Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 37


    లోపలకు వచ్చిన కనకయ్య "సాంబయ్యగారూ? నిద్రపోయారా ఏమిటి? పడుకోండి! పడుకోండి! మళ్ళీ వస్తాలే!" అంటూ మంచం పక్కనే నిలబడ్డాడు.
    ఎవరూ? కనకయ్యా! నిద్రా లేదు. పాడూ లేదు. రావయ్యా రా! కూర్చో!" అంటూ లేచి కూర్చున్నాడు సాంబయ్య.
    సాంబయ్యను చూస్తూనే కనకయ్య నోరంతా తెరచి క్షణకాలం చూస్తూ వుండిపోయాడు.
    "ఏమిటి సాంబయ్యా? అలా ఉన్నావేం? ఏమయింది? వంట్లో బాగుండటం లేదా?" అన్నాడు కనకయ్య.
    "ఆఁ బాగుండక పోవటం ఏమిటిలే? మూన్నెల్ల క్రితం ఓ వారంరోజులు పడక పెట్టాను. అప్పట్నుంచీ ఏదో నలతగానే ఉందయ్యా!"
    "మెల్లగా అంటావేమిటి? ఏనుగులాంటి మనిషిని ఎట్టా అయిపోయావో తెలుసా? నాతో రండి! బస్తీలో మా అబ్బాయికి తెలిసిన ఒక పెద్ద డాక్టరు ఉన్నాడు. ఆయనకు చూపించుదాం!" కనకయ్య తన ఆదుర్దానూ, ఆపేక్షనూ, పెద్ద మోతాదులోనే చూపించాడు.
    "ఈ మాత్రం దానికి బస్తీలూ, డాక్టర్లూ దేనికయ్యా? ఆచారి చెయ్యి చూసి అతి ఊష్ణం అన్నాడు. నాలుగు వారాలు పోతే మళ్ళీ మామూలు మనిషి ఆవనూ?" బింకంగా అన్నాడు సాంబయ్య.
    సాంబయ్య గుండె నిబ్బరం, మొండితనం కనకయ్యకు కొత్తేం కాదు. సాంబయ్యను పరిశీలనగా చూసి "సాంబయ్యా? నీ వయస్సెంత ఇప్పుడు?" అని అడిగాడు. అలా ఎందుకడిగాడో కనకయ్యకు సరిగా తెలియదు.
    "నా వయస్సా?" సాలోచనగా అంటూ సాంబయ్య కనుబొమలు ముడివేశాడు.
    "అరవై దాటలా?"
    "ఎందుకు దాటలా? దాటేవుంటాయ్!"
    "అట్లా చెప్పు! వయస్సు బాబూ వయస్సు! వయసు మళ్ళాక వెనుకటి ఓపిక ఇంకా ఎందుకుంటుంది లే?" ఇహ నీపని అంతే అని స్ఫురించేట్టు అన్నాడు కనకయ్య.
    సాంబయ్య పైకి తేలిగ్గా నవ్వేశాడు. కాని అతని గుండెల్లో వృద్ధుడి గుండెపోటు చప్పుళ్ళు విన్పించాయి.
    "పైకం తెచ్చావా? ఏం, ఇంతాలాస్యమైందేం?" అడిగాడు సాంబయ్య.
    "ఇదిగో వద్దాం, అదుగోవద్దాం అనుకొంటూనే వున్నా కాని తీరికెక్కడిది? ఒకటి వదిలించుకుంటే మరొకటి తగులుకుంటుంది."
    "అవునూ! నువ్వు చిన్నకారు కొన్నావా?"
    "నేనా! చిన్నకారా?" ఆశ్చర్యపోయినట్టు కన్పించడు కనకయ్య.
    "మరేంటి ఊళ్ళో అత్తా చెప్పుకుంటున్నారేం?"
    "ఓహో! అదా? మీ కొడుకూ, కోడలూ రావటానికి కారు కావాలంటే మాట్లాడాను. ఆ రోజు మనూరి రాంసుబ్బయ్య నేను బస్సులకడ నిల్చోటం చూసి అడిగాడు. కొన్నాలేవయ్యా! నాదే కారు! అన్నా ఆ మాట అప్పుడే పాకిందన్న మాట ఊరంతా? తస్సాదియ్యా! ఏం ఊరు? ఏం కత?"
    సాంబయ్య ఆ తర్వాత కనకయ్య చెప్పింది విన్పించుకోలేదు. ఈ కనకయ్య గాడేనన్నమాట వాళ్ళకు కారు మాట్లాడి ఊళ్ళోకి పంపించింది? అసలు వాడే ఇచ్చి వుంటాడు ఈ సలహా.....సాంబయ్యగారి కోడలనీ-బలరామయ్యగారి కూతుర్నీ బస్సులో వెళ్ళటం ఏమిటనీ...
    ఇంకా సాంబయ్య ఆలోచనలు అలా సాగుతుండగానే, కనకయ్య సంచిలో నుంచి తీసి ముందు పెట్టిన నోట్ల కట్టలమీద సాంబయ్య దృష్టి పడింది.
    డబ్బు లెక్క పెట్టిన సాంబయ్య కనకయ్యను చిరాగ్గాచూసి "సగమే తెచ్చావేంటీ? మిగతాది ఎప్పుడిస్తావ్?" అన్నాడు.
    "సగమేమిటి సాంబయ్యా? ఇది ఐదువేలు. మూడు నెలల క్రితం ఇచ్చింది ఐదూ-మొత్తం పడవలా? ఆ మాటముఫ్ఫైఏడూ వడ్డీ! సరిపోలే లెక్కా?" అన్నాడు కనకయ్య.
    సాంబయ్యకు కనకయ్యను గుండెలమీద తన్నాలన్నంత కోపం వచ్చింది. వెనకటి ఓపిక వుంటే అంత పనీ చేసేవాడే.
    "ఎవడికిచ్చావూ? ఎప్పుడిచ్చావయ్యా ఐదువేలూ?" ఓపికకొద్దీ అరిచాడు సాంబయ్య.
    "అదేమిటి సాంబయ్యా? మీ అబ్బాయి చెప్పలా? మీ కోడలూ కొడుకూ వారం రోజులపాటు బస్తీలో ఉన్నారు చూడండి. అప్పుడు వెంకటపతే స్వయంగా వచ్చి చాలా అవసరం అని అడిగితే ఇచ్చాను. ఆ సంగతి మీవాడు చెప్పనేలేదా? ఇంట్లోనే వున్నాడుగా, పిల్చి అడగండి." కనకయ్య కూడా గొంతు పెద్దది చేసుకొనే చెప్పాడు. సాంబయ్య నిర్ఘాంతపోయాడు. ఆయన కొడుకు పిల్చేలోగా కనకయ్యే వెంకటపతిని కేక వేశాడు.
    వెంకటపతి చలవచేసిన తెల్లటి బట్టలు వేసుకొని, బూట్లు ధ్వనిచేస్తూ, తండ్రి ముందు కొచ్చాడు.
    "డబ్బు తీసుకొన్న సంగతి మీ నాన్నకు చెప్పలేదా?" నిలదీసి అడిగాడు కనకయ్య. వెంకటపతి మూగపశువులా నిలబడ్డాడు.
    "ఏం చేశావురా ఆ డబ్బూ?" సాంబయ్య గద్దించి అడిగాడు.
    "ఖర్చయిపోయిందిలే!" మంచినీళ్ళు తాగినంత తేలిగ్గా చెప్పాడు వెంకటపతి.
    "ఐదువేలు! ఏం ఖర్చు పెట్టావురా? పెళ్ళాని కిచ్చావా? మామ కిచ్చావా?"
    ఇంట్లో ఏ గిన్నో పళ్ళెమో ఎత్తికొట్టిన శబ్దమై ఉలిక్కిపడ్డాడు కనకయ్య. సాంబయ్య కళ్ళు చింతనిప్పుల్లా మెరిశాయి.
    ఇంతలో 'పఁయ్!" 'డుక్క్!' 'డుక్క్!' అని ధ్వని చెఉస్కుమ్తో చిన్నకారు వీధి మలుపు తిరిగి సాంబయ్యగారి వాకిలి ముందు కొచ్చింది. దాని వెనకే పిల్లలు కేరింతలుకొడ్తూ రొదచేస్తూ పరుగెత్తుకొచ్చారు. డ్రైవర్ పిల్లల్ని గదమాయిస్తున్నాడు. సాంబయ్యగారి ఇంటిముందు కొచ్చి కొంచెంసేపు పెద్దగా ధ్వనించేసి ఆగిందాకారు.
    "ఏమిటి మేళాం?" సాంబయ్య కనకయ్యను గుర్రుగా చూస్తూ అడిగాడు.
    "అబ్బే! నాకేం తెలుసూ? నేనూ అదే చూస్తున్నా!" అంటూ కనకయ్య లేచి డ్రైవర్ను కేకవేసి పిలిచి అడిగాడు.
    "ఒరేయ్? పాపారాయుడూ? ఎవరు తెమ్మన్నారా కారూ?"
    "వెంకటపతిగారే కబురంపారు" అన్నాడు డ్రైవరు.
    సాంబయ్యా, కనకయ్యా వెంకటపతికేసి చూశారు.
    "ఆఁ నేనే తెప్పించా! అదే! అదే! డాక్టరుకు చూపించాలని!" వెంకటపతి మాట అతికీ అతక్కుండా అన్నాడు.
    "నా కెందుకురా డాక్టరూ?" సమబయ్య కొడుకు ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు.
    సాంబయ్యకు లోలోపల ఆనందం కలక్కపోలేదు. కొడుకు తనకు మాట మాత్రమైనా చెప్పకుండా తనను బస్తీకి తీసుకెళ్ళి డాక్టరుకు చూపించే ప్రయత్నంలో వున్నాడు. తనమాటే వాడికి మనసులో ఎంత ప్రేమ లేకపోతే ఈ పని చేస్తాడు? అంటే ఇన్ని రోజులనుంచి తన ఆరోగ్యం బాగా లేదని వాడూ బాధ పడుతున్నాడన్నమాట? వాడు వట్టి అమాయకుడు. నోరులేనివాడు. అంతే! ప్రేమలూ ఆపేక్షలూ ఎక్కడకు పోతాయి? తనకు ముందే చెబితే పడనీయడని వాడికీ తెలుసు. అందుకే ఉట్టుడియంగా ఇంత పని చేశాడు. అయినా వాడి పిచ్చి కాకపోతే తనకు బస్తీ డాక్టర్లెందుకూ? ఈ కారెందుకూ? అంతగా బస్తీకి వెళ్ళాలంటే తమ సవారి బండి లేదూ? అంతగా అయితే బస్ లేదా? వాడికి ఉండేదీ పోయేదీ తెలియదు. అది చూసుకొనే కోడలు వాడిచేత డబ్బు తగలేయిస్తూంది. సాంబయ్యకు చటుక్కున వెంకటపతి కనకయ్య దగ్గిర ఐదువేలు తీసుకొన్న సంగతి గుర్తొచ్చింది. అప్పటికి కొడుకుల మీద ఏర్పడ్డ సదభిప్రాయంతో కొడుకును కనకయ్యముందు దుపలడానికి వెనకాడాడు.
    "ఇంకా ఆలోచనెందుకయ్యా? లే! బయలుదేరు. కొడుకు చిన్నకారు  తెప్పించి ఇంటిముందు వుంచితేను!" సాంబయ్యను కనకయ్య ఉషారెక్కిస్తుండగా, బుచ్చమ్మ పెట్టెలుతెచ్చి క్లీనర్ కు అందించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS