"ఇప్పుడే అస్ప్రుశ్యులు చదువుకోవాలని ఏడుస్తున్నారా ఏమిటి? ఏమిటో! ఉట్టిపుణ్యానికి లేనికలతలు తెప్పించటంగాని!"
శేషగిరి అందర్నీ కోప్పడ్డాడు. సంకుచితత్వం విడవకపోతే దేశాన్ని ఉద్దరించలేమన్నాడు. మార్పుకు జడిసే ఎప్పటి పరిష్టితిలకు భిన్నం ఉండదన్నాడు. పంచముల్ని చేర్చుకోకుండా ఉండటానికి ఒప్పుకున్నాడు. అందరూ తృప్తిపడి వెళ్ళిపోయినారు.
శేషగిరి సీతమ్మగారినీ పిల్లల్నీ ఇంటిదగ్గర దిగవిడిచాడు. తన అన్న గృహజీవితంలో కలిగిన గొప్ప మార్పును గురించి ఆవిడ ఇరుగుపొరుగు వాళ్ళతో ఈ విధంగా చెప్పింది.
"ఇంకెందుకొచ్చిందోగాని మా అన్నయ్యమాత్రం వొట్టి పిచ్చివాడల్లే అయిపోయినాడు. తెల్లారి లేచిందిమొదలు పడుకోపోయేదాకా గాంధీగొడవా, స్వరాజ్యం గొడవానూ! శుచీ ఆచారంలేదు కొంపలో. ఇంటో ఎక్కడచూసినా గోనెపట్టాలల్లే ఈ ఖద్దరు బట్టలే. మడికీ అవే, మైలకూ అవే, బయట తిరగటానికిపోయి ఆ గుడ్డలతోనే అన్నాని క్కూచుంటాడు మా అన్నయ్య. నానా అయోమయంగానూ ఉంది. ఉద్యోగం మానేశాడు గదా! పిల్లాడి చదువుకాస్తా పోయింది! ఏం కానుందో ఏమో!"
* * * *
సహాయ నిరాకరణోద్యమంలో శేషగిరి ఆరునెల్లపాటు జైలుశిక్ష అనుభవించాడు. ఆయన జైల్లోఉన్న కాలంలో సీతమ్మగారు పిల్లలతో వదినెగారిని చూడవెళ్ళింది. కామేశ్వరి, వకీలు సీతరామయ్యను బాగా తిట్టిపోసింది.
"ఈయనకు ఈ పాడు ఆలోచనలన్నీ ఆ సీతరామయ్యే పెట్టాడు. చివరకు జైలుకు వెళ్ళాలిసొచ్చేటప్పటికి ఈయన ఒక్కరే అయినారు. ఆయన తన ప్లీడరీ చేసుకుంటూ హాయిగా ఠింగురంగా అని కూచున్నాడు. ఆయన ఉద్యోగం ఇకరు తీసేసేదా, రాజీనామా ఇచ్చేదా? మాకివి శనిరోజులు వదినా, నానా అగచాట్లూ పడుతున్నాం. పిల్లకేమిటిగాని, సరుసు బొత్తిగా చెడిపోతున్నాడు. ఎంత చక్కగా చదువుకునేవాడు! బీడీలు కాలుస్తూ గొడ్లగాసే పిల్లలతో తిరుగుతున్నాడు. వాడికిప్పుడు చదువురందే లేదు. ఎంతసేపటికి సంగీతాలూ, పద్యాలూ, పాటలూనూ. ఊళ్లో పనిలేనివాళ్ళని పోగుచేశాడు. ఇప్పుడీన నాటకాలాడతాట్ట! వాళ్ళనాన్న ఆడిన నాటకం చాలనట్టు! ఆ జైలుతిండి ఆయనకు పడలా. రక్తవిరేచనాలు పట్టుకున్నయట. ఇరవై పౌన్లు తగ్గానని రాశారు. ముందేం కానుందా అని తలుచుకుంటే భయంగా ఉంది" అని కామేశ్వరి కంటనీరు పెట్టుకున్నది.
సీతమ్మగారు వేదాంతం చెప్పింది. అంతా భగవంతుడి ఆధీనం. మనం దేనికీ కర్తలం కాం. ఎట్లా కావలిసుంటే అట్లా కాకమానదు.
తన అన్న కుటుంబానికి ఏదో కోరదగని పరిణామం జరుగుతున్నట్టూ, తను ఎంతో అదృష్టవంతురాలు కావటంచేత తనకూ తన పిల్లలకూ అది తప్పినట్టూ సీతమ్మగారు వూహించుకున్నది. అన్నకోసం విచారంతోబాటు ఈ అసంతృప్తికూడా ఆవిడకు కలిగింది.
సుందరంకూడా తల్లి నానుకుని కూచుని అత్తయ్య చెప్పిన మాటలన్నీ విన్నాడు. వాడికి మిగిలినవేమీ పట్టలేదుగాని సరుసు విషయం చాలా విచారం కలిగించింది. ఇదివరకల్లా సరుసు తన కంటె రెండు క్లాసులు ముందున్నవాడు, ఇప్పుడు తనకన్న రెండు క్లాసులూ, మూడు క్లాసులూ, నాలుగు క్లాసులూ వెనకపడి పోతాడు. తను బియ్యే, ఎమ్మేకూడా పాసయిపోతాడు. సరుసు మాత్రం మూడోఫారం సహా చదివి మానేసినవాడుగానే ఉండిపోతాడు. యీ ఆలోచనవల్ల సుందరానికి ఆవగింజంతైనా సంతృప్తి కలగలేదు.
సీతమ్మగారూ పిల్లలూ చేరిన కొద్దిసేపటికి సరుసు ఇంటికివచ్చాడు.
"ఏంరా,ఎప్పుడొచ్చారు?" అన్నాడు సరుసు.
కిందటసారికీ ఇప్పటికీ వాడు చాలా మారిపోయినాడు. వెనుకటి బెట్టులేదు. చాలా రోజులకు సుందరాన్ని చూసిన ఆశ్చర్యం లేదు.
"ఇంతకుముందే వచ్చాం" అన్నాడు సుందరం, తనకన్న చాలాపెద్దవాడితో మాట్లడినట్టుగా. నిజానికి సరుసుకు వయసులాంటి దేదోవచ్చింది.
"రా, మేడమెట్లమీదికి పోదాం" అంటూ సరుసు మేడ మెట్లమీదికి వెళ్ళాడు. సరుసు. తనను ఆజ్ఞాపించినట్టే భావించుకుని సుందరం పైకివెళ్ళాడు.
మేడమీద నాలుగు మంచాలూ, వడ్ల బస్తాలూ తప్ప ఇంకేమీలేవు. నేలమీద చాపపరిచివుంది. దానిమీద హార్మోనియం ఒకటి పెట్టిఉంది.
మేడమీది డాబాలో ఒక మూల ఆరు బయట రాటం పడిఉన్నది.
నూలు,తియ్యటంలేదా?" అన్నాడు సుందరం.
"ఎన్నాళ్ళయిందో నూలుతీసి?.... పాడనా? వింటా? అయితే అట్లా కూచుని తిత్తిపొయ్యి."
సరుసు మాటలధోరణీ, వాలకమూ, అంతా మారిపోయింది. వాడిమీద పల్లెటూరి ముద్ర బాగా పడింది.
సుందరం గాలిపోస్తుంటే సరుసు రెండు చేతులా హార్మోనియం వాయిస్తూ నాటకాల్లో పద్యాలు_ హరిశ్చంద్రలోనీ, చిత్రనళీయంలోవీ, గయోపాఖ్యానంలోవీ_పాడాడు.
"నీకు రాగాలు తెలుసా?" అన్నాడు సరుసు. సుందరానికి తెలీదు సరుసుపాట సుందరం చెవులకు చాలా గొప్పగా ఉన్నది. నాటకంలో వాళ్ళుపాడినట్టుగానే ఉన్నది.
"ఎవరుమాత్రం ఇంతకన్న బాగా ఎట్లాపాడతారు? ఎంత బాగా నేర్చుకున్నావురా? ఈ హార్మోనియం వాయించటం ఎట్లా వచ్చిందీ?" అన్నాడు సుందరం.
సరుసు సంతోషించాడు. సుందరం తనను మనస్పూర్తిగా మెచ్చుకుంటున్నట్టు వాడు గ్రహించాడు.
"వెధవ ఆరుమోనియం వాయించటానికి నేర్చుకోవాలి కూడానా? ఇంకా పాటన్నావ్? అది చాలా నేర్చుకోవాలి. వచ్చేయేడు చూసుకో ఎట్లా పాడతానో. నాటక బృందం ఒకటి తయారు చేస్తున్నాలే. మనమాటవినే పిల్లకాయలున్నారు." అన్నాడు సరుసు.
సరుసు మాట్లాడుతుంటే వాడు ఎవరినో ఎందుకో అపహాస్యం చేస్తున్నట్టు సుందరానికి తోచింది. తననుచూసి తానే నవ్వుకుంటున్నాడేమో కూడా సుందరానికి తెలియలేదు. నిజానికి సరుసు మనఃప్రవ్రుత్తి ఎట్లా పరిణమించిందీ ఊహించగల స్థితిలో లేడు సుందరం. సరుసు కివాళ దేనిమీదా పెద్ద విశ్వాసంలేదు. ఇప్పుడు వాడు తన ఆనందంకోసం తనలోనే వెతుక్కుంటున్నాడు. వాడిలో ఉన్నపట్టుదల ఇప్పుడు మామూలు మార్గాలు వదిలేసి కొత్త మార్గాలు పడుతున్నది. లేకపోతే కొద్ది మాసాలలో వాడు ఇంత సంగీత సాధన చేయటం సాధ్యంకాదు.
