"మీరు ఫాలో అవటం అనుమానించి శరత్ వ్యక్తే అలా చెప్పి ఉండొచ్చుగదా సార్" వేణు అనుమానంగా అన్నాడు.
"అదంతా హైదరాబాద్ లోనే తెలుస్తుంది. మొత్తానికి మనకు కావల్సింది ఆ ఆడ వ్యక్తి."
"మీరు ఏ ఫ్లయిట్ లొ వస్తున్నారు సార్?"
"నన్నేం రిసీవ్ చేసుకోనక్కర్లేదు. మరో నాలుగ్గంటల్లో నేను ఆఫీసులో ఉంటాను. నేను వచ్చేలోగా అన్నీ ఫైల్ చేసి పెట్టు."
"ఎస్ సర్..."
అవతలి వైపు ఫోన్ పెట్టిన చప్పుడు. వేణు ఫైల్స్ సరిచేయడంలో మునిగిపోయాడు.
* * * *
అయితే మొత్తానికి ఈ హెచ్చరిక పాఠకుల్లో సంచలనం సృష్టిస్తుందన్న మాట. ఎక్కడ విన్నా అవే కబుర్లు. మీ ఎడిటర్ ఏమంటున్నాడు" అడిగాడు నిఖిల్.
"ఆయన కొంత బాధ పడినప్పటికీ....పత్రిక సర్క్యులేషన్ ఒక్కసారిగా లక్షల్లో పెరిగేసరికి సంతోషపడుతున్నాడు."
"ఒక సంచలనాన్ని క్యాష్ చేసుకోవటం వాళ్ళ బిజినెస్ కి గుండెకాయ" పేలవంగా చెప్పాడు భార్గవ.
"హెచ్చరికలు చేస్తున్న వ్యక్తి పాఠకురాళ్ళలో ఒకరై ఉండాలి. లేదా నీకు ప్రత్యర్ధులైన రచయిత్రులెవరైనా ఉన్నారా? జెలసీతో ఇలా చేస్తూ ఉండొచ్చు. ఏమంటావ్ భార్గవ! అన్నాడు సిగరెట్ బూడిద యాష్ ట్రేలో దులుపుతూ.
"నా పాఠకులంతా నన్ను ఆరాధించే వాళ్ళే. ఇకపోతే రైటర్స్ లోనూ నాకెవ్వరూ శత్రువుల్లేరు. క్రొత్తదనం కన్పిస్తే పాఠకులు ఇదైపోతారు. ఈ మాసం సంచికని క్యూలో నిలబడి కొనుక్కొంటున్నారు. వాళ్ళ బలహీనతని డబ్బుగా మార్చడానికి మా ఎడిటర్ మరో ప్లాన్ వేశాడు. 'ఇలాంటి హెచ్చరికలు మీకు వస్తే...' అవి కొందరి రచయితల ఇంటర్వ్యూలు చేస్తున్నారు? ఈ సంచికనుంచి..."
నిఖిల్ నవ్వాడు ఏదైనా 'డిటో' చేసేవాడే ఎ'డిటోర్' అనొచ్చు. మరి ఈ సారి ఏ రచయితను ఇంటర్వ్యూ చేశారు?" అని పత్రిక పేజీలు తిరగేశాడు నిఖిల్. ఓ పేజీలో ఇంటర్వ్యూ కనపడింది. నిఖిల్ కు నవల్లు చదివే అలవాటులేదు. భార్గవ "అదే...ప్రముఖ రచయితలు కొమ్మూరి సాంబశివరావుగారితో చేసిన ఇంటర్వ్యూ" అనే సరికి చదివాడు.
ప్రశ్న: "సాంబశివరావ్ గారూ! మీరు ఒక గొప్ప రైటర్ కదా! భార్గవ గారి "తూర్పు పడమర ఎదురెదురు" సీరియల్ సంచలనం సృష్టిస్తోంది ఈ మధ్యకాలంలో అయితే అందులోని మౌనిక పాత్రకు ప్రాణం వచ్చినట్లు అదే పేరుతో ఒక వ్యక్తి భార్గవగార్ని నిరంతరం హెచ్చరిస్తున్నట్లు మేం ప్రచురిస్తున్నాం. ఈ విచిత్ర హెచ్చరికకు మీరెలా ప్రతిస్పందిస్తున్నారు?"
కొ.సా. జవాబు: "లేదు ఒక పాత్ర బ్రతికొచ్చి ఆ రైటర్ ని బెదిరించటం నవలా సృష్టిలో జరుగొచ్చు కానీ....నిజ జీవితంలో జరగడానికి ఎంత మాత్రం వీలులేదు కాక వీల్లేదు. ఆ వ్యక్తి తప్పక పట్టుబడుతుంది."
"థాంక్యూ అయితే పేరుకోసం ఆ రచయితే ఇది సృష్టిస్తుండొచ్చని ఒక పాఠకుడు ఆరోపిస్తూ మాకు లెటర్ రాశాడు. దీనికి మీరేమంటారు?"
కొ.సా జవాబు: లేదు. భార్గవ నాకు తెల్సిన వ్యక్తి. అతనిలో కీర్తి కాంక్ష ఎంత మాత్రం లేదు. ఒక రచయిత తనకు పేరు రావడానికి పేపర్ పబ్లిసిటీ కోరుతాడుగానీ....చచ్చీచెడి ఇలాంటి హెచ్చరికల ద్వారా మభ్యపెట్టరు. అలా అయినా పక్షంలో ఆయన, ఆయన తరపున మేం ఇంటర్ పోల్ డిటెక్టివ్స్ ని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది? అదెవరో పకడ్బందీగా చేస్తున్నారు కాబట్టి....డిటెక్టివ్ లకైనా పట్టుబడాల్సిందే."
ప్రశ్న: సాంబశివరావుగారూ! భార్గవ విషయంలో అలా ఉండనీయండి. అలాగే మీ నవలలోని ఒక పాత్ర బ్రతికొచ్చి నిజంగానే మిమ్మల్ని హత్య చేస్తే...?
కొ.సా. జవాబు: (నవ్వు) అలా ఎవరికీ జరుగదు. ఒక వేళ నా పాత్ర ఏదైనా బ్రతికొచ్చి నన్ను చంపినా...నేను సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్ బ్రతికొచ్చి ఆ పాత్రను చంపేస్తాడు. దట్స్ ష్యూర్ (మళ్ళీ నవ్వు).
ఇదే పత్రిక కొమ్మూరి సాంబశివరావ్ గారి అభిమాని అయిన మరో ప్రఖ్యాత రచయిత 'మల్లాది' గార్ని అదే ప్రశ్న అడిగినప్పుడు__
"నేనెలా ఉంటానో నా పాఠకులకు తెలీదు. అలాగే నా పతఃరాలకు కూడా తెల్సివుండదు. అందుకే నన్నెవరూ చంపరు. నా సర్కిల్ లో నాకు శత్రువులు కూడా లేరు కాబట్టి" అని చమత్కరించారు.
అదే ప్రశ్న యండమూరిని అడిగితే__
"నన్ను చంపే ముందు.......చంపి రమ్మంటాను. ఎందుకంటే నా మీద చాలా మందికి అదే అభిప్రాయం కాబట్టి....ఈ జవాబే సమంజసంగా ఉంటుందని" నవ్వుతూ చెప్పారు.
నిఖిల్ చదవటం ఆపి పత్రిక మూసేస్తూ..."మొత్తానికి మీ ఎడిటర్ చాలా తెలివైనవాడు. ఒక భయాన్ని క్యాష్ చేసుకోవడం అతనికే చెల్లు..." అన్నాడు.
భార్గవ నిట్టూర్చి కుర్చీ వెనక్కి వాలాడు.
"నిర్లిప్తలేదు. సుగాత్రి వాళ్ళింటికిపోయింది. అందుకే నేనే కాఫీచేసి తెస్తానుండు" అని లేచి వంటగదిలోకి పోయాడు నిఖిల్.
ఒక నిమిషం తర్వాత-
అప్పుడు మ్రోగింది ఫోన్-ట్రింగ్...ట్రింగ్....ట్రింగ్ మని.
భయాన్ని బట్టి ఏ చప్పుడైనా ఉలికిపాటు తెప్పిస్తుంది అదే భార్గవలో.
ఓ అరనిమిషం తర్వాత__
