Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 36

    ఇద్దరు కానిస్టేబుల్స్ గోపీ చెరో రెక్కా పట్టుకుని గుడిసె బయటకి లాక్కుని వచ్చారు. వాళ్ళ వెనకాలే మిగతా కానిస్టేబుల్స్, ఇన్ స్పెక్టర్ కూడా బయటికి వచ్చారు.
    అక్కడ గంగ కన్నీళ్ళు కారుస్తూ నిల్చుని ఉంది.
    దాన్ని చూడగానే గోపి కానిస్టేబుల్స్ చేతుల్ని విదిలించి కొట్టాడు. గబగబా గంగ దగ్గరకి వెళ్ళి దాని ముందు మోకాళ్ళమీద కూర్చన్నాడు.
    "గంగా నువ్వైనా చెప్పు. నేను సీతాలుని హత్య చేశానా? చెప్పు గంగా చెప్పు"అంటూ గంగ పీక పట్టుకుని ఊపేస్తూ అడిగాడు గోపి.
    గంగ తల అడ్డంగా ఊపి "భే... భే..." అంది.
    "చూశావా ఇన్ స్పెక్టర్! నోరులేని ఈ అమాయకపు జంతువు కూడా నేను చంపలేదని చెప్తుంది. పసిపిల్లలూ, ఆవులూ, పందులూ, వీటి సాక్ష్యాలు పనికిరావు. పద పద ముందు జీపెక్కు" అన్నాడు గోపిని ముందుకు తోస్తూ హెడ్ కానిస్టేబులు.
    అప్పటికే గూడెంజనం అంతా అక్కడ మూగారు. అందరూ గోపివంక ఏహ్యభావంతో చూడసాగారు.
    "వద్దు. అలా చూడకండి. నేను సీతాలుని హత్య చెయ్యలేదు.
    నాకేం తెలీదు. నిజంగా నాకేం తెలీదు" అడుగులు ముందుకు వేస్తూ వాళ్ళవంక  దీనంగా చూస్తూ అన్నాడు గోపి.
    "ఛీ..."
    "థూ..."
    జనంలోంచి ఎవరో అన్నాడు.
    "మీరు కూడా నన్ను నమ్మరా? హయ్యో భగవంతుడా" సంకెళ్ళతో నెత్తి కొట్టుకున్నాడు గోపి. ఆ దెబ్బకి బుర్ర చితికి నుదుటిమీదికి రక్తం కారడం మొదలుపెట్టింది.
    "ఊ... ఊ...పద" ఓ కానిస్టేబులు గోపి భుజంమీద చెయ్యేసి ముందుకు తోశాడు.
    గోపి జీపును సమీపించి ఎక్కబోతూండగా.
    "హేవండీ"
    పెద్ద కేక వినవచ్చింది.
    గోపీ వెనక్కి తిరిగి చూశాడు.
    రాధ చీర కుచ్చెళ్లని తన్నేస్కుంటూ, పడ్తూ లేస్తూ పరుగులు పెడ్తూ వస్తూంది.
    "రాధా..."
    గోపి ఇంకా పెద్దగా అరిచి, తనని పట్టుకున్న పోలీసులను విదిలించికొట్టి పరుగున రాధకి ఎదురువెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు.
    "హేవండీ..."
    "రాధా..."
    ఇద్దరి గొంతుల్లో బాధ.
    "ఏవిటండీ ఇదీ?"
    "నాకేం తెలియదు రాధా. సీతాలుని నేను చంపలేదు రాధా...నేను చంపలేదు! ఈ ప్రపంచంలో ఏ అన్నయ్యయినా చెల్లెల్ని చంపుతాడా రాధా?..."
    "నాకు తెలుసండీ ఒక మనిషిని చంపేంత కసాయి గుండె కాదండీ మీది. మీరు దేవుడండీ... దేవుడు"
    "చాలు రాధా!చాలు! ఈ ప్రపంచంలో ఎవరు నమ్మకపోయినా నాకు లెక్కలేదు. రాధా నువ్వు నమ్మావ్. అది చాలు రాధా అది చాలు."
    "కానీ మీకు శిక్షపడకూడదంటే జడ్జికూడా మిమ్మల్ని నమ్మాలండీ" బాధగా అంది రాధ.
    "అది కూడా నిజమేననుకో" నసిగాడు గోపి.
    "ఊ... ఊ... ఇంకా చాల్లే... దా" ఇన్ స్పెక్టర్ గర్జించాడు.
    "హేవండీ" రాధ మళ్ళీ గట్టిగా అరిచి గోపిని వాటేస్కుంది.
    "రాధా" గోపి రాధని తన కౌగిట్లో బంధించాడు.
    కానీ ఖాకీ డ్రెస్ కసాయితనం వాళ్ళ అన్యోన్యాన్ని చూసి సహించలేకపోయింది.
    ఒక కానిస్టేబుల్ గోపీని, మరో కానిస్టేబుల్ రాధని పట్టిలాగి విడదీసారు.
    "రాధా" ఒక చెయ్యి చాపుతూ అరిచాడు గోపి కానిస్టేబులు రెండోచేతిని పట్టి జీపు దగ్గరకి లాక్కెళుతుంటే.
    "హేవండీ..." రాధకూడా ఓ చెయ్యిచాపి శక్తివంచన లేకుండా అరిచింది.
    ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ గోపిని ఎత్తి జీపులో కూలేశారు. రాధని పట్టుకున్న కానిస్టేబులు రాధని ఒక్క నూకునూకాడు. రాధమట్టిలో బోర్లాపడి కేర్ కేర్ మంది.
    రాధని తోసిన కానిస్టేబుల్ కూడా పరుగున వెళ్ళి జీపు ఎక్కేశాడు.
    జీపు దుమ్మురేపుకుంటూ ముందుకు కదిలింది.
    "రాధా..." జీపులోంచి రెండు చేతులూ చాపి జీపు వెనకాల పరిగెత్తింది.
    జీపు స్పీడందుకుంది.
    రాధ పరుగెత్తి చీరకుచ్చిళ్ళు కాళ్ళకు తట్టుకుని బోర్లా పడింది.
    హఠాత్తుగా ఓ గుడ్డి బిచ్చగాడికి మూడ్ వచ్చి హార్మానీ వాయిస్తూ పాటందుకున్నాడు.
    "ఇది దేవుడు చేసిన బొమ్మా   
    దీనికి బాధలు ఎన్నెన్నో మట్టిబొమ్మా    ఈ బంధాలే ఒక మాయా
    అనుబంధాలే మహా మాయా
    తెలుసుకు మసలరో బావా
    ఎవరికీ ఎవరూ???"
    పాట వింటూ కుమిలి కుమిలి ఏడ్చింది రాధ... మట్టిలో పొర్లుతూ.

                                                               30
    రాధ మంచంమీద పడుకుని వెక్కివెక్కి ఏడుస్తూంది.
    "అమ్మా రాధా. ఎంతసేపని అలా బోర్లాపడుకుని ఏడుస్తావమ్మా, లేమ్మాలే." అంది సరస్వతి రాధ తల నిముర్తూ.
    వెంటనే రాధ వెల్లకితలా తిరిగి తన ఏడుపు కొనసాగించింది.
    "హమ్మా రాధా! బోర్లాపడుకుని ఉన్న నువ్వు వెల్లకిలా తిరిగి ఏడవమని కాదమ్మా ఉద్దేశం. మంచంమీంచి లేవమ్మా." భారంగా అంది సరస్వతి.
    రాధ మంచంమీంచి లేచి సరస్వతిని పట్టుకుని బావురుమంది.
    "హత్తయ్యా..."
    "ఊర్కో అమ్మా. ఊర్కో. కష్టాలు మనుషులకు కాకుండా మానులకొస్తాయా. మన గోపి ఈ హత్య చెయ్యలేదని నా అంతరాత్మ చెప్తుందమ్మా. నా అంతరాత్మ చెప్తుంది. వాడు మనిషి కాడమ్మా! వాడు మనిషి కాదు. వాడు మనుషుల్లో దేవుడు" రాధ వీపునిముర్తూ ఊరడించింది సరస్వతి.
    "కానీ ఆయన మనుషుల్లో దేవుడని పోలీసులు నమ్మాలి కదత్తయ్యా?" వెక్కుతూ అంది రాధ
    "తప్పకుండా నమ్ముతారమ్మా. నాకా నమ్మకం వుంది. అంతిమవిజయం ఎప్పుడూ న్యాయానిదేనమ్మా. అన్యాయం ఎప్పుడూ ఓడిపోతుందమ్మా."
    "ఎంత చక్కని జీవితసత్యం చెప్పారత్తయ్యా." కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ.
    "పదమ్మా పద... కాస్త మింగుదువుగాని..." అంది సరస్వతి రాధతో.
    "వద్దత్తయ్యా. నాకు తిండి సహించట్లేదు."
    "అలా అంటే ఎలాగమ్మా. కాస్త ఎంగిలిపడుదువుగానీ రా. ఈ పాడుపొట్టని భగవంతుడు ఇచ్చింది ఇన్ని మెతుకులు మింగడానికే నమ్మా. రామ్మా రా."
    "వద్దత్తయ్యా నాకు సహించదు!"
    "అలాగనకమ్మా. ఈపూట చికెన్ బిర్యానీ చేసాను. వేడివేడిగా కాస్త తిందువుగానీ రా" ప్రేమగా అంది సరస్వతి.
    "సర్లే. నీ ఇష్టం అత్తయ్యా." అంటూ వంటగదివైపు అడుగులు వేసింది రాధ.
    సరస్వతి తృప్తిగా బుస్సున ఓ నిట్టూర్పు విడిచింది.
    ఇద్దరూ కంచాల్లో వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీవడ్డించుకున్నారు.
    సరస్వతి ఓముద్ద పైకెత్తి సర్రున లోపలికి లాగింది. రాధ కూడా కంచంలోంచి ఓ ముద్దతీసింది.
    కానీ ముద్ద నోట్లో పెట్టుకోకుండా అలాగే ఆగిపోయింది.
    "ఏంటి రాధా. ఆగిపోయావేం? ఊ లాగించు" అంది సరస్వతి మరో ముద్దని చేతిలోకి తీస్కుంటూ.
    "ఏం లేదత్తయ్యా. పాపం ఆయనెలా ఉన్నారో... ఏం తింటున్నారో? మనం ఇక్కడ చికెన్ బిర్యానీలు తింటున్నాం. పాపం! అక్కడ జైల్లో ఆయనకి బొద్దింకల సాంబారన్నం పెడ్తున్నారో ఏంటో!" కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అంది రాధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS