"తను తెలివి తక్కువగా బైటపడిపోవటం ఒకటి, రెండవది తన బుద్ధితక్కువ తనం కామినీ గ్రహించడం. కామినీ అంత నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందంటే ఫోటోలు వున్నాయని రుజువుకావటం, కామినీ ఎలా చచ్చినా తన మెడకు వురిత్రాడు పడటం ఖాయం." ఒకేసారి ఈ నిజాలు గ్రహింపుకు వచ్చేసరికి ఆవేశం పట్టలేక ఒక్కసారి లేచాడు కిరణ్ సోఫాలో నుండి. అతని రెండు చేతులూ కామినీ మెడచుట్టూ పడ్డాయి.
"చంపు ఆలస్యం ఎందుకు? నీకు ఎక్కువ రోజులుబ్రతకాలని వున్నట్టు లేదు. నన్ను చంపిన మరుక్షణం ఈ ఇంటి పరువూ మర్యాద గంగలో కలవటం మాట అటుంచి నీవు కూడా నా వెనక రాక తప్పదు కదా!" నవ్వుతూ అంది కామిని.
అప్రయత్నంగా కామిని మెడనుండి అతని చేతులు కిందకు జారినాయి. "రాక్షసీ" అన్నాడు.
"అవును రాక్షసినే! నన్ను ప్రేమమూర్తిగా స్వీకరించడం చేతకాక, రాక్షసిగా మార్చావ్. నేను రాక్షసిని కావటానికి కారణం నువ్వే. ఈ నిజంకూడా గ్రహించు. మరొకసారి చెబుతున్నాను. నా విషయంలో నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నా ఒక్కసారి కాస్త తీవ్రంగా ఆలోచించు, ఆలోచించేముందు నీ కళ్ళముందు ఖాళీ వురిత్రాడు వ్రేలాడుతూ కనిపిస్తే మాత్రం వెనకకి తగ్గు. నువ్వు నా భర్తవి కాబట్టి నీకు ఈ సలహా ఇస్తున్నాను. మైండిట్" తాను చెప్పదలచినది చెప్పి కామిని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయింది.
రెండు చేతులూ నెత్తిమీద పెట్టుకుని కూర్చున్నాడు కిరణ్.
అంతకుమించి కిరణ్ చేసేదేమీ లేదు. చెయ్యలేడు కూడానూ.
22
"లేదు డాడీ!" కిరణ్ అన్నాడు.
"లేదు డాడీ! కాదు డాడీ! ఎన్ని రకాలుగా త్రిప్పి త్రిప్పి అడిగినా నువ్వు ఒకేరకంగా సమాధానం చెబుతున్నావు. ఒకేమాట చెబుతున్నావు" రావుగారు రవ్వంత విసుగుతో అన్నారు.
మరోసారి "లేదు డాడీ!" అన్నాడు కిరణ్.
"కాస్త ఆలోచించి జవాబు చెప్పు కిరణ్!"
"ఆలోచించటానికి ఏమీలేదు డాడీ!"
"లేదో కాదో నాకు తెలియదు. ఆలోచించి జవాబు చెప్పమన్నాను. ఆలోచించి జవాబు చెప్పు అంతే."
ఒక్కసారిగా ఆ గది అంతా నిశ్శబ్దం ఆవరించింది.
కిరణ్ ఆలోచించడానికి ఏమీలేదు. ఆల్ రెడీ అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చివున్నాడు. తండ్రి ఏది అడిగినా ఒకే మాట చెబుతున్నాడు. తండ్రి తిప్పి తిప్పి అడిగినా మళ్ళీ అదేమాట. బాలెన్స్ తప్పకుండా జాగ్రత్త పడినట్టు, మాటలు కూడా తూచి తూచి ఒకే రకంగా ఒకేమాట మాట్లాడుతున్నాడు కిరణ్.
ఆ సమయంలో ఇంట్లో రావుగారు, కిరణ్ ఇద్దరే వున్నారు. ఊర్మిళాదేవి మహిళా మండలిలో ముఖ్యమైన చర్చ జరుగుతూ వుంటే అక్కడికి వెళ్ళింది. కామినీదేవి వాళ్ళ బాబాయ్ దగ్గరకు వెళ్ళింది.
అందువల్ల తండ్రీ కొడుకులు నిర్భయంగా మాట్లాడుకుంటున్నారు.
ఆ వుదయం రావుగారు కిరణ్ కి గట్టిగా చెప్పాడు. "ఈ రోజు నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. మన సంభాషణ ఎవరూ వినకూడదు. సాయంత్రం నీవు ఎక్కడికీ వెళ్ళకుండా రెడీగా వుండు. మనిద్దరం కలసి బయటకు వెళ్ళాలి. అక్కడ మాట్లాడుకుందాం."
వుదయం తండ్రి అలా చెప్పగానే తండ్రి తనతో మాట్లాడే విషయమేదో కిరణ్ చూచాయిగా అప్పుడే గ్రహించాడు. ఈ రోజు తప్పించుకున్నా మరో రోజు అయినా తండ్రి ప్రశ్నలకి తను సమాధానం చెప్పక తప్పదు. అది ఈ రోజు అయితేనేమి, మరో రోజు అయితే నేమి, అనుకున్న కిరణ్ "అలాగే డాడీ!" అన్నాడు.
తన ఆమోదం వెంటనే తెలిసి అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. తను తీసుకున్న నిర్ణయం ప్రకారమే జాగ్రత్తగా మాట్లాడుకున్నాడు కిరణ్.
అత్తాకోడళ్ళు ఇంట్లో లేక పోవడంతో రావుగారు కొడుకుని బయటకు తీసుకెళ్ళటం మానివేసి ఇంట్లోనే అసలు విషయాన్ని చర్చించడం మొదలుపెట్టాడు.
ఎంతకీ కిరణ్ మాట్లాడక పోవడంతో "ఈ మధ్య నువ్వు చాలా డల్ గా వుంటున్నావు తెలుసా!" అన్నారు రావుగారు.
"అదేం లేదు డాడీ! నేను చాలా హేపీగా వున్నాను"
"అలా నీవు చెబితే సరికాదు నేను అనుకోవాలి కదా!" కిరణ్ మౌనం వహించాడు.
"నేను మొన్నొక రోజు కామినీ నీ మీద ఎగురుతుంటే విన్నాను. ఆమె ఎగురుతూ వుంటే నీవు మౌనంగా వుండిపోయావు. ఎందుకని?"
"నేను కామినీని పిక్చర్ కి తీసుకు వెడతానన్నాను. కాని తీసుకు వెళ్ళలేదు. అందుకని కోపగించుకుని అరచిందంతే."
"వాళ్ళ బాబాయ్ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గమనించావా!"
పొరపాటున "ఊ" అన్నాడు కిరణ్.
"పిక్చర్ కి తీసుకు వెళ్ళలేదని నీ భార్యా నీ మీద కోపగించుకుంది అన్నావు. ఆ మాట నేను నమ్మక పోయినా, అలా జరగడానికి అవకాశం వుంది కాబట్టి నేను నోరు మూసుకున్నాను. దీనికి సరయిన సమాధానం చెప్పు. ఆ బాబాయ్ ఒక దగుల్భాజీ వెధవ, వీధి కుక్కలాంటివాడు. సరాసరి లోపలికి వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తూవుంటే నువ్వు ఎందుకు సహిస్తున్నావ్! వాట్ ఈజ్ ది రీజన్?" రావుగారు గట్టిగా అడిగారు.
"ఆయన పేదవాడని..." నసుగుతూ ఆగాడు కిరణ్.
"గాడిదకు వయస్సు మీరినా కాళ్ళు పట్టుకోం. అవునా!"
