Previous Page Next Page 
ఎండమావులు పేజి 37


    నిర్ఘాంత పోయాడు జానకిరాం. తను పరాయి వ్యక్తిని తెల్సికూడా నగేంద్రబాల ఇట్లా మాట్లాతున్నదంటే తానెవరో ఆమెకు తెలిసి పోయినట్లుగా అర్ధం చేసుకున్నాడు. అనుకోకుండానే ఒకరి ముఖాలొకరు సూటిగా చూసుకున్నారు.
    "జానకిరాం గారూ" నవ్వుతూ అన్నది నగేంద్ర బాల.
    విస్తుపోయాడు జానకిరాం.
    "ఉద్వేగంతో ఏదో మాట్లాడేశాను. నన్ను క్షమించండి. గౌతమి మిమ్మల్ని ఎప్పుడూ దూరం చేసుకో దల్చుకోలేదు. ఐదేళ్ళుగా కాపురం చేసినా మీరు ఆమెను సరిగా అర్ధం చేసుకోలేదనే నా భావన. ఈ ఎందు నెల్లల్లో ఆమెను పూర్తిగా తెల్సుకున్నాను. తన కాళ్ళమీద తానుగా నిలబడి జీవించగల శక్తి ఏ కొద్ది మంది చదువుకున్న ఆడ వాళ్ళకో ఉంటుంది. కాని వాళ్ళుకూడా జీవితాంతమూ అట్లాగే ఉంటారా అనేది కూడా సందేహమే.ఆ తీరుగా గౌతమి కొద్ది నెలలు కూడా తన జీవితాన్ని గడపలేదు. ఆమె జీవనలత మీతో పెనవేసుకు పోవలసిందే. ఒక రకమైన విరక్తి భావంతో ఒక తాత్కాలిక భ్రాంతిలో పడి ఆమె ఇట్లా వచ్చేసింది. ఈ రోజున ఆమె మీతో వస్తుంది. మీరు తీసుకు వెళతారా"
    సూటిగా అడిగిన ఈ ప్రశ్న సూలంలా అతని మనస్సులో గుచ్చుకున్నట్లయింది.
    "పొరబడ్డారు. గౌతమిని నేను తీసుకు వెళ్ళదల్చుకుంటే నేరుగా అక్కడికే వెళ్ళేవాడిని. ఏ కారణం చేత విరక్తి భావంతో ఆమె వచ్చేసిందో ఆ కారణం ఇధమిద్ధరంగా నాకు ఈ రోజుకూ తెలీదు. ఆ విరక్తి భావమే ఆమెలో శాశ్వతమైన ముద్ర వేసుకుంటుందేమో నాకు తెలీదు. విరక్తి పోయి అనురక్తి ఆమెలో కలిగిన నాడు గౌతమి తానుగానే నా ఇంటికి వస్తుంది. ఆమె కోసం నా హృదయ కవాటం ఎప్పుడూ తెరచే ఉంటుంది. నిర్భయంగా ప్రేమానురాగాలను పుణికి పుచ్చుకుని ఎప్పుడు ప్రవేశించినా ప్రవేశించవచ్చు. శలవు, వస్తాను" అంటూ వచ్చేశాడు జానకిరాం.
    స్థబ్దురాలై గుమ్మం వైపే చూస్తూ నిల్చుండి పోయింది నగేంద్రబాల.
    ఇంటికి వచ్చిన జానకిరాం ను చూసి శ్రీలక్ష్మి తల్లి దగ్గరకు వెళ్ళి "అమ్మా, అమ్మా జానకిరాం అన్నయ్య వచ్చాడే. చూడట్లా వచ్చి" అన్నది. ఈలోగా జానకిరాం తల్లి దగ్గరకు రానే వచ్చాడు.
    "ఏం నాయనా కోపం తీరిందా, మీ నాన్న ఆ రోజున అట్లా అన్నారని కోపగించుకుని వెళ్ళి పోయావుకదూ. ఉన్నట్లుండి హఠాత్తుగా తెల్లవారి పక్కమీద చూస్తే లేవు. ఎక్కడికి వెళ్ళిందీ తెలీదు. బజారుకు వెళ్ళావేమోనని పది గంటల వరకూ చూశాం. అతీ గతీ లేదు. శ్రీలక్ష్మి నీ గదిలోకి వెళ్ళింది. బావురుమంటూ వచ్చి 'అమ్మా అన్నయ్య పెట్టె తీసుకుని వెళ్ళి పోయాడే. బహుశా నిన్న నాన్నగారన్న మాటలకు మనస్సు కష్ట పెట్టుకుని వెళ్ళిపోయాడు' అన్నది. నా ప్రాణాలు ఎగిరి పోయినయ్యి. వాడు ఆ రకంగా వెళ్ళి పోతే, నువ్వు ఈ రకంగా కోపంతో దేశాల పాలయ్యావని నెత్తి బాదుకుని ఏడుస్తున్నాను. ఎక్కడికి వెళ్లావురా నాయనా" అంటూ కొడుకుని కావిలించుకుని కంట తడి పెట్టింది ప్రభావతమ్మ.
    జయలక్ష్మి, శ్రీలక్ష్మి సంతోషంతో జానకిరాంను చూస్తూ "మా అందర్నీ ఈ మూడు రోజులూ హడల గొట్టేశావు. ఏమయినావో, ఎక్కడికి వెళ్ళానోనని అమ్మ ఒకటే గోల. నీకు పుణ్యం ఉంటుంది ఇలాంటి పని ఎన్నడూ చెయ్యకు" అన్నారు వాళ్ళిద్దరూ.
    జానకిరాం ఖిన్నవదనుడై నవ్వుకున్నాడు.
    "నేనేం పసివాడినా అమ్మా మారు పడిపోయేందుకు. అంత గాబరా ఎందుకు కలగాలో నాకు అర్ధం కావటం లేదు" అన్నాడు.
    "మారుబట్టమే కాదు వేరుబడ్డా మాకు కష్టంగానే ఉంటుంది. నిన్ను ఉద్యోగం చెయ్యమని ఎన్నడూ ఇక అనను. మాతోబాటుగా కలో గంజో తాగుతూ మా కళ్ళ ఎదుట వుంటే నువ్వు ఉద్యోగం చేసినట్లుగానే భావిస్తాం" అంటూ ఇంక అక్కడ నిల్చోకుండా వెళ్ళిపోయాడు గోపాలశాస్త్రి. తండ్రి వచ్చి విషయమే గమనించలేదు జానకిరాం.
    అభిమానంతో, సిగ్గుతో కుమిలి పోయాడు జానకిరాం. మెల్లిగా తన గదిలోకి వెళ్ళాడు.
    "ఇంత పనికిమాలినవానిగా నన్ను సృష్టించావా భగవంతుడా" అని మనస్సులోనే అనుకుంటూ వాపోయాడు.
    శ్రీలక్ష్మి, జయలక్ష్మిల సంతోషానికి మేరలేదు.
    ఆ రోజే జయలక్ష్మి వెళ్ళి జానకిరాం వచ్చి నట్లుగా స్వాతితోనూ, కృష్ణమూర్తితోనూ చెప్పింది. అందరికీ పోయిన ప్రాణం లేచి వచ్చి నట్లయింది. ఆ రోజున అందరికీ పండుగగానే ఉంది, ఒక్క జానకిరాం కు మినహా-

                                        27

    ఆ రోజు జ్యోతి పుట్టినరోజు. ప్రతి ఏడూ తన పుట్టినరోజు పండక్కి తన స్నేహితురాండ్రనందర్నీ పిలిచి చిన్న టీపార్టీ ఇచ్చేది జ్యోతి. ఈ సంవత్సరం ఆ పద్ధతి మానేసింది. వయస్సు వస్తున్న కొద్ది అభిరుచులు మారుతున్నయ్యి. ఈ పుట్టిన రోజు వేడుకకి ఎవ్వర్నీ పిలవ దల్చుకోలేదు. ఇద్దర్నీ మాత్రమే భోజనానికి పిలిచింది. మొదటి వ్యక్తి స్వాతి, రెండో వ్యక్తి జయలక్ష్మి. ఈ సారి ఈ వేడుకకు అనుకోకుండా మురహరి కూడా ఉన్నాడు. ఈ పద్దతికి తాసిల్దారు కూడా గారు వప్పుకున్నారు.
    స్వాతి రానన్నది. ఆమె మనస్సులోని అభిప్రాయం వేరు. ఎక్కడ హీనంగా చిన్నబుచ్చుకో వలసిన పరిస్థితి వస్తుందోనని ఆమె దిగులు.
    "జ్యోతీ నా సంగతి ఇదివరకు నీకు తెలీక పోయినా ఇప్పుడు తెలుసు. నేను మీ ఇంట్లో భోజనం చెయ్యటం నీకు ఇష్టమున్నా మీ నాన్నగారికి, అమ్మగారికి మీ బావకూ ఇష్టం లేక పోవచ్చు. కులగోత్రాలు కప్పి పుచ్చుకుంటే దాగేవి కావు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డరీతిగా నన్ను చెయ్యకు" అన్నది వినయ పూర్వకంగా.
    జ్యోతి ఈ మాటలకు ఎంతో నొచ్చుకుంది.
    "వదినా నువ్వు ఎవరయిందీ నాకక్కర్లేదు. నీ కుల గోత్రాలు నాకనవసరం. నువ్వు మా వదినెవు. కృష్ణ మూర్తి అన్నయ్య భార్యవు. ఆ చుట్టరికాన్ని దృష్టిలో ఉంచుకునే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను" అన్నది.
    స్వాతి వప్పుకోక తప్పలేదు.
    భోజనాల గదిలో తాసిల్దారుగారూ, మురహరి ఒక వరసన కూర్చున్నారు. వారి పక్కన పిల్లలంతా కూర్చున్నారు. ఎదురు వరసలో జ్యోతి, స్వాతి, జయ లక్ష్మి, జ్యోతి తల్లి కూర్చున్నారు. వంటావిడ వడ్డించింది. పిండి వంటలతో, పాయసంతో మృష్టాన్న భోజనంగా ఉండాలని జ్యోతి ఉరమాయించి అన్ని పదార్ధాలూ చేయించింది. అంతా భోజనం ప్రారంభించారు.
    "మా జ్యోతి మూలంగా మిమ్మల్నందర్నీ విందుకు ఆహ్వానించటానికి వీలు కలిగింది. మీ అందరితోనూ ఈ విందులో పాల్గొనటానికి ఇవ్వాళ నాకూ వీలు కలిగింది, చాలా సంతోషం" అన్నారు తాసిల్దారుగారు.
    "అవున్నాన్నా ఈ రకంగానయినా నలుగురం ఒక చోట కల్సుకోటానికి వీలుపడింది, మీ అందరికీ నా కృతజ్ఞత" అన్నది జ్యోతి.
    "ఎవరికి ఏం కావాలో అడిగి వడ్డించుకుని తినాలి. మొహమాట పడితే లాభంలేదు" అన్నాడు హరనాధ్.
    "ఇంతటితో అయిపోలేదోయ్. రేపు మీ జ్యోతి పెళ్ళిలో ఇంతకన్న ఎక్కువగా విందులూ, వేడుకలూ జరిపించాలి, ఏమంటారు మురహరిగారు" అన్నది స్వాతి.
    మురహరి నవ్వి ఊరుకున్నాడు. జ్యోతి కళ్ళు బావ వైపే చూడసాగాయి. వీరిద్దరి ముఖ కవళికలూ చూస్తున్నది తలొంచుకునే జయలక్ష్మి. చూసీ చూడనట్లుగా ఒకసారి జయలక్ష్మివైపు చూశాడు మురహరి. అందరి ముఖాల్లోనూ సంతోషాతిశయాన్నే చూసింది స్వాతి. జ్యోతి తల్లికి మాత్రం ఈ సంభాషణ నచ్చలేదు.
    "ఏమండీ పెద్దవారు మీరు మాట్లాడరే. పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తారు" అన్నది స్వాతి జ్యోతి తల్లివైపు చూస్తూ.
    "ఆ రోజు రావాలికదా, ఎవరికి ఎవరు రాసి పెట్టుకున్నారో ఎవరికి తెలుసు. అంతా విధి విధితమే కదా" అన్నది జ్యోతి తల్లి.
    "వివాహాలు స్వర్గంలో జరుగతయ్యనే ఆర్యోక్తి ననుసరించి మాట్లాడుతున్నారు" అన్నది జయ లక్ష్మి జ్యోతి తల్లి వైపు, మురహరి వైపూ చూస్తూ
    జ్యోతి మనస్సు ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
    "ఇతను తెల్సుగా టీచరుగారూ మా మేనల్లుడు మురహరి. ఆనర్సు పూర్తి చేశాడు" అన్నాడు తాసిల్దారుగారు స్వాతితో.
    "ఇంకేమండీ బాధేలేదు" అన్నది స్వాతి ఆయనతో.
    చిరునవ్వుతో భార్యవైపు చూశాడాయన. చూసీ చూడనట్లుగానే ఊరుకుందావిడ.
    "ఒరేయ్ హరనాద్ ఏమిటా కోతి తిండి, తలొంచుకు తిను, అట్లా పప్పులు పోసుకు న్నట్లు తింటావేం. అవతల బావ విస్తట్లో మెతుకులు పడతయ్యి" అని హరనాద్ ను కసిరిందావిడ.
    "పెళ్ళయ్యాక అక్కయ్య ఎంగిలి ఎట్లాగూ తింటాడు. అందాకా నా ఎంగిలి తిన్నా తప్పు లేదు ఏం బావా" అన్నాడు హరనాద్.
    స్వాతి మనస్పూర్తిగా నవ్వింది. తాసిల్దారు గారు మేనల్లుడి వీపు తట్టారు. జయలక్ష్మి ముభావకంగా ఊరుకుంది. జ్యోతి సిగ్గుతో వంచిన తల ఎత్తలేదు. మురహరి కనబడీ కనబడనట్లు గా జయలక్ష్మివైపు క్రీగంట చూశాడు. ఆ చూపును అందుకుంది జయలక్ష్మి. మురహరి ముఖ కవళికల్ని అర్ధం చేసుకోలేక పోయింది జ్యోతి. అసలీ ప్రస్తావనే నచ్చలేదు జ్యోతి తల్లికి. భార్య ముఖం చూసి నొచ్చుకున్నాడు తాసిల్దారు గారు. అంతా తింటూనే ఆలోచనల్లో పడ్డారు.
    "ఏమ్మా జయలక్ష్మి మాట్లాడకుండా భోజనం పూర్తి చేస్తున్నారా" అన్నది స్వాతి.
    అన్య మనస్కురాలై ఉన్న జయలక్ష్మి ఒక్క సారి తలెత్తి చూసి "ప్రస్తుతం మనం వచ్చింది అందుకేగా వదినా. భోజనం ముందు కబుర్లు తరువాత" అన్నది జయలక్ష్మి.
    "అట్లాకాదు భోజనంతో కబుర్లు కలిపి తింటుంటే బావుంటుంది అవునా వదినా" అన్నది జ్యోతి.
    "టీచరుగారు మీ ఇద్దరికీ వదినగారన్నమాట. బాగుంది వరస. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అంతా ఇక్కడ చేరి సరదాగా మనస్సులు విప్పి మాట్లాడుకోటం నాకు నిజంగా ఆనందంగా ఉన్నదమ్మా. ఉద్యోగరీత్యా, సేవాధర్మంలో పడి వేళా పాళా లేకుండా తిరిగే నాబోటి వాడికి ఈ మాత్రం తీరిక చిక్కి మీ అందరి మధ్యా ఇంత హాయిగా సంతోషంగా భోజనం చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు ఈ స్నేహ వాత్సల్యాలూ, కలుపుగోలుతనమూ మీ ముగ్గురిలోనూ ఎల్లప్పుడూ ఉండాలని నా కోరిక. మా జ్యోతి ప్రకృతే వేరు. దాని మనస్సుకు వచ్చినవాళ్ళయితేనే, తన ఆశయాలకూ, అభిరుచులకు అనుగుణ్యంగా ఉన్నవాళ్ళయితేనే, అది వాళ్ళతో స్నేహం చేస్తుంది. మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకంగా పిలిస్తే పలికే హృదయం దానిది. ఏమ్మా జ్యోతి అంతేనా" అన్నాడాయన వాత్సల్య పూర్వకంగా కూతురు వైపు చూస్తూ. పులకాంకితురాలైంది జ్యోతి. హృదయ పీఠంమీద బావను నిల్చుకుంది. మనస్సులో స్వాతినీ, జయ లక్ష్మినీ నింపుకుంది. తండ్రి తన ఉద్దేశ్యాలతో భావాలతో ఎప్పుడూ ఏకీభవిస్తాడని తెల్సు. తల్లి మాత్రం ఎప్పుడు తనతో కలిసిరాదు. ఆ కుమిలింపు మనస్సులో ఎప్పుడూ కలక వేస్తూనే ఉంటుంది. తల్లివైపు చూసింది జ్యోతి. ఆమె ముఖం తుమ్మల్లో పొద్దూకినట్లుగా ఉంది.
    మురహరి వైపు చూసింది జ్యోతి. అతని మనస్సులో ఏముందో తెలీదు. ఏ భావాలున్నయ్యో బయటికి రావు. తనవైపు ఒక్కసారయినా చూసి నట్లుగా లేదనుకుంది. ఈ దాగుడు మూతలకు  అంతమెప్పుడో!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS