాలయాత్' - అంతే!! అంతే!!
   
    రాజారావు అలా అరుగుమీదనే నిద్రపోయాడు.....గాఢ నిద్ర "ఎందుకండీ - పిల్లలమీద కక్ష - మన పిల్లలేగా" - ఎవరూ - నువ్వా, నన్ను ఓదారుస్తున్నావా నేనూ వచ్చేస్తా నీ దగ్గరికి - ఉండలేను ఇక్కడ - ఎవరికీ అక్కర్లేకుండా - రాజారావు ఏడుస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS