Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 37

    సరస్వతి పకపకా నవ్వింది
    "పిచ్చిపిల్లా. మొగుడంటే ఎంత ప్రేమ నీకు?" ఎడమచేత్తో రాధ తల నిమిరింది.
    "నీకు మొగుడంటే ప్రేముంటుంది గానీ నాకు నా కొడుకంటే ప్రేమ వుండదా?"
    "హత్తయ్యా!" బాధగా అంది రాధ.
    "వాడు అక్కడ బొద్దింకల సాంబారేస్కుని అన్నం తింటుంటే నేనిక్కడ చికెన్ బిర్యానీలు తినడానికి నాదేమైనా కసాయిగుండె అనుకున్నావా తల్లీ"
    "హత్తయ్యా... ఏంటత్తయ్యా  నువ్వంటున్నది?" బాధగా  అంది రాధ.
    "అవునమ్మా. వాడెక్కడ బాగానే తింటున్నాడమ్మా!' చెప్పింది సరస్వతి.
    "అత్తయ్యా. ఏంటత్తయ్య నువ్వంటున్నది? నువ్వు చెప్పింది నిజమేనా అత్తయ్యా నిజమేనా." సరస్వతి భుజాలుపట్టి ఊర్కే కుదిపేస్తూ అడిగింది రాధ. ఆ కుదుపుకి సరస్వతి కొప్పూడిపోయింది.
    "ప్లీజ్. అమ్మా రాధా. నువ్విక నన్న పట్టుకుని ఊపడం ఆవుతల్లీ. నా కొప్పు ఊడిపోయింది. నీ కుదుపుకి నా మెదడులో నరాలుకూడా కదిలిపోతున్నాయి. ప్లీజ్ రాధా..." ప్రాధేయపూర్వకంగా అడిగింది సరస్వతి.
    రాధ సరస్వతి భుజాలు వదిలిపెట్టి మళ్ళీ కుతూహలంగా అడిగింది "నువ్వు చెప్పింద నిజమా అత్తయ్యా?"
    "అవును రాధా!" పళ్ళునూర్తూ కొప్పుచుట్టుకుంటూ సమాధానం చెప్పింది సరస్వతి.
    "నీకెలా తెలుసు అత్తయ్యా?"
    "మన గూడెంలోని రంగడనే వెధవాయ్ ఒహడు ఈ మధ్యన జైలుకి వెళ్ళొచ్చాడు కదా. వాడు చెప్పాడమ్మా . ఇప్పుడు ఇదివరకటిలా కాదటమ్మా.జైళ్ళలో భోజనంబాగానే పెడ్తున్నారట! అదీ మన గోపిని పెట్టిన జైల్లోని భోజనం ఇంకా బాగుంటుందట!"
    ఆమె మాటలు వినగానే రాధ గుండెల్లో బోల్డన్ని వీణలూ, సీతార్లూ, సరోద్ లూ, జలతరంగాలు వగైరాలన్నీ కలగాపులగంగా మోగాయి.
    "చాలత్తయ్యా చాలు!ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నా మనసు కూడా ఎంతో ప్రశాంతంగా వుంది. ఇప్పుడు నేను చికెన్ బిర్యాని తృప్తిగా తింటాను." ఆనందభాష్పాలు రాలుస్తూ అంది రాధ.
    "ఏం తృప్తిగా తినడమో ఏం పాడో. నీ సందేహాలన్నీ తీర్చేసరికి బిర్యానీ మొత్తం చప్పగా చల్లారిపోయింది" కాస్త విసుగ్గా మొహంపెట్టి అంది సరస్వతి.
    "అయితే ఏం అత్తయ్యా! బిర్యానీని ఒక్క క్షణంలో వేడిచేసి తీసుకొస్తాగా?" హుషారుగా పలికింది రాధ.
    రాధ చకచకా బిర్యానిని వేడిచేసి మళ్ళీ ఇద్దరి కంచాల్లో వడ్డించింది.
    ఇద్దరు బిర్యానీ తినేసి వీధి అరుగుమీద కూర్చుని తీరుబడిగా పళ్ళు కుట్టుకుంటుంటే అక్కడికి రంగడు వచ్చాడు.
    "ఏంట్రా రంగడు ఇలా వచ్చావ్?" అడిగింది సరస్వతి.
    :మీకో విషయం చెప్పాలని వచ్చానమ్మా" అన్నాడు రంగడు.
    "ఏంట్రా అది?"
    "గోపి బాబుగార్ని జైలునుంచి ఇడిపించే మార్గం చెప్తానమ్మగోరు."
    "ఎలారా ఎలా ఎలా ఎలా?" ఇద్దరూ రంగడిమీదకి దూకి వాడి పీకుచ్చుకుని ఆతృతగా ఊపేశారు
    "మీరిట్టా నా పీకుచ్చుకుంటే నేను సెప్పనండమ్మా... అబ్బా! ఖళ్ ఖళ్ నా పీకొదలండమ్మా. ఖళ్ దగ్గొచ్చేస్తోంది!! ఖళ్ ఖళ్"గిల గిల్లాడుతూ చెప్పాడు రంగడు.
    ఇద్దరూ రంగడి పీక వదిలిపెట్టేశారు.
    "చెప్పు రంగడు. మా గోపిని ఎలా విడిపించాలి."
    "చెప్పు రంగడూ మా ఆయన్ని ఎలా విడిపించాలి?"
    ఇద్దరూ గోలగోలగా అరిచారు.
    రంగడు భయం భయంగా నాలుగు అడుగులు వెనక్కి వేసి తర్వాత చెప్పాడు.రాయుడికి శానా పలుకుబడి వుందండమ్మా. ఆయన తల్చుకుంటే గోపీగార్ని నిర్దోషి కింద రుజువు చేసి విడుదల చేయించగల్రమ్మా. నన్ను కూడా జైలునుంచి ఇడుదల చేయించింది ఆయనేనమ్మా. నా పెళ్ళాం ఆయనగారి కాళ్ళమీద పడి వేడుకుంటే నన్ను ఇడుదల చేయించాడమ్మా. ఇంక నేనొస్తానమ్మా.
    మళ్ళీ తన పీక పట్టుకుని ఇంకేం అడుగుతారో అని అక్కడినుండి పరుగుతీసాడు రంగడు.
    "అత్తయ్యా ఆ రాయుడు దగ్గరికి వెళ్ళి నా దైవాన్ని జైలునుండి విడుదల చేయించమని వేడుకుంటానత్తయ్యా" అంది రాధ.
    "వద్దమ్మా వద్దు" అంది సరస్వతి ఆందోళనగా.
    "హత్తయ్యా" రాధ గావుకేక పెట్టింది.
    ఆ అరుపుకి సరస్వతి హడలిచచ్చింది.
    "నువ్వేనా అత్తయ్యా ఇలా అంటున్నది. నా దైవాన్ని రక్షించుకోవడానికి వెళ్లొద్దని ఎలా అంటున్నావ్ అత్తయ్యా."
    "హమ్మా!" బాధగా అంది సరస్వతి.
    "ఇంతేనామ్మా నువ్వు నన్ను అర్ధం చేసుకుంది? నువ్వు వెళ్తే ఆ రాయుడు నీ శరీరాన్ని కోరతాడమ్మా. అందుకే వద్దన్నాను తల్లీ."
    రాధ మొహం గంభీరంగా మారిపోయింది.
    "అత్తయ్యా! స్ర్తీ కి మాంగల్యం ముఖ్యం అత్తయ్యా. పసుపు కుంకుమకోసం స్త్రీ ఎటువంటి త్యాగానికైనా వెనకాడకూడదత్తయ్యా."
    ఆవేశంగా అంది రాధ. "కాబట్టి నేను ఆ రాయుడి దగ్గరకి వెళ్తానట్టయ్యా. నాకు నా శీలంకంటే నా పతియే ముఖ్యం అత్తయ్యా."
    "కానీ ఈ ప్రపంచంలో ఏ భర్తకైనా భార్య శీలం ముఖ్యం అమ్మా" పళ్ళు నూర్తూ అంది సరస్వతి. "కాబట్టి నువ్వు ఆ రాయుడి దగ్గరకి వెళ్లొద్దమ్మా.
    "మరిప్పుడు ఎలా?" రాధ అయోమయంగా మొహం పెట్టింది.
    "ఏముంది తల్లీ! నీ బదులు నేను వెళ్తానమ్మా. నీ మాంగల్యం భాగ్యం గురించి ఆ రాయుడిని నేను వేడుకుంటానమ్మా." ఆవేశంగా పలికింది సరస్వతి.
    "హత్తయ్యా"
    రాధ మళ్ళీ అరిచింది.
    "నాకోసం ఎంత త్యాగానికి ఒడిగడ్తున్నావ్ అత్తయ్యా. నా మాంగల్యంకోసం ఆ రాయుడికి గంగానది అంత పవిత్రమైన నీ శీలాన్ని అర్పిస్తావా అత్తయ్యా?"
    "ఛీ ఏంటమ్మా ఆ పాడు మాటలు."
    సరస్వతి సిగ్గుగా పైటకొంగు భుజాల చుట్టూ కప్పుకుంది. "నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి రాయుడు నిన్ను అలాంటి కోరికలు కోర్తాడేమోగానీ నన్నెందుకు కోరతాడమ్మా. నాలో దాచుకోవడానికి ఇంకా ఏముంది తల్లీ."
    "అంతేనంటావా అత్తయ్యా."
    "అంతే తల్లీ. మరి నేనింక వెళ్ళిరానమ్మా"
    "హత్తయ్యా"
    రాధ సరస్వతిని గట్టిగా కౌగిలించుకుని భోరుమంది.
    "ఊర్కో అమ్మా.... ఊర్కో. ఎలాగైనా గోపీని నేను విడిపించుకుని వస్తానుగా?" రాధ వీపు నిముర్తూ అంది సరస్వతి.
    రాధ సరస్వతిని బల్లిలా కర్చుకుంది.
                                                            31
    సరస్వతి రాయుడి ఇంటిని సమీపించింది.
    వీధి తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయ్.
    మెల్లగా తలుపు తట్టింది సరస్వతి. కొన్ని క్షణాల తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
    "ఎవరూ?" తలుపులు తెరిచిన రాయుడి భార్య మహాలక్ష్మమ్మ సరస్వతిని చూస్తూ ప్రశ్నించింది.
    "రాయుడిగారి కోసం వచ్చానండీ. ఆయన ఉన్నారాండీ?" అనవసరంగా పైటకొంగు నిండుగా కప్పుకుంటూ అడిగింది సరస్వతి.
    "ఆయన ఇంట్లో లేరే?" అంది మహాలక్ష్మమ్మ.
    "హయ్యో? ఇప్పుడెలా? చాలా అర్జంటు పనిమీద ఆయనకోసం వచ్చానే!!" బాధపడ్తూ అంది సరస్వతి.
    "పోనీ లోపలికొచ్చి కూర్చోండి. ఆయన పొలం వెళ్ళినట్టున్నారు ఒక అరగంటలో వచ్చేస్తారు"
   సరస్వతి ఓ క్షణం ఆలోచించి "సరే అలాగే" అంది.  
    "ఉండండి కాళ్ళు కడుక్కోడానికి నీళ్లిస్తా."
    మహాలక్ష్మమ్మ సరస్వతిని కాళ్ళు కడుక్కోడానికి వెండిచెంబుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది.
    సరస్వతిని కాళ్ళు కడుక్కున్నాక ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు.
    "ఏం తీసుకుంటావక్కా. కాఫీయా, టీయా, మజ్జిగా?" అడిగింది మహాలక్ష్మమ్మ.
    "హమ్మా!"
    గట్టిగా అరిచింది సరస్వతి.
    మహాలక్ష్మమ్మ కంగారుపడిపోయింది.
    "పోనీ అవేమీ మీకిష్టం లేకపోతే పాలల్లో బోర్నవీటా కలిపిస్తాలే అక్కా" భయం భయంగా చూస్తూ అంది మహాలక్ష్మమ్మ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS