Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 37


    వారితో కలిసి ఉంటే వేటాడవలసిన పనిలేదు. ఆత్మరక్షణ గురించి అనుక్షణం ఆలోచించే పనిలేదు. అందునించి అలజడులు తగ్గినాయి. శారీరకమయిన శ్రమకూడా తగ్గిపోయింది.
    మొత్తంమీద అతనికి బలహీనమయినా, శారీరకస్థితివల్ల మరొకరి సాయాన్ని అందుకోవటం, అందులో సుఖాన్ని అనుభవించటం అలవాటయింది.
    అదే కావాలనిపించింది. మరొకరి శ్రమతో తాను సుఖించడమనే నాగరిక లక్షణం అతనికి ఏర్పడింది. అది కారణంగా అతడువారిని అనుసరించిపోవటం ప్రారంభించాడు.
    తనదయిన ప్రకృతి వదనంనుంచి జనావాసాలకు దగ్గరగా వారితోపాటు పయనంసాగించాడు. మూడురోజులు రాత్రింబవళ్ళు ప్రయాణం అనంతరం ప్రప్రధమంగామరొక పల్లెటూరు ప్రవేశించారు.
    అది నేపాల్ సరిహద్దులలో ఓ కుగ్రామం. అక్కడ మొదటిసారిగా తనలాంటి అనేకులు కలిసి మెలిసి జీవించటం చూచాడు అర్ధమానవుడు. అతనికి అదొక అపురూమయిన అనుభవమయింది. ఆస్థితిని పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయినా మొత్తం మీద ఆ వినూత్న అనుభవానికి స్వాగతం పలికాడతడు.
    కెప్టెన్ మాలతి అతనికి కొన్ని మాటలు నేర్పింది. ఉచ్చారణలో తాళాలున్న అక్షరాలను పలకగలుగుతున్నాడతడు. వారి వెంట నడుస్తున్న అతని వేషధారణచూసి గ్రామీణులు అబ్బురపడ సాగారు.
    నేరుగా అతనిని నగరాలకు తీసుకుపోవటం అంత క్షేమాకరమయిన పని కాదని గ్రహించింది మాలతి. ఒక గ్రామంలో గ్రామీణులతో మాట్లాడి ఊరికి వెలుపలగా ఉన్నా ఒక కుటీరాన్ని తీసుకుంది.    
    ఇక్కడ మనం ఎంతకాలం ఉండవలసివస్తుందని ప్రశ్నించాడు ఫిజో. మాలతి బాగా ఆలోచించి చేయవలసిందంతా నిర్ణయించి చెప్పింది.
    "ఫిజో! ఈ ప్రకృతి పుత్రుడు హఠాత్తుగా నగరాల మధ్యకు వస్తే ఆ వాతావరణాన్ని యిముడ్చుకోలేక పోవచ్చు. ఏమయినా మనః ప్రకోపాలకు అతడు గురి అయితే సముదాయించేందుకు మన శక్తి చాలకపోవచ్చు.
    ఒక మంచిపని చేసేందుకు మనం ఒక ప్రయోగాన్ని చేపట్టాం. ఏదయినా కారణాలవల్ల అది తిరుగబడితే చాల ప్రమాదకరమయిన పరిస్థితుల్ని మనం ఎదుర్కోవలసి వస్తుంది.
    అందునించి ముందుగా ఒక వరం రోజులపాటు యిక్కడే ఉంటాం. ఆ పైన మనుష్యులమధ్య అర్ధమానవుడి ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించాలి. వారి ప్రవర్తనపట్ల యితనిలోంచి వచ్చే ప్రతి స్పందనలు ఎలా ఉంటాయో అర్ధంచేసుకోవాలి.
    అతని మనఃస్థితి గురించి ఒక అంచనాకు రావాలి.
    ఆ తరువాతనే యిక్కడినించి నగరాలవైపు పురోగ మించటం" అని చెప్పింది కెప్టెన్ మాలతి.
    ఆమె చెప్పిన దానిలో తన గురించిన సందర్భమేదీలేక పోవటంతో విచిత్ర స్థితిలో పడిపోయినాడు ఫిజో? సందేహంతో తలమునకలయినాడు.
    "కెప్టెన్! అనుకున్న ప్రకారం మన ప్రయాణం సాగలేదు. మనతో వచ్చిన బృందమంతా పిరికి పందలయి పారిపోయినారు. సిన్హా, గోయెల్, కుట్టి అంతా - ఇలాంటి వారితో సాహసోపేతమయిన పనులు పెట్టుకోవటం మంచిది కాదు.
    వారు వెళ్ళిపోయిందికాక మీరు ప్రమాదంలో పడిపోయారు. మీతోపాటు ఉన్నందుకు మిమ్మల్ని మళ్ళీ చూడ గలిగాను. మీలాంటివారి నాయకత్వంలో పనిచేయటం నిజంగా నా అదృష్టమే అనుకుంటున్నాను.
    అయితే మంచి అవకాశం ఈ పర్యాయం జారిపోయింది. మరొక మారు యిటువంటి పర్వతారోహణ గురించిన కార్యక్రమాలు ఏవయినా రూపొందిస్తే నేను మీ వెంట ఉండాలని ఆశిస్తున్నాను.
    అలా ఉండగలిగితే అది నా అదృష్టంగా భావిస్తాను. అందునించి ఈ పర్యాయం మీరు ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు నాకు ముందుగా వర్తమానం పంపాలి.
    నేను ఎన్నో బృందాలకు సాయంగా అడవులు కొండలవెంట తిరిగాను. కానీ మీతో కలిసి పనిచేసిన ఈ కొద్ది రోజులు నాకు అపూర్వమయినవి.
    మీ నాయకత్వాన్ని చిరకాలం గుండెల్లో దాచుకుని పవిత్రంగా స్మరిస్తాను. ఇలాగే అడవులు కొండల వెంట తిరుగుతూ ఎప్పుడో ఎక్కడో రాలిపోతాను.
    అలా జరిగితే ఎప్పుడయినా ఈ దీనుడిని స్మరించటం మాత్రం మరచిపోకండి." అంటూ అంతటి ధైర్యశాలి అయిన ఫిజో చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నాడు. కంఠం గద్గదిక మయిపోయింది.
    అతడు మనఃపూర్వకంగా వినయ విధేయతల్ని వ్యక్తపరుస్తూ చేతులు జోడించి కెప్టెన్ పట్ల తన గౌరవాన్ని ప్రగాఢ మయిన సహానుభూతిని వ్యక్తీకరించాడు.
    అతడి మనోగతాలను అవగతం చేసుకున్న కెప్టెన్ మాలతి మనసు మంచులా కరిగిపోయింది.
    అమిత బలశాలి, అమిత ధైర్యశాలి, అమిత అనుభవశాలి. అటువంటి వ్యక్తి తనను యింతగా గౌరవించడం ఆరాధించడం ఆమెకు అమితానంద కారణమయింది.
    ప్రాణాపాయమయిన పరిస్థితుల్ని ఎదిరించి తనకోసం నిలిచినా ప్రాణాధిక మిత్రుడు. అటువంటి వ్యక్తిని దూరం చేసుకుంటే జీవితంలో యింక ఆ లోటు తీరనిదే అనిపించింది కెప్టెన్ మాలతి.
    "ఫిజో యిదంతా ఎందుకు చెప్తున్నావు. నీవుచెప్పే వీడ్కోలు వింటే నామనసు దుఃఖ సాగరమవుతోంది. మిత్రుల కోసం ప్రాణాలయినా అర్పించేందుకు సిద్ధుడవు కాగలిగిన మహా మనస్వివి నీవు.
    నీవు తిరిగి వెళ్ళిపోతే నా జీవితం ఎన్నటికీ కొరతగానే ఉండిపోతుంది. నీవు కొంతకాలం కనీసం ఈ అర్ధమానవుడి గురించి నేను చేస్తున్న ఆలోచనలు ఒక దారికి వచ్చేంతవరకయినా నీవు నాతో పాటుగా ఉండాలి. హఠాత్తుగా నీవంటి మిత్రుడు విడిచిపోతే నేను భరించలేని బాధకు గురిఅవుతాను.
    మనసు ఎడారిలా అవుతుంది.
    ఎప్పుడయినా ఎక్కడయినా రాలిపోతే జ్ఞాపకం పెట్టుకోమని నీవు అడుగుతున్నావు. మన జీవితాలు ముగిసేదాకా, యిలాగే ఆప్యాయతను అభిమానాన్ని పంచుకునే మిత్రుల లాగా కలిసి జీవిద్దాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS