రిసీవర్ ఎత్తి "హలో భార్గవ హియర్" అన్నాడు.
కొద్ది సేపటి మౌనం తర్వాత....
శవాన్ని చీల్చకుండానే...రక్తం పీలుస్తున్న స్మశాన పిశాచంలా నవ్వు....
కంఠంలో కోయిల రాగాలాపన చేసినంత శ్రావ్యమైనా....ఆ శ్రావ్యానికి కర్కశాన్ని కలగలిపి నవ్వే నవ్వు...
భీతిగొలిపే నవ్వు.
భార్గవ భయంకొద్దీ నిటారయ్యాడు. మౌనిక పాత్ర సృష్టించిన పాపానికీ__మహోదృత జలపాతపు మృత్యునాదమై ఫోన్ తీగల్లో స్రవించబడుతోన్న నవ్వు....రోజు రోజుకీ భార్గవని నిర్వీర్యం చేస్తుంది.
కాఫీలు పట్టుకొస్తున్న నిఖిల్ భార్గవవైపు చూసి కనుబొమ్మలు ముడేసి దబ్బున కప్పులు టేబిల్ పైన పెట్టి రిసీవర్ లాక్కొని తన చెవి దగ్గర పెట్టుకున్నాడు గాబరాగా...
అదే నవ్వు....కత్తికి తేనెపూస్తున్నట్టు!
ఆ నవ్వు...రాలిపడుతున్న జలపాతపు కెరటం విద్యుత్తును సృష్టిస్తున్నట్టు...
అరనిమిషం పాటు విన్నాక ఇటునించి నిఖిల్ నవ్వాడు...అవతలి వేపు నవ్వు ఆగిపోయింది.
"ఆపేసావేం డాళింగ్...నీ నవ్వు నా గుండెల్లో కదలాడి కలత నిద్దర లేపుతోంది. ఇంకాసేపు నవ్వవూ..." అన్నాడు కవ్వింపుగా. అవతలివేపు సడెన్ గా రిసీవర్ హుక్ మీద పెట్టిన చప్పుడు.
నిఖిల్ నిట్టూర్చాడు.
"భార్గవా! నా మాట వినగానే ఫోన్ పెట్టేసింది నీ మౌనిక. అంటే ఆ అమ్మాయి నీకే కాదు. నాక్కూడా తెల్సిన అమ్మాయే అయివుండాలన్న మాట. సో వెంటాడి వేటాడుదాం. నువ్వేం వర్రీ అవకు..." భార్గవ భుజమ్మీద చెయ్యేసి చెప్పాడు నిఖిల్.
అదోరకం వైరాగ్యం చీకటి తెరలా భార్గవను కప్పేస్తుండగా ఏమీ మాట్లాడకుండానే కాఫీ తాగుతున్నాడు.
అప్పుడే వచ్చింది నిర్లిప్త.
"ఏంటన్నయ్యా.....ఎప్పుడొచ్చారు? మావారి కాఫీలో ఈగలు జలకాలాడతాయి. కాస్త చూసుకుంటూ తాగండి" అంటూ.
మరో దిక్కున సాగుతోన్న ఆలోచనల్ని అణిచిపెడుతూ భార్గవ నవ్వాడు నిఖిల్ తో పాటు.
** ** ** **
అయిదో అంతస్థులోని ఆ గదిలో....
కిటికీ తెరలు రెపరెపలాడి చిరుగాలి తెమ్మర వాళ్ళిద్దర్నీ తాకింది. బయట మబ్బులు ఒరుసుకుంటూ వేకువను కప్పేస్తున్నాయి.
శరత్ ఏమీ మాట్లాడకపోయేసరికి భార్గవ చెయిర్ లో అసహనంగా కదిలాడు. శరత్ కళ్ళు ఏవో చెప్పాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.
"మీరు సస్పెన్స్ తో చంపుతున్నారు."
ఆ గదిలో నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడు భార్గవ. అసందర్బంగానే అక్కడ మౌనిక ప్రస్తావన వస్తుందేమోనన్న అనుమానం అతడికి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ముందు మౌనిక గురించే అడుగుతున్నారు.
మౌనిక!
మౌనిక!!
మౌనిక!!!
తల విదిలించాడు. వెన్నెముకలోని మూలుగుని తొలుచుకుంటూ మెదడులోకి ప్రాకుతున్న గొంగళిపురుగులా ఆ పేరు గుర్తొచ్చి జలధరించాడు.
"సస్పెన్స్ అనడానికి ఇది నవల కాదు మిస్టర్ భార్గవా!....జీవితం! అందుకే నా కోరికని ఎలా మొదలెట్టాలోనని ఆలోచిస్తున్నాను" గంభీర్యతను సంతరించుకొని చెప్పాడు శరత్.
"మీ కోరిక ఎలాంటిదయినా ఈ సృష్టిలో ఎవరూ కోరనిదేమయినా వుంటుందా? అవసరం అన్ని కోరికలకూ అవకాశం కల్పిస్తుంది... కాని మీరు చెప్పే ఏ మగాడూ మరే మగాన్ని కోరని కోరిక....ఏ భక్తుడూ భగవంతున్ని కోరని కోరిక అన్నది తప్పయి వుండాలి. ఎందుకంటే మనిషి అవసరాలు చాలా ఎక్కువ" భార్గవ అసలు టాపిక్ లోకి దింపాలన్న ప్రయత్నంలో అలా అన్నాడు కాని శరత్ కోరికను అంచనా వేయలేకపోతున్నాడు.
"ఆ అవసరం వేరు....ఈ అవసరం ఎవరికీ రాకూడదు" శరత్ చెయిర్ లోంచి లేస్తూ అన్నాడు. కిటికీ దగ్గరికి నడిచి చాలాసేపు రోడ్డువైపు చూశాడు.
చీమల బారులా కదులుతున్న వాహనాలు...జనం....
వాతావరణపు శీలాన్ని ముళ్ళపందిలా పెరికేస్తున్న శబ్దకాలుష్యం...
"మిస్టర్ భార్గవా__" అతడి పెదాలు తడబడ్డాయి. భార్గవ తదేకంగా శరత్ నే చూస్తున్నాడు.
"సెకనుకి ఆరుగురు పుడుతున్న ఈ ప్రపంచంలో మేంమాత్రం నిర్వీర్యంగా ఎందుకుండిపోయాం అన్న ప్రశ్న రోజు రోజుకీ నన్ను, నా భార్యనీ మృత్యువుకి దగ్గర చేస్తోంది. అది దరిచేరకుండా వుండాలంటే ఒక్క పసినవ్వు ఆ లోగిలిలో ప్రతిధ్వనించాలి....ఒక్క బోసి నవ్వు మా మధ్య ఏర్పడుతున్న శూన్యాన్ని దూరం చేయాలి. ఈ ఆస్తుల, అంతస్తుల పునాదులు ఒక్క చిన్నారి చేతుల్లో నిలబడాలి. అందుకే నేనో యజ్ఞం తలపెట్టాను. అందుకే నిన్నిక్కడకు రప్పించింది."
సరిగ్గా అప్పుడు__
వాళ్ళున్న ఆ గది తలుపుల దగ్గరికి రెండు పాదాలు వచ్చి నిలిచి పోయాయి ఆ మాటలు విని.
"అందుకని...మీరు బాబీని దత్తత కోరుతున్నారు కదా శరత్ గారూ! నా భార్య పోయినా నే బ్రతుకుతున్నది నా రచనల్ని చూసుకుని కాదు....బాబీగాడ్ని మాత్రం...బట్....నెవర్__"
భార్గవ కళ్ళు కొంచెం ఎర్రబారాయి. ఆ కళ్ళకింద మసకబారిన ఆవేదన భార్గవ నించి వచ్చిన ఆ మాటలతాటికి శరత్ గిరుక్కున అతడి వేపు తిరిగాడు.
"అక్కడే మీరు పొరబడ్డారు రైటర్జీ! ఎదుటి మనిషిని మామూలు మనుషులకంటే కూడా మీ రచయితలు సదవగాహనతో అర్ధం చేసుకుంటారనే కొన్ని రాత్రుల ఆలోచనలకు రూపకల్పనగా మిమ్మల్ని ఎన్నుకున్నాను. కాని అర్ధం చేసుకోక ముందే మీరు ఆవేశపడుతున్నారు..." అన్నాడు శరత్.
