Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 37


                                     శ్రీశ్రీ - శ్రీశ్రీ భార్య - నేను
    
    చిత్రానికి శ్రీశ్రీగారు పెట్టిన పేరుని ప్రొడ్యూసర్లతో చెప్పాను. వాళ్ళు పొంగి పోయారు.
    "బ్రహ్మాండంగా వుందండీ శ్రీశ్రీగారూ! సాయంకాలం వెళ్ళేముందు చెప్తానని ఇప్పుడే చెప్పేశారే" అన్నారు.
    "అయిడియా ఇచ్చింది సరోజేనండీ. నిజానికి ఈ టైటిల్ మేం ఇద్దరం కలసి పెట్టామంటే న్యాయంగా వుంటుంది" అన్నారు.
    వారి అమాయకత్వానికి, సత్యసంధతకి నాకు నిజంగానే వారిమీద జాలి వేసింది 'వీరుడు' అన్న పేరు ముందు పిక్చర్ కి పెట్టింది వారేకదా! దీనికి కూడా ఏదైనా 'వీరుడ'ని తగిలించండి - అన్నాను. అంతే! ఆ మాత్రం దానికి ఇంత గొప్పగా చెప్పాలా?
    ఇంకొకరైతే అసలా మాట బైటకి రానిస్తారా? ప్రొడ్యూసర్లు వెళ్ళిపోయాక "పానకంలో పుడకలా మధ్య నా పేరెందుకు ఎత్తారండీ" అన్నాను. అయన ఏం సమాధానం ఇవ్వలేదు.
    "మధ్యాహ్నం  మళ్ళీ వస్తామ"ని ఇళ్ళకి బయలుదేరాం.
    సినీ ప్రపంచంలో, 'ఆ అమ్మాయి అదృష్టవంతురాలు. శ్రీశ్రీగారి దగ్గరికి వచ్చిన వేళా విశేషం మంచిది. ఆయనకి బాగా పిక్చర్లు వస్తున్నాయ"ని అందరు అనుకోవటం ప్ర్రారంభించారు. ఈనోటా ఆనోటా వచ్చే ఆ మాటని చివరికి నాతోనే అనసాగారు.
    
                           *    *    *
    
    మైసూరు ప్రయాణం నిశ్చయమయ్యింది. టిక్కెట్లు బుక్ చెయ్యాలి.
    "మా ఆవిడ వస్తోంది గనక మీ అమ్మగార్ని వుంచేసి నువ్వురా" అన్నారు శ్రీశ్రీగారు.
    "మా నాన్నగారు ఒప్పుకోరండీ. అమ్మ రాకుండా నేనూ రాలేన"న్నా.
    "మా ఆవిడొచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంద"న్నారు. నేను ఆశ్చర్యపోయాను.
    
                           *    *    *
    
    "శ్రీశ్రీగారి భార్య మన యింటికొచ్చి మైసూరు ప్రయాణం గురించి మాట్లాడతారట" అని నాన్నగారితో చెప్పాను.
    "మాట్లాడ్డానికేం వుంది? మీ అమ్మ ఎలాగూ నీతో వుంటుంది. ఆవిడ కూడా వస్తున్నారంటే మరీ మంచిద"ని నాన్నగారన్నారు.
    "ఆవిడ వస్తున్నారు కనక అమ్మని వద్దంటున్నారు. ఆ విషయం మాట్లాడడానికే ఆవిడ వస్తున్నారట" అని చెప్పాను.
    "నీ ఉద్దేశం ఏమిటమ్మా"ని నాన్నగారడిగారు.
    "అలా అడగటంలో మీ ఉద్దేశం ఏమిట"ని నేనడిగాను.
    ఇద్దరం మాట్లాడుతూండగా ఆవిడ వచ్చారు. నాకు మాత్రం ఆవిడ రాక సహజంగా  అనిపించలేదు. ఏదో కారణం వుండి వుంటుంది. లేదా వేరే ప్లానయినా అయి వుంటుందనుకున్నాను.
    ఎదురువెళ్ళి పలకరించి కూర్చోపెట్టాను. కాఫీ, టిఫిన్ ఇచ్చాను. మురిపించుకోకుండా తిన్నారు.
    "శ్రీశ్రీగారు రాలేదా" అనడిగాను.
    "కంపెనీకి వెళ్ళార"ని చెప్పారు.
    'కంపెనీకి వెళ్ళడమే నిజమైతే ఏదో స్ట్రయిట్ పిక్చర్ పాటకయివుంటుందిలే' అనుకున్నాను.
    ఆరోజు ఆవిడ ప్రవర్తనకీ - ఈరోజు ప్రవర్తనకీ సంబంధమే లేదు. కానీ చూద్దాం. తొందరెందుకని కూర్చున్నాను.
    "ఈసారి మావారితో నేనూ వెళుతున్నానండీ. ఎలాగూ నేనుంటాను కనుక మీ ఆవిడ రాకపోయినా ఫరవాలేదు. మీరేమీ భయపడక్కర్లేదు. మీ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటాను. భద్రంగా మళ్ళీ మీ కప్పగించే బాధ్యత నాది. నాతో పంపండి. ఆ విషయం మీతో మాట్లాడాలనే వచ్చా"నని మా నాన్నగారితో అన్నారావిడ.
    వాళ్ళ యింటికి వెళ్ళినప్పుడు ఆవిడ వేసిన ప్రశ్నలు, ఆడిన మాటలు నేను మరచిపోతానా? మా నాన్నగా రే మంటారో చూద్దామని ఎదురుచూస్తున్నాను.
    "సరోజని ఒక్కర్తినీఇంతవరకూ ఎక్కడికీ పంపలేదండీ. పైగా వేరే ఊరికని అంటున్నారు. దాన్ని కూడా ఓమాట అడిగిచూడండన్నారు"
    "ఏవమ్మాయి! నేనున్నానుగా! నీకేం ఫరవాలేదు. నాతో వస్తావుకదూ?" అని అడిగారు.
    "క్షమించాలి. నేను ఒక్కర్తినీ ఎక్కడికీ రానండి. మీరే స్వయంగా వచ్చి అడుగుతున్నందువల్ల మా నాన్నగారు మొహమాటపడుతున్నారు. నన్నొక్కర్తినీ పంపరు. పంపినా నేను రాను" అని కచ్చితంగా చెప్పేశాను.
    "అనవసరంగా డబ్బు వేస్ట్ కదమ్మా!" - అన్నారావిడ.
    "డబ్బుకోసం చూసుకుంటే పనులవుతాయా? మా అమ్మగారి ఖర్చులు నేనే పెట్టుకుంటాను. మీకా శ్రమ ఇవ్వను" అన్నాను.
    ఆవిడ ముఖం మాడిపోయింది "అన్నీ రెట్టింపు ఖర్చులవుతాయి" - అన్నారు. "చెప్పాను కదండీ! నన్నొక్కర్తినీ మీరు భరిస్తే చాలు. మా అమ్మ గురించిన బెంగ మీకు అవసరం లేదు" - అన్నాను.
    'దీంతో లాభంలేదురా! గట్టిపిండం' అనుకున్నారేమో, "వారితో మాట్లాడి చెప్తాన"న్నారావిడ.
    "చూడండి. నేను పనిమీద మైసూరు రెండుసార్లు వెళ్ళి వచ్చాను. ఈసారి నేనుండిపోతాను. మీరుభయులూ వెళ్ళి రండ"న్నాను.
    "నేను వస్తే నువ్వు రావాని?" అడిగారావిడ.
    "నేను రానని మీతో చెప్పలేదే. ఒక్కర్తినే రానన్నాను. మీరోస్తే నాకేమండీ పైగా నాకుచాలా సంతోషం. మీరలా మాట్లాడ్డం బాగులేద"న్నాను.
    మా అమ్మా నాన్నగార్లతో మాట్లాడి మా పుట్టుపూర్వోత్తరాలు, నివాస స్థలం మొత్తం తెలుసుకుని, "సరే - నేను వెళతానన్నా"రావిడ.
    అందరం కిందికి వెళ్ళి కారు వరకూ సాగనంపాం.
    "ఏమిటమ్మా! ఆవిడతో అలా మాట్లాడావని" నాన్నగారడిగారు.
    "సరిగ్గానే మాట్లాడాను నాన్నగారూ! మనసు విప్పి మాట్లాడిన వాళ్ళతో మనం కూడా మనసారా మాట్లాడొచ్చు. ఆవిడ తన యింట్లో నన్ను తెగ క్రాస్ చేశారు. నేను ఒక్కదానినీ ఆవిడతో వెళితే అంతేసంగతులు"....అన్నాను.
    మైసూరు ప్రయాణ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. టైం అయిన సంగతే మాకు తెలీలేదు. శ్రీశ్రీగారు వచ్చి, "రేపే మైసూరు ప్రయాణం" అన్నారు. ఆవిడ వచ్చి మాట్లాడిన వివరాలన్నీ ఆయనతో చెప్పాను.
    "మన నలుగురికీ టిక్కెట్లు రేపు బుక్ చేయిస్తాను. బట్టలన్నీ సర్దుకోండి. ఉదయం పది గంటలకి ఒకసారి కంపెనీకి వెళ్ళి వచ్చేద్దాం" అన్నారు.
    "మీరు కంపెనీకి వెళ్ళారుట".
    "అవును అక్కడినుండే వస్తూ నీకీ విషయం చెప్పాలని వచ్చాను".
    "ఏ కంపెనీకి వెళ్ళారని నేను అడగలేదు. ఆయన చెప్పలేదు.
    
                           *    *    *
    

    అనుకున్న ప్రకారం, మర్నాడు కంపెనీ వాళ్ళ ఆఫీసులో కూర్చున్నాం. శ్రీశ్రీగారు ఎందుకో వర్రీ అవుతున్నట్టు గ్రహించాను.
    "ఏమిటి అదోలా వున్నారు?" అనడిగాను.
    "ప్రయాణ విషయంలో అన్నీ సమస్యలే" అన్నారు.
    "సమస్యలకేం వుంది? నేను ఆవిడతో కూడా చెప్పాను. మీరు ఉభయులూ వెళ్ళిరండ"నన్ను.
    "అదేమిటి సరోజా! నువ్వు లేకుండా పని ఎలాగవుతుంది? తనని తీసుకెళ్ళకుండా నీతో మైసూరు వెళ్ళి వస్తున్నానని గోలపెడుతూంటే "నువ్వూ రా తీసుకు వెళతా"నని చెప్పానన్నారు.
    "చూడండి. అన్నిటికీ మనసు పాడుచేసుకుంటే లాభంలేదు. ఆవిడ వస్తానని అనడంలోనూ తప్పులేదు. మీరు తీసుకురావడంలో అంతకన్నా తప్పులేద"న్నాను.
    "సమస్య అది కాదు సరోజా! టిక్కెట్ల సంగతి....".
    "ఏం వుంది? తెప్పించండి" అన్నాను.
    "మా ఇద్దరికీ మాత్రం ఫస్టుక్లాసుట" అన్నారు.
    "మీ ఇద్దరు మాత్రమే ఫస్ట్ క్లాసులో ప్రయాణం చెయ్యాలని ఆవిడ ఉద్దేశం కావచ్చు. మనం మైసూరు వెళ్ళినప్పుడల్లా వేర్వేరు కంపార్టు మెంట్ లోనే కదా వెళుతున్నాం! ఇప్పుడూ అలాగే వెళదాం. దానికింత ఆలోచన ఎందుకు? మీ ఇద్దరి దగ్గర కూర్చోమని మీరు చెప్పినా నేను కూర్చోను.
    మాకు ఫస్ట్ క్లాస్ మీరు కొనొద్దు. కొన్నా మేము అందులో రాం మా మామూలు డబ్బా మూడవ తరగతి లేడీస్ ది వుండనే వుంది. ఎవరో ఒకరు సర్దుకోవాలి. పైగా నాకు ఆవిడలా ఇతర ఆలోచనలే వీలేవు" - అన్నాను.
    పాపం! ఒక నిట్టూర్పు విడిచారు.
    "మేము ఫస్ట్ క్లాసులో వస్తూ, మీకు థర్డ్ క్లాసంటే, నిజంగా నీకు బాధకలగలేదూ"
    "అదేమిటి? అర్ధంలేని ప్రశ్న. బాధపడటానికి నేనేమైనా మీ చుట్టాన్నా? నేను అసిస్టెంట్ పనికి వచ్చినదాన్ని - అంతే! నా స్థానం ఎంత వరకూ అన్న విషయం నాకు తెలుసు. ఆవిడతో సమానంగా తూగాలన్న ఆలోచనా, ఆశా నాకు ఏ కోశానా లేవు" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS