"నా మాట వినండి సుమతీ!" అన్నాడు.
"ఔను! కావాలంటే రేపు వెళ్ళిపోదురుగాని.....ప్లీజ్" అంది అహల్య.
ఆమె నన్ను వుంచడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. బహుశా నేను బయటికి వెళితే తను ఎక్కడ వుందో ఆమె భర్తకి చెప్తానని భయం కాబోలు.
"అహల్య అంతగా అడుగుతోందిగా...వుండండి" అన్నాడు ప్రదీప్.
ఆ గొంతులో శాసింపుకి కట్టుబడ్డట్లుగా నేను సూట్ కేస్ క్రింద పెట్టేసాను.
నేను ఒంటరిగా గదిలోనే వుండిపోయాను. మొదటినుండీ నా జీవితం అన్యమనస్కంగానే వుంది. తల్లిదండ్రుల నీడలో అందరి పిల్లల్లా బాల్యం అనుభవించలేదు. ప్రేమ అనేది యవ్వనంలో మనసులోనికి చేరనివ్వలేదు. పెళ్ళి అనేది ఎలాంటి మధురోహాలకీ తావివ్వకుండా ఒక వ్యాపారపు ఒడంబడికలా జరిగిపోయింది. తొలిరాత్రి ముచ్చట్లు లేవు. భర్త పరిష్వంగంలేదు. తొలిచూలు అపురూపాలు లేవు. కడుపు పండిన పారవశ్యం లేదు. స్నేహహస్తాల్ని బాహాటంగా అందుకునే అవకాశం లేదు. ఇప్పుడు మనసు మొదటిసారి లయ తప్పి వింతరాగం పలుకుతున్న వేళ మళ్ళీ అపశృతి....అహల్య రూపంలో.
బయట ప్రదీప్, అహల్యల మాటలు వినపడడంలేదు.
నా మనస్సు వాళ్ళ ఇద్దరి చుట్టూతా పరిభ్రమిస్తోంది. ఏం చేస్తూ వుండి వుంటారు?
అతను సరస శృంగార పట్టాభిషిక్తుడు.... రాత్రికో రాణీ, పగటికో పడతీ.
ఆమె..... సమస్త భోగాల్నీ పేగు పాశాన్నీ, సంఘంలో గౌరవాన్ని సైతం తృణప్రాయంగా వదిలేసుకుని అతని సాహచర్యంకోసం వచ్చేసిన తెగువరి! అన్నింటినీ మించి అపురూప లావణ్యవతి!
వానకి బిగుసుకున్న తలుపు చెక్కని బలవంతంగా తెరిచే అవసరం అతనికేమిటి? అతనిక్సోం నిరంతరం తెరిచివుంచిన ఆమె హృదయ ద్వారాలు ఎదురుచూస్తుండగా.
అహల్య ప్రదీప్ తో ఎంత క్లోజ్ గా వుందీ? ఇప్పుడేం చేస్తూ వుండి వుంటారో కదా?
అతను ఆమె నునుమెత్తని చెంపలని స్పృశిస్తూ అలాగే చేతులు క్రిందికి పోనిచ్చి ఆ అందమైన ప్రదేశాలని....ఆపైన ఊహ సాగనివ్వకూడదని బలవంతంగా ప్రయత్నించాను. దుఃఖం ముంచుకువచ్చిందిగానీ ఆలోచనలు మనసుని వీడిపోవడంలేదు.
నిన్న రాత్రి అతను తలుపు మూస్తుండగా....నేను ఒక్క అడుగు ముందుకు వేసివుంటే....ఒక్క పలుకు నా పెదవి దాటి వచ్చివుంటే....ఆ! వుంటే?
అప్పుడు ఈ హృదయం ఇంకా దహించుకుపోయేది. ఏమీ జరగకపోవడమే నా పాలిటి వరమైంది.
"ఏం చేస్తున్నారూ?" అహల్య అడుగుతూ వచ్చింది. ఆ ప్రశ్నకి లేచి కూర్చున్నాను.
"ఎందుకా కన్నీళ్ళూ?" ఆమె దగ్గరగా వచ్చి చెంపలు నిమిరేదాకా నేను ఏడుస్తున్నానని గమనించలేదు.
"అంత మౌనంగా హృదయంలోనే దాచుకొనే బాధా? ఎవరితో పంచుకోకూడదా?" లాలనగా అడిగింది.
ఆమెకి ఏం చెప్పగలనూ? నీ రాకవల్ల నా హృదయం తునాతునకలైందనా? లేక నేను పుట్టు దురదృష్టవంతురాలిని నీలా అనుకున్నవన్నీ నాకు లభ్యం కావు అనా?
నిస్తేజంగా ఆమెని చూసారు.
"సుమతీ! నిన్ను నువ్వు అంటున్నందుకు ఏమీ అనుకోకు కానీ అలాగే అనాలనిపిస్తోంది. నువ్వు ఇలా ప్రదీప్ తో వచ్చినందుకు నేనేమైనా అనుకుంటున్నానేమోనని నువ్వు అనుకుని బాధపడుతున్నావా? ఒద్దమ్మా....ఇంకొకళ్ళ ఆలోచనలు నీవి చేసుకుని, నీ శరీరాన్ని, మనసుని కష్టపెట్టకు. ఆ ఇంకొకళ్ళెవరూ వచ్చి నీలో నువ్వు కుమిలిపోతున్నప్పుడు నీ కన్నీళ్ళు తుడవరు.
నీ బాధా....నీ దుఃఖం వాళ్ళకి వినోదంగా మాత్రమే ఉపయోగపడతాయి.
మండుతున్న నా గుండెల నెగడుని ఎవరో ఆర్పజూస్తున్నట్లు అనిపించింది.
"బాగా తినగలిగినవాడ్ని చూస్తే అజీర్తి రోగి వెటకారం చేస్తాడు. స్త్రీ లభ్యం కానిచోట కళ్ళు మూసుకుని తపస్సు చేసేవాడు నిగ్రహం గురించి చెప్పచ్చు. జీవితం అంటే పప్పూ, అన్నం, నిద్రా అనుకునే వాడ్ని వెన్నెలా, పువ్వులు బాధించవు. అది ఇంద్రియ నిగ్రహం అని వాళ్ళు అనుకుంటారు. కాలూ, చెయ్యీ నరాలు లాగేస్తుంటే ఆ నిగ్రహపరులు ఎలా ఓర్చుకుంటారో అడిగి తెలుసుకోవాలి. ఏ జ్వరాన్ని చూసినా జాలిపడతారు. మరి యవ్వనజ్వరాన్ని చూసి ఎందుకు అసహ్యించుకుంటారో ఆ నీతివేత్తలని, సర్వం తెలిసిన తత్వవేత్తలని అడగాలి. 'భగవన్నామం చేయండి శాశ్వతానందం పొందండి' అని నామం బలవంతంగా చేయిస్తుంటే, కడుపు నెప్పితో గింగుర్లు తిరిగే వాడికి కూర్చోబుద్ది అవుతుందా?"
నాకు నవ్వొచ్చింది. కన్నీళ్ళు తుడుచుకుంటూ నవ్వాను.
అహల్య నా పక్కన కూర్చుని చెప్తోంది.
"రాత్రి నుంచీ నువ్వు అనేక రకాల ప్రశ్నలతో వేసారిపోయి వుంటావు. ఔనా? అదే....నాకూ ప్రదీప్ కి వున్న సంబంధం గురించి...."
ఏం చెప్పాలో తోచక తల వంచుకున్నాను.
"ఈవిడ వయసేమిటీ? అతని వయసేమిటీ? ఇంత సిగ్గుమాలిన తనంగా పిల్ల పెళ్ళికి ముందు ఇంటినుండి లేచొచ్చి నాకు కబుర్లు చెప్తోందేవిటీ అనుకుంటున్నావా?"
నిజంగా నా మనసులో మాటలే!
సంస్కారంగా నటించడం కోసం తల అడ్డంగా తిప్పలేకపోయాను.
"ఒక స్త్రీ భర్తని తప్ప ఎవర్నీ కన్నెత్తి చోదోఅకుండా తలుపు వెనక నుండి చూస్తూ 'అన్నయ్యగారూ!' అని పరపురుషుడ్ని సంబోధిస్తూ మాట్లాడితేనే నీతిమంతురాలని, ఇంకొక స్త్రీ ఎటువంటి భావం లేకుండా పురుషుడి భుజం మీద తట్టి మాట్లాడితే అవినీతిమంతురాలని, అనుకోవడం ఎంత పొరపాటో.....నన్నూ, ప్రదీప్ నీ గురించి నువ్వు అనుకునేది అంత తప్పు."
ఎంతో ఉత్సాహంగా ఆమె చెప్పే విషయం కోసం ఎదురుచూశాను.
"సముద్రంలో చాలా నీళ్లుంటాయి. కానీ దాహం తీర్చవు. గొంతు ఎండిపోయిన వేళ గుక్కెడు మంచినీళ్ళు దొరికితే ఎంత హాయిగా వుంటుందో అంత హాయైన స్నేహాన్ని అందించగలడు ప్రదీప్! ఒక ఆడా మగా కలిస్తే....అదొక్కటే పనికాదు....ఇంకా చాలా చాలా వుంటాయి. ఈ విషయం తెలుసుకోవాలంటే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ తెలియాలి. ఒకే రకమైన వేవ్ లెంగ్త్ తో స్పందించే మనుషుల మధ్య జెండర్ తేడా వున్నా.....కామపరమైన కోర్కెలు తట్టవు. కారణం....భావప్రాప్తి అనేది శరీరానికి సంబంధించిన విషయమే కాదు.....మనసుకీ మెదడుకీ సంబంధించిన విషయం. ఆఖరి బంతి సిక్సర్ కొట్టి జట్టుని గెలిపించిన సచిన్ కి బ్యాటింగ్ లో దొరకచ్చు! ఆఖరి వాక్యం వ్రాసి తృప్తిగా నిట్టూర్చిన రచయితకి రచనలో దొరకవచ్చు..... నటన తపస్సులా సాగించిన వాడికి నటనలో దొరకచ్చు. కానీ మనసుకి ఆ స్థాయిలో స్పందించే మనిషే దొరకనప్పుడు జీవితం నరకం!
ప్రదీప్ నాకు ఎలా పరిచయమో, ఎటువంటి బంధమో అవన్నీ నీకు అవసరం. నాకు అనవసరం! కానీ.....ఒక స్త్రీ జీవితంలో అన్నీ వుండీ ఆమె ఒంటరితనంతో, నిరాసక్తతతో కొన్ని పదుల సంవత్సరాలు ఎలా నష్టపోయిందో ఏం పోగొట్టుకుందో నీకు తెలియాలి. నా కత నీకు తెలిసినందు వల్ల నాకు జరిగే లాభం ఏమీలేదు. నువ్వు నా వకీలులా నా తరపున నిలబడి ఈ సమాజాన్ని ఎదిరించి వాదిస్తావన్న ఆశతోటీ కాదు. కేవలం....కన్ ఫెషన్ బాక్స్ లో నిలబడి చెప్పుకునే వాడికి కలిగే తృప్తిలాంటిది నా ఈ ప్రస్తుత పరిస్థితికి వుపయోగ పడుతుందేమోనన్న ఆశ."
