"ఈవిడ పేరు సుమతి....నా ఫ్రెండ్" ఆమెకి పరిచయం చేశాడు.
'నమస్కారం' అనబోయిన నేను ఆమెని చూసి షాక్ కొట్టినట్లుగా ఆగిపోయాను.
ఆమె అహల్య!
* * *
భోజనాలయ్యేదాకా ప్రదీప్ నన్ను వెళ్ళొద్దన్నాడు. నాకు ఒక నిముషము కూడా అక్కడ వుండటం దుస్సహంగా వుంది.
అహల్య వంటవాడ్ని పక్కకి నెట్టి తానే వంట చేసింది. ఆమె ప్రతి భంగిమలో రాజసం! తెల్లని ఆమె శరీరం ఎటువంచినా మన్మథుని విల్లులా వుంది. ఆ మెడ క్రింద ఎర్రగా కాచిన పాలలాంటి నునుపైన భాగం.....ఒక్కసారి తాకితే ఆ మాధుర్యం ఎవడికైనా జన్మంతా వదిలిపోదేమో అనిపించింది. పెద్ద పెద్ద కళ్ళు.....వాల్చినప్పుడు పొడవాటి కనురెప్పల వెంట్రుకలు ఎంతో అందంగా వున్నాయి. చెవులకి ఏమీ పెట్టుకోలేదు. చేతులకీ ఏమీ వేసుకోలేదు. మెడలో మంగళసూత్రాల తాడు మాత్రం వుంది. ఎంతో నిర్మలంగా ప్రకాశవంతంగా వున్న పాలభాగంలో నల్లని చుక్క బొట్టు మాత్రం పెట్టుకుంది. ఆమె వేసుకున్న గంధపురంగు బ్లౌజు ఆమె శరీరంలో కలిసిపోయింది. ఇంత సింపుల్ గా వున్నా ఆమె ఒంటెడు నగలతో వున్నట్లు కళగా వుంది....కారణం ఆమె నవ్వూ....చూపూ! మహారాణి స్నానానికి ముందర నగలు తీసేసింది కాబోలు అనుకుంటారే గానీ కొత్తవాళ్ళయినా ఆమె బీదరాలు అనుకోరు! అదేనేమో గ్రేస్ అంటే!
ఆమె ముందు నేను వెలవెల బోయినట్లు ఫీలయ్యాను.
"దీపూ.....ఆనియన్స్ కట్ చెయ్యి.....ఆమ్లెట్స్ వేసేస్తాను!" ఆమె చనువుగా మాట్లాడుతోంది అతనితో.
అతను ఆమెని ఏదో ఒకటి అని నవ్విస్తున్నాడు.
చాలా గంభీరంగా కనపడే ఆమె అప్పుడప్పుడూ గుప్పెడు మల్లెలు రువ్వినట్లు ఫక్కున నవ్వుతోంది. "దీపూ....యూనాటీ!" అంటోంది. ఆమెని అలా అతనికి దగ్గరగా చూస్తుంటే.....ఇండస్ట్రయలిస్ట్ రఘురాంగారు భార్యనీ, పెళ్ళీడు కూతురుందనీ ఎవరూ అనుకోరు! ఎంతో నాజూగ్గా....పొందికైనా సౌష్టవంతో నా వయసు అమ్మాయిలాగే వుంది. ప్రదీప్ పక్కన అందంలో తులతూగేట్లు వుంది. నాలో బాధో, ఈర్ష్యో....తెలీదు కానీ ఆమె అతని కోసం ఇలా ఇల్లు విడిచిపెట్టి రావడం....అదీ పిల్ల పెళ్ళిముందు....అనైతికంగా అనిపించింది.
నాకు ఆమె చరిత్ర తెలుసని ఆమె గుర్తించలేదు! అసలు నేనెవరో ఆమెకి తెలియనట్లే వుంది. ఔను....సినిమా ఏక్టర్లనీ, రాజకీయ నాయకులనీ మనం గుర్తిస్తాం కానీ వాళ్ళు చూసిన ప్రతివాళ్ళనీ గుర్తు పెట్టుకోలేరుగా!
నేను గదిలోకి వచ్చేశాను. నాలోని నాకు నేను చాలా ఓదార్పు మాటలు చెప్పుకున్నాను. కానీ స్వాంతనగాలేదు. బయటనుండి ఆమె కంఠం శ్రావ్యంగా వినిపిస్తోంది.
చిన్నతనంలో రేడియో దగ్గరకు నేను పరుగెత్తుకు వెళ్ళేలా చేసిన పాట.....ఆమె సినిమాలో పాడిన పాత. నిజానికి ఎంతటి అదృష్టం....అలా అభిమానగాయని పాట ప్రత్యక్షంగా వినడం. అయినా ప్రస్తుతం ఆ ఆనందం నా గుండెని చేరలేక పోయింది. నిన్నంతా స్వర్గమనిపించిన పరిసరాలు బోర్ కొడ్తున్నాయి. అతను ఆమెతో చనువుగా వుండటం చూడలేక దూరంగా పారిపోవాలని మనసు తొందర పడుతోంది. అంత సౌందర్యవతితో ఇంతటి సాన్నిహిత్యం కాబట్టే అతనిని పెళ్ళికాని మాధవి కూడా ఆకట్టుకోలేకపోయింది అని మనసు భగ్గుమంటోంది. మనిద్దరి మధ్యా ఈమెందుకూ అన్నట్టు ఆమె చూస్తుందేమోనని ఎదురుపడటానికే జంకుగా వుంది. ఒకవేళ ప్రదీప్ కూడా అలా భావిస్తే....ఆ ఊహకే గుండె ఆగినంత పనయింది. నా స్నానం అదీ ముగించుకుని సూట్ కేస్ సర్దుకుంటుండగా....అడుగుల శబ్దం అయింది. చూస్తే అహల్య...ఆమె రెండు చేతులూ కట్టుకుని కిటికీకి ఆనుకుని నిలబడి నన్ను పరీక్షగా చూస్తోంది.
నాకెందుకో టీచర్ ముందు నిలబడ్డ తప్పుచేసిన విద్యార్ధిలా గుండె టకటకలాడింది. 'రాత్రంతా ప్రదీప్ తో ఒంటరిగా ఎందుకు వున్నావని అడుగుతుందేమో....అసలు నీకు ఏవుందని ఇంత పెద్ద కోరికలు అని హేళన చేస్తుందేమో.... మా ఇద్దరి స్థాయి ఇదీ.... అని తెలియజెప్పేలాంటి మాటలు మాట్లాడుతుందేమో...' నాకెందుకో చాలా భయం వేసింది.
అహల్య చాలా శాంతంగా ఎంతో నిలకడగా వుంది. "తప్పుచేసి ఇంత నిర్భయంగా వుండడం విచిత్రం....అవునా!"
నాకు ఆ మాటలు చెర్నాకోలా దెబ్బల్లా తగిలాయి. గబుక్కున తలెత్తి "నేనేం తప్పు చేయలేదు....అసలు రాత్రి ఏం జరగలేదు!" అని అరవాలనిపించింది. కానీ ఆమె ముందు నిలబడటానికే వణుకుతున్న శరీరం సహకరించలేదు. భయం భయంగా చూసాను.
"నిజానికి నేనేం తప్పు చేయలేదు సుమతీ! ఇటువంటి స్టెప్ నేను వేసేదాకా కాలం నన్ను విసిగించేసింది. మీ దృష్టిలో నే చేసింది భయంకరమైన అపరాధమే.....కాదనను కానీ ఎందుకు చేశానో.....నాకు మాత్రమే తెలుసు" ఆమె కళ్ళల్లో కన్నీటి తెర.
నేను సంభ్రమంగా చూశాను. అయితే ఆమె మాట్లాడింది తన గురించే కానీ నా గురించి కాదు. పైగా నేనెవరో ఆమె గుర్తుపట్టింది. గుండెలమీంచి పెద్ద భారం దిగిపోయినట్లనిపించింది.
"పునీత నా ప్రాణం! దాని పెళ్ళిముందు నేనిలా రావడం దాని భవిష్యత్తుకి గొడ్డలిపెట్టే! కానీ ఆయనకి....ఇప్పుడు మాత్రమే నాతో అవసరం. మళ్ళీ నా కాస్తఘట్టం అయిపోయాకా నా గురించి పట్టించుకోరు. నేనేమైపోయినా ఆయనకి అనవసరం....అందుకే ఈ సమయంలో ఇలాంటి స్టెప్పు తీసుకున్నాను" కసిగా అంది.
నేను ఆపుకోలేకపోయాను. కాస్త భయంగా, ఇంకెంతో బాధతో "ప్రదీప్ ని మీరు ప్రేమించారా? అతనికోసం ఇల్లొదిలి వచ్చేశారా? అదే నిజమైతే మధ్యలో రఘురాంగారికి ఎంత అవమానం?" అని అడిగాను.
ఆమె చిన్నగా నవ్వింది ఆ నవ్వుని ఎలా అర్ధం చేసుకోవాలో నాకు తెలియలేదు.
"స్త్రీ జీవితంలో ప్రేమ అనే భయంకరమైన పరిణామం ఎందుకు వస్తుందో తెలీదు. వచ్చేకా అంతా బాధే!" అంది.
నాకు అంతా తేటతెల్లమైంది. మాధవీ....సుమతీ....అహల్య....మేం అందరం ఒకే జాబితాలోవాళ్ళం. కానీ ఆవిడది పైచేయి!
నేను వెనక్కి తిరిగి సూట్ కేసు చేతిలోకి తీసుకున్నాను.
"వెళ్ళిపోతున్నారా?" అంది.
"ఔను!"
"భోజనం చేయండి" అంది.
"ఆకలిగా లేదు!" మనసులో మాత్రం "కడుపు నింపావుగా తల్లీ!' అనుకున్నాను.
"నేను వచ్చానని వెళ్ళిపోతున్నారా?" అడిగింది.
"కాదు!"
"అయితే ఈ వేల్టికి వుండండి" ప్రదీప్ కంఠం వినిపించింది.
నేను అతనివైపు సూటిగా చూసాను. 'ఇంకా ఏం చూడడానికి? మీ ప్రేమనా? సరసాలనా?' అన్నట్లుగా వుండి వుంటాయి నా చూపులు.
