వాళ్ళు మనసులోనే ఆమెకు నమస్కరించి వెళ్ళిపోయారు.
అలా ఒంటరిదై పోయింది పద్మజ.
భర్తను వదిలేసినందుకు ఆమె ఏ క్షణమూ పశ్చాత్తాపం చెందలేదు. పైపెచ్చు ఆత్మగౌరవాన్ని నిలుపుకున్నానని సంతోషించింది.
ఇంతలో కూతుర్ని కన్నది పద్మజ.
మెల్లగా ఇంటిని చక్కబెట్టుకోవడం ప్రారంభించింది. తండ్రికి పూర్తిగా వ్యవసాయ బాధ్యతను అప్పజెప్పింది.
తను, పెద్ద చెల్లెలూ గేదెల్ని చేసుకోవాలని, చిన్న చెల్లెలు స్కూలు కెళ్ళడం కంటిన్యూ చేయాలని నిర్ణయించింది.
ఆమేరకు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు.
పక్కవూర్లో ఇలా జరిగిన నాటికి మన వూర్లో సుబ్బరామయ్య కొడుకు గోకుల్ చదువు పూర్తిచేసి పర్మినెంటుగా ఇంటికి వచ్చేశాడు.
అతను ఇంటర్ నుంచి ఎం.ఏ వరకు టౌన్ లోనే చదువుకున్నా వ్యవసాయం మీద ఆసక్తి ఎక్కువ.
అందులోనూ ఇక చదువులేదు. కాబట్టి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు, అదీగాక సుబ్బరామయ్యకు కూడా వయసైపోయింది. కట్టువుంటే తప్ప కాలు కదల్చలేని స్థితి.
వాళ్ళకి ఆ వూరికి, ఈ వూరికీ మధ్య అయిదెకరాల పొలం వుంది. దానికి నీటి సదుపాయం తక్కువ. దూరంగా వుండే బావి నుంచి మోటార్ తో నీళ్ళు తోడుకోవాలి.
సుబ్బరామయ్య తన హయాంలో ఆ పొలంలో పైరు వేయలేక పోయాడు.
గోకుల్ వస్తూనే ఆ పొలంలో పంట పండించాలని నిర్ణయించుకున్నాడు. దానికి కరెంట్ కనెక్షన్ ను తీసుకున్నాడు.
వర్షాలు మొదలవగానే ఆ పొలంలో వేరుశెనగ వేశాడు.
ఆ పొలం రెండు వూర్ల మధ్యలోనే వున్నా పద్మజ గ్రామానికి బాగా అనుకూలం.
కూలీల్ని ఆ వూర్లోంచే పిలుచుకొచ్చేవాడు గోకుల్.
వేరుశనగ బాగా మొలిచింది.
పొలం ఎగువున చిన్న పాక వేయించాడు గోకుల్ తను వుండడానికి వ్యవసాయ పనిముట్లు వుంచడానికి అనుకూలంగా వుంటుందనే అతని ఐడియా.
అక్కడ ఆ అయిదెకరాల పొలం తప్ప వ్యవసాయ భూములు లేవు చుట్టూ కాలవ. అందుకే పాక వుండడం బాగా వుపయోగపడింది.
గోకుల్ టిఫిన్ తిన్నాక నేరుగా ఈ పాకకు చేరుకునేవాడు.
చుట్టూ జనసంచారం వుండదు గనుక ప్రశాంతంగా వుండేది. కాబట్టే ఏదైనా పుస్తకం తీసుకుని పాకకు వచ్చేవాడు. సాయంకాలం ఏ మూడింటికో ఇంటికి తిరిగివచ్చేవాడు.
పొలంలో కూలీలు వుంటే సాయంకాలం వాళ్ళు వెళ్ళిపోయాక అతను ఇంటికి బయలుదేరేవాడు.
వర్షాకాలం ముగిసిందో లేదో అందరూ వరిపైరు నాటేశారు. గేదెల్ని ఎక్కడికీ తోలే వీలులేదు. కసువు కూడా బంగారం అయిపోయింది. మేతలేక పశువులు పాలు కూడా సరిగా ఇవ్వడం లేదు.
ఈ అసస్థ చూసి ఎదురింటి పార్వతమ్మ ఓ సలహా చెప్పింది. "ఏటి మధ్యలో ఆ పక్క వూరతను వేరుశనగ వేశాడట. పొలం గట్లుమీద కసువు బాగా పెరిగింది. వెళ్ళి కోసుకో. వేరుశనగే కాబట్టి పైరు తొక్కేశావని కూడా ఎవరూ అనలేరు"
దాంతో పద్మజ గంప తీసుకుని బయలుదేరింది.
ఆమె వెళ్ళేటప్పటికి తెల్లారి ఎండ శరీరానికి వెచ్చటి దుప్పటిని కప్పుతోంది. గాలి కూడా ఒంటిని ఆరబెట్టుకున్నట్లు మెల్లగా తగుల్తోంది. పొలం గట్ల మీదున్న గడ్డి చివర్ల మంచుబిందువులు ముతాల్ని ఆరబెట్టినట్లున్నాయి.
పద్మజ కసువు కోయడం ప్రారంభించింది.
మరో పావుగంటకు గోకుల్ పొలం దగ్గరికి వచ్చాడు.
అప్పటికే అతనికి ఇన్ఫర్మేషన్ అందింది.
"మీ పొలంలో ఎవరో కసువు కోస్తున్నారు. మనవూరి అమ్మాయి కాదు. పక్కవూరి అమ్మాయి అనుకుంటాను. గట్టుమీదున్న కసువును కోసేస్తే దొంగగొడ్లు సరాసరి పైరునే మేస్తాయి. అందువల్ల ఆ పిల్లను తరిమేయ్" అన్నాడు వీరాస్వామి ఎదురుపడి.
తన పొలంలో తనని అడక్కుండా కసువు ఎవరు కోస్తున్నారో తెలియని గోకుల్ త్వరత్వరగా వెళ్ళాడు.
అతను వెళ్ళేటప్పటికి ఆమె అటు తిరిగి కసువుకొస్తోంది.
ఎవరో వస్తున్న అలికిడికి ఇటు తిరిగింది.
అతను అలా నిలబడిపోయాడు.
పచ్చటి పొలాల మధ్య వుండడం వల్ల కాబోలు ఆమె శరీర ఛాయ కాస్తంత పెరిగింది. పైట చెంగుని బొడ్లో దోపుకోవడం వల్ల ఆమె ఎద మరింత పొంగి అతని కళ్ళను బద్దలు కొడుతోంది. బిగదీసుకు కూర్చోవడం వల్ల చీర కుచ్చిళ్ళు పాదాలపైకి ఎగబాకి పాదాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. పసుపు కొమ్ముల్లాంటి ఆ పాదాలను చూసి అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
"ఎవరూ?" అని అడగడం కూడా మరిచిపోయాడు.
ఆమె మాత్రం అతనెవరో వూహించింది.
"నేను పక్కవూరి పద్మజను ఎక్కడా కసువు లేకపోతే ఇక్కడికి వచ్చాను" అంది క్షమించమన్న ధోరణిలో.
"సరేలే.... కోసుకో" అన్నాడు.
అంత అందమైన అమ్మాయిని తరిమేయడానికి మనసొప్పలేదు. గట్టుమీదున్న కసువునే కాదు పొలంలో వున్న వేరుశనగను కోసుకున్నా ఏమీ అనలేని స్థాయిలో ఉన్నాడతను.
అంతగా ఏ అమ్మాయీ అతన్ని అంతకు ముందు ఆకర్షించలేదు. అతనికి ఆడపిల్లల పరిచయాలు ఏం లేవు. ఎప్పుడూ చదువు ధ్యాసలోనే గడిపాడు. ఇప్పుడు చదువైపోయింది. అందమైన అమ్మాయిని చూశాడు. దాంతో ఒక్కసారిగా యవ్వనం నిద్రలేచింది.
అతను పాకను చేరుకున్నాడు. చేతిలోనున్న పుస్తకం తీశాడు గానీ చదవబుద్ది కావడం లేదు.
మనసు గానుగెద్దు అయిపోయింది. అది ఎంతసేపూ ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ వుంది గానీ పక్కకి తప్పుకోవడం లేదు. ఇంటికెళితే ఆమె వెళ్ళిపోతుందేమోనన్న భయంతో మధ్యాహ్నం భోజనానికి కూడా వెళ్ళలేదు.
