"సర్లే! పొద్దున్నే నేనే దొరికానా నీకు....?" అన్నాడు సురేంద్ర నవ్వుతూ.
"అవును! అందుకే ఓ చూపు చూద్దామని వచ్చాను" అని బక్కెట్ నీళ్ళలో చేతులుముంచి కడుక్కుని, దోసిలిలో నీళ్ళు పట్టుకుని సురేంద్ర పై చల్లింది.
సరిగ్గా ఆ సమయంలోనే గిరిజ అక్కడికి వచ్చింది.
సురేంద్ర ఆమెను చూసి ఖంగుతిన్నాడు.
గిరిజ ముఖమంతా కందగడ్డలా చేసుకుని, చురుక్కున లోపలికి వెళ్ళిపోయింది. జయంతి ఇవేమీ గమనించకుండా సురేంద్రపై నీళ్ళు చల్లుతూనే వుంది.
"అబ్బా జయంతి ఊరుకో! ఇంకా చిన్నపిల్లలా ప్రవర్తించకు పెళ్లీడు వచ్చిన పిల్లవి కాస్త పొందికగా వుండటం నేర్చుకో" అన్నాడు కాస్త కటువుగానే.
జయంతి, సురేంద్ర మాటల్ని అసలేమాత్రం పట్టించుకోలేదు.
"ఓహో పెళ్లీడు వచ్చిందని తమరు చెపితేనేగని నాకు తెలిదనుకున్నవా? నేను నీ పెళ్ళాంలాగా పెళ్లీడు వచ్చిందని టక్కునమెడలో మూడు ముళ్ళు వేసుకోనోయ్ బావ, ఇంకా నేను చదవాల్సింది చాలా వుంది తెలుసా?' అంది బావి గట్టుపైన కూర్చుని కాళ్ళుపుతూ.
"అబ్బ సర్లే జయంతి! పొరపాటున నిన్ను కదిలించుకున్నా అన్నాడు చిరాగ్గా.
"ఏంటి బావా! ఈమధ్య ప్రతి చిన్న విషయానికి చిరాకుపడుతున్నావ్? నేనంటే నీకు అంత చిరాకేస్తుందా? నేనేం చేశానని?" అంది సీరియస్ గా.
సురేంద్ర కాస్త ఖంగుతిన్నాడు.
"అబ్బే అలాంటిదేంలేదు జయంతి! నీ మేలుకోరే చెపుతున్నా నాతో యిలా సరదాగా వుంటే పర్వాలేదు, ఇదే మరొకరితో వుంటే మరోలా భావిస్తారుకదా, అందుకే అలా అన్నాను" అన్నాడు వివరిస్తూ.
"అబ్బో! తమరు చెపితేగానీ నాకా విషయం తెలిదా? అయినా , బావవు కాబట్టి చనువుగా వుంటున్నాను. వేరే వాళ్ళతో ఎందుకుంటాను? అసలు మా స్కూల్లో నేనంటే హడల్. అడ పులి అంటారు....అబ్బా అసలు నాతో మాట్లాడటానికే భయపడతారు" అంది నవ్వుతూ.
"మంచిదేగా తల్లీ...." అన్నాడు క్లుప్తంగా.
ఇంతలో జయంతి అంటూ కస్తూరి కేకవేయటంతో "వచ్చేవచ్చే" అంటూ గబగబా ముఖం కడుక్కుని.
'వెళుతున్నాను బావగారూ" అంటూ మళ్ళి కొన్ని నీళ్ళు ముఖాన కొట్టి లోపలికి పరుగుతీసింది.
జయంతి వెళ్ళిపోవటంతో, అక్కడకు గిరిజ రుసరుసలాడుతూ వచ్చింది.
సురేంద్ర ఆమెను నిశ్శబ్దంగా చూసి నవ్వాడు.
"ఏంటి మీకు దాన్తో సరసాలు?' అంది సీరియస్ గా.
"సరసాలా? ఛ...అవేం మాటలు గిరిజా?" అన్నాడు సురేంద్ర సీరియస్ గా.
"నేను చూడలేదు అనుకోకండి....మీరు చెపుతారా? నన్ను చెప్పమంటారా?" అంది మళ్ళి సీరియస్ గా.
"అబ్బ గిరిజా! నన్ను విసిగించకు. పొద్దున్నే గొడవ పెట్టుకుంటావేమిటి?" అన్నాడు సీరియస్ గా.
"అవున్లే నాతో ఎందుకు మాట్లాడతారు? నేనంటే మోజు తీరిపోయింది కదా?" అంది.
సురేంద్ర ఆమె వేపు నిశ్శబ్దంగా చూసి, ఎడ్లను తీసుకుని గొడ్ల చవిడిలోకి వెళ్ళాడు.
గిరిజ బావిలో చేదవేసి బక్కేటుతో నీళ్ళు తోడుకుని బిందెలో పోసుకుంది. బిందె నిండేవరకు నీళ్ళు తోడుకుని బిందె నిండిన తరువాత బిందె తీసుకుని పెరటివేపుకు వెళ్ళింది.
వాళ్ళకు తెలిదు వాళ్ళ సంభాషణంతా వీధి గుమ్మం ముందు ముగ్గులేస్తున్న దాక్షాయణి విందని.
దాక్షాయణి వారి సంభాషణ విని చెమటలు పోశాయి. అంతకు మునుపు జయంతి, సురేంద్ర మాటలు కూడా ఆమె వినింది. గిరిజ జయంతిని ఎంత దారుణంగా అపార్ధం చేసుకుంటుంది!?
ఆమె మనసేందుకో కీడు శంకించింది.
20
దాక్షాయణి భర్తకు భోజనం పెట్టి పంపిన తరువాత పిల్లలిద్దరిని స్కూలుకు పంపి అలానే మంచంపైన గదిలో పడుకుండిపోయింది. ఆమె మనసేమి బాలేదు. అసలు గిరిజ అంత నీచంగా ఆలోచిస్తుందని అసలు వుహించలేదు. పాపం జయంతి కల్లాకపటం లేనిపిల్ల. ఆమె గూర్చి ఎందుకలా ఆలోచిస్తుంది? పెళ్ళికి ముందు ఇద్దరూ ఎంత బావుండేవారు? సొంత అక్కచెల్లెల్లా వుండేవారు. ఆసలు సురేంద్ర జయంతిని చేసుకుంటాడని అందరం అనుకున్నాం.
ఎవరూ ఉహించని విధంగా ఆరోజు కస్తురక్కా ఆ విధంగా మాట్లాడటంతో గిరిజ పెళ్ళి సురెంద్రతో ఖాయమైంది. సురేంద్ర కూడా జయంతినే చేసుకోవాలనుకున్నాడేమో ! అందుకే గిరిజ అంతగా అనుమానపడుతుందేమో! కానీ చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగినవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా ఒకరి మనసు ఒకరు అర్ధం చేసుకోలేక ఎంత దారుణంగా అపార్ధం చేసుకుంటున్నారు? పాపం సురేంద్ర పరిస్థితి మరీ ఇరకాటంలో పడిపోయింది. అటు జయంతికి చెప్పలేక, ఇటు భార్యకు చెప్పలేక మధ్యలో నలిగిపోతున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. ఇద్దరి మధ్యలో ఇంత అఘాతం వుందని ఇప్పుడు తెలిసింది.
ఈ విషయం జయంతికి చెపితే ఎంత బాధపడుతుందో పాపం అది బొత్తిగా అమాయకురాలు. భోళా మనిషి, అందరూ నా వాళ్ళే అనుకుంటుంది. గిరిజ మనసులో ఇంతటి విషం దాగుందని తెలిస్తే తట్టుకోలేదు.
