Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 37

   
    "యాభై రూపాయలు" అన్నాడు తైనాతీ.

    "ఆల్ రైట్" అన్నాడు శేషయ్య.

    అందానికీ, అలంకారానికీ, కృత్రిమత్వానికి, ఆడదానికీ, పశుత్వానికీ ప్రేమకీ మధ్యగల వ్యత్యాసం తెలియని శేషయ్య ఒక అపరిచిత వ్యభిచారిణి కౌగిలిలో సొమ్మసిల్లి నిద్రపోయాడు. మూడు రోజులూ ఎన్నడూ ఎరుగని ఆనందాన్ని తృప్తినీ గర్వాన్నీ అత్యున్నత స్థాయిలో పొందిన శేషయ్యకి తల తిరిగిపోయింది. వివేకం తప్పిపోయింది. అధికారమూ సౌఖ్యమూ తన జన్మహక్కు అనుకున్నాడు. తనే సౌఖ్యమూ, అధికారమూ అంటే అనుకున్నాడు.

    మూడవ రోజు రాత్రి పండ్రెండు గంటలకి మూడవ బొమ్మ శేషయ్య గది విడిచి వెళ్ళిపోయింది. నిద్రమత్తులో ఉన్న శేషయ్యకి తెల్లవారగానే తాను గది ఖాళీచేసి తన పాత తాటాకు ఇంటికి వెళ్ళిపోవాలన్న జ్ఞానం చటుక్కున తేలుకాటులాగ చుర్రుమంది.

    ఎవరో ఒక పెద్ద నిచ్చెనవేసి, ఎత్తుకి మరీ ఎత్తుకి ఎక్కించేసి, ఉన్నట్టుండి దభాల్న తోసివేసినట్టయింది శేషయ్యకి. అతని బుర్ర తీవ్రంగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. భయమూ బాధా నిర్వేదమూ కలిగాయి. పళ్ళు బిగించాడు. తల పట్టుకున్నాడు. ఎయిర్ కండిషన్డు గదిలోకూడా అతనికి చెమటలు పట్టాయి. తెల్లవారేవరకూ ఆలోచిస్తూ గది అంతా కలయదొక్కాడు.
 
    ఏడుగంటలకి - ఉదయం - హోటలు విడిచి రోడ్డుమీద అడుగుపెట్టాడు. మాధవుడు నవ్వుతూ ఎదురొచ్చాడు.
  "ఏరా ఎలాగ ఉంది?" అన్నాడు.

    కోపంగా మాధవుణ్ణి ఆపాదమస్తకం పరీక్షించి  "హుఁ" అన్నాడు. శేషయ్య.

    "ఏమిట్రా ఇది" అన్నాడు మాధవుడు.

    "చంపేస్తా"

    "ఎవర్ని"

    "నిన్ను"

    "ఆ-" అంటూ ఒక్క అడుగు వెనక్కి వేశాడు మాధవుడు.

    "ప్రపంచంలో రెండే రెండు వర్గాలు. ధనికులూ, పేదలూ. వీరి మధ్య ఎప్పుడూ ఎడతెగని వైరం. జాగ్రత్త మాధవ్! ఇంతమంది దరిద్రుల్ని, నిస్సహాయుల్నీ, నీచుల్ని తయారు చేసిన నిన్నూ, నీలాంటి వాళ్ళనీ క్షమించేదిలేదు. నువ్వంటే నాకు వైరం. పీకదాకా ద్వేషం, అసహ్యం" అంటు గబగబా వెళ్ళిపోయాడు శేషయ్య.

    మాధవుడు తెల్లబోయి నుంచున్నాడు. మాధవుణ్ణి చూసి, ప్రత్యుత్ధానం చేసేందుకు వచ్చిన హోటల్ మేనేజర్ శిలాసదృశుడైపోయాడు.

    శేషయ్య తిన్నగా తీవ్రవాద సంస్థ కార్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కుర్రవాణ్ణి జుట్టుపట్టుకుని ఊపుతూ,  "ఏడీ తిరపతి ఎక్కడ" అని గర్జించాడు. కుర్రాడు భయపడి ఓగది చూపించాడు. శేషయ్య విసురుగావెళ్ళి  "తిరపతి, నీ సంస్థలో చేరాను. నా పేరు రాసుకో" అన్నాడు.

    తిరపతి గుడ్లప్పగించి చూస్తున్నాడు.

    శేషయ్య పిడికిలి బిగించి, గాలిలో వూపాడు. "ఈ ధనికవర్గాన్ని నాశనం చెయ్యటమే నా జీవితాశయం. నల్లుల్లాగ నలిపి పారేస్తాను. విప్లవం నా ధ్యేయం. హింస నా సాధనం. ద్వేషం నా రక్తం" అని అరిచాడు.

    ఆలస్యంచేస్తే తననే చంపేస్తాడేమో అన్నంత తొందరతో గబుక్కున శేషయ్య పేరు రాసేసి సభ్యత్వపు రశీదు శేషయ్య కిచ్చాడు తిరపతి.

    "ఇప్పుడు నేనేం చెయ్యాలి"  - అడిగాడు శేషయ్య.
 
    "సాయంత్రం మీటింగ్, అక్కడికిరా" అన్నాడు తిరపతి. మీటింగులో శేషయ్య ఉపన్యాసం విన్నవాళ్ళు ఒళ్ళు జలదరించి, కంగారుపడిపోయారు. అతనేం చెప్పాడో సరిగా ఎవరికీ తెలియదు కాని, చూపులూ, మంటలూ. శ్మశానాలూ, గద్దలూ, రక్తమూ మొదలైన భయంకరమైన మాటలు చాలాచాలా వినిపించి, చాలామంది చప్పట్లు కొట్టేశారు.

    నాటినుండి ఎక్కడ చూసినా శేషయ్య. పోస్టర్లు అంటిస్తూ శేషయ్య మీటింగులో శేషయ్య, సమ్మెలలో శేషయ్య.....

    ఓసారి ఎవడో ఒక ధనవంతుడితో మాట్లాడినందుకు ఒక సభ్యుడిని లెంపకాయకొట్టాడు శేషయ్య.

    ఇంకోసారి ఓ సినిమాతార బొమ్మని జేబులో దాచుకున్నందుకు ఒక యువకుణ్ని వాళ్ళ సంస్థ కార్యాలయం గదిలో పైవాసానికి తాడుకట్టి రాత్రంతా వేలాడతీశాడు శేషయ్య.

    శేషయ్య కఠినంగా అయిపోయాడు. నిరంతర ధనిక ద్వేషం ఒక మహావ్రతంక్రింద కొనసాగిస్తున్నాడు. అందుకే మేడల్నీ, మోటారుకార్లనీ, ఫస్టుక్లాసు రైలుపెట్టెల్నీ కూడా చూడడు. గట్టిగా కళ్ళు మూసేసుకుంటాడు. అందమూ , ఆనందమూ, కళలూ - ఈ మూడూ తీరికగల ధనవంతులకే కాబట్టి వాటి ప్రసక్తి కూడా రానివ్వడు. ఎప్పుడూ కొరకొరలాడుతూ నడుస్తూన్న కొరకంచులా ఉంటాడు.

    శేషయ్యముందు తిరపతి నీరసించిపోయి, తక్కువ రకపు సంస్కరణవాదిలా అందరికీ కనిపించాడు.

    శేషయ్య చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ప్రధానుడైపోయాడు. కొన్నాళ్ళకి జిల్లా అంతటికీ ఏకైక తీవ్రవాద నాయకుడిగా గుర్తించబడ్డాడు.

    శేషయ్య కళ్ళల్లో ద్వేషం స్పిరిట్ లా నీలంగా మండుతూంటుందనీ యిప్పటికి అథనికి రాత్రుళ్ళు కలల్లోకి  'హోటల్లో మూడు రోజులూ, మూడు బొమ్మలూ' వచ్చి ఉలిక్కిపడుతుంటాడని మాధవుడు అందరితోనూ అంటూంటాడుట!

                                                               (భారతి - ఏప్రిల్, 1963)

                              **********


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS