తన తపస్సుకు ఎప్పుడో భంగం కలిగింది. ఎప్పుడయితే ఇహ పారాల గురించి తను ఆందోళన చెందాడో, తన గత చరిత్రను తెలిపే పర్సనల్ డైరీల విషయంలో కలవరపడి ఎప్పుడయితే వాటిని దగ్ధం చేశాడో అప్పుడే తన తపోనిష్టకు భంగం వాటిల్లింది, తన ఏకాగ్రత , సర్వశక్తులు ఈనాడు ఎమైపోతాయోనన్న భయాందోళన ఒక్కసారిగా కలిగిందతనిలో.
"విష్ణు .......నువ్వు జీవితంలో మరొకసారి ఓడిపోయావు. పూర్తిగా ఓడిపోయవు.......నా నమ్మకాన్ని వమ్ము చేశావు......
నీ స్థితికి జాలిపడుతున్నాను. ఛ! ఛ! ఇంతకు దిగాజారుతావని కలలో కూడా నేననుకోలేదు. ....యూ ఆర్ అన్ డన్.......నీ కీర్తి ప్రతిష్టలను నీ చేజేతులా నువ్వే మంటగలుపుకున్నావు...యూ ఆర్ జస్ట్ లైక్ ఎనీ అదర్ క్రీచర్......నువ్వు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అతీతుడవనుకున్నాను. కానీ నువ్వు.....నువ్వూ సగటు మనిషివే....
నౌ ఐ హెట్ యూ ఐ హెట్ యూ సోమచ్" ఆవేశంలో ధీరజ మాటలు తడబడుతున్నాయి. కోపంతో ముక్కు పుటాలు అదురుతున్నాయి. ఉన్మాదంతో విరుచుకుపడుతుందా అన్నట్టు వున్నది ధీరజ రూపం, ఆమె ఆవేశం. తన మాటలు ఎవరయినా వింటారన్న వివేకం సయితం ఆమెలోపూర్తిగా నశించిపోయింది. ఆగ్రహంతో ఊగిపోతున్నది.
విష్ణు పద్మాసనం నుంచి లేచాడు. ధీరజ నాక్ప్రవాహం అనంతంలా సాగిపోతూనే వుంది.
తన ఆవేదన, ఆవేశం, ఆక్రందన అంతా వ్రేళ్ళగాక్కిన తరువాత ఆయాసాన్ని తీర్చుకోవడానికి అన్నట్టు ఆమె మాట్లాడటం ఆపింది. తన ఎదురుగా నిలువెత్తున వున్న విష్ణుని అప్పుడు దగ్గరగా చూసింది. అతని ముఖంలో శరీరంలో అణువణువూన ఏదో అనిర్వచనీయమైన బ్రహ్మ తేజస్సు గోచరించింది.
"విష్ణు......." ఇప్పుడు అతని పేరును ఉచ్చరించడానికి సైతం ఆమె పెదవులు తడబడుతున్నాయి. అతని కళ్ళలోకి సూటిగా చూడలేక తలవాల్చే సింది.
"మిస్ ధీరజ! కామ, క్రోధ, లోభ, మద , మాత్సర్యాలకు అతీతుడయిన వాడే యోగి కాగలడు......అసలు ఎదుటివ్యక్తి యోగి అవునా కాదా అని గ్రహించగల శక్తి ఒక్కరికే వుంటుంది. బహుశా ఆ అర్హత నీకు లేకపోవచ్చు. ఇప్పుడు చెప్పినా నీకు అర్ధం కాకపోవచ్చు. అయినా చెప్పడమూ నా ధర్మం కనుక చెబుతాను......
ఎవరయితే కామ, క్రోధ, లోభ, మద మత్సర్యాలకు అతీతులవుతారో వారే ఆ శక్తిని గ్రహించగలుగుతారు. ఇప్పుడు చెప్పు ఎవరు క్షణికావేశానికి లోనయ్యారో?....."
"విష్ణు....." అతి కష్టం మీద నోరు విప్పగాలిగింది. ధీరజ తల ఎత్తి అతని కళ్ళలోకి చూడడానికి ప్రయత్నించింది. ఎంతో నిర్మలంగా వుండాల్సిన కళ్ళల్లో అగ్నిగోళం బద్దలై లావా పెల్లుబికినట్టు రక్తనాళాలు ఉబ్బాయి.......రక్త ప్రసరణ పెరగడం వల్లనేమో , తెల్లని అతని కనుగుడ్లు ఉదయిస్తున్న సూర్యుని ప్రతాపంలా అరుణారుణమయ్యాయి. అతని అణువణువూన బ్రహ్మతేజస్సు ప్రకాశిస్తోంది. అతని విశ్వరూపం చూడలేనట్లు ఆమె కనురెప్పలు వ్రాలాయి.
"నన్ను క్షమించు విష్ణూ, నీ తపశక్తి నీ జనం గూర్చీ తెలుసుకోలేక నేను తొందరపడి మాటలు జారాను, నన్ను క్షమించు చటుక్కున వంగి అతని పాదాలను తాకింది ధీరజ.
అప్పటివరకు వాళ్ళిద్దరి సంభాషణను పొంచి వింటూ వాళ్ళ చర్యలను గమనిస్తోన్న భారతి రీటాలు విస్తుపోయారు.
"విష్ణు' అంటూ ధీరజ ఏకవచన ప్రయోగం వినడంతోనే వారిరువురికి మతిపోయింది.
"ఇక వెళ్ళండి కలెక్టర్ గారు......జిల్లా అధికారిగా మీరు ప్రజలకు చేయవలసిన సేవ ఎంతో వుంది....." అంటూనే అర్ధంతరంగా వెనుదిరిగి తన విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయాడు విష్ణు.
అప్పటివరకు ఏకవచన ప్రయోగం , మరి అంతలోనే జిల్లా కలెక్టరుగా గుర్తింపు. అసలు, వారిరువురి మధ్యన ఏం జరగనట్టే వాళ్ళిరువురు అక్కడ నుంచి నిష్క్రమించడంతో విష్ణు మీద, ధీరజ మీద తొలిసారిగా అనుమాన బీజాలు నాటుకున్నాయి రీటా, భారతిల మనసులలో.......
రీటా ధీరజను అనుసరించింది. కాని అప్పటికే ఆమె సీరియస్ గా కారు ఎక్కింది.
విష్ణు వెనుకే అయన విశ్రాంతి మందిరానికి వెళ్ళింది భారతి. అప్పటికే విష్ణు తన గదిలోపలకు వెళ్ళి తలుపులు మోసివేశాడు.
అటు ధీరజ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న పట్టుదల రీటాలో పెరిగింది.
ఇటు విష్ణు అంతరంగాన్ని క్షుణ్ణంగా చదివేయాలన్న సంకల్పం భారతికి కలిగింది. ఇద్దరూ తమ తమ కర్యసిద్దికి వ్యూహరచన చేయసాగారు.
* * * *
ఆ రాత్రి బద్దంగా కరిగిపోయింది.
తెల్లవారుఝాము మూడు గంటల సమయం.
కృష్ణవేణి పుష్కర ఘాట్ వద్ద జనసంచారం ఇంకా ప్రారంభం కాలేదు.
రాత్రి తెల్లవార్లూ గత స్మృతులు అతని మనసును అతలాకుతలం చేశాయి. ఆలోచనలు అల్లకల్లోలమయ్యాయి. భావనలు కలుషితమయ్యాయి ఏకాగ్రత చెదిరింది. ఆందోళన హెచ్చింది....
అసలు తను ఏమిటి? తన సాధన ఎందుకోసం?
తను అన్నింటికి అతీతుడననుకున్నాడు. అయినా బలహీనపడిపోతున్నాడు. ఎందుకు జరుగుతుంది ఇలా?
తెలిసి కాని, తెలియక కాని తను ఏ తప్పూ చేయలేదే! మనసా వాచా కర్మణా తన గురించి తన స్వార్ధం గురించి ఏనాడూ ఆలోచించలేదే! తపనపడలేదే!
తను ఏమయిపోయినా ఫర్వాలేదు తన శరీరం, మనసు ఆలోచనలు మలినం కాకుండా వుంటే చాలు. వాటిని తన సాధన ద్వారా స్వాధీనపరచుకుని కాపాడకుంటూ వస్తున్నాడు , మరి, ఇప్పుడేమయింది.
