Previous Page Next Page 
హద్దులున్నాయి జాగ్రత్త పేజి 39


    
    ఎంతో ఆసక్తిగా వింటున్న నేను ఆమె ఆగిపోయేసరికి తల తిప్పి చూశాను.
    
    ఆమె ఏడుస్తోంది.
    
    వెనక నుండి వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేశాను.
    
    "పంచభక్ష పరమాన్నాలు తినేవాడికే గొడ్డుకారం మెతుకులు తింటే కన్నీళ్ళొచ్చేస్తాయి. రోజూ అవే పరమాన్నంలా తినేవాడికి రావు.
    
    అలాగే....కీర్తీ.....గుర్తింపూ.... అభిమానం వెల్లువలా పొందిన నన్నే ఈ ఒంటరితనం అనేది ఇంతగా బాధపెట్టగలదు! కళాకారులు ఆ విషయంలో చాలా దురదృష్టవంతులు.... గత వైభవం వారిని ఆనందపరచడం కన్నా ఎక్కువ దుఃఖాన్నే యిస్తుంది" ఆమె కళ్ళు తుడుచుకుంది.
    
    "ఇప్పుడే వస్తా" అని వేగంగా అక్కడినుండి వెళ్ళింది.
    
    నేను ఎంతో ఆతృతగా ఆమె రాకకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఆమె మాట్లాడిన మాటల్లో తర్కం, వాదనా లేవు. నిజాలున్నాయి. ఆమె మనస్థితికి దర్పణం పడుతున్నాయి. ఆమె చెప్పేది వినడంవల్ల నాకు ఏమయినా లాభం కలుగుతుందా? లేక యింకా డిప్రెషన్ లో కూరుకుపోతానా?
    
    "సుమతీ! ఇదిగో....నా జీవితంలోని ప్రతి ముఖ్యమైన ఘట్టం ఇందులో వ్రాశాను. ఒకసారి చదువు.... నిదానంగా చదువు. నీ ప్రయాణాన్ని ఈ రోజుకి వాయిదా వేసుకొని చదువు. నాకోసం చదువు..." ఆమె అందమైన నీలిరంగు డైరీ నా చేతికిస్తూ అంది. అంత దగ్గర నుండి చూస్తే కానీ ఆ అందమైన నీలిరంగు డైరీ నా చేతికిస్తూ అంది. అంత దగ్గర నుండి చూస్తే కానీ ఆ అందమైన కళ్ళల్లో నీలినీడలు నాకు కనిపించలేదు.
    
                                                              * * *
    
    ఆడంబరాలూ, భేషజాలూ పైకి కనిపించే పటాటోపాలు తప్ప లోపల ఏమీలేని డొల్లలాంటి జమీందారి కుటుంబం మాది.
    
    నాన్న కోటులోపల చిరుగుల చొక్కాని దాచుకునేవారు. ఇంటికి ఎందరు వస్తున్నారో.... ఎన్ని విస్తళ్ళు వేస్తోందో కూడా ఆలోచించకుండా మరబొమ్మలా చేసుకుపోతుండేది అమ్మ!
    
    వెండీ బంగారమే కాదు ఇత్తడి, కంచూ కూడా కరిగిపోయి అతిధుల విస్తళ్ళలోకి ఆధరువులయ్యేవి. ఇద్దరన్నయ్యలూ చదువులో అంతగా పైకి రాలేదు. వాళ్ళ గురించి అసలు పట్టించుకునే తీరిక నాన్నకుండేది కాదు. ఆయన రచ్చబండ దగ్గర్నుండి వచ్చే లోపల ఇల్లంతా మాటుమణిగిపోయేది. అమ్మకి అస్సలేం తెలీవు. దేవుడి ముందు కూర్చుని అష్టోత్తరాలూ, స్తోత్రాలూ, పంచరత్నాలూ చదవడం, మధ్యాహ్నంపూట వత్తులు చేసుకుంటూ ఏ సీతమ్మ సమర్తపాటో పాడటం మాత్రం తెలుసు!
    
    ఆ కంఠంలోని మాధుర్యాన్ని నేను చాలా చిన్నతనంలోనే వివశురాలినై పోయేదాన్ని. అమ్మపాట మరీ మరీ వినాలనిపించేది. ఆమె భుజాలు పట్టివూగుతూ నేను గొంతు కలిపేదాన్ని. అమ్మ వత్తులవీ నేను తప్పు పలికితే విసుక్కోకుండా మళ్ళీ మళ్ళీ సరిగ్గా అనిపించేది. అదే ఈ కాలంలో వాళ్ళలో మనకి కనపడనిది. భాషని స్పష్టంగా, స్వచ్చంగా పలకగలగడం. చదువు మాత్రం వానాకాలం చదువులాగే వుండేది. భుజాన సంచీ వేసుకుని కాలవగట్టు వెంట నాలుగుమైళ్ళు నడిచి బడికివెళ్ళాలి. అప్పుడప్పుడూ బల్లకట్టు రంగడ్ని బతిమాలి బల్లకట్టు ఎక్కేదాన్ని. కాళ్ళకి వెండి పట్టీలూ, కడియాలూ ఘల్లుఘల్లుమని మోగుతుండగా పరిగెడితే తమాషా ధ్వని వచ్చేది. గోదారి గట్టుమీద కూర్చొని ఆ గలగలలతో పోటీపడుతూ స్నేహితులం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. కోయిల కూతలో, రైలుబండి పరుగులో అన్నింటా నాకు లయా శృతీ కనిపించేవి. అమ్మ చల్ల చిలుకుతున్నప్పుడు ఆమె చేతి గాజుల సవ్వడి యిష్టంగా కళ్ళు మూసుకుని ఆస్వాదించేదాన్ని.
    
    అమ్మ మధ్యలో-
    
    "హలా! పుత్తడిబొమ్మనికాదూ! పెళ్ళికూతురివి కాదూ....లేమ్మా!" నై నన్ను నిద్రలేపుతూ మళ్ళీ పాట అందుకునేది. 'హరి నా మొర విని రారాదా దేవా.....సీతారామా.....శ్రీరామచంద్రా.....కరిరాజూ నీకూ చుట్టాలూ? వాణీ మొర విని నీవూ వేగమే చనలేదా...' అని దేవుడ్ని నిలదీస్తున్నట్లుగా పాడుతుంటే రోజూ విన్నవే అయినా యింకా యింకా వినాలనిపించేవి.
    
    అమ్మ వెన్న పూస తీసి కాచి అమ్మేది.
    
    మా బర్రెల పాడి వూరివాళ్ళకేగాని మా ఇంట్లో వాళ్ళకు కాదు. పెద్దన్నయ్య అర్భకుడని వాడికి కంచు చెంబులో అప్పుడప్పుడూ పాలిచ్చేది. రెండో అన్నయ్య అస్తమానం పెద్దమ్మగారింటి దగ్గరే వుండేవాడు. వాళ్ళకి పిల్లలులేరు. పెంపకం వెళ్ళాడు.
    
    అమ్మ చేత్తో ఊరగాయముక్కవేసి మజ్జిగన్నం పెట్టినా అమృతంలా వుండేది పెరట్లో చిక్కుడూ, సొర, బీరా, పొట్లాలాంటి కూరగాయల పాదులుండేవి. అర్ధణాపెట్టి కూరకొని ఎరగం అంటూ గర్వంగా చెప్పుకునేది అమ్మ ప్రొద్దుటినుండి రాత్రివరకూ తిరగలి రాయిలా గిరగిరా తిరుగుతూ పనిచేసిన అమ్మ మమ్మల్ని విసుక్కోవడం, తిట్టడం, కొట్టడంలాంటివి చేసేదికాదు. మధ్యాహ్నాలు తీరుబడి అయితే గవ్వలూ, చింత పిక్కలూ కూడా మాతో సమానంగా ఆడేది. చాలాసార్లు కావాలని న అచేతిలో ఓడిపోయేది కూడా!
    
    నేను ఎనిమిదో తరగతిలో వున్నప్పుడు భావనాపురం నుండి పూర్ణానంద భాగవతార్ అనే హరిదాసుగారొచ్చారు. ఊళ్ళోకి వస్తూనే నాన్నగారి దర్శనం చేసుకొని కత పెట్టించమన్నారు. మా తాతల్నీ, ముత్తాతల్నీ వాళ్ళు తాగిన నేతుల్నీ వర్ణించేసరికి నాన్న డబ్బాడు నెయ్యి తాగినట్లు ఉబ్బిపోయి వారం రోజులపాటు ఆయనచేత సప్తాహం పెట్టించారు.
    
    ఆయన కందిపచ్చడి మీద కూడా కంద పద్యం చెప్పేవారు. మంచి గాత్రం. మొదటిరోజునే అమ్మ చేతి అరటికాయ ఆవ పెట్టిన కూర తిని అసువుగా గుత్తివంకాయవంటి అత్త, మంచి గుమ్మడివంటి మామ, కందాబచ్చలి వంటి తోటి కోడండ్రు, పనసపొట్టు వంటి పసగల భర్త, అరటికాయ కూరవంటి సరసపు ఆడబిడ్డలు కలిగిన కుటుంబమే షడ్రసోపేతమైన భోజనం వంటి కుటుంబం అని ఇంకా ఏదేదో చదివారు. అమ్మ ఎప్పుడూ లేనిది ఫక్కున నవ్వింది. నాన్నగారు మధ్య వేలికున్న వైఢూర్యపు ఉంగరం తీసి యిచ్చేశారు.
    
    రాత్రి సీతా స్వయంవరం కథ చెప్పారు.
    
    పిట్టకథలు చెపుతుంటే నేను పీట చెక్క మీద నుండి కిందపడిపోయి నవ్వాను. హారతిపళ్ళెం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని అది అయిపోగానే ప్రసాదం పంచేవారు. కానీ ఆ సమయానికల్లా నేను అమ్మకి చేరగిలబడి నిద్రపోయేదాన్ని. ప్రొద్దుటే ప్రసాదం టైంకి ఎందుకు లేపలేదని పేచీలు పెట్టేదాన్ని.
    
    సీతా, సుబ్బులూ, మేడింటివాళ్ళ కస్తూరీ, గౌరీనాధ శాస్త్రిలతో ఆడుకునేదాన్ని రాత్రి దాసుగారు చెప్పిన కథ పొల్లుపోకుండా విన్నంతవరకూ పాడుతూ మొలకి ఎర్ర పట్టుపంచె కట్టుకుని ఎగిరేదాన్ని. ఒకనాడు సత్యభామని వర్ణిస్తూ 'భామనే....పది ఆరువేలా.... భామలా అందరిలోనా' అని కుచ్చుల జడ తెగ ఊపుతూ ఆడుతుంటే అమ్మొచ్చి అన్నానికి పిలిచింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS