నవారు మంచం మీద కూర్చున్న ధన్వి ఇప్పుడు చూశాడు మట్టి గోడలతో కట్టుకున్న యిల్లు. పైన రూప్ కి బదులు తాటికమ్మల్ని వాడారు. పూర్తిగా అది పూరిల్లు కాదు.
నుదుటపట్టిన స్వేదాన్ని తుడుచుకుంటుంటే "మంచినీళ్ళు తాగన్నయ్యా"అంది క్షితిజ గ్లాసుతో నీళ్ళందిస్తూ.
లంగా, ఒణిలు వేసుకున్న క్షితిజ అచ్చు నాన్నాలాగే వుంది. దేవుడు చెక్కిన అందమైన శిల్పంలా ఏ శాపం మూలంగానో యీ మూలకి విసిరేయబడ్డ బంగారు బొమ్మలా అనిపించింది.....
"నిన్నెలా గుర్తుపట్టాను అని నీ సందేహమా అన్నయ్యా....." గభాల్న లోపలికి తునిగలా పరుగెత్తిన క్షితిజ అరనిముషం వ్యవధిలో అమ్మా నాన్నల్తో బాటు తను వున్న ఫోటోని తీసుకొచ్చి యిచ్చింది.
చాలాసేపటిదాకా తల పైకెత్తలేకపోయాడు ధన్వి.
అమ్మ విషయంలో గానీ, తన విషయంలో గానీ యీ యింట ఎలాంటి అరమరకల్ని ప్రదర్శించలేదు నాన్న, కానీ యీ యింటి విషయాన్ని ఇంత కాలము తను దగ్గర గోప్యంగా వుంచాడు.
నిజానికి మరో స్థితి అయితే సుమిత్రతో యింకోలా మాట్లాడేవాడే.....కానీ యిప్పుడు గొంతు పెగలడంలేదు.
ఉండటానికి సరైన యిల్లు లేకపోయినా కట్టుకోటానికి సరైనా చీర లేకపోయినా గానీ నాన్నకి భార్య కావడమే ఓ గొప్ప వరంలా భావిస్తూ ఏ స్వప్నపు వుతకర్రనో పట్టుకుని రెండు దశాబ్దాల దాంపత్యజీవితం కొనసాగించిన సుమిత్రని ఏమని నిలదీయగలడు?
నిన్నటి పల్లవికి, యింకా రాయబడని చరణానికి మధ్య అస్పష్టంగా కనిపిస్తున్న జంత్ర సంగీతం లాంటి ఓ నిర్భాగ్యురాలిని.....కొడిగట్టుకుంటున్న వేళ కూడా యింకా తను ఆరని దిపాన్నే అనుకుంటూ అగాధమైనా , శున్యమైనా మాకేం? ఆ మనిషి వుంటే చాలానిపించినట్టు కనిపించే ఈ కుటుంబాన్ని ఏమని దండించగలడు?
సుమిత్ర టీ తెచ్చి యిచ్చింది. "నాన్నగారు ఏదో ఒక రోజు నిన్ను పంపుతానన్నారు , కానీ యింత తొందరగా పంపుతారనుకోలేదు.....అమ్మగారు బాగున్నారా?"
సుమిత్ర గొంతులో వినిపిస్తున్న సంస్కారం తన రాక ఆమెలో కలిగించిన అనందం చూస్తుంటే యిప్పుడు తను చెప్పాల్సిన నిజం గురించి ఆలోచిస్తున్నాడు.
"అన్నయ్యా. ఓ మాట చెప్పనా?" క్షితిజ కళ్ళలో అంతులేని పారవశ్యం. అసలు యింతకాలమూ 'అన్నయ్యా' అని పిలవటం కోసం తపస్సు చేసినట్టుగా చూస్తుంది. "కోపం రాదంటే చెబుతా మరి."
"చెప్పమ్మా" అన్నాడు ధన్వి నెత్తుటి పొత్తిళ్ళలో పసిపాపంతటి స్వచ్చతని క్షితిజలో చూస్తూ "కోపం దేనికి?"
"మరేమో....." బిడియంగా అంది క్షితిజ. " నువ్వు నాన్నకన్నా బాగున్నావ్."
"నువ్వు నాకన్నా బాగున్నావ్ గా" తనూ చనువుగా అనేశాడు.
మృదువుగా నవ్వింది సుమిత్రా....."అన్నయ్యని చూడాలనుంది నాన్నా అంటూ నాన్నగారి ప్రాణాలు తీసేది.....ఇంతకాలానికి ఆ కోరిక తీరిన ఆనందంలో కోతిచేష్టలు మొదలుపెట్టింది."
ఆ కొద్దిపాటి పరిచయానికి తన అన్నమీద అధికారం వున్నట్టు ధన్వి సమీపంలో కూచున్న క్షితిజ ధన్వి కళ్ళలోకి చూస్తూ.....ఇంకొక కోరిక మిగిలిపోయిందన్నయ్యా!" అంది.
"ఎంటమ్మా!"
"పెద్దమ్మని చూడడం...."
ధన్వి జవాబు చెప్పలేకపోయాడు.
"ఆ తర్వాత యింక నాన్న తరచూ రాకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు నువ్వు రాసే ఉత్తరాలు చూసుకుంటూ నీకు నేను ఉత్తరాలు రాస్తూ గడిపేస్తాను."
ధన్వి విప్పరితంగా చూశాడు.
ముగుసిన మరణయజ్ఞంలో ఆశల సమాధికి ఆయువు నునెని పోసి క్షితిజ చాలా అందోళన కలిగిస్తుంది.
"ఆ నాన్న రాకపోయినా పర్వాలేదంటావ్?"
'అవును' అని వుంటే అక్కడి నుంచే గుండె దిట్టవు చేసుకుని 'న్నాన్న ఇక రారమ్మా' అనేసేవాడే కానీ సుమిత్ర జోక్యం చేసుకొంది.
"తరచూ నాన్నగారు రాలేదన్న విషయం క్షితిజకి తెలుసు బాబూ. కానీ చిన్నపిల్లలా మారాం చేస్తుంది. అలా అని అయన యిబ్బంది పడుతూరావటాన్ని తను భరించలేదు."
సుమిత్ర కళ్ళనుండి నీటిబొట్లు రాలుతున్నాయి.
"రెండు పడవల మీద ఒకేసారి ప్రయాణం లాంటి జీవితంలో అయన మానసికంగా ఎంతో కుమిలిపోతున్నది నాకు తెలుసు ధన్వి. పైగా నాకు జీవితాన్ని యిచ్చిన దేవుడు. ఆయన్ని ఎలా బాధపెట్టగలను? ఈ బ్రతుక్కిది చాలు నాన్నా! దేవత లాంటి మీ అమ్మగారికి చేసిన ద్రోహం చాలు. నేను యిప్పుడు కోరుకునేది నాన్నగారు నాతో వుండటం కాదు.....అక్కయ్యతో కలిసి నూరేళ్ళు ఆనందంగా బ్రతకటం, ఎప్పుడో ఒకసారి అయన కనిపిస్తే చాలు. మరికొంత కాలందాకా నా వూపిరి ఆగిపోకుండా నన్ను నేను కాపాడుకోగలను."
చీర చెంగుతో నీళ్ళువోత్తుకుంది సుమిత్ర. "నిన్ను కోరేది ఒక్కటే నాన్నా. తప్పు చేశానన్న ఆత్మన్యూనత మూలంగా అయన తాగుడికి అలవాటు పడిపోయారు, ఆ ఒక్క అలవాటు మాన్పించు. ఎక్కడున్నాగానీ అయన ఆరోగ్యంగానే వున్నరన్నా సంతృప్తితో బ్రతికే అదృష్టాన్ని మాకు కలిగించు."
హటాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
కళ్ళలో కాంక్షలకన్నా కన్నిళ్ళని నింపుకుని మిగిలిన బ్రతుకు దూరాన్ని కాలినడకన కాక కూలిపోని నమ్మకాల ఆసరాతోనే సాగిస్తానని అంటున్న ఈ స్త్రీకి నాన్న లేడన్న నిజం ఎలా చెప్పగలడు?
చేతనైనా గానీ కవితగా మలుచుకుని "ఆశావాదంతో బ్రతుకుని ముందుకు వెడుతూ కలతలో అయినా నుదుట తిలకం మిగిలితే చాలానే యిద్దరు ప్రాణులున్న ఆ చిన్ని పొదరింటిని నాన్న లేడన్న నిజం చెప్పి ఎలా కుల్చగలడు?
