Previous Page Next Page 
ఈ రేయి నీదోయి పేజి 37

 

    పార్వతమ్మ ఎవర్నో చూసి తన భర్తనుకుంది అని సమాధాన పడింది.
    
    మరుసటిరోజు తన భర్త రాగానే.... పెరట్లోకి లాక్కెళ్ళి "నిజమా! కానీ నేను నమ్మలేదు" అని ప్రారంభించి నిన్న జరిగినదంతా చెప్పింది.
    
    "పార్వతమ్మకి కళ్ళు సరిగా కనిపించేటట్లు లేవు. కళ్ళద్దాలు కొనిస్తానని చెప్పు" అని ఒక్క వాక్యంతో బయటపడిపోయాడు.
    
    అప్పట్నుంఛీ జాగ్రత్తలు పాటించాలనుకున్నాడు. అందుకే రాత్రుళ్ళు  వెళ్ళడం మానుకున్నాడు. ఓ ఆదివారం చిన్నిని టౌన్ కి రమ్మని, ముసల్దాని ఇంట్లో కలుసుకున్నారు.
    
    ఇలా రెండు మూడు నెలలు గడిచాయి.
    
    ఓరోజు రాత్రి లాస్ట్ బస్ దిగి అత్తగారింటికి నడవడం మొదలుపెట్టాడు.
    
    అప్పటికి చిన్నిని కలుసుకుని వారం రోజులైంది. మనసంతా పీకుతోంది. నరాలు రక్తప్రసరణకు అడ్డం పడుతున్నాయి. ఆమెతో గడిపిన ప్రతిక్షణం గుండెల్లో అలజడిని రేపుతోంది. ఆమె చిలిపితనం, పడకలో ఆమె చూపించే కొంటెతనం అన్నీ కళ్ళ ముందు పరుచుకుంటున్నాయి.
    
    చిన్ని ఇల్లు వచ్చింది. దాన్ని దాటితే భార్య ఇల్లు.
    
    అతనికి తెలియకుండానే అతని కాళ్ళు చిన్ని యింట్లోకి దారితీశాయి.
    
    ఆరోజు శనివారం కావడంతో చిన్ని తలంటి స్నానం చేసింది. ముఖాన్నంతా వెంట్రుకలు కమ్మేయడం కొత్త అందాన్ని ఇచ్చింది ఆమెకి.
    
    "వచ్చావా! జడలో పెట్టుకోవడానికి పూలు కొన్నాను. నువ్వు రాకపోతే అవి వేస్టే కదా.... నాలాగా" అంది చిన్నగా.
    
    ఆమె పబ్లిక్ గా పూలు పెట్టుకోదు. రాత్రి.... అదీ అతను వచ్చినప్పుడు....ఆ కాసింతసేపూ పెట్టుకుంటుంది.
    
    అతను ఏమీ మాట్లాడకుండా ఆమెని ఇంట్లోకి లాగాడు.
    
    పక్కింట్లోనే పెళ్ళాముందన్న విషయం ఎప్పట్లానే ఆ రాత్రి అతనికి గుర్తుకు రాలేదు.
    
    తెల్లవారుజామున లేచి బస్టాండ్ కి చేరుకున్నాడు. అతను అక్కడికి వెళ్ళేటప్పటికే ఏవో రెండు ఆకారాలు అక్కడ వున్నాయి.

 

    "ఎవరూ?" అంటూ పలకరించాడు.
    
    ఆ ఆకారాల్లో ఏ ఒక్కటీ మాట్లాడలేదు.
    
    పక్కనున్న టీ అంగడి దగ్గరికెళ్ళి టీ చెప్పాడు.
    
    మసక చీకట్లు తెల్లబారుతున్నాయి.
    
    ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నారు వాళ్ళు.
    
    అతని నాలుక వేడి టీ పడేటప్పటికి కాలింది.
    
    "నువ్వా!" అన్నాడు దగ్గరికెళ్ళి.
    
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    
    "రాత్రి రాలేదు నేను. ఇప్పుడే వచ్చాను"
    
    ఆమె అంత పొద్దున్న ఎక్కడికి బయల్దేరిందో అతని వూహకి అందడం లేదు. ఎవరో బంధువుల పెళ్ళికి తండ్రితోపాటు బయల్దేరిందన్న విషయం తెలియదు అతనికి.
    
    "ఇదిగో.... నిన్నే....నువ్వెళుతున్నావ్ కనుకనే నేనూ ఫ్యాక్టరీకి వెళ్ళి రాత్రికి వచ్చేస్తాను" అన్నాడు.
    
    "రాత్రికి రా గానీ.... నా దగ్గరికి మాత్రం రాకు. చిన్ని ఇంటికే వెళ్ళు, మా ఇంటికొస్తే కళ్ళు విరిచేస్తాం" అని మరో మాట మాట్లాడకుండా వస్తున్న బస్సును ఆపమన్నట్టు చేయి వూపింది.
    
    ఆగిన బస్సులోకి ఆమె ఎక్కడం చూస్తూనే వున్నాడు తప్ప నోట్లోంచి మాట జారిపడడం లేదు అతనికి.
    
    ఆమె అతని భార్య, ఆ తరువాత ఏమైందో మళ్ళీ చెబుతాను" అని రంగనాయకి గుడిలోకి వెళ్ళింది.
    
    బస్టాండ్ లో తన భర్తను చూడడంతోనే తన వివాహ బంధాన్ని తెంచేసుకుంది పద్మజ.
    
    ఆమె భర్తకు రెండు పేర్లు. ఒకటి పద్మనాభం. అయితే ఇంకొకటి నాదముని. తనకు రెండు పేర్లు వున్నట్టే ఇద్దరు స్త్రీలను "ఏకకాలంలో మైన్ టైన్ చేయాలనుకున్నాడు గానీ వీలైంది కాదు.
    
    బస్టాండ్ లో భార్యను చూశాక సర్దుకోవాలని ఎంతో ప్రయత్నించాడు. రెండు రోజుల తర్వాత భార్యకు నచ్చజెప్పడానికి తనే వెళ్ళాడు. అతను ఎన్ని చెప్పినా పద్మజ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. చివరగా "నాన్నా! బాగా రాత్రయినట్టుంది. ఈయన వెళ్ళాక వీధి తలుపు వేసేసేయ్" అంది.
    
    దాంతో ఆశను చంపుకుని వచ్చేశాడు.
    
    మరోరోజు పెద్దమనుషుల్ని పంపి రాజీకి యత్నించాడు. అదీ బెడిసికొట్టింది.
    
    ఇక లాభం లేదని ఓరోజు చిన్ని దగ్గరికి వెళ్ళాడు.
    
    "ఏం అల్లుడూ ఇంత రాత్రిపూట వచ్చావ్..." అని అడిగింది చిన్ని.
    
    "నీకోసమే"

    "నాకోసమా!" అంటూ ఆశ్చర్యపోయింది ఆమె.
    
    "ఆ....!"
    
    ఆమె ఏమీ మాట్లాడలేదు.
    
    "పద్మజను వదిలేశాను. ఇకనుంచీ నీతోనే జీవితం" అని అంటూ ఆమె నడుంను రెండు చేతులతో బిగించి గిరగిరా తిప్పబోయాడు.
    
    ఆమె ఠక్కున అతన్నుంచి విడిపించుకుని, "ఒద్దు అల్లుడూ.... అలాంటి మాటలనకు. నలుగురూ వింటే నా పరువు పోతుంది" అంది బాధగా.
    
    అతను షాక్ కొట్టినట్టు కదిలాడు.
    
    "నిజం అల్లుడూ, ఇప్పటికే మనిద్దరి మధ్యా ఏదో వుందని జనమంతా అనుకుంటున్నారు. ఇక ఈ ఇంటికి రాకు" అంది.
    
    అతని తల తిరిగి కళ్ళు బైర్లు కమ్మాయి.
    
    లేనిది వున్నట్టు జనం అనుకుంటున్నారని ఆమె చెబుతుంటే అతనికి నోరు ఎండిపోయింది.
    
    తన శరీరంలోని రక్తమంతా ఆవిరైపోతున్నట్టు తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు.
    
    "సరే అల్లుడూ...నిద్రొస్తోంది. వెళ్ళి పడుకుంటా" అని అతని ముఖం మీదే తలుపేసింది చిన్ని.  ప్రజల పోకడ, లోకం నడక చూసినప్పుడు యోగులు చిన్న నవ్వు నవ్వుతారు. ఆ నవ్వులో విరక్తి వుంటుంది.
    
    అయితే అతను యోగి కాదు కనుక బిగ్గరగా ఏడ్చాడు.
    
    అలా ఏడుస్తూనే బస్టాండు చేరుకొని తన స్వగ్రామానికి వెళ్ళిపోయాడు.
    
    విషయం కోర్టుకు ఎక్కలేదు. మధ్యవర్తుల సమక్షంలోనే సెటిల్ అయిపోయింది.
    
    "నాకు ఆయన ఆస్తిలో భాగం వద్దు. భరణం అంతకంటే వద్దు. ఆయనే వద్దనుకుంటున్నప్పుడు ఆయన డబ్బు మాత్రం ఎందుకు? స్త్రీకి భర్తను వదిలేస్తే బతుకులేదని చెప్పడానికే భరణం అనే మాటను సృష్టించి వుంటారు. అతను ఈ ఇంటి ఛాయలక్కూడా రాకపోవడమే అతనిచ్చే భరణం నాకు. నామీద నాకు నమ్మకముంది. నేను బతకగలను" అని పద్మజ తెగేసి చెప్పినప్పుడు పద్మనాభం అనే నాదముని ఎంత మంచి భార్యను పోగొట్టుకున్నాడో పెద్ద మనుషులకు అర్ధమైంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS