Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 37


    "పోనీ యిదివరకు అడగలేదు. యిప్పుడడుగుతున్నాను, మాట యియ్యి"
    "అరే, మళ్ళీ అదేమాట! ఏం మాట యివ్వమంటారు?" అంది కొంటెగా సుజాత.
    "తెలిసికూడా కావాలని నన్నేడిపిస్తున్నావు కదూ...." అర్దింపుగా అన్నాడు రామకృష్ణ.
    "అడగడం కూడా రాదు అబ్బాయిగారికి, ఉత్త బుద్దావతారం! ఇలాంటి మనిషి...."
    "అవును సుజాతా, నేనో జడపదార్ధాన్ని నా కీ చైతన్యం కలిగించింది నీవు. మూగగా పడివున్నవీణను శృతి చేసింది నీవే ఇంక యీ వీణని మధురంగా పలికిస్తావో, మళ్ళీ మూల పారేస్తావో నీ చేతిలోనే వుంది. నిద్రపోతున్న నా మనసుని తట్టి లేపి, 'చూడు నీ చుట్టూ వున్న ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడు' అంటూ రంగుల ప్రపంచాన్ని కళ్ళముందు పరిచిందీ నీవే, ఆ రంగుల స్వప్నం చెదిరిపోకుండా నీవే చూడాలి సుజాతా!" ఆవేశంగా అన్నాడు రామకృష్ణ.
    "అలా అని వివరంగా చెపితే తప్ప అర్ధం చేసికోలేరన్నమాట ఆ మాత్రం నా భావాలు గ్రహించలేదా యిన్నాళ్ళు...." అంటూ నవ్వుతూనే చేయి విడిపించుకుని క్రిందకి వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ వెనక్కి తిరిగి రామకృష్ణ గుండెలు కొట్టుకునేలాగ ఓ చూపు విసిరిపోయింది సుజాత.
    
                                           23
    
    సుజాతా, రామకృష్ణల వివాహం ఆ తర్వాత పదిరోజుల లోపలే కల్యాణి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగింది. పెళ్ళి చాలా హడావిడిగా ముహూర్తం పదిరోజులకి లోపులే వుందని, ఆ తర్వాత మరి యిప్పట్లో లేవని అప్పటికప్పుడు సుజాత తల్లితండ్రులకి, రామకృష్ణ తల్లితండ్రులకి టెలిగ్రాం యిచ్చి పిలిపించి, పెళ్ళి నిర్ణయించటమేమిటి, పెళ్ళి జరగడమేమిటి-అన్నీ ఆ పది రోజులలో అయిపోయాయి. పట్టుచీరెలుకొని, విందుచేసి మనంగానే జరిపించింది కల్యాణి సుజాత పెళ్ళి.
    సుజాత తల్లితండ్రుల సంతోషానికి అవధులు లేకపోయాయి. కూతురికి అంత చదువుకున్న భర్త లభిస్తాడని, అందులో కట్నంప్రసక్తి లేకుండా వస్తాడని కలలోకూడా ఊహించలేకపోయారు, వాళ్ళు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బులయ్యారు. కూతురికి రెండు జతల గాజులు, గొలుసు, పట్టుచీర మాత్రం ఖర్చు మిగతా దంతా కల్యాణే ఖర్చు పెట్టింది.
    రామకృష్ణ తల్లితండ్రులు సుజాత అందాన్ని, అణకువ చూసి ముచ్చటపడ్డారు. కానీ బొత్తిగా యే కట్నకానుకలు లేవని మనసులో మధన పడ్డారు. కొడుకు తెచ్చే కట్నంతో     కూతురి పెళ్ళి చెయ్యాలన్న ఆశతో వున్న వాళ్ళు చాలా చాలా ఆశాభంగం చెందారు. అదొక్కటే అసంతృప్తి తప్ప వాళ్ళకీ ఆనందంగానే వుంది. చెల్లెలి పెళ్ళి గురించి బాధపడవద్దని, జీతం అంతా తనకేం ఖర్చుండదు గనక వాళ్ళకే పంపుతానని అన్నాడు రామకృష్ణ.
    వాళ్ళిద్దరి వివాహం నిర్ణయం కాగానే నవ్వుతూనే ఓరోజు కల్యాణి "అసిస్టెంట్ పదవి వదిలేసి ఇల్లరికపుటల్లుడిగారు అవుతారన్నమాట, ఇంక రామకృష్ణగారు" అంది నవ్వుతూ, తన మనసులో మాట తెలుపడానికే.
    రామకృష్ణ యేం చెప్పాలో తెలియక అవస్థపడ్డాడు. పెళ్ళయ్యాక కూడా తను, సుజాత యింకా ఆ యింట్లోనే వుండాలన్న విషయానికి అతని మనసు యెందుకో అంగీకరించడం లేదు. ఆవిడెంత మంచివారయినా, తమని యెంత ఆదరాభిమానాలతో చూసినా, బొత్తిగా ఏ సంబంధము లేని ఆవిడ తమని యింట్లో పెట్టుకు పోషించడం ఎన్నాళ్ళు తాము అలా వుండిపోవడం బాగుంటుందా! రేప్పొద్దున్న తనకి పిల్లలు పుట్టుకొస్తారు; వీళ్ళందరితో తను తన సంసారం అంటూ యేర్పరచుకోకుండా ఎన్నాళ్ళని గడపగలడు! ఎంత ఆదరించినా తన ఇల్లన్నస్వతంత్రం ఎలా వస్తుంది? అలా అని ఆవిడ అవస్థచూస్తూ సుజాతని ఉద్యోగం మానమని చెప్పడానికి నోరురాలేదు. తమని అవసరంలో ఆదుకున్న ఆమెని అవసరం లేకపోయాక వదిలేయడం, అంతకంటే కృతజ్ఞత వేరే వుండదు. అలా అని కృతజ్ఞత ఎన్నాళ్ళు చూపించాలి! ఈ మాటలే ఆలోచిస్తున్న అతని మనోభావాన్ని పసిగట్టింది కళ్యాణి.
    "ఏమిటి రామకృష్ణా ఆలోచిస్తున్నావు?"
    "అబ్బే ఏం లేదండీ,.....ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకు పోషించింది చాలక, మీకిబ్బంది కలిగించమంటారా?" అన్నాడు నెమ్మదిగా.
    "ఇదిగో, నీవలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నాకేం ఇబ్బంది లేదు. సుజాత లేకుండా ఈ ఇల్లు ఒక్కక్షణం నడవదన్న విషయం నీవు గ్రహించే వుంటావు. మరి పెళ్ళిచేసుకుని నన్నిబ్బంది పెట్టదలచుకొంటే అలాగే  వెళ్ళండి" అంది కల్యాణి కాస్త బాధగా.
    ఆవిడ అలా మాట్లాడుతూంటే ఇంకేమనాలో తెలియక ఊరుకున్నాడు రామకృష్ణ. సుజాత ఏదో చెప్పాలని తాపత్రయపడింది.
    "ఏమిటి సుజా!" కల్యాణి అడిగింది.
    "ఏం లేదు, మీరు కూతురు, అల్లుడు అంటూ ఇంట్లో వుంచుకుంటాను అంటూనే ఇంకా నాకు జీతం లెక్కగట్టి యీయడానికి వీలులేదు ఇకమీదట. అందుకు మీరు వప్పుకుంటేనే! మమ్మల్ని మీరు కూతురు అల్లుడు అనుకున్నప్పుడు, నేను జీతానికి పని చేస్తానా? ఇంట్లో వుంటాను, నాకేం జీతం యీయడానికి వీలులేదు." నిష్కర్షగా అంది సుజాత.
    "ఔను ఇంట్లో వుంటూంటే మాకేం ఖర్చుంటుంది." అన్నాడు రామకృష్ణ.
    "అయితే సరే, ఇకమీదట మా అసిస్టెంట్ గారి హోదాతోపాటు జీతం కూడా మార్చుతున్నాను. రామకృష్ణా, నీ వింకే ఉద్యోగమూ ప్రయత్నించకు. ఇక్కడే వుండి పో. నీ ప్రాక్టీసుకి కావలిస్తే నా నర్సింగ్ హోమ్ వాడుకో. నేనో ఐదువందలు ఇస్తాను. నీకు ఓపిక వుంటే ఇంకా బాగా స్వంతంగా కేసులు తీసుకో. నీవు ఎటెండ్ అయే కేసులకి, ఆ డబ్బు నీవే తీసుకో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS