Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 37

                                               పళ్ల డాక్టర్లు
    ఏదో నవల చదూతూ మధ్యలో ఎందుకో భర్త ఆంజనేయులు వంక చూసిన భువనేశ్వరి మండిపడింది.
    "ఏం... ఒళ్లేమైన చిమ చిమలాడ్తూందా?" అని అడిగింది నవలను పక్కనపెట్టి కయ్యానికి కాలు దువ్వుతూ.
    "ఇప్పుడు నిన్ను నేనేమన్నానే అలా విరుచుకుపడ్తున్నావ్?" కాస్త అయోమయంగా, మరికాస్త అమాయకంగా అడిగాడు ఆంజనేయులు.
    "వేరేగా ఏమైనా అనాలా?... నన్ను వెక్కిరిస్తున్నారు... అది చాల్దా?" గుడ్లురిమి చూసింది భువనేశ్వరి.
    "నేనెక్కడెక్కిరిస్తున్నానే బాబూ..."మొత్తుకున్నాడు ఆంజనేయులు.
    "ఓ పక్కన కోతిలా మూతిపెట్టి వెక్కిరిస్తూనే నేనెక్కడ వెక్కిరిస్తున్నానని అంటారా నంగనాచిలా?"
    "కోతిలా మూతిపెట్టి  వెక్కిరిస్తున్నానా?" ఆశ్చర్యంగా భార్యవంక చూసాడు.
    అంతలోకే అతనికి ఏదో అనుమానం వచ్చి అద్దం దగ్గరికి పరుగు తీసాడు.
    అద్దంలో మొహం చూస్కోగానే  కెవ్వుమని అరిచాడు ఆంజనేయులు.
    "ఇదేంటి?... అద్దంలో నా మొహం కాకుండా కోతి మొహమేదో కనిపిస్తుందే... హిహి... ఇదేదో మ్యాజిక్ లా ఉందేంటీ... హిహిహి?..."
    అద్దంలోకి చూస్తూ నవ్వసాగాడు ఆంజనేయులు.
    "మీ మొహం... మేజిక్ లేదూ పాడూలేదు... అది మీ మొహమే..." అంది భువనేశ్వరి.
    "ఆ!... నిజమా?!..."
    అద్దంలోకి పరీక్షగా చూసాడు.
    నిజమే!... అద్దంలోని ప్రతిబింబంలో కొద్ది కొద్దిగా తన పోలికలు కనిపిస్తున్నాయ్.
    "హమ్మో!... హమ్మో!!... నా మూతెంత వాచిపోయిందో!!..."
    గుండెలు బాదుకున్నాడు అంజేయులు.
    "మీ మూతి ఎందుకు వాచిందసలు?... నేనెప్పుడూ మీ నెత్తిమీదే కొడ్తాను... లేదా వీపుమీద కొడ్తాను!... అట్లాంటప్పుడు మీ మూతెందుకు వాచింది?..."
    భువనేశ్వరి ఆంజనేయులు కాలర్ పట్టుకుంది.
    'నిజం చెప్పండి... మీకు వేరే ఆడదాన్తో సంబంధం ఉంది... అదీ కూడా మూతిమీద కొట్టే ఆడదాన్తో... అవునా?..."పళ్లు కర కరా కొరికింది.
    "బాబోయ్... ఇదెక్కడి గోలే నాకూ?... అనవసరంగా నా శీలాన్ని శంకించకే బాబూ... నాకు మూతిమీద కొట్టే ఆడదాన్తో సంబంధం లేదు, ముక్కుమీద గుద్దే ఆడదాన్తో సంబంధంలేదు..." ఘొల్లుమన్నాడు అతను.
    "మరైతే మీ మూతెందుకు వాచింది... చెప్పండి...చెప్పండి...చెప్పండి..." కాలర్ పట్టుకుని ఊపేసింది భువనేశ్వరి.
    "నాకు రెండ్రోజుల్నుండి పంటి నొప్పి ఉంది!... ఆ నెప్పి ఈవాళ ఇంకాస్త పెరిగింది... ఒకవేళ నా మూతి అందుకే వాచిందేమో!..." అని, మరోసారి అద్దంలో తన రూపాన్ని పరీక్షగా చూస్కుని "కెవ్ వ్"అని అరిచి "నేను వెంటనే పళ్ళ డాక్టరు దగ్గరికెళ్ళాలి!"
    "మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు... మన ఇంటి పక్కనే ఓ పెద్ద పళ్ల డాక్టరున్నాడుగా!"
    "అతను పళ్లడాక్టరు కాదే!..."ఒళ్ల డాక్టరే!! జనరల్ ఫిజీషియన్..."
    "మీ బొంద... పళ్ల డాక్టరు కాదంటారేం? ఆయనకి అంతేసి పెద్ద పెద్ద పళ్లుంటేనూ?..."
    కిసుక్ అంటూ నవ్వాడు ఆంజనేయులు.
    "పళ్ల డాక్టరంటే పెద్ద పెద్ద పళ్లు ఉండే డాక్టరని అనుకుంటున్నావా?... కిసుక్ కిసుక్..." పళ్ల డాక్టరంటే పంటి జబ్బుల్ని నయం చేసే డాక్టరు"
    మళ్ళీ కిసుక్ అని నవ్వాడు.
    "అయినా ఇప్పుడు డాక్టరు దగ్గరికెందుకండీ దండగ!... ఇలా ఉంటేనే బాగుంటుంది... ఎంచక్కా పేరుకు తగ్గట్టు... ఎవరోగానీ పేరుకు తగ్గట్టు ఉండరు... మీరిలానే ఉండిపోండి!!..." గారంగా అంది భువనేశ్వరి.
    ఆంజనేయులు మొహమాటంగా నవ్వాడు.
    "నువ్వు చెప్పింది బాగానే ఉందిగానీ... మరి నాకు నొప్పిగా ఉంది కదా?... ఏనాడూ నీ మాట కాదన్లేదుగానీ... ఈ ఒకసారికి నన్ను వదిలెయ్... ప్లీజ్..." అంటూ పెళ్లానికి చెయ్యెత్తి దణ్ణం పెట్టి పళ్ల డాక్టరు దగ్గరికి పరుగుతీసాడు ఆంజనేయులు.
    ఆంజనేయుల్ని చూడగానే పళ్ల డాక్టరు దంతేశ్వర్రావు భక్తిగా చేతులూ జోడించి నమస్కరిస్తూ"ఆహా... ఆంజనేయా...ఇన్నాళ్లకు ఈ భక్తుడిని కరుణించావా స్వామీ... ఆహాహా... నా జన్మ ధన్యమైంది స్వామీ..."అన్నాడు అర్థ నిమీలిత నేత్రాలతో చూస్తూ.
    అంజనేయులు కిసుక్కున నవ్వాడు.
    "నేను ఆంజనేయుల్నేగానీ మీరనుకుంటున్న ఆంజనేయుల్ని కానుస్వామీ... నేను మీ దగ్గరికి వచ్చిన పేషంటుని...పన్ను నొప్పికి మూతి వాచిపోయి మీ కట్టా కనిపిస్తున్నానన్నమాట... కిసుక్... కిసుక్... కిసుక్"
    అది వినగానే పళ్ల డాక్టర్ దంతేశ్వర్రావు తన బోసినోటిని పూర్తిగా తెరిచి "పుసుక్ పుసుక్" మంటూ నవ్వాడు.
    "ఎత్తు మూతేస్కుని వచ్చి భలే బురిడీ కొట్టించావయ్యా నన్ను... నా కప్పుడే అనుమానం వచ్చింది సుమీ... ఆంజనేయస్వామేంటి ఇట్టా చొక్కా పంట్లాం వేస్కుని రావడమేంటీ అని..."
    ఆంజనేయులు మళ్లీ కిసుక్ మని నవ్వాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS