26
ఆ రోజు సాయంకాలం లాయర్ గారు, డాక్టరు గారు, స్వప్న కూర్చుని మాటాడుకోసాగారు. స్వప్న ముఖం గంభీరంగా వుంది. తమతో కలసి మాటాడటానికి రవిని కూడా పిలుద్దామన్నాడు డాక్టర్. లాయరు గారూ సమ్మతించారు. కానయితే స్వప్న అందుకి అంగీకరించలేదు. దాంతో వాళ్ళిద్దరూ కూడా గంభీరంగా, ముభావంగా వుండిపోయారు.
రవి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడు.
అక్కడికి హఠాత్తుగా వచ్చాడు వెంకట్రామయ్య. అతనికీ మధ్య జరిగిన సంఘటనలన్నీ తలనొప్పిగా తయారయ్యాయి. అమ్మమ్మగారు అంత హఠాత్తుగా పోతారనుకోలేదు అతను. ముసలిది పోతే పోయింది. కానీ పోతూ పోతూ ఆస్తినీ అమ్మాయినీ ఆ బికారి గాడి చేతిలో పెట్టిపోయిందే అనేదే అతని బాధ. దాంతో ఎలాగయినా అతను స్వప్న మనస్సు విరిచి ఆ పెళ్ళి చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. అది అతని అంతరాంతరాల్లోనిర్ణయించుకున్న విషయం.
వెంకట్రామయ్యని చూడగానే స్వప్న ముఖంలో కండరాలు బిగుసుకున్నాయ్ "ఏమిటిలా వచ్చారు? ఎందుకొచ్చారు?" కఠినంగా అడిగింది.
వెంకట్రామయ్య ముఖం పాలిపోయిందా ప్రశ్నలతో అతను చప్పున జవాబు చెప్పలేక పోయాడు.
"రానీవమ్మా! పెద్దవాడు ఏదయినా-సలహా చెపుతాడు!" అన్నాడు లాయరు విశ్వేశ్వరం.
"వద్దులెండి! ఇది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం. దీంట్లో మేనేజర్లూ, గుమాస్తాలూ చొరవ చేసుకోవటం ఎందుకు?" అన్నాడు డాక్టర్.
'బాబూ! నేను గుమాస్తానీ, మేనేజర్ని కాదు. వీళ్ళ దగ్గరి బంధువుని కూడా. నేను స్వయానా కృష్ణవేణమ్మగారి మరిది కొడుకుని. నా కామె పెద్దమ్మ అవుతారు. కానయితే ఆమె ఐశ్వర్యాన్ని పెంచుకుంది. మేం తగ్గిపోయాం. జరక్క ఆమె దగ్గర పనికి కుదిరి బతుకుతున్నాను!"
ఆ మాటలు విని ఆశ్చర్యంగా చూసింది స్వప్న.
"అవునమ్మా! రవి ఎలాగు ఆమె కొడుకు కొడుకో. నీవెలా కూతురి కూతురివో నేనూ అలాగే ఆమె మరిది కొడుకుని___"
"కూర్చోండి!" అన్నాడు డాక్టరు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా.
అతను కూర్చోగానే "రవి అమ్మమ్మగారి మనవడా?" అడిగేడు లాయర్.
"అవును బాబూ! తల్లీ కొడుకులకి బ్రతిక నన్నాళ్ళూ సరిపడలేదు. ఆమె ఎదలో ముల్లులాగా వ్యవహరించాడు వాడు. దత్తత పేరుతో ఆమె నరకం కొని తెచ్చుకుంది. అసలామెకి దత్తత యిష్టంలేదు. కానీ ఆ ముసలాయన ప్రోద్భలంతో దత్తు తీసుకుంది."
"సరే! అమ్మమ్మగారి నిర్ణయం సరైందే!"
"ఏమిటి బాబూ?" అడిగేడు లాయర్ని.
"వెంకట్రామయ్యగారూ! ఆమె చాలా రోజులనాడే విల్లు రాయించింది. ఆస్తి అంతా స్వప్నకి. ఆమె కాబోయే భర్తకి. స్వప్న అమ్మమ్మగారు చూసిన సంబంధం చేసుకోవాలి. వాళ్ళకి సంతానం కలిగితే ఆస్తిపై హక్కు అంతా వాళ్ళకే. స్వప్నకి కానీ, ఆమె చేసుకున్నతనికి కానీ ఏమీ హక్కు వుండదు-"
"ఉహూఁ" తలూపేడు వెంకట్రామయ్య.
"మీకూ తెలిసే వుంటుంది. అమ్మమ్మగారు స్వప్నని రవిని నిశ్చయించేరు. వాళ్ళిద్దరి చేతులూ కలిపిపాణి గ్రహణం చేయించి పెళ్ళి చేసిన తృప్తితో పోయారు!"
పెదవి విరిచాడు వెంకట్రామయ్య.
"వాళ్ళ పెళ్ళి సాధ్యమైనంత త్వరలో చేయాలి!"
"ఎందుకు?"
"ఎందుకేమిటి వెంకట్రామయ్యగారూ! స్వప్న అమాయకురాలు. మొన్ననే కాలేజీ చదువుముగించింది. అమ్మమ్మ గారు పోయేదాకా ఆమె అండదండల్లో నిష్పూచీగా బ్రతికింది. ఇప్పుడింత భారంపై బడితే ఈ బరువుని మోయగలదా? ఉహూఁ అందుకే ఆమెకి తోడు అవసరం!"
"రవి అన్నీ చూస్తున్నాడుగా!"
"ఇద్దరికీ ముడి పెట్టేస్తే అతని బాధ్యత పెరుగుతుంది. ఆమె బాధ్యత తగ్గుతుంది!"
"నా మాట వింటారా?"
చెప్పండన్నట్టుగా తలూపేరు ఇద్దరూ.
స్వప్న మాత్రం ఏమీ అనకుండా వింటూ వుంది.
"పెద్దమ్మగారి సాంవత్సరికాలు అయ్యేదాకా ఆగండి. తర్వాత పెళ్ళి చేద్దాం. అప్పటికి అమ్మాయికి అతన్ని గురించి అవగాహన ఏర్పడుతుంది!"
"వద్దు. వద్దు!" అన్నాడు లాయర్ విశ్వేశ్వరంగారు.
"ఏం?"
"అన్ని రోజులు వంటరిగా వుంచటం బావులేదు!"
"లాయర్ గారూ! ఇప్పటికి నాలుగైదు నెలలు గడిచాయి. ఇంకో ఏడు నెలలు. ఇంతలో వస్తుంది కాలం? అంత దాకా ఆగండి!"
"వీల్లేదు. స్వప్నకి ఏదైనా ఆపద సంభవిస్తే మనం చాలా చింతించవలసి వస్తుంది!"
"మనం యిద్దరం వుండగా ఆమెకి ఆపదా?" హేళనగా అడిగాడు వెంకట్రామయ్య.
"ఆపద వచ్చేప్పుడు ఎందరున్నా వస్తుంది!"
"అలాంటప్పుడు పెళ్ళయినా రావచ్చుగా?"
"అయ్యా! అప్పుడు మనకింత బాధ్యత వుండదు. రవి అన్నీ చూసుకుంటాడు!"
"మనకంటే జాగ్రత్త పడతాడా?"
"తాళికట్టి భర్త అయ్యాక అతనికి స్వప్న ప్రాణమవుతుంది. మనసంతా ఒకెత్తు! అతనొక్కడూ ఒకెత్తు."
"పోనీ ఆరునెలలు గడిచేదాకా ఆగండి!"
ఇద్దరూ స్వప్న వైపు చూశారు.
స్వప్న సమాధానం యివ్వలేదు. ఆమె మనస్సేమిటో ఎవరికీ అర్ధం కాలేదు.
"స్వప్నా! నీ ఉద్దేశ్యం ఏమిటి?" అడిగేడు లాయర్.
"ఇదిగో లాయర్ గారూ! పాపం అమ్మాయేం చెబుతుంది? మనం ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుంటుంది అంతే! దానికి ఆమెని మళ్ళీ అడగాలా?" నవ్వుతూ అన్నాడు వెంకట్రామయ్య.
