సరుసు ప్రయత్నాలలో ఇంకో విశేషంకూడా ఉన్నది. వాడిప్పుడు అచ్చగా తన విషయమే చూడటంలేదు. తన ఈడువాళ్ళని కూడగట్టి వాళ్ళందరితోనూ కలసి ఏదో చెయ్యాలని చూస్తున్నాడు__ నాటకాలాడటమే కానీగాక!
సుందరం కార్యక్రమంలో పెద్దపరీక్ష పాసుకావటమూ, పెద్ద ఉద్యోగాలు చెయ్యటమూ వంటివి ఉన్నాయిగాని నలుగుర్నీ కూడగట్టి చేసేపని అందులో ఒక్కటీ లేదు. అయితే ఈ తేడా సుందరం అర్ధంచేసుకో లేదు. బహుశా సరుసుక్కూడా తనకూ సుందరానికిగల తేడా అర్ధమై ఉండదు. అయినా తాను చేస్తున్నాపని వాడికి చాలా స్వాభావికంగా కనిపించింది. సుందరానికి మటుకు నిరర్ధక మనిపించింది. సరుసు ఎంతపాటపాడి ఎన్ని నాటకాలాడించినా అవి మామూలు నాటకాల్లా ఉండవనీ, ఏదో పల్లెటూరి అమాయిక ప్రజలు వీధినాటకం చూసినట్టు చూసి సంతోషించటానికి మాత్రమే పనికివస్తాయనీ సుందరం నమ్మకం. ఈనమ్మకాన్ని బయటపెట్టి సుందరం సరుసును నొప్పించలేదు.
నాలుగైదు రాగాలమీద పద్యాలు పాడి విశ్రాంతి తీసుకుంటూ సరుసు జేబులోనుంచి బీడీతీసి అంటించాడు.
"నిజంగా బీడీలు కాలుస్తున్నావుట్రా?" అన్నాడు సుందరం ఆశ్చర్యంతో.
"ఆ మాత్రం ఉండాల్లే," అన్నాడు సరుసు. వాడి ఉద్దేశ్యం సుందరానికి అర్ధంకాలేదు.
"నువు పాడతావా ఏం? కాస్సేపు వాయిస్తా." అన్నాడు సరుసు.
"అబ్బే నాకేంరాదు" అన్నాడు సుందరం.
"ఏదో పాటరాకుండా ఉంటుందా ఏం? ఏమీరాకపోతే అప్పనా తనామనా పాడు."
సుందరానికి లోపలినుంచి ఏదో దడపుట్టింది. పాట వినటమంటే ఎంతో ఆసక్తికలవాడు కనక వాడికి కొన్నిపాటలు వచ్చిన మాట నిజమే. కాని సరుసు తనను పాడమంటాడేమోనని సుందరం వొణికి పోయినాడు.
సరుసు, వాడి ధర్మమా అంటూ బలవటం చెయ్యలేదు.
౧౪
సెకండుఫారంలోకి వచ్చినప్పటినుంచీ సుందరం క్లాసులో రాణించటం లేదు. అదివర కెన్నడూ వాడి "ప్లేసు" పదిదాటేది గాదు. ఇప్పుడు పదిహేనూ, ఇరవైమధ్య ఉండటమేకాక, క్లాసులో తనకన్న చురుకైన వాళ్ళూ, తెలివిగలవాళ్ళూ చాలా మంది ఉన్నట్టు వాడికితోచసాగింది. దీనికి కారణమేమిటో వాడు చాలారోజులు ఊహించలేక పోయినాడు.
"నాకీయేడు మంచిప్లేసు రావడం లేదమ్మా," అన్నాడు సుందరం, తన సమస్య ఆవిడేమో తీరుస్తుందన్నట్టు.
"నువ్వు సరిగా చదవటంలేదు గామాలు! కాకపోయినా ఆ నాగేశ్వరరావు నువ్వూచేరి ఒకరి చదువు ఒకళ్ళు చెడగొట్టు కుంటున్నారు. ఒక్కడివీ చదివినప్పుడేనయం" అన్నది సీతమ్మగారు
ఆవిడ నాగేశ్వరరావుమీద తప్పు తోయటమూ, తమ స్నేహాన్ని కించపరచటమూ సుందరాని కేమీ ఇష్టంలేక పోయింది. కాని "ప్లేసు" రావటం లేదన్న చింత అట్లాగే ఉండిపోయింది. "క్వార్టర్లీ" లోనూ, "హాఫియర్లీ" లోనూ ఈ చింత మరింతయింది. సుందరానికి పాడుమార్కులు వచ్చాయి. పాసుమార్కు లయితేమాత్ర మేం?
"ఈ పరీక్షల్లోనే ఇట్లా మార్కులొస్తే అసలు పరీక్షల్లో పానుకావడం ఎట్లారా?" అన్నాడు సుందరం నాగేశ్వరావుతో.
"నూటికి యాభైలూ, అరవైలూ ఎంతమందికి వచ్చాయో చూశావా?" అన్నాడు నాగేశ్వరావు.
దీనికంతకూ కారణమేమిటో నాగేశ్వరరావు అన్న చెప్పేదాకా వాళ్ళకు తెలియదు.
వాళ్ళ క్లాసుటీచరుకు ఇంటిదగ్గర వేరేబడివుంది అందులో నలభైమందిదాకా చదువుతారు. వాళ్ళల్లో సగానికి పైగా ఆయన క్లాసుపిల్లలే. బళ్ళోలాగే ఈ పిల్లలు ఆయనకు నెలకు రెండున్నరచొప్పున ఇచ్చుకుంటారు. ప్రతి రాత్రీ ఆయన ఒక గంటసేపు వాళ్ళచేత మర్నాటి పాఠాలు చదివిస్తాడు. తాను మర్నాడు క్లాసులో వెయ్యబోయే ప్రశ్నలూ, లెక్కలూ వాళ్ళకు చెప్పి నూరుతాడు. చాలామంది పిల్లలు క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటారు. ఇంత నూరినా క్లాసులో తెల్లమొహాలు వేసే మొద్దులూ వున్నారు. ఆయనకు స్కూలు వాళ్ళు ఎంత జీతం ఇస్తారో అంతా ప్రైవేట్లతో సంపాదిస్తాడు.
స్కూలు పిల్లలు కాక ఇతర విద్యార్దులు కూడా ఆయన దగ్గర చదువుకుంటారు. వాళ్ళలో ఎక్కువభాగం ఏబీసీడీలుకూడా రాని మచ్చు. వాళ్ళేంచేస్తారంటే ఆయన దగ్గర చేరి ఒక ఏడాదిలో ఫస్టుఫారం స్టాండర్డుకు వస్తారు. రాకపోయినా ఇబ్బందిలేదు; సెకండు ఫారంలోకి బయటినుంచి వచ్చి చేరే వాళ్ళను చేర్చుకునేది ఆయనే గనక తనదగ్గిర ఏడాదీ, ఆరునెల్లూ చదువుకున్నవాళ్ళని సెకండుఫారంలో చేర్చుకుంటాడు. ఆయేడల్లాకూడా ఆయన వాళ్ళను తన ట్యూషను కిందే ఉంచుకుంటాడు. సెకండుఫారం ఆఖరు పరీక్షలు వచ్చే సమయానికి సెకండుఫారం పరీక్షపేపర్లు సెట్ చేసే వాళ్ళలో వీలయినంత మందిని మంచిచేసుకుని వాళ్ళిచ్చే ప్రశ్నలు తెలుసుకుని తన ప్రైవేటు విద్యార్దులకు చెప్పి వాళ్ళు థర్డుఫారంలోకి తోసుకుపోవటానికి వీలైనంత వరకు తోస్తాడు. ఆ తరువాత వాళ్ళపాట్లు వాళ్ళుపడతారు.
ప్రతి రాత్రీ తొమ్మిదిగంట లయేసరికల్లా లాంతర్లతో సహా, కప్పుకునే బట్టలతో సహా ఈ పంతులు ఇంటికి తయారయే విద్యార్దుల తూగిడీలు చూడముచ్చటగా వుంటాయి.
ఈ సంగతులు కొంతవరకు సుందరం అదివరకు ఎరుగును గాని క్లాసులో తాను ప్లేసు సంపాదించటానికి వీటికీ సంబంధం వున్నదని వాడికి తట్టలేదు.
* * * *
నాగేశ్వరావు అన్న ఎక్కడినుంచో తెలుగు పుస్తకాలు తెచ్చేవాడు, చదువు కోవటానికి కనపడిందల్లా చదివే అలవాటు సుందరానికున్నది. ఈ అలవాటు నాగేశ్వరరావు సుందరం దగ్గరే నేర్చుకున్నాడు. ఇద్దరూ కలసి "కన్యాశుల్కం" నాటకం చదవసాగారు. ఆ నాటకం మొదటినుంచి చివరిదాకా వాళ్ళకు నవ్వొస్తూనేవుండేది. అందులో వున్న పాత్రలూ, శిల్పమూ హాస్యపు లోతులూ వాళ్ళ కర్ధంకాకపోయినా సంభాషణలు చాలా తమాషాగా, అచ్చగా మనుషులు మాట్లాడినట్టే వుండేవి. ఇదే వాళ్ళకు సహం నవ్వొచ్చేది. వీరేశిలింగంగారి నాటకాలుకూడా వాళ్ళకు చిన్నచిన్న పుస్తకాలుగా దొరికాయి. అవి మామూలు నాటకాలకు దగ్గరిగా వున్నా అవికూడా నవ్వొచ్చేవి.
