Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 37


    ఒక స్త్రీ ఉండవలసిన చోట ఇద్దరు పురుషుల్ని చూసి తన సుధ అదే రాణి ......దూరం నుంచి తిరిగి పోదు గదా?
    ఇంతకాలం తనకు అశ్ర్రయం ఇచ్చిన ఆ బెంచీయే తనకు భూమిలోకి దించేస్తున్నట్టు బాధపడ్డాడు ముకుందం.
    ఈ పానకంలో పుడకగాడు కదిలేలా లేడు. ముకుందం అతని వైపు కొరకొరా చూశాడు. నిమిషంలో తాను రాక్షసుడు కానందుకు , ఆ యువకుడ్ని అమాంతం మింగేయలేనందుకు బాధపడ్డాడు.
    ఆ యువకుడు కూడా మాటిమాటికి గడియారం చూసుకుంటూ బెంచీ మీద అశాంతిగా కదలసాగాడు. ముకుందం వైపు మధ్య మధ్య చురచురా చూడసాగాడు.
    ఆరున్నర అయింది. ఇంకా రాదెం తన రాణి? కాని ఎలా వస్తుందిక్కడకు? దూరం నుండే చూసి వెళ్లిపోయిందేమో?
    "ఒక్కసారి తోటంతా తిరిగి వస్తే ? వంటరిగా నిరాశాతో ఎవరి కోసమో వెతుకుతున్న తన రాణినే గుర్తించలేడా?
    ముకుందం అక్కడ్నుంచి కదిలాడో లేదో ఆ యువకుడు పీడా విరగాడయ్యినట్టు నిట్టూర్చాడు. ముకుందానికి అతన్ని చీమల మర్రికి కట్టాలనిపించింది. చుట్టూ కలియ చూస్తూ పబ్లిక్ గార్డెన్ లో నడుస్తున్న ముకుందానికి అల్లంతదూరంలో ఒక అమ్మాయి - చెంపకు చేరడేసి కళ్ళతో , కోడె త్రాచులాంటి జడతో, పచ్చని శరీరచ్చాయతో , అధునాతన వేషంలో, ఎవరి కోసమో వేదుకుతూన్నట్టు చూస్తూ వయ్యారంగా నడచి రావటం కనిపించింది.
    ఆమెను చూడగానే ముకుందానికి ప్రాణం లేచి వచ్చింది. ఇంకా అనుమానం ఎందుకు? ఆ అమ్మాయి తన సుధే! ఆ పెద్ద పెద్ద కళ్ళలో యెంత కుతూహలాన్ని నింపుకొని తనకోసం వెతుకుతోందో? ఇంకా   సందేహమెందుకు ?
    గబగబా ఆమెకు ఎదురెళ్ళి నిల్చున్నాడు ముకుందం. హృదయంలోని అనురాగ రసాన్ని కళ్ళతో కురిపిస్తూ బొంగురు పోయిన కంఠంతో "సుధా!" అన్నాడు.
    ఆ అమ్మాయి బిత్తరపోయి చూసింది.
    "నేను సుధా .........నేను నీ అభిమాన ........."
    "షటప్ ఇడియట్!"
    ఎవరో వీపు మీద లాగి తన్నినట్టయింది ముకుందానికి.
    ఇంతలో వెనుక నుంచి "హలో ! వసూధ ఆలస్యం అయింది కదూ?" అంటూ ఓ అందమయిన యువకుడు ఆ అమ్మాయి దగ్గర కొచ్చాడు.
    ముకుందం మూర్చ తేరుకొనే సరికి యా అమ్మాయీ ఆ యువకుడూ పది గజాల దూరంలో నిల్చొని కనిపించారు. ఆ అమ్మాయి ఆ యువకుడితో ఏదో చెబుతోంది. అతను ముకుందం కేసి చూశాడు. ముకుందానికి ప్రాణాలు ఎగిరిపోయినట్లయింది.
    దేహశుద్ది జరిగేలా గుంది. అతని ముందు తనెంత మనిషి? పిట్టంత మనిషి? పరుగూ నడకా కాని వేగంతో ముకుందం తన బెంచీ దగ్గర కొచ్చి పడ్డాడు. చేతులకు పట్టిన చెమటను కర్చిపుతో తుడుచుకున్నాడు.
    "ఏమండీ! ఏదో పులి కనిపించినట్టు అట్టా గాబరాగా పరుగెత్తుకొచ్చారు ?" అడిగాడు బెంచీ మీద యువకుడు నవ్వుతూ.
    అబ్బే! ఏం లేదే,  అసలేం చూడందే?" గాబరాగా ఏదో అనేశాడు. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ ముకుందం.
    "ఏమీ లేకపోవడం ఏమిటి? వంటరిగా ఉన్న ఆడపిల్లనైనా కదిలించి చూశారా ఏమిటి?" అన్నాడు వస్తున్న నవ్వును ఆపుకుంటూ ఆ యువకుడు.
    ముకుందం ముందు తెల్లపోయాడు.
    "{అయితే మీరు నన్ను యెందుకు వెంటాడుతున్నట్లు?" తేరుకొని విసుగ్గానే అడిగాడు ,ముకుందం.
    "మిమ్మల్ని నేను వెంటాడటం ఎమిటండోయ్?"
    "మరి లేకపోతే మీకెట్లా తెలిసింది ?"
    "ఓ అదా ! మీ వాలకం చూసి అనుకున్నాను లెండి. అయితే నిజమేనన్నమాట?"
    అసలే ముకుందం ముఖం చిన్నది. తోటివాళ్ళు చిన్నప్పుడు దమ్మిడీ ముఖం గాడు అనేవాళ్లు. ఆచిన్న ముఖం మరీ చిన్నది అయింది. ఆ ముఖం చూస్తుంటే , ఆ యువకుడికి జాలి వేసింది.
    "బాధ పడకండి, ఇలాంటివి కుర్రాళ్ళ జీవితంలో అప్పుడప్పుడు జరుగుతూంటేనే అందం అదే వైవిద్యం" అన్నాడు ఆ యువకుడు.
    "నేను అలాంటి అల్లరి చిల్లరి వాణ్ణి కాదండీ!" గుటకవేశాడు ముకుందం.
    "అది కాదండీ! అసలు విషయం ఏమిటంటే ?" మళ్ళీ గుటక అడ్డం వచ్చింది.
    ఆ యువకుడికి ముకుందాన్ని చూస్తుంటే సరదాగా వుంది.
    "ఆగిపోయారేం? చెప్పండి !" అన్నాడు.
    "అసలు విషయం ఏమిటంటే నేను ఒక అమ్మాయిని కలుసుకుందామని వచ్చానండీ, ఇక్కడే ! ఈ బెంచీ మీదే కలుసుకోవాలనుకున్నాం. చిక్కల్లా ఇంతకుముందు ఆ అమ్మాయిని నేను చూడలేదు."
    ఆ యువకుడు ఆలోచనలో పడ్డాడు.
    "మీరు నాకంటే ముందే ఇక్కడకొచ్చి కూర్చున్నారు. అందుకని.......?"
    కొంచెం ఆగి "అయితే మీరు యెదురు చూస్తుంది సుధారాణి కోసమేనా?" అడిగాడు ఆ యువకుడు.
    ముఖం తెల్లబోయి చూశాడు. ఇతనికెలా తెలిసిందబ్బా! తన విషయం తెలుసుకొని అన్నను సుధారాణి పంపలేదు గదా ! ముకుందం గుండెలు దడదడ కొట్టుకొన్నాయి.
    "మీరు అనురాధ.......?"
    ముకుందం యెగిరిపడ్డాడు.
    "కాదు.........ఆఁఅవును.......కాదు........"
    "అవునూ .......కాదు ..........యందుకంత గాబరా పడతారూ ? మీరు అనూరాధ......."
    "కాదండీ ! అనూరాధ అన్నగారిని ......." అనేశాడు ముకుందం నాలుక్కు అతుక్కుపోతున్న అక్షరాలను బయటకు బలవంతంగా నెడుతున్నట్టు.
    ఆ యువకుడు ముకుందం ముఖంలోకి గుచ్చి గుచ్చి చూశాడు ముకుందం అశాంతిగా కదిలాడు.
    "ఓ భగవంతుడా! యెలాగయినా ఈ గండం నుంచి బయట పడేయ్!" అనుకున్నాడు ముకుందం.
    "అయితే మీరు అనురాధ.........." ముకుందం మళ్ళీ ఉలిక్కి పడటం చూసిన ఆ యువకుడు ముసి ముసిగా నవ్వుకొన్నాడు.
    "మీరు సుధారాణి అన్నగారా?" యెలాగో అడిగాడు ముకుందం అతని నవ్వు ముఖం చూసి.
    "కాదు ........"
    "మరి ప్రియులా?" వళ్ళు మండిపోయి అడిగాడు ముకుందం.
    "కాదు" అన్నాడు చిరునవ్వుతో.
    "అయితే ఆమె మీకేమవుతుంది?" ధైర్యంగా అడిగాడు ముకుందం.
    "నా పేరు సుధాకర్."
    "నీ పేరేవడికి కావాలి ? సుధకు నువ్వేమవుతావో చెప్పి ఏడవక?" మనసులోనే అనుకున్నాడు ముకుందం.
    "నా పెన్ నేమ్ అంటే కలం పేరు......"
    "మీరు కధలు రాస్తారా?" ఆశ్చర్యంగా అడిగాడు ముకుందం .
    "అబ్బే నాకు కధలు రాసేంత ఓపిక లేదండీ ?"
    "ఏడ్చావ్ ! ఓపిక లేదంట ఓపిక. రాయటంరాదని ఏడవకూడదూ. కవిత్వం యేడుస్తాడులా వుంది" అనుకోని "మరి కవిత్వం రాస్తారా ?" అని అడిగాడు.
    "కవిత్వమే? బాబోయ్ ! ఆ పేరంటేనే నాకు భయం!"   
    "మరి పెన్ నేమ్ దేనికయ్యా?" ఈసడింపుగా అడిగాడు ముకుందం.
    "కధలూ కవిత్వం రాసేవాళ్ళకు ఉత్తరాలూ రాస్తుంటాను. అది నా హాబీ!"
    "ఏడవలేకపోయావ్!" అనుకున్నాడు ముకుందం కసికసిగా.
    "ఇంతకూ మీ కలం పేరు చెప్పారు కాదు " ఎగతాళి ధ్వనించే కంఠంతో ప్రశ్నించాడు ముకుందం.
    "సుధారాణి" అంటూ ఆ యువకుడు ముకుందం కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూశాడు.
    "ఆఁ" అంటూ తెరచిన ముకుందం నోరుమూత పడటానికి మూడు నిమిషాలయినా పట్టి వుంటుంది.
    "ఉత్తరాలు రాయటానికి అడపేరు యెందుకు?"
    "కొందరు మగవాళ్ళు అడపేరు పెట్టుకొని కధలేందుకు రాస్తున్నారూ ?" సాగదీస్తూ అన్నాడు ఆ యువకుడు కొంటెగా.
    మరు నిముషంలో యెలా చేరుకున్నాడో పబ్లిక్ గార్డెన్ గేటులో వున్నాడు ముకుందం.
    యెదురుగా వున్న క్లాక్ టవర్ ముకుందాన్ని పరామర్శిస్తూన్నట్టు ఏడు కొట్టింది.
    క్లాక్ టవర్ బద్దలు కొట్టాలని పించింది. పక్కగా పోతున్న గేదెను మోచేతితో పొడవాలని పించింది. ఎలక్ట్రిక్ స్థంభానికి వళ్ళు రుద్దుకుంటున్న కుక్క మీదకు రాయి విసరాలని పించింది. జుట్టు పీక్కోవాలని పించింది. ఏడవాలని పించింది.
    కొత్త బూట్లు శబ్దం చేసుకుంటూ వడివడిగా నడుస్తున్న ముకుందం చెవుల్లో తన వెనక నుంచి ఆ యువకుడు నవ్విన నవ్వు యింకా వినిపిస్తూనే వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS