"రుక్మిణత్త ఎవరికో కూతురికి సంబంధం గురించి వ్రాసిందమ్మా. ఎవరూ చదువకుండా సంధ్య దాచుకోవాల్సినంత రహస్యమైన ఉత్తరం ఏం కాదు."
"ఏం లేనిదే ఆ ఉత్తరం కోసం అంత పెనుగులాడిందా?" ఆవిడ అనుమానంగా చూసింది. "ఏదీ ఆ ఉత్తరం?"
"చించి కిటికీలోంచి బయటికి పారేశాను."
ఇంకేం చేసేది లేనట్టుగా ఆవిడ వెళ్ళిపోయింది.
* * *
అరుణ్ తరుచుగా వెళ్ళే చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసికెళ్ళాడొకరోజు, సంధ్యని.
కొబ్బరికాయకొట్టి తీర్థప్రసాదాలు తీసుకొన్న తర్వాత, వచ్చి మంటపంలో ఓ ప్రక్కన కూర్చున్నారు.
ప్రతిమతో కలసి వచ్చినప్పుడు ధర్మం చెయ్యమంటూ వచ్చిన ముష్టిపిల్ల ఈరోజూ వచ్చింది.
"ఒకరోజు ఈ పిల్లని చూసి అచ్చు మా సంధ్యలా వుందే అనుకొన్నాను. ఆ సంగతి ప్రతిమతో కూడా చెప్పాను." అంటూ ఆరోజు జరిగిన సంఘటన చెప్పాడు అరుణ్. ఆ పిల్లకి పావలా బిళ్ళవేసి పంపాడు.
సంధ్య అతడు చెప్పేదంతా మౌనంగా వింటూ కూర్చుందే తప్ప ఏం మాట్లాడలేదు.
కాస్సేపటికి ఆమె ఏమీ మాట్లాడడం లేదని గ్రహించి, "ఏం మాట్లాడడం లేదేమిటి?" అనడిగాడు.
"ఏముంది మాట్లాడడానికి?"
"రాజానగరం సంగతులు చెప్పు. ముఖ్యంగా మీ సింహం సంగతులు చెప్పు. భలే సుందరుడిని వలచావు." అని నవ్వసాగాడు.
"అవును. అతడిమీది విరహం భరించలేకపోతున్నాను. నన్ను మా ఊరికి పంపించెయ్యి, అరుణ్! నాకు ఇక్కడేమిటో ఊపిరాడనట్టుగా అవుతూంది."
"నీకిక్కడ వున్న కష్టమేమిటో చెప్పు!"
"కష్టముందనికాదు మా ఊరిమీద బుద్ధి పుడుతూంది."
"ఊరిమీదా? సింహంమీదా?"
"అవును సింహంమీదే."
"నిన్ను మళ్ళీ పంపించెయ్యడానికేనా తీసుకువచ్చింది? అవును గాని, సంధ్యా! ఆ ఉత్తరం, అదే మీ అమ్మ మా అమ్మకి వ్రాసిన ఉత్తరం పోస్ట్ చేయకుండా నీ దగ్గరే ఎందుకుండిపోయింది?"
"అమ్మకి మతిపోయి వ్రాసింది ఆ ఉత్తరం. పట్నం వచ్చి మమ్మల్ని పూర్తిగా మరిచిపోయిన వాళ్ళను ఎప్పుడో వెనుకటికి అనుకొన్న మాట గుర్తుచేసి నా కూతుర్ని చేసుకొమ్మని అభ్యర్థించడం ఎంత హాస్యాస్పదమో నాకుతెలుసు. అందుకే అమ్మకి తెలియకుండా ఆ ఉత్తరం పోస్టుచేయకుండా దాచాను."
"ఇప్పటికీ సంధ్యకి అరుణ్ అంటే ఎంత ప్రేమో అని వ్రాసింది రుక్మిణత్త! అదికూడా మతిపోయే వ్రాసిందా?"
ఉత్తరం సంగతి ఎత్తినప్పుడే సంధ్య ముఖం ఎర్రబడింది. ఈ ప్రశ్నకి ఇంకా ఎర్రబడింది.
"మతివుండి వ్రాసినా, లేక వ్రాసినా దానికేమైనా విలువ ఉందా?" ముఖందించుకొని అడిగింది.
"నా చిన్ననాటి చెలి నన్నే ఆరాధిస్తూందని తెలిశాక బొత్తిగా విలువ ఇవ్వకుండా ఎలా వుండగలను?"
"ప్రతిమతో నీ పెళ్ళి జరుగబోతూందని జానకి అత్త చెప్పింది అరుణ్. నీమీద పిచ్చిపిచ్చి ఆశలేమీ పెట్టుకోవద్దని కూడా పరోక్షంగా హెచ్చరించింది నీకు ప్రతిమతో వివాహం కావడం వల్ల నువ్వెంత వున్నత స్థితికి చేరుకొంటావో, మీ నాన్నగారి కాలంనుండి శ్రీపతిగారు మీ కుటుంబానికి ఎంత సాయంచేశారో చెప్పింది."
"ఈ విషయంలో ఏదైనా నిర్ణయించవలసింది నేనుగాని అమ్మ కాదనుకొంటాను." అని లేచాడు అరుణ్. "నువ్వు కొద్దిగా ఓపిక పట్టావంటే నీ సమస్య త్వరలో పరిష్కరిస్తాను."
"నేను నీకు సమస్యకావడం నాకిష్టంలేదు, అరుణ్! నన్ను మా ఊరికి పంపించివెయ్యి."
"సింహం మెడలో వరమాల వేయాలని నీకంత ఉబలాటంగా ఉంటే అలాగే పంపించి వేస్తాను."
"నీతో వచ్చి సింహం మెడలో వరమాలవేసే అర్హత కూడా కోల్పోయాననుకొంటున్నాను."
మాటల్లోనే కారు దగ్గరికి వచ్చారు. అరుణ్ డోర్ తెరిచి, సంధ్య ఎక్కాక డోర్ వేసి, తను ఇటునుండి వచ్చి ఎక్కి కారు స్టార్ట్ చేశాడు.
* * *
