"ఏమిటి అంకుల్ మీరు చెప్పేది?"
"నిజమేనమ్మా! వీరు డాక్టర్ పరంజ్యోతిగారు. మీ అమ్మాయికి తెలివి వస్తుంది. డోంట్ వర్రీ అని చెపుతూనే వున్నారు. నా భయం నాది. పైకి తగిలిన దెబ్బ ఏమో చిన్నది. తలకి తగలరాని చోట తగిలిందేమో రెండురోజులు పూర్తిగా మన లోకంలో లేవు నీవు. అలాగే పూర్తికోమాలోకి వెళ్ళిపోయావేమోనని నా భయం..." లోకేశ్వరర్రావు చెప్పుకుపోతున్నాడు.
"వన్ మినిట్" డాక్టర్ గారు అనేసరికి లోకేశ్వరర్రావు మాటలు ఆపి పక్కకి తొలిగాడు.
డాక్టర్ పరంజ్యోతి ఏవేవో ప్రశ్నలు వేస్తూ శీతల్ కళ్ళు, నాలుక, గుండె వగైరాలు పరీక్ష చేశాడు. చివరికి అన్ని బాగున్నాయని తేల్చి "తలపోటుగాని, తలదిమ్ముగాని లేదు కదా?" అనడిగాడు.
లేదని చెప్పింది శీతల్.
"అలాంటివేవి లేకపోవటం మంచిది. ఈ రోజంతా పూర్తి రెస్ట్ తో బెడ్ మీద వున్నానంటే చాలు. రేపటి నుంచి మామూలుగా లేచి తిరగవచ్చు నీరసం రాకుండా ఓ ఇంజక్షన్ ఇస్తాను" అని చెప్పి అప్పటికప్పుడే ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు డాక్టర్ పరంజ్యోతి.
శీతల్ మారుమాట్లాడకుండా ఇంజక్షన్ చేయించుకుంది. ఆలోచనలు మాత్రం పరివిధాల పోతున్నాయి.
డాక్టర్ పరంజ్యోతి మరికొద్ది సేపే వుండి వెళ్ళిపోయాడు.
డాక్టర్ గారిని సాగనంపటానికి లోకేశ్వరరావు గుమ్మందాకా వెళ్ళాడు. ఆ కొద్ది సమయంలో శీతల్ తల తిప్పి ఆ రూమ్ నంతా పరికించి చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకుని వుండిపోయింది.
లోకేశ్వరరావు లోపలికి వస్తూనే "అమ్మా శీతల్ అంటూ నెమ్మదిగా పిలిచాడు.
లో గొంతుకతో "ఊ" అంది శీతల్.
"ఎలా వుందమ్మా!" ఆప్యాయంగా అడిగాడు లోకేశ్వరరావు. అంతేకాదు అప్పుడే నౌకరు తెచ్చిన వేడి వేడి హార్లిక్స్ ని తన చేతిలోకి తీసుకుని లేచి హార్లిక్స్ తాగడానికి బలవంతం చేశాడు.
"మత్తుగా వుంది అంకుల్!" అంది శీతల్.
"డాక్టరు గారు ఇంజక్షన్ ఇచ్చారు కదా! విశ్రాంతిగా వుండటానికి నిద్ర వస్తుంది. ఇది తాగి పడుకోమ్మా నెమ్మదిగా అదే సర్దుకుంటుంది." అంటూ శీతల్ ని నే కూర్చోపెట్టి హార్లిక్స్ కప్పుచేతికి అందించి మళ్ళీ మాటలు మొదలుపెట్టాడు.
"నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని అనుకోలేదు శీతల్ నీకేదైనా జరగరానిది జరిగినట్లయితే? ముందు నేను వుండేవాడిని కాను. మీ అమ్మకి నా ముఖం ఎలా చూపించేవాడిని! మనం మృత్యుముఖం దాక వెళ్ళి బతకటం అన్నది కేవలం నా అదృష్టం. నిజంగా నిన్ను మళ్ళీ ఇలా చూస్తానని శీత్ మాట్లాడుతానని...
లోకేశ్వరరావు అలా మాట్లాడుతూనే వున్నాడు.
శీతల్ దీర్ఘంగా ఆలోచించదల్చుకుంది. ఈ ఓల్డ్ సాక్స్ ఓ పట్టాన వదిలేటట్టు లేడు. ఉపాయంగా వదుల్చుకోవాలి. ఆ మాట అనుకోంగానే "అంకుల్ బాగా నిద్ర వస్తున్నది. కాసేపు నిద్రపోతాను" అంది కనురెప్పలు మూత వేస్తూ.
"డాక్టరుగారు ఇంజక్షన్ ఇచ్చారు కదా నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినంతసేపు పడుకో నీవు ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచిది" అని చెప్పి లోకేశ్వరరావు బయటికి వెళ్ళాడు.
శీతల్ కి నిద్ర రావటంలేదు. మత్తుగాను లేదు. చాలా తేలిగ్గా వుంది. ఆలోచించుకోవటానికి ఆ చిన్న అబద్దం ఆడింది.
లోకేశ్వరరావు అటు వెళ్ళంగానే తెలివి తక్కువగా లేచి కూర్చోలేదు. కళ్ళు మూసుకుని పడుకుని ఆలోచిస్తూ వుండిపోయింది.
"తాము ఎక్కి ప్రయాణిస్తున్న చిన్నకారు యాక్సిడెంట్ కి గురి అయిందా?"
"తను ఏకంగా రెండురోజులు మత్తుగా (కోమాలో) పడి వుందా?"
"ఇదంతా నమ్మదగ్గ మాటేనా?"
కాదు...కాదు...కాదు...అని తన మనసు నొక్కి వక్కాణించి మరీ చెపుతున్నది.
"ఏదో జరిగింది అంతవరకు ఖాయం"
"అది ఏమిటి?"
శీతల్ అలా ఆలోచిస్తుంటే టక్కున రాకుమారి అంతఃపురం రాణీ వాసపుశయ్య. తాటకీదేవి పూతకి గుర్తుకు వచ్చారు. నీగ్రో నౌకర్లు కొజ్జా కాపలాదారులు అన్ని వరసక్రమంగా గుర్తుకు వచ్చాయి.
శీతల్ ఆలోచనలు యీ తఫా మరో విధంగా సాగాయి.
తను యాక్సిడెంట్ కి గురి అయితే మాత్రం గతం గుర్తుకొస్తుందా? ఆ గతం తాలూకా ఆలోచనలకి మరీ వింతగా జరుగుతాయా? తన తలకి దెబ్బ తగిలి కోమాలోకి వెళ్ళిపోయింది? నో....నో....ఇట్స్ ఇంపాజిబుల్.
ఇదేది శీతల్ నమ్మదల్చుకోలేదు.
అయితే
ఈ విషయం లోకేశ్వరరావుకి చెప్పాలా వద్దా?
చెప్పటంవల్ల వరిగే లాభం ఏమిటి?
చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి?
ఈ విషయం చెప్పాలా వద్దా అని శీతల్ కాసేపు లాభ నష్టాలు బేరీజు వేసుకుంది.
చెప్పకపోతే నష్టం విషయం అలా వుండిపోతుంది చెపితే ఏం జరుగుతుందా అని చెప్పి చూడటమే నయం.
