"అందుకోలేవు, ఎందుకు ప్రయాసపడతావు? నేను చదివితేగాని ఇవ్వను." ఉత్తరం మడిచి మళ్ళీ జేబులో పెట్టుకొన్నాడు. "మీ అమ్మ మా అమ్మకు వ్రాసిన ఉత్తరం నీ దగ్గరెందుకుందో నేను తెలుసుకోవద్దా?"
"నువ్వు ఆ ఉత్తరం చదివితే ఒట్టు. ఇలా ఇవ్వు!" సంధ్య ముఖం ఎర్రబడి, కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి.
"ఒట్టుతీసి గట్టున పెట్టాను." అంటూ వెళ్ళబోయాడు. సంధ్య అతడి చెయ్యి గట్టిగా పట్టుకొంది.
"నువ్వా ఉత్తరం చదివితే నన్ను చంపినంత. అదిలా ఇచ్చెయ్యి."
"నేను చదువకూడనిది ఏముంది ఇందులో?"
"ఏముంటే నీకెందుకు? అదిలా ఇవ్వు."
"ఇవ్వనుగాక ఇవ్వను." సంధ్యనుండి చెయ్యిని విడిపించుకొని, తన గదిలోకి పరుగుతీసి తలుపులు మూశాడు.
అతడు పారిపోతున్న తొందరలో తల్లిని చూడలేదు గాని, సంధ్యని ఆవిడ కసిరినట్టుగా అడిగింది. "ఏమిటా పెనుగులాట? ఏం కథ?"
"నా ఉత్తరం ఒకటి చదువొద్దంటే చదువుతానని తీసికెళ్ళాడు."
"ఏం ఉత్తరం?"
"..............."
"ఏం ఉత్తరమంటే మాట్లాడవేం?"
"చదువుతున్నాడుగా? అరుణ్ చెబుతాడత్తా!"
అరుణ్ తలుపుమూసి గదిలోకి వచ్చాక కాళ్ళు స్టూల్ మీదుంచి వాలుకుర్చీలో పడుకొని ఉత్తరం చదివాడు. ఒకసారి కాదు, రెండుసార్లు చదివాడు. మనసులో అండర్ లైన్ చేస్తున్నట్టుగా అందులో కొన్ని వాక్యాలు మళ్ళీ మళ్ళీ చదివాడు. ".... సంధ్య పుట్టకముందే నీ కోడలి స్థానం దానికి రిజర్వ్ చేసి వుంచావు, జ్ఞాపకముందా?...... అరుణ్ మరిచిపోయాడేమోగాని సంధ్య అరుణ్ ని ఎప్పుడూమరిచిపోలేదు. అరుణ్ అంటే దానికి ఎంత ప్రేమో.... ఎంతో వేదనని ఎదలోమోస్తూ ఒంటరితనంతో వేగిపోతున్నాను. జానకే వుంటే నాకింత ఒంటరితనం వుండేదికాదు కదాని..... నా కూతురని గొప్పగా చెప్పుకోవడం కాదు గాని సంధ్య కుందనపు బొమ్మలా వుంది..... ఒక్కసారి చూశావంటే....."
చిన్నప్పుడు తనని ముద్దుచేస్తూ ఆడిస్తూంటే రుక్మిణి అత్త ముఖం అరుణ్ కళ్ళముందు కదిలింది. సుహాసిని అన్నట్టుగా ఆవిడది ఎప్పుడూ నవ్వు ముఖం. నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేది. అల్లుడూ అల్లుడూ అంటూ తనని భలే ముద్దు చేసేది.
పాపం! ఆవిడ ఎంత దీనావస్థలో ఈ ఉత్తరాన్ని వ్రాసిందో? వ్రాసిన ఉత్తరం సంధ్య దగ్గరే ఎందుకుండిపోయిందో?
"అరుణ్ మరిచిపోయాడేమోగాని సంధ్య ఎప్పుడూ అరుణ్ ని మరిచిపోలేదు. అరుణ్ అంటే దానికి ఎంత ప్రేమో!"
చిన్నప్పుడు సంధ్యతో గడిపిన రోజులు జ్ఞాపకమొచ్చాయి. ఆ పిల్లతో ఆడుకొన్న ఆటలు, పొగడపూలు గ్రుచ్చడం, బొమ్మల పెళ్ళిళ్ళు, మొగుడూ పెళ్లాల ఆట అన్నీ వరుసగా గుర్తు వస్తున్నాయి. అమ్మలక్కలు 'నీ మొగుడు నీ మొగుడు' అంటూ ఆట పట్టించేవాళ్ళు సంధ్యని. ఆ ఆట పట్టింపు సంధ్యకి ఇష్టమే అయినా పైకి ఉడుక్కునేది.
సంధ్య నుండి తను దూరమైనా సంధ్య తనని మరిచిపోలేదన్నమాట. తను మరిచిపోయాడు ఇక్కడ ఏర్పడిన క్రొత్త స్నేహాలతో, క్రొత్త జీవితంతో. ఎప్పుడైనా గుర్తు వచ్చేది సంధ్య.
సంధ్యని మరిచిపోబట్టే సంధ్యస్థానం సునాయాసంగా ప్రతిమకు ఇవ్వగలిగాడు. ఇప్పుడు మళ్లీ సంధ్యస్థానం సంధ్యకివ్వాలంటే అంత సులభంగా కనిపించడంలేదు. ఈ రెండు మూడేళ్ళుగా కాబోయే భార్యాభర్తలుగా కలిసి తిరిగారు తనూ ప్రతిమా. పోతే శ్రీపతితో బిజినెస్ రీత్యా చాలా లావాదేవీలున్నాయి.
'చిన్నప్పటినుండి నన్నే మనసులో నిలుపుకొన్న సంధ్యకి నేనేమివ్వగలను? ఆమెకి కావలసింది ఇవ్వలేనప్పుడు ఇక ఏమిచ్చినా వ్యర్థమే కదూ?'
ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది.
అరుణ్ ఉత్తరం మడిచి విలువైన వస్తువును దాస్తున్నట్టుగా బీరువాలో వుంచి వచ్చి తలుపు తీశాడు.
ఎదురుగా తల్లి!
" అంత బలవంతంగా లాక్కొచ్చి చదవాల్సినంత ముఖ్యమైన ఉత్తరం ఏమిట్రా?"
