"మిస్టర్ వినయ్ .....నేరుగా వెళ్ళి కలెక్టర్ ధీరజ గారిని కలుసుకో, ఇప్పుడు నాకు చెప్పి కన్విన్స్ చేసినట్టుగానే ఆమెను సమాధానపరచడానికి ప్రయత్నించు. ప్రజావెల్లువ ఉప్పొంగినప్పుడు ఆమె ఉద్రేక పడడం సహజమే అందుకే ముందుగానే వెళ్ళి ఇలా చేయబోతున్నాను . ఆ కార్యక్రమం మీ సమక్షంలోనే జరిగితే బాగుంటుంది. నిజానిజాలు మీరే స్వయంగా తెలుసుకున్నట్టు వుంటుంది అని ఆమెకు అర్ధమయ్యేలా చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయి.
సర్! మీరు చెప్పింది బాగానే వుంది కాని......సరాసరి కలెక్టర్ దగ్గరకు వెళ్ళి విష్ణు దేశ ద్రోహి అని చెబితే ఆమె నమ్ముతుందా?' వినయ్ కుమార్ నిరుత్సాహంగా అన్నాడు.
"వినయ్ మనకు కావలసింది అదే....విష్ణు నిర్దోషిగా నిరూపించడానికి అయినా ఆమె నీతో వచ్చి హౌస్ సర్చ్ నిర్వహిస్తుంది..... అప్పుడు అతను దోషి అని తేలితే ఆమె సమక్షంలోనే అతన్ని అరెస్టు చేయవచ్చు. లేదా నిర్దోషి అని బయాటపడితే కేవలం అనుమాన నివృత్తి కోసం అలా ప్రవర్తించవలసి వచ్చిందని ఆమె విష్ణుకు సర్ది చెప్పుకుంటుంది.'
సి.పి. పృద్విరాజ్ ఇచ్చిన సలహా అతనికి బాగా నచ్చింది.
"ఒకే సర్.......మీరు చెప్పినట్టుగానే ఇప్పుడే వెళ్ళి కలెక్టర్ గారిని కలుసుకుంటాను " అన్నాడు వినయ్ విన్రమంగా.
సి.పి దగ్గర అవసరమయిన పేపర్స్ తీసుకుని బయలుదేరాడు వినయ్ కుమార్.
* * * *
జిల్లా కలెక్టర్ చాంబర్.....
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ చెప్పిన విషయం వింటూనే కలెక్టర్ ధీరజ తోక తొక్కినా తాచులా చివ్వున లేచింది.
"మిస్టర్ ఇన్ స్పెక్టర్ .....ప్లీజ్ స్టాప్ యువర్ కామెంట్........'
ఆమె అరుపులకు బిత్తరపోయిన వినయ్ కుమార్ తన మాటలను మధ్యలోనే ఆపేశాడు.
'అది కాదు మేడమ్......"
"నాన్సెన్స్ ఇంకొక్క మాట కూడా విష్ణు గురించి తప్పుగా మాట్లాడకండి....మాట్లాడారో నేను సహించలేను. అసలు మీరు ఏ ఆధారలతో అతను విదేశీ శక్తులతో చేయి కలిపినట్టు భ్రమ పడుతున్నారో చెప్పగలరా?" తను జిల్లా కలెక్టర్ అన్న సంగతే మరచిపోయి విష్ణు భక్తురాలిగా ఆవేశపడుతొందామే.
"ఎస్......మేడమ్....ఆ ఆధారాలు అతని దైరీలలో వున్నాయని నా అనుమానం........'
"నో.....ఆ డైరీల్లో మీరనుకుంటున్న ఆధారాలు ఏమీ లేవు. అవి అతని పర్సనల్ డైరీలనే మాట నిజం....."
'అల్ రైట్ మేడమ్....మీరు చెప్పిందే నిజమనుకుందాం. అలాంటప్పుడు భారతి, రీటా దొంగతనంగా చదవలసినంత రహస్యాలు వాటిలో ఏమున్నాయి? వాళ్ళు విష్ణును బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నట్టు?"
"ఎందుకో వాళ్ళనే అడగండి........అంతే తప్ప విష్ణు మందిరాన్ని సెర్చ్ చేయడానికి వీల్లేదు. అదే జరిగితే ప్రజల వ్యతిరేకతను మీరు ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాదు అది ఒక ఉద్యమంగా టర్న్ అయినా కావచ్చు. ఆపై లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే అందుకు మీరే భాద్యులవుతారు కూడా....."
"ఆ డైరీలలో ఏమీ లేదని మీరంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు మేడమ్..."
అతని మాటలకు కలెక్టర్ ధీరజ కళ్ళల్లో క్షణం కలవరం అంతలోనే ఆమె తేరుకుంది.
"సింపుల్ లాజిక్......అటువంటి ప్రమాదకరమైన సమాచారం అంటూ ఏదన్నా వుంటే ఎంతటి అమాయకుడైనా తన డైరీలను అలా పిచ్చిగా వదిలేయడని నా నమ్మకం.....ఎనీవే.....మీరంత పట్టుదలగా వున్నారు కాబట్టి నమ్మకంగా చెబుతున్నారు కాబట్టి అతని డైరీలను తప్పకుండా మీరూ పరిశీలించండి. కాకపోతే అలా చేస్తే దైవచింతనే ప్రేరణగా జీవిస్తున్న ఒక సాధు పురుషుణ్ణి అవమానపరచినట్టు అవుతుంది. అయన పట్ల అపార నమ్మం ఏర్పరచుకున్న భక్త జనులు మనసులను గాయపరచిన వాళ్ళమౌతామన్నదే నా బాధ.....
"అల్ రైట్ విష్ణు సమక్షంలోనే ఆ డైరీలను చూడండి. అప్పుడే నిజానిజాలు తెలుస్తాయి. ఈ మాత్రం డానికి సర్చ్ వారెంట్ ఎందుకు......పదండి వెడదాం......" కలెక్టర్ ధీరజ ఉద్వేగంగా చెప్పి లేచి నిలుచున్నది.
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ మౌనంగా ఆమెను అనుసరించాడు.
కలెక్టర్ కారు విష్ణు మందిరంలో ప్రవేశించిన సమయంలో అయన ధ్యానమందిరంలో వున్నాడు.
శిష్యులు విష్ణు అనుమతి తీసుకుని వాళ్ళిద్దరినీ లోనికి పంపారు.
విష్ణు ముఖం గంభీరంగా వుంది.
అతని ఎదురుగా హోమగుండంలో అప్పుడే ఆరిపోతున్న ఎర్రని మంటలు కనిపిస్తున్నాయి. ఆ గదిలో వున్న వ్యక్తులను గమనించనట్టు విష్ణు హోమగుండంలో తిరిగి అవునేయిని పోసాడు. అగ్నిహోమం తిరిగి రాజుకుంది. "విష్ణుజీ.......మీరు అతి భద్రంగా దాచుకున్న ఆ డైరీలను ఒకసారి తెప్పించండి. విదేశీ ఏజెంటు అంటూ మీపైబడిన నింద తొలగిపోవాలంటే మీ పర్శనల్ డైరీలను బహిర్గతం చేయక తప్పడం లేదు.
ఒక జిల్లా కలెక్టరుగా నేను ఆదేశాలు జారీ చేస్తున్నందుకు నన్ను అన్యధా భావించకండి. నా మాటలు మన్నించి డైరీలు చూపండి.....' ఆమె నోటివెంట మాటలు ఎంతో ఉద్వేగంతో వెలువడ్డాయి. విష్ణు ముఖంలో చిద్విలాసం.
"ఐయాం సారీ కలెక్టర్ జీ, మీరు చాలా శ్రమ కోర్చి ఇంతదూరం వచ్చారు. గత జ్ఞాపకాలకు గుర్తుగా ఒకప్పటి డైరీలను నేను భద్రంగా దాచుకున్నమాట నిజమే. కానీ అందరి దృష్టి నా డైరీల మీదే పడింది. ఒకరయితే నిధి నిక్షేపాల వివరాలు వాటిలో వున్నాయనే భ్రమతో దొంగిలించారు. మరొకరు అందులో ఏమున్నదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో చూసారు. ఇంకొకరు ఏకంగా విదేశీ హస్తాలతో చేయి కలిపిన రహస్యాలు అందులో వున్నాయంటూన్నారు. ఏకంగా ఇప్పుడు మీరు కూడా ఆ విషయం నిగ్గు తేల్చుకోవదానికే వచ్చారు....
"నిజం ఏమిటో ఆ సర్వేశ్వరుడికే తెలుసు.....
ఇలా ఇంకా నేను ఎన్ని అపనిందలకు గురి అవుతానో అని......అయినా నా హృదయ ఫలకం మీద చెరిగిపోని ముద్రగా నిలిచి వున్న నా గతాన్ని డైరీల రూపంలో తిరిగి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదని......కొన్ని క్షణాల క్రితమే ఆ త్రిమూర్తుల సాక్షిగా నా డైరీలను ఈ హోమ గుండంలో అగ్నికి ఆహుతి చేశాను. ఇదిగో నింగికి ఎగిసిపోతున్న ఆ అగ్నిహోత్రపు ఛాయలు అవే......" విష్ణు పలికిన ఒక్కొక్క మాట ఆమెను చెళ్ళున కొరడాతో చరిచినట్టయింది.
ధీరజ ముఖంలో రంగులు మారాయి. అసంతృప్తికి చిహ్నంలా, ఆవేశానికి గీటురాయిగా ఆమె అంతరంగంలో బడబాగ్ని రగులుకుంటున్నది.
విష్ణు నిర్దిషిత్వాన్ని రుజువుపరిచే సాక్ష్యాలు భాస్మిపటలం అయిపోయినందుకు ఆమె ఎంతగా మధనపడిపోతున్నదో ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ప్రత్యేక్షంగా గమనించాడు.
"సారీ మేడమ్.......మీకు శ్రమ ఇచ్చాను. అయినా నా అనుమానం అనుమానంగానే మిగిలిపోయింది. కాని నా అనుమానం అలాగే మిగిలిపోకుండా నిజమే నని నిరూపించేవరకు నేను విశ్రమించను. అలానే నా దర్యాప్తులో అన్ని విధాలుగా సహకరించి మీరు మీ మాటను నిలబెట్టుకుంటారని ఆశిస్తాను...." అని వినయ్ కుమార్ కలెక్టర్ వద్ద సెలవు తీసుకున్నాడు.
ఇప్పుడు గదిలో ధీరజ, విష్ణు మిగిలారు. తుఫాన్ రావడానికి ముందు వుండే వాతవరనంలా స్మశాన నిశ్శబ్దం ఆవరించుకుందాక్కడ.
"విష్ణూ......"
