Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 37

   

     లలితకర్ధమయిపోయింది - భర్త పోయి, ఏడాది పిల్లాడున్న దానికి రామాన్నిచ్చి పెళ్ళి చేస్తాడా ఈ ముసలాడు - ఎంత దూరాశ, రామానికి ఏం ఖర్మ - వితంతువును పెళ్ళాడటానికి - ఎవడి పిల్లాడినో పెంచి పెద్ద చేయటానికీ - ఆ ఇది ఒట్టివ్యవహారమే - పొద్దున్నే బయలుదేరి వెళ్ళమంటే సరిచాలు, చాలు గొప్ప సంబంధమే, లలిత నవ్వుకుంటూ పనులన్నీ పూర్తి చేసింది.
   
    రాత్రి పదిన్నర దాటింది. వీధి తలుపు కొడుతున్నారెవరో, ఎవరూ   
   
    'నేనే - రామాన్ని' -
   
    లలిత గబగబా తలుపు తీసింది. 'అదేమిటీ, రేపొస్తానన్నావుగా'
   
    'ఆ బస్ దొరికింది, వచ్చేసాను, మీరెప్పుడొచ్చారూ'. మేష్టార్ని చూసి కొంచం ఆశ్చర్యపోయి, వెంటనే పల్కరించాడు రామం.
   
    'మీరొచ్చారేమిటీ - నన్ను రమ్మంటే నేనే వచ్చేవాడినిగా - రండి మేష్టారూ' మేష్టారు, రామం లోపలకెళ్ళిపోయారు.
   
    లలిత లోపలకెళ్ళి తలుపేసుకుంది. రామానికి ఈ సంబంధం కుదరదులే - పదో క్లాసు చదువు, భర్త పోయినపిల్ల, ఒక కొడుకున్న ఆడది ఛీ రామానికేం ఖర్మ ఇలాంటి దాన్ని చేసుకోడానికి - చేసుకోడు! వెంకట్రామయ్య గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.
   
    లలితకి నిద్రపట్టడం లేదు. తలుపుతీసుకుని బైటకొచ్చింది రామం నిద్రపోతున్నాడా లేదా. ఆశ్చర్యం ! రామం, కృష్ణమూర్తిమేష్టారు ముందువరండాలో మెట్లమీద కూచుని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు టైము మూడు గంటలయింది.
   
    తెల్లవారు ఝామున బస్సులో మేష్టార్ని ఎక్కించి, దగ్గరలో వున్న హోటల్ లో కాఫీ తాగి, పేపరు కొనుక్కుని వచ్చిన రామం గుమ్మంలో లలిత కనిపించగానే గుడ్ మార్నింగ్ అన్నాడు.
   
    'గుడ్ మార్నింగ్ -మార్నింగ్ వాక్ మొదలుపెట్టావా' అంది.
   
    'మేష్టార్ని బస్సెక్కించి వచ్చాను'
   
    'మంచి పని చేసావు - చాదస్తపు ముసలాడు - ఆశకి అంతువుండద్దూ" లలిత కల్పించుకుని మాట్లాడింది.
   
    'లేకపోతె - నీకేం ఖర్మ - ఆ ముసలాడి ధైర్యానికి, నాకు కోపమొస్తోంది' - అంది లలిత. రామానికి అర్ధమయిపోయింది- 'ఓ, అదీ' అంటూ లోపలకొచ్చేశాడు.
   
    రామం మంచంపైనపడుకుని సీలింగ్ పాన్ వంక చూస్తున్నాడు. తను మేష్టారుని పంపించేశాడు - గాయత్రి ఎక్కడుంటే పిల్లాడు అక్కడే వుంటాడు అన్నాడు. బాగానే వుంది. ఆదర్శాల కోసం వితంతువివాహం చేసుకోటంలేదని, గాయత్రి అంటే తనకిష్టమని స్పష్టంగాచెప్పాడు - ఇప్పుడు రామానికి భయమేసింది - తల్లితో ఒక్కమాట చెప్పి, ఆ తర్వాత ఇవన్నీ మేష్టారితో చెప్తే బావుండదేమో -మేష్టారు యశోదమ్మగారితో తను చెప్పిన విషయాలు చెప్తే ఆవిడ మనసు బాధపడుతూ - థానే ముందర అమ్మకి చెప్పాలి - ముందు ఒప్పుకోదు - కానీ, కొడుకుపై ప్రేమకొద్దీ అంగీకరిస్తుంది - అమ్మతో చెప్పాలి - మళ్ళీ తను ఆ ఊరు ఎలావెడతాడూ, రామం తలుపు తాళం వేసి బయటకెళ్ళాడు.

    యశోదమ్మ ఎదురింటి సుబ్బారావుగారింట్లో ఫోను వుంది. ఆ నెంబరు తనకు తెలుసు....డైరీ చేత్తో పట్టుకుని గబగబా పబ్లిక్ టెలిఫోను బూత్ దగ్గర కెళ్ళాడు రామం.
   
    "హలో నేను హైదరాబాదు నుంచి, రామం మాట్లాడుతున్నాను. మా అమ్మ యశోదమ్మ గార్ని ఒక్కసారి దయుంచు పిలుస్తారా"-
   
    ఆ ఫోను సుబ్బారావు అందుకున్నాడు - సుబ్బారావుకి యశోదమ్మగారంటే చాలా గౌరవం సుబ్బారావు సహజంగా మంచివాడు. ఇరుగు పొరుగుకి సాయంగా వుంటాడు. ఆ ఊళ్ళో పెద్ద బట్టల దుకాణం సుబ్బారావుగారిదే.
   
    "ఏం రామం, ఏమిటీ" - ఖంగారుగా అంది యశోదమ్మ
   
    "ఖంగారులేదు - నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి"
   
    "నా తోనా"
   
    "ఆ నీతోనే మధ్యాహ్నం బస్సుకి బయలుదేరి వచ్చేయి-
   
    'మధ్యాహ్నమే - ఒంటో బాగుందా'
   
    "ఆ - సరే"
   
    "ఉంటాను" - రామం ఫోను పెట్టేశాడు.
   
    'ఏమిటమ్మా హడావిడి' అడిగాడు సుబ్బారావు.
   
    'ఏమో అన్నయ్య గారూ ముఖ్య విషయం చెప్పాలిట -మధ్యాహ్నం బస్సుకి రమ్మంటాడు - ఏమిటో మరి - అంది అక్కడ కుర్చీలో కూచుంటూ. మొన్న వచ్చినపుడు మా అందరిళ్ళకీ వచ్చాడుగా బుద్దిమంతుడు, తల్లి అంటే ఎంతో గౌరవం - ఈ రోజుల్లో తల్లిని తండ్రిని లెక్క పెట్టే దెవరూ. నువ్వు చూసావుగా తల్లీ, నా చిన్నకొడుకు ఆకులం పిల్లని, ఒక్కమాటన్ని చెప్పకుండా పెళ్ళిచేసుకు ఇంటికితెస్తే ఏం చేశాం, నోరుమూసుకున్నాం - తల్లి తండ్రులతో పనిలేదు - వాళ్ళు సంపాదించి దాచిపెట్టే మూటతోనే పని" - సుబ్బారావు అంటూ లోపలకెళ్ళిపోయాడు యశోదమ్మ ఇంట్లోకొచ్చేసింది.
   
    రామం ఎందుకు ఫోను చేసినట్టో - చాలా రోజులుగా అంటున్నాడు ఈ ఊర్లో ఒకర్తివీ ఎందుకు - ఈ పొలం అమ్మేసి, డబ్బు  నీ పేర బాంక్ లో వేస్తానని - పొలం బేరం పెట్టాడేమో - అది కనక అయితే, చచ్చినా ఒప్పుకోను - నేను నమ్ముకున్న పొలం, నన్ను బతికిస్తోన్న పొలం - నేను బతికుండగా అమ్మనీయను - ఒకవేళ వాడు అలాటి ముఖ్య విషయం మాట్లాడటానికే నన్ను అక్కడికి రమ్మంటే, తిరుగుబస్సులో వచ్చేస్తా కృష్ణమూర్తి మేష్టారిని, సుబ్బారావు గారిని పిలిచి బుద్ది చెప్పిస్తా - యశోదమ్మ ఆపనులు ఈ పనులు గబగబా చేసుకోటంలో మునిగి పోయింది.
   
    ఫోను చేసి వచ్చిన రామాన్ని వెంకట్రామయ్య పల్కరించారు.
   
    'మేష్టారు వున్నారా'
   
    'వెళ్ళారండి'
   
    'పాపం ఆయనదీ నాదీ ఒకటే సమస్య - నా పిల్లకి ఒక పెళ్ళి చేయకాకనేను ఏడుస్తుంటే, ఆయన పిల్లకి రెండో పెళ్ళి చేయాలని ఆయన గొడవ - తప్పేముందిలే -పాపం, చిన్నపిల్ల - ఎవరైనా చేసుకుంటానని ముందుకొచ్చే వాడుంటే మంచిదే' అన్నాడు పేపరు తిరగేస్తూ.
   
    'ఎందుకుండరండీ - లోకం చాలా మారిపోయింది -భార్య పోయినవాడు మళ్ళీ పెళ్ళి చేసుకుంటానంటున్నాడా - మనమందరం అంగీకరిస్తున్నామా - మరి భర్తపోయిన అమ్మాయి పెళ్ళి ఎందుకు చేసుకోవద్దూ, మనం ఎందుకు ఒప్పుకోవద్దూ'
   
    నిజమే బాబూ - నిజమే - పాపం, భర్త పోయినంతమాత్రాన జీవితమంతే ఒంటరిగా గడపటం కష్టమే - నువ్వన్నట్టు అలాటి పిల్లలకీ పెళ్ళి జరిపించాల్సిందే, -వెంకట్రామయ్య పేపరు పక్కనేపడేశాడు.
   
    "పైగా - ఇంకోమాట బాబాయి గారూ" - విడాకుల విషయం తీసుకోండి - విడాకులు తీసుకున్న మగాడు ఇంకో పెళ్ళిచేసుకుంటే, విడాకులు థేఉస్కున్న ఆడది పెళ్ళి ఎందుకు చేసుకోకూడదూ-
   
    "నిజమే బాబూ - నువ్వు చెప్పింది నిజమే - రెండు చేతులు కలిపితే చప్పట్లని - విడాకులకి ఇద్దరూ బాధ్యులే - అలాటప్పుడు, వాడు చేసుకోటమేమిటీ, అది చేసుకోకూడదనటమేమిటీ - తప్పులేదు - విడాకులు తీసుకున్న ఆడవాళ్ళకూ పెళ్ళిళ్ళు కావలసిందే - వెంకట్రామయ్య గట్టిగా అన్నాడు."
   
    'ఇంకో విషయం బాబాయిగారూ - ఒకవేళ ఒక పిల్లకి భర్తపోయాడనుకుందాం - ఆ అమ్మాయికి ఒకళ్ళో, ఇద్దరో పిల్లలను కుందాం ఆ అమ్మాయి చాలా చిన్నదే - ముప్పయి ఏళ్ళలోపనుకోండి - ఆ పిల్ల మరోడిని పెళ్ళి చేసుకోవాలనుకుంటే తప్పా, చెప్పండి' -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS