వెంటనే వెనుదిరిగాడు బ్రహ్మాజీరావు. అతన్ని అనుకుని నిలబడివుంది. అతని భార్య ప్రమీల. సీత ఎక్కడుందో కనబడలేదు వాళ్ళకి.
"పద!" అని ప్రమీల చెయ్యిపట్టుకుని మెట్లవైపు పరిగెత్తాడు బ్రహ్మాజీరావు. మెట్లని సమీపించగానే అతని పాదాలు ఆగిపోయాయి.
ఆ మెట్లమీద పరచిన సింథెటిక్ కార్పెట్ నీ మెట్లపక్క వున్న కొయ్య రెయిలింగ్స్ నీ చురచురమని కాల్చేస్తూ మెట్లెక్కి వచ్చేస్తున్నాయి మంటలు!
పైకిపాకివస్తున్న మంటలు మాత్రమే కనబడుతున్నాయి వాళ్ళకి. ఆ వెనకఏముందో కనబడటంలేదు. దట్టంగా ఘనీభవించినట్లు కనబడుతున్న నల్లటి పొగ ఆవరించేస్తోంది!
మంటలని దాటి ఆ పొగలోకి వెళ్తే ఏమవుతుందో తెలుసు బ్రహ్మాజీరావుకి.
ఆ పొగలో వుంటుంది కిల్లర్ గ్యాస్!
కార్బన్ మోనాక్సైడ్!
అగ్ని ప్రమాదాలలో చనిపోయే వాళ్ళలో ఎక్కువశాతం మందివళ్ళు కాలడంవల్లకంటే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక చనిపోతారంటారు. మెట్లమీద నుంచి కిందికి దిగే ఆలోచనమానుకున్నాడు బ్రహ్మాజీరావు.
"కమాన్!" అని కారిడార్ లోకి పరుగుతీశాడు. అతనితోబాటే పరిగెత్తింది ప్రమీల.
మంటలువాళ్ళని తరుముతున్నట్లు కారిడార్ లోకి వచ్చాయి. ఎదురుగా కిటికీలు కనబడుతున్నాయి.
కిటికీలో నుండి కూడా లోపలికి నాల్కలుచాచుతోంది అగ్ని.
పెద్దపెద్ద అగ్ని ప్రమాదాలలో మంటలు మెట్లమీదుగా కారిడార్లలో నుండి ఎయిర్ కండిషనింగు డక్టుల ద్వారా పయనిస్తూ తగులబడే వాటినన్నిటినీ దగ్ధం చేసేస్తాయి.
అగ్నికి వున్న మరొక లక్షణం కాన్వెక్షన్ కరెంట్స్ బిల్డింగుని కొండచిలువలా చుట్టేస్తూ పైకిపోవడం, కింది అంతస్తులోకి ఏ కిటికీలో నుంచో బయటికి వచ్చినమంటలు బిల్డింగుకి దూరంగా వెళ్ళిపోవు కన్వెక్షన్ కరెంట్స్ గా బిల్డింగుని స్ప్రింగులా చుట్టుకుంటూ పై అంతస్తులకి వెళ్ళిపోతాయి.
కిటికీలోనుంచి లోపలికి వస్తున్న మంటలని చూశాడు బ్రహ్మాజీరావు. ఒక్కక్షణం ఆలోచించి" ఇంకొక్కటే మార్గం వుంది! రా" అన్నాడు ప్రమీలతో. అంటూనే పరిగెత్తి పై అంతస్తుకి వెళ్ళేమెట్లు చేరుకున్నాడు.
అక్కడ మంటలు ఎక్కువగా వ్యాపించలేదు ఇంతవరకూ.
"పద!" అని మెట్లెక్కడం మొదలెట్టాడు బ్రహ్మాజీరావు. ఇద్దరూ నలభయ్యో అంతస్తు చేరుకున్నారు. ఆ పైన ఓపెన్ స్పేస్ వుంది. ఇంకా వాతావరణం వేడిగా అయిపోలేదు అక్కడ.
అప్పటికే అన్ని అంతస్తులనుండి ఎంతోమంది జనంచెరుకున్నారు అక్కడికి. వాళ్ళలో సీతకూడా ఉండడం బ్రహ్మాజీరావు గమనించలేదు.
పిట్టగోడ దగ్గరగా నిలబడివుంది సీత. కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అంత ఎత్తున ఉంది తను. నలభయ్యవ అంతస్తు అది! అంటే దాదాపు నాలుగొందల అడుగుల ఎత్తు!
క్రింద ఫైరింజన్లు నిప్పులని తినే ఎర్రటి పురుగుల్లా వచ్చి బిల్డింగుని చుట్టుముట్టడం కనిపిస్తోంది. ఏనుగు తొండాలంతటి ధారతో నీళ్ళు చిమ్ముతున్నాయి ఫైరింజన్లు. వాటికి అమర్చివున్న టర్న్ టేబుల్ లేడర్స్(నిచ్చెనలు) మడతలు విప్పుకుంటూ పదో అంతస్తుదాకాలేచి అక్కడ వున్నవాళ్ళని సురక్షిత స్థానాలకు చేరవేస్తున్నాయి!
కానీ తను? తను నలభయ్యో అంతస్తులో వుంది. ఇక్కడిదాకా వస్తాయా ఆ నిచ్చెనలు? రాకపోతే ఎలా? అప్పుడింక మృత్యువు తధ్యమా? చిత్రంగా సీతకు చావు అంటే భయం కలగలేదు.
పుట్టడం ఎంత నిజమో గిట్టడంకూడా అంత నిజం! పుట్టిన ప్రతి వాళ్ళూ చనిపోకతప్పదు.
అయితే కొంతమంది ముందుగా కొంతమంది వెనకగా అంతే తేడా!
మూడుపదుల సంవత్సరాల క్రితంపుట్టింది తను. ముద్దు మురిపాలతో పెంచారు తనని అమ్మానాన్నా!
ఆ తర్వాత కిడ్నాప్.....రాఘవులు, ఉస్మాన్.....అహల్య....
అహల్య దగ్గరా ముద్దుగా పెరిగింది తను. అహల్య తర్వాత ఆ ఇంటికి మేడమ్ అయింది సహజంగానే! ఎవరినీ బలవంతం చెయ్యలేదు! మోసపోయి అమ్మాయిలూ, దగాపడ్డ చెల్లెళ్ళూ తనని వెదుక్కుంటూ వచ్చేవాళ్ళు వాళ్ళను బతికించింది తను. తను బతికింది. ఆ తర్వాత లెక్కలేనంత డబ్బు!
చౌకబారు ప్రాస్టిట్యూషన్ లోనుంచి హైక్లాస్ కాల్ గర్ల్ కి బిజినెస్ లోకి....
ఇప్పుడు తనకింద ఉండేవాళ్ళంతా సోఫిస్టికేటెడ్ గర్ల్స్! మామూలుగా పడుపువృత్తిచేసేవాళ్ళలా బ్రోతల్స్ లా ఉండరు వీళ్ళు. గుట్టుగా మర్యాదగా ఎవరిబ్రతుకువాళ్ళు బతుకుతూ అవసరాలకోసం థ్రిల్ కోసం అప్పుడప్పుడు బిజినెస్ చేసే హైక్లాస్ గర్ల్స్ వీళ్ళు.
వీళ్ళు కూడా......తనని వేదుక్క్మ్తూ వస్తారు. సీత మేడమ్ అంటే అంత గురి వాళ్ళకి! తను సృజన అన్నపేరు వదిలేసి సీత అని ఎందుకు పెట్టుకుందో గుర్తువచ్చింది.
వ్యభిచారపు కొంపలలో పెరిగిన తను సీత అనే పేరు పెట్టుకోవడానికి కారణం వుంది. వ్యభిచారాన్ని నిరోధించడానికి ప్రభుత్వం చేసిన చట్టంపేరు అప్పట్లో-
ఆయాక్టు తాలూకు మొదటి అక్షరాలు కలిపి క్లుప్తంగా ాఒ"ఆ అనేవాళ్ళు.
ాఒ"ఆ! పరమసాధ్వి. సీత పేరుపడుపు వృత్తి యాక్టుకి కలిసింది! చిత్రం!
తనకి ఆ విషయం ఎందుకో మనసులో బాగా నాటుకుపోయింది. తల్లితండ్రులనీ గతాన్నీ మర్చిపోవాలనే ప్రయత్నంలో తన అసలు పేరుని కూడా వదిలేసి సీత అనే పేరు పెట్టుకుంది తను! పడుపుకొంపలలో సీత!
బతికినన్నాళ్ళు బతికింది. ఇప్పుడు నిశ్చింతగా చనిపోతుంది తను! చావంటే భయంలేదు తనకు! చావు పెద్దరిలీఫ్ అని నమ్ముతుంది తను.
కానీ ఒక్కటే అసంతృప్తి.
రాఘవులు! తనని ఈ స్థితికి తెచ్చినరాఘవులమీద కసితీర్చుకోకుండానే వెళ్ళిపోతుందా? ఆ కసి తీర్చుకోవడానికి ఎంత చక్కటి ప్లాను ఆలోచించి పెట్టింది తను? అది అమల్లో పెట్టకుండానే వెళ్ళిపోవలసి వస్తోంది?
సాలోచనగా కిందికి చూసింది సీత. నేల ఈనినట్లు కనబడుతున్నారు జనం.
అప్పుడు వినపడింది ఒక కొత్త శబ్దం! ట్టట్టట్టట్టట్ట అని గాలిని నరుకుతున్నట్లు!
తలెత్తి చూసింది సీత. హెలీకాఫ్టర్ ఒకటి దూరాన కనబడింది. క్షణాల్లో దగ్గరయింది అది! సరిగ్గా ఆ బిల్డింగ్ మీద గాలిలో ఆగింది హెలికాఫ్టర్. మరుక్షణంలో దానిలోనుంచి ఒక త్రాటినిచ్చెనకిందికి జారింది. ప్రాణభయంతో జనంవున్న ఆనిచ్చెనని అందుకోవడానికి ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పరిగెత్తారు. తను ఉన్నచోటునుంచి కదలలేదు సీత. కొద్దిగా పక్కకి ఒదిగి నిచ్చెన దగ్గరికి పరిగెత్తే వాళ్ళకి దారి ఇచ్చింది. విలువలేని జీవితం తనది! పోతేపోనీ ప్రాణాలు! బతకనీ బతకాలన్న కోరిక ఉన్న మరొకళ్ళని!
ఆర్తనాదాలు హాహాకారాలు హృదయ విదారకంగా వినబడుతున్నాయి.
ఉదాసీనంగా చూస్తూ నిలబడింది సీత. కాళ్ళకింద గచ్చు వేడెక్కుతోంది. తనకు తెలియకుండాఒక కాలుమార్చి ఒక కాలుమీద నిలుచుంటోంది సీత.
కెరటం ముందుకు సాగిన జనంవున్నట్లుండి మళ్ళీ వెనక్కి విరుచుకుపడ్డారు.
పిట్టగోడ దగ్గర నిలబడి వున్న సీత తూలి ఒరిగింది.
8
బ్రహ్మాజీ! అంది ప్రమీల. శోభనం రాత్రి ఆమె అతన్ని అలా పేరు పెట్టి తమకంగా పిలిచింది. తర్వాత కొడుకు పుట్టినప్పుడు ఆర్ద్రంగా. మళ్ళీ ఇన్నేళ్ళకు మృత్యుముఖంలో వున్నప్పుడు అప్రయత్నంగా వెలువడింది ఆ పిలుపు!
