మళ్ళీ వీణ మేలుకునేసరికి టాక్సీ పల్లెలోకి ప్రవేశిస్తోంది.
వెంకమ్మగారు, ఇల్లంతా బోరడిచేత శుభ్రంగా కడిగించి ముగ్గులుపెట్టి ద్వారబంధాలకు మామిదాకుల తోరణాలు కట్టించారు.
శాము రైతులు, వారి ఆడవారు, 'శామప్ప గారి' రాజకుమారి దర్శనార్ధం ఇంటిముందు గుమిగూడారు.
ఇంటిముందు టాక్సీ ఆగగానే పల్లెటూరి పిల్లలు మెరుస్తున్న కారును ఆశ్చర్యంతో చూడసాగారు. శాము కారు దిగి వీణ నెత్తుకున్నాడు. వీణ సంతోషంతో అర్ధం లేని శబ్దాలను చేస్తూ తండ్రి భుజాన్ని గట్టిగా పట్టుకుంది.
గులాబి రంగులో ముద్దులు మూట కట్టే పాపను చూసిన వాళ్ళ ఆనందానికి పారమేలేదు. వృద్దు సంజస్వ, వీణ బుగ్గలను తన చేతితో తాకి టక్కున మెటికలు విరచింది. శాము వీణ నెత్తుకొని లోపలికి వెడుతూ, "మీరా వీరందరికీ ఫలహారాలు పంచి పెట్టు" అన్నాడు.
మీర బుట్ట విప్పి రవ్వ లడ్డు, చక్కిలాలను పిల్ల్లలందరికి పంచి పెద్దవారికంతా పంచదార, ఎండు కొబ్బర కలిపిన తీపి పంచి పెట్టింది. అందరూ ఇళ్ళకు బయలుదేరారు.
"మాదవ్వా బిడ్డ బంగారు బొమ్మలా ఉంది గాదా"
"బంగారు బొమ్మలా ఉండకేం సంజవ్వా. ఆలుమగలు లచిమి నారాయణుల్లా ఉన్నారు. బిడ్డేలా ఉండేను? శామన్నగారి అయ్యగారికి ఆ బాబొక్కడే కొడుకు. ఇపుడు ఈయనకో బిడ్డ. కలల్లో పెట్టి పెంచుకుంటారు మారాజులు."
"ఆరికేం తక్కువా? పాలు నెయ్యి కొదువా? తొడిగిన గుడ్డ చూశావా? థళా థళా మెరుస్తుండాది. దాని వేల వో వంద రూపాయలు సేనును కొంటాను."
"బిడ్డ చెవుల్లో లోలక్కు చూశా కమల పువ్వులా ఎంత బాగుండాదో. ఇటూ అటూ తిరిగితే దళక్ పళక్కని మెరుస్తున్నాది"
వీళ్ళ మాటలను మౌనంగా వింటూన్న తిమ్మవ్వ నిట్టూర్చి "కలిగినోళ్ళకే బిడ్డలు పుట్టాలి. మన లాంటి బీదోళ్ళకు బిడ్డల్నివ్వ కూడదూ దేముడు?" అంది.
శాము బిడ్డ నెత్తుకొని లోపలికి వెళ్ళగానే వెంకమ్మగారు దిష్టితీసి, కొబ్బరి కాయ దిగ తుడిచి పగుల కొట్టి హార తిచ్చారు. అవధానిగారి కూతురు వెంకు పరిగెత్తుకుంటూవచ్చి, "శామన్నా నే నెత్తుకుంటాను ఇవ్వు" అంది.
కొత్త మొహాన్ని చూసి వీణ వెంకూ దగ్గరకు వెళ్ళకపోయినా, బలవంతంగా ఎత్తుకొని, బిడ్డ నోటిమీద ముద్దెట్టుకుంది. దీనిని చూసిన మీర తీక్షణంగా, "ఇకమీదట బిడ్డ నోటిమీద ముద్దెట్టుకోకు" అంది. వెంకు అనుకోని ఈ దాడితో అప్రతిభురాలై శామువేపు చూసింది. శాముకు, వెంకూకు చిన్న బిడ్డ మీదున్న సరళ మైన ప్రేమ అర్ధమైనా, పాప శ్రేయస్సు దృష్టితో "అవును వెంకూ, మీర చెప్పేది నిజం, అలా నోటి మీద ముద్దెట్టుకోవటం, బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదు" అన్నాడు.
వెంకు నొచ్చుకుంటూ "నాకు తెలియదు శామన్నా. ఇంకెప్పుడూ అలా చెయ్యను. బిడ్డకు పేరేం పెట్టారు?" అంది.
"నేను జానకి అని పెట్టాను. ముద్దుగా జాని అని పిలుస్తాను."
"ఆ పేరు నాకు నచ్చలేదు వెంకూ. నేను వీణా అని పిలుస్తాను"
వెంకు ఆశ్చర్యంతో నోరు తెరచి "ఆ" అంది.
"వీణ"
"వీణా? అంటే బొమ్మలోని సరస్వతి చేతిలో ఉంటుందే అదేనా? నాకేమో జానీనే బాగుంది బాబూ"
వెంకుతో ఫిర్యాదు చేస్తున్నట్టుగా శాము "వెంకూ నువ్వైనా దానికి బుద్ధి చెప్పమ్మా. ఆ పేరు తెచ్చి నా పాపకు పెట్టింది" అన్నాడు.
హాలులోని గడియారం నాలుగు గంటలు కొట్టగానే అదిరి పడింది మీర.
"అయ్యో పాడు మతిమరుపు. బిడ్డకు పాలు పట్టే టైమయింది" అంటూ వంట గది వైపు వెళ్ళింది. వెంకమ్మగారితో,
"కాస్త ఆవుపాలు వెచ్చ బెట్టండి. వీణకు పాలు పట్టాలి" అంది.
వెంకమ్మగారు ఆశ్చర్యంతో,
"అదేమిటమ్మాయ్. పాప కింకా నాలుగునెల్లేగా! నువ్వు పాలివ్వవా?" అన్నారు.
"నా దగ్గర పాలు చాలటంలేదు వీణకు" అంటూ - పాత సీసా కడిగి తేవటానికి బయటకు వెళ్ళింది. వెంకమ్మగారు పాలు కుంపటిమీద పెట్టి విసురుతూండగా లోపలి కొచ్చిన మీర ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్టుగా
"అయ్యయ్యో ఉండండి కాస్త. పాలగిన్నె మీద మూత లేకుండా విసిరితే దుమ్ము పడుతుంది" అంటూ గిన్నెమీద మూత వేసింది. వెంకమమగారు పాలు తెచ్చివ్వగానే మీర పాలు వడియ కట్టి పాల బుడ్డీలో వేసింది. వెంకు ఇదంతా ఆశ్చర్యంతో చూస్తూ కూర్చుంది. వెంకు తమ్ముడు చిన్న పిల్లాడిగా ఉన్నపుడు వాళ్ళమ్మ ఉగ్గు గిన్నెతో పాలు పట్టండటం మాత్రమే తెలుసు.
మీర "దామ్మా" అంటూ వీణను తొడమీద పడుకోబెట్టుకొని మొదట అడాక్సలిన్ వేసి తరువాత నిప్పులు నోట్లో పెట్టింది. వీణ తల్లి వైపు చూస్తూ తృప్తిగా పాలు తాగసాగింది.
శాము లోపలికొచ్చి "మీరా రైలొచ్చే వేళయింది. నేను వెళ్ళి మామయ్యగారిని తీసుకొస్తాను" అంటూ వీణ బుగ్గ గిల్లటానికి దగ్గర కొచ్చాడు మీర.
"మీరు వెళ్ళండి. ఇక మిమ్మల్ని చూస్తే వీణ పాలు తాగదంతే" అంటూ కరిసింది.
శాము బయటికి వెళ్ళాడు.
మీర పాపకు పాలుపట్టి, పాలసీసా కడిగి పాపను చేతికిచ్చి "వెంకూ జాగ్రత్తగా ఎత్తుకోమ్మ. పడేసేవ్. రెండు చేతులతో గట్టిగా పట్టుకో! ఇప్పుడే పాలు పట్టావా మృదువుగా ఎత్తుకోలేకపోతే కక్కుతుంది" అని చెప్పి వూరినుండి తెచ్చిన సామానులు సర్ధడానికి లోపలికి వెళ్ళింది. వెంకు మీరా మాటలు విని తఃనలో తనే నవ్వుకుంది. తన తమ్ముళ్ళూ, చెల్లెళ్ళను చిన్నప్పటినుండి ఎత్తుకుని బాగా అలవాటు వెంకుకు. అయిదేళ్ళ పిల్లగా ఉన్నప్పుడే వాళ్ళమ్మ తనను బిడ్డ నెత్తుకో నిచ్చేవారు. కాని ఎప్పుడూ ఈవిధంగా హెచ్చరించలేదు.
పెద్ధవారి సాహసం అనుకుంటూ బయటికి వెళ్ళబోయింది.
మీర కంఠం వెనుకనుండి వినిపించింది - "వెంకూ పాపకు స్వెటర్ వేయలేదు, బయటికి తీసికెళ్ళకు".
వెంకు చాపమీద కూర్చొని బిడ్డను ఆడించసాగింది.
కృష్ణయ్యగారు, శాము ఇంట్లోకి రాగానే వెంకూ కుతూహలాని ఆపుకోలేక లేచి వచ్చింది. ప్రామ్ ని చూసి,
"ఇదెలాంటి బండి శామన్నా" అనడిగింది.
కృష్ణయ్యగారూ శామూ ఇద్దరూ నవ్వారు. శాము నవ్వుతూనే.
"ఇది కారు కాదమ్మా, పిల్లలను బయటికి తీసుకెళ్ళాలంటే ఇందులో పడుకోబెట్టి తీసుకెళ్ళొచ్చు" అంటూ వీణ నెత్తి ప్రామ్ లో పడుకోబెట్టాడు.
"ఎండగా ఉంటేకాని, వర్షమొస్తేగాని, టాపు వెయ్యొచ్చు." అని టాపు వేసి చూపించాడు. వెంకు దాన్ని చూసి నివ్వెరపోయింది. మెరుస్తున్న ముదురు ఎరుపు రంగు, చిన్న చక్రాలు లోపలున్న మెత్తటి కుషన్ వీటినంతా ఆశ్చర్యంతో చూడసాగింది.
"తరువాత ఇలా పట్టుకు ముందుకు తోసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళొచ్చు" అంటూ కాస్త దూరం బండిని తోసి చూపించాడు శాము. అతను వదలగానే వెంకు,
"శామన్నా నేనూ కాస్త దూరం తోస్తాను" అంది. ఆ బండిని హాల్లోనే అటునుండి ఇటు తోసుకుంటూ ఆనందించింది. బోరడు లోపలికి తెచ్చిన ఉయ్యాలను, మీర తమ గదిలో కిటికీకి ఎదురుగా పెట్టించి, దోమ తెర కట్టింది. వూరి నుండి తెచ్చిన సామానులు సర్దేసరికి రాత్రయింది. ఏడు గంటలకు వీణకు పాలు పట్టి పడుకోబెట్టి తరువాత భర్తకూ, పెదనాన్నకూ భోజనానికి ఆకులు వేసింది.
వీణ పుట్టుక మునుపు పల్లెలో ఒక్కో నిముషమూ ఒక్కో యుగంగా గడిచేది మీరకు. ఇపుడిహ తీరికన్న మాటేలేదు! వీణ గుడ్డలు ఉతికించి ఇస్త్రీ చేయటం, వీణని ఆడించటం, పాలు పట్టడం, సాయంత్రాలు అలా తిప్పుక రావటం, వీటితో రోజులు ఎలా గడచి పోతున్నాయో తెలియటం లేదు, వీణ నిద్రపోయేటప్పుడు మాత్రం కాస్త తీరిక దొరికేది. అప్పుడు మేజోళ్ళు అల్లుతూనో, నవల చదువుతూనో కాలం గడిపేది. కాస్సేపు చదివేసరికి వీణ నిద్ర లేచేది.
తన జీవితంలోని పెద్ద మార్పును మీర గమనించింది. పెళ్ళయిన రోజునుండి కూడా శాము మీర భార్యా భర్తలుగా ఒకే ఇంట్లో జీవిస్తున్నా, వారిద్దరి మనసులు ఎప్పుడూ ఒకటవలేదు. మోహావేశంలో, ఉద్వేగపు సమయాల్లో శాము ఎన్నోసార్లు ఆమెతో మృదువుగా, ప్రేమగా మాట్లాడే వాడు. కాని వారిద్దరి అభిప్రాయాలు, జీవితపు ఆదర్శాలూ, ఆకాంక్షలూ అన్నీ పూర్తయి భిన్న మైనవే! చీర రంగు విషయాన్నుండి, వారు ఏది తమ జీవితపు ధ్యేయ మనుకునేవారో అక్కడి దాకా అన్ని విషయాల్లోనూ వారి మనసులు విడివడి రెండు భాగాలుగానే ఉండిపోయాయి. కేవలం దైహిక ఆకర్షణవల్ల నిసర్గ నియమానికి లోనైన వేడి రక్తపు మనసులు కొన్ని మార్లు ఒకటిగా ఉండేవేకాని, వారి హృదయాలు మాత్రం ఒకటి కాలేదు. తన స్నేహితులు వచ్చిన రోజు రాత్రి శాము తనను బలాత్కారం చేయటంతో, మీరకు దైహిక సంబంధమంటేనే, తీవ్రమైన అసహ్యం, విసుగు, కోపం అనిపించింది. అప్పటి నుండి, ఆమె సాధ్యమైనంతవరకూ భర్తనుండి దూరంగా ఉండటానికే ప్రయత్నించింది. కాని ఇంద్రియాలకు దాసుడైన శాము ప్రతిసారి, తన కోర్కెను నెరవేర్చుకుంటూ, ఆమె మనసు నుండీ దూర మవసాగాడు. దూర దూర మవుతున్న రెండు హృదయాలనూ, దగ్గరకు చేర్చి, బంధించింది చిన్నారి వీణ. తనకు ఇరుపక్కలా వున్న ఇనుప ముక్కలను, అయస్కాంతం ఆకర్షించి నట్టు, శాము, మీరా, వీణ దగ్గరికి వచ్చారు. భార్యా భర్తలకు ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, తమ బిడ్డ హితం కోరే విషయంలో మాత్రం ఒకటిగానే ఉండేవారు. మిగతా విషయాలలో ఎంత విరుద్ధ భావాలున్నా, దానిని మరిపించి, దగ్గరగా వచ్చేలాగా వారిద్దరిని, తనమీది వాత్సల్యపు గొలుసుతో బంధించసాగింది వీణ.
శామూ, మీర ప్రతిరోజూ సాయంత్రం వీణను ప్రామ్ లో కూర్చోబెట్టుకుని, తోసుకుంటూ షికారు వెళ్ళేవారు. ప్రశాంతమైనచోట బండిని ఆపి ఎగిరే పక్షులకూ, తేలుతున్న సుబ్బులనూ వీణకు చూపించేవారు. ఒక్కోసారి వీణమీద వారికున్న అమితమైన ప్రేమవల్లనే దెబ్బలాడుకునేవారు కూడా.
"మీరా, జానీకి పన్నెండో ఏటనే పెళ్ళి చేసేస్తాను నేను" అనేవాడు శాము.
"నే నొప్పుకో నసలు. మీకుమాత్రం అమ్మాయిని అంత త్వరగా అత్తవారింటికి పంపాలని కోరిగ్గా ఉందా, ఏమిటి?"
"జానీని ఎక్కడికి పంపను. మనింట్లో ఉండగలిగే వాడినే వెతికి పెళ్ళి చేస్తాను. అప్పుడు జానీ, అల్లుడూ, వారి పిల్లలూ అందరూ మనింట్లోనే ఉంటారు."
"నాకేమో వీణకు పెళ్ళి చేయాలని లేదు."
"అలాగే వదిలేద్దామంటా వేమిటి కొంప దీసి?"
"ఊహుఁ మెడిసిన్ చదివిస్తాను. నా ఆశ ఎలానూ తీరలేదు. నా కూతురిని చదివించైనా ఆ ఆశ తీర్చుకుంటాను."
"నాకు జానీ ఎక్కువగా చదవటం ఇష్టం లేదు."
"నాకు దానికి తొందరగా పెళ్ళి చేసి సంసారంలో పడేయటం ఇష్టంలేదు."
వీణ కాళ్ళలోని అందెల గలగలలతో ఇద్దరి వాదన ఆగిపోయి అటు తిరిగేవారు.
ఒక్కోసారి శాము, "జానీకి చదువు మీది కన్నా, పెళ్ళి చేసుకొని సంసారం చేయటంలోనే ఆసక్తి ఉంటే....." అనడిగేవాడు.
"తనలా ఇష్టపడితే అలాగే చేయమంటారు. కాని వీణ డాక్టరవుతానంటే?......."
"వద్దనను. "నీ కెలాగిష్టమైతే అలాగే చేయమ్మా' అంటాను."
"వీణా నీకేది కావాలమ్మా?" అంటూ వీణని ముద్దెట్టుకునేది మీర.
రాత్రివేళల్లో వీణ లేచి ఏడిస్తే శాము లేచి ఉయ్యాల వూపేవాడు. ఒక్క నిముషం కూడా నిద్రను ఆపుకోలేని శాము తన ముద్దుల జానీను వూపి పడుకో బెట్టడంలో ఎనలేని తృప్తి పొందే వాడు.
