Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 36

    "బెర్తులా?...ఎక్కడా??... నా జేబులో ఏం లేవే?...హిహిహి"అన్నాడు అందరివైపు కొంటెగా చూస్తూ.
    అందరూ పడీపడీ నవ్వారు.
    "భలే జోకేసారు సార్..."అన్నారు.
    "సార్... సార్... మరేమో మీరు ఓ జోకేసారు కదా... నేను కూడా మాంఛి జోకేస్తాను సార్... అలా పక్కకి వస్తారా?..."ఒకతను టిక్కెట్ కలెక్టర్ వంక మరింత కొంటెగా చూస్తూ అన్నాడు.
    "పద... పద... నువ్వెట్టాంటి జోకేస్తావో చూద్దాం..."అన్నాడు టిక్కెట్ కలెక్టర్.
    "సార్... సార్... ఆ జోకేంటో మేం కూడా వింటాంసార్..."అన్నాడు అంకారావు ఉత్సాహంగా.
    జోకేస్తానని అన్నాయన అంకారావువైపు కోపంగా చూశాడు.
    "వీల్లేదు..అసలు టిక్కెట్ కలెక్టర్ నువ్వా ఈయనా?... నేనేసే జోకు కేవలం టీసీగారే వినాలి!!!" అనేసి టిక్కెట్టు కలెక్టర్ ని కాస్త దూరానికి తీస్కెళ్ళాడు.
    అక్కడినుండి వెనక్కి గుంపు దగ్గరికి వస్తూనే టీసి ఫకాల్మని నవ్వుతూ"భలే జోకేసడయ్యా ఈయన... నాకు బాగా నచ్చింది... అందుకే ఈయనకి ఒక బెర్తు ఇచ్చేసా..."అన్నాడు.
    "సార్...సార్...సార్... ఇప్పుడు జోకు నేను వినిపిస్తా సార్... ప్లీజ్ సార్"అంటూ ఇంకో ఆయన టీసిని పక్కకి లాక్కెళ్లిపోయాడు.
    టీసి భడేళ్ మని నవ్వుతూ అతనికి రెండు బెర్తులు ఇచ్చేసాడు.
    అలా ఒక్కొక్కరు విడివిడిగా టీసిని పక్కకి లాక్కెళ్లి జోకులు చెప్పసాగారు.
    అంకారావుకి కంగారు పుట్టింది.
    లాభంలేదు... తను త్వరగా జోక్ చెప్పకపోతే తనకి బెర్త్ మిగలదు...
    "టీసీగారూ... టీసిగారూ...నేనుకూడా ఓ జోక్ చెప్తానండీ... ప్లీజ్ నాకేమో మంచి మంచి జోకులు వచ్చు... హిహి"అన్నాడు అంకారావు టీసీ ముందు చేతులు నలుపుకుంటూ, నవ్వేస్తూ.
    "ఏంటి మరీ అట్లా నవ్వేస్తున్నావ్?...
    "ఆ జోక్ తల్చుకుంటే నాకు చెడ్డ నవ్వొచ్చేస్తుందండీ... హిహి... మరి మీక్కూడా చెప్పానా?హి?"
    "ఏదీ... ఏదీ చెప్పు చూద్దాం..."అంటూ అంకారావుని పక్కకి తీస్కెళ్ళాడు టిక్కెట్ కలెక్టర్.
    అంకారావు చేతులు కట్టుకుని జోక్ చెప్పసాగాడు.
    "మరేమో ఒహడున్నాడటా...హి! వాడేమో బజార్లో నడుస్తుంటే హిహి... ఒక ఫ్రండు తగిలాడటా... హిహిహి... ఆ ఫ్రండుకి నున్నటి గుండూ, దానికి ఓ పిలకా ఉన్నాయటా...హిహి..."
    జోక్ పూర్తిగా చెప్పాడు అంకారావు.తర్వాత పొట్టపట్టుకుని కిందపడి దొర్లి దొర్లి నవ్వాడు తనేసిన జోక్ కి తనే...
    తర్వాత మెల్లగా క్రిందపడి లేచి బట్టలు దులుపుకుని "మరి మీరు కింద దొర్లరాసార్?" అని అడిగాడు అంకారావు.
    "ఏంటి?...ఇది జోకా?... నాకేం నవ్వు రాలేదు... నేను దొర్లను!! ఇందాక వాళ్లేసిన జోక్ కే నేను కిందపడి దొర్లలేదు... నీ చచ్చు జోక్ కి నవ్వుతానా విసుగ్గా చూస్తూ అన్నాడు టిక్కెట్ కలెక్టర్.
    "పోనీ ఇంకో జోక్ చెప్తా...ఏం?" బుర్ర గోక్కుంటూ ఆలోచిస్తూ అన్నాడు అంకారావు.
    "లాభం లేదయ్యా... నువ్వు ఎన్ని జోకులు చెప్పినా నాకు నవ్వురాదు... నాకు నచ్చే జోక్ నువ్వు చెప్పలేవు... కాబట్టి నీకు బెర్త్ ఇవ్వను..."
    "పోనీ మీకెట్టాంటి జోక్ నచ్చుతుందో చెప్పండి... చెప్తా"
    "ఇరవై రూపాయలు తీసివ్వు...హి?..."అన్నాడు టీసి.
    అంకారావు జేబులోంచి ఇరవై రూపాయలు తీసి టీసీ చేతిలోపెట్టి, ఆలోచిస్తూ పైకిచూస్తూ జోక్ చెప్పడం ప్రారంభించాడు."మరేమో ఒహడున్నాడటా... వాడేమో షాపుకెళ్లీ..."
    "చాల్లే... ఆపు! నువ్వింకే జోకూ చెప్పనక్కర్లేదు... నువ్విరవై రూపాయలిచ్చావ్ గా... అదే నాకు నచ్చిన జోకు..."అంటూ భళ్లున నవ్వేసాడు టీసీ."నీకు బెర్త్ ఇచ్చేస్తున్నా ఫో..."అన్నాడు.
    ఆ విధంగా ట్రైన్ లో బెర్త్ సంపాదించాడు అంకారావు.
    రైలు కదిలింది...
    రెండున్నర గంటల తర్వాత రైలు కాజీపేట స్టేషన్ చేరింది.అక్కడ రైలు పావుగంటసేపు ఆగుతుంది.
    కాఫీ తాగుదామని ఫ్లాట్ ఫాం మీదికి దిగాడు అంకారావు. అతని కంపార్టుమెంటు పక్కనే ఉన్న ఫస్టుక్లాసు కంపార్టుమెంట్ నుండి ఒక యువకుడు దిగాడు. అతను కూడా అంకారావుతోబాటు కాఫీ కొనుక్కుని వెక్కి వెక్కి ఏడుస్తూ తాగుతున్నాడు.
    "ఏమైందండీ... ఎందుకలా ఏడుస్తున్నారు?మీ సామాన్లెవరైనా కొట్టేసారా?" అతన్ని అడిగాడు అంకారావు.
    "కాదండీ...నాకు కొత్తగా పెళ్లయింది... నా భార్యతో హానీమూన్ వెళ్తున్నా... అందుకని కూపే ఇస్తారు కదా అని రెండు వారాలముందు ఫస్టుక్లాసు టిక్కెట్లు కొనుక్కున్నా..."చెప్పడం ఆగి వెక్కాడు.
    "అయితే ఏమైంది?"
    "కూపే కొత్తగా పెళ్లయిన జంట మాకివ్వకుండా కావాలనే ఆ టీసీ డెబ్బయి సంవత్సరాల వృద్ధి జంటకి ఇచ్చాడు. మా కంపార్టుమెంట్లోనే ఉన్న ఇంకో కూపే ఇద్దరు మగాళ్ళకి ఇచ్చాడు... కావాలనే వా..." భోర్ ర్ మన్నాడు ఆ యువకుడు.
    "మీరోపని చేయండి..."అన్నాడు అంకారావు.
    "ఏమిటి?" ఏడుపాపి అడిగాడు అతను.
    "టీసీకి జోక్ చెప్పండి... మీకూ కూపే ఇచ్చేస్తాడు"
    అర్ధంకాక వెర్రిమొహం వేస్కుని అంకారావు వంక చూసాడు ఆ యువకుడు.
                                                                              *   *   *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS