Previous Page Next Page 
ఎండమావులు పేజి 36


    ఆలోచించి ఏదో పరిష్కారానికి వచ్చిన వాడిలా కూర్చున్నాడు జానకిరాం. మెల్లిగా తన పెట్టె తీశాడు, ఎక్కడో పెట్టి అడుగున ఉన్న ఉత్తరం తీశాడు. ఆ రోజున గౌతమి వ్రాసిన ఉత్తరం అది, ఒకటి రెండు సార్లు మళ్ళీ చదువుకున్నాడు. అప్పటికి సాయంత్రం నాలుగున్నర దాటింది. మెల్లిగా గౌతమి పని చేసే ఆఫీసు వైపు వెళ్ళాడు. కాసేపు చెట్ల నీడల్లో పచార్లు చేశాడు. అయిదు దాటింది. ఆఫీసునుంచి ఒక్కొక్కరే వెళుతున్నారు. అంత దూరాన గౌతమి, ఆమె పక్కన మరో ఆమె కను పించారు. గౌతమి ఉత్తరంలో రాసినట్లుగా ఆమే నగేంద్రబాల అనుకున్నాడు. వాళ్ళకు కనిపించకుండా చెట్ల చాటున నిల్చున్నాడు. గౌతమీ, నగేంద్రబాల మెల్లిగా నడిచి వెళ్ళారు. గౌతమిని చూశాడు జానకిరాం. అందమైన పువ్వుల చీరె కట్టుకుంది గౌతమి. అందుకు అమరిన జాకెట్టు చేతుల్లో చిన్న సంచీ, మనిషి కొంచం నల్లబడ్డది. ముఖంలోని అందమూ, వర్చస్సూ తగ్గలేదు. జీవితాధ్యాయంలోని విషాదచ్చాయలు ఆమె ముఖంలో చూడగలిగాడు జానకిరాం. ఆ కళ్ళలోని నిస్సార మైన చూపులు జానకిరాంను చకితుడిని చేసినయ్యి. మనిషి ఇక్కడా, మనస్సు ఎక్కడో అన్నట్లుంది ఆమె తీరు, అయిదేళ్ళుగా కాపురం చేసి, కష్ట సుఖాల్ని పంచుకుని, ఆనందానుభూతుల్ని మేళవింప జేసి చిరు కోపంతో, అభిమానంతో అస్తవ్యస్తంగా తనతో మాట్లాడుతూ, తనకు కోపం తెప్పించి, తను విచార పడుతూ తన బాహువల్లరిలో ముగ్ధమోహన సౌందర్యాతిశయంతో ఇమిడి ఉండవలసిన తన అర్ధాంగి గౌతమిని చెట్టు చాటునుంచి చాటుగా, మాటుగా చూడవలసిన పరిస్థితి ఏర్పడినందుకు మనస్సులో నవ్వుకున్నాడు జానకిరాం. అకారణం గానో, సకారణంగానో ఆమె ఎప్పుడూ తనతో ఏదో మాట్లాడుతూనే ఉండేది. ఆ కబుర్లన్నీ ఇప్పుడు ఏమై పోయినయ్యి.
    గౌతమి, నగేంద్ర బాల వెళ్ళిపోయారు. జానకిరాం మనస్సు ఉద్విగ్నమై ఉంది. అడుగులు బరువుగా వేసుకుంటూ వాళ్ళకు వందగజాల దూరంలో కనుచూపు మేరలో ఉంటూ నడిచాడు. కొంత దూరం వెళ్ళాక నగేంద్రబాల తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు గుర్తు పెట్టుకున్నాడు జానకిరాం. గౌతమి వంటరిగానే వెళుతోంది. తన ఇంటికి వెళ్ళుతోంది. కాదు పుట్టింటికి వెళ్ళుతోంది. తన మామగారిల్లు వస్తోంది. అల్లంత దూరంలో నిల్చుని చూస్తుండగానే గౌతమి ఇంట్లోకి వెళ్ళి పోయింది.
    అది ఒక వీడ్కోలు సన్నివేశమే అయింది. వారి జీవితాల్లో ఈ జీవన నాటకానికి అత్యంత స్థూల మైననాందీ ప్రస్తావన ఉద్యోగం. దీనికి ఉప సంహార మేమిటో ఎవరికీ ఇంతవరకూ తెలీదు. ప్రేమ, వాంఛ, కోరికలతో కలకాలం కాపురం చేయవలసిన తమ దాంపత్య జీవితంలో ఇప్పుడు ఏదో తెలీని ఒక సంఘటన తిష్ట వేసుకుని ఉన్నది. ఆ సంఘటన ఇప్పట్లో వైదొలగి పోతుందో ఇంకా గూడు కట్టుకుని కాపురం చేస్తుందో జానకిరాం కు అర్ధం కాలేదు. ఆదరంతో ఆహ్వానాన్ని అందుకుని అత్యంత ప్రేమ పూరితమైన ఆదరాభిమానాలలో అడుగిడ వలసిన మామగారి ఇంటిని అంత దూరానుంచే చూసి వెనక్కు తిరిగాడు జానకిరాం. వివాహమై పునః సంధానమైన కొత్త రోజుల్లో తను ఆమెను విడిచి వచ్చేటప్పుడు అశ్రు పూర్ణ నేత్రాలతో ఆ వరండాలో నిల్చుండి చూసింది ఒకానొకప్పుడు గౌతమి. ఆమె చిత్త శుద్ధిని, ప్రేమ నిర్మలతనూ, ఆత్మ తృప్తినీ తల్చుకుంటూ తను ఇప్పుడు నిల్చున్న చోటువరకూ వచ్చి వెనుదిరిగి చూస్తూ వెళ్ళిపోయేవాడు ఆ రోజుల్లో. ఈ రోజున ఆ స్థలంలోనే నిల్చుని ఆ సాయం సంధ్యారాగ సమయంలో ఆ ఇంటి వైపు చూసి వెళ్ళటమే తప్ప ఒక్క అడుగు ముందుకు వెయ్యలేక పోయాడు. జానకిరాం. అతని మనస్సు ఉరకలు వేసినా, కాంక్షలు కళ్ళు తెరచినా అభిమానం వాటినేకాక, తనను కూడా అమాంతంగా నెట్టి వేసింది. ఎవరయినా తెల్సినవాళ్ళు చూస్తారేమోనని వెంటనే రిక్షా ఎక్కి పావు గంటలో తన హోటలు గదిలో ప్రవేశించాడు జానకిరాం.
    పంకా వేసి పడుకున్నాడు. గిర్రున పంకా తిరుగుతోంది. నా జీవితమూ ఒక ఉపగ్రహం గమనంలానే ఉంది. గమ్యస్థానం చేరుకోలేక యధా స్థానానికి చేరినట్లుగానే ఉంది అనుకున్నాడు జానకిరాం మనస్సులో.
    అప్రయత్నంగానే అతని మనస్సులో నగేంద్ర బాల ప్రవేశించింది. ఈవిడ స్నేహం చేసి గౌతమి ఇట్లా ఉన్నదా? భర్తని వదిలేసి ఉద్యోగం చేసుకుంటూ నీపోట్టబోసుకోమని ఈవిడ గౌతమికి ఉపదేశం చేసిందా? నాకన్న ఈవిడ బోధలే తన జీవితాన్ని తీర్చి దిద్దగలుగుతయ్యని గౌతమి నిర్ణయానికొచ్చిందా?
    ఒక్కసారి నగేంద్రబాలతో మాట్లాడితే? తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది. ఆమె భర్తతో ఉన్నదో, తల్లి తండ్రులతో ఉన్నదో ఏం తెలుసు? మాట్లాట్టానికి వెళ్ళితే వాళ్ళేమనుకుంటారో? నీ భార్యను గురించి నేనిచ్చే సలహా ఏమిటండీ అంటే అప్పుడు తన అభిమానం దెబ్బతినదూ? ఇది అర్ధంలేని అపరిష్రుత సమస్యలానే తోచింది జానకి రాంకు. కాని ఏదో ఒక త్రోవ తొక్కాలి. సరాసరి మామగారింటికి వెళ్ళటం సిగ్గుచేటనిపించింది అతనికి. ఏదో ఒక అర్ధం చేసుకోలేని నిర్ణయని కొచ్చాడు.
    ఆ రాత్రి హోటల్లోనే గడిచింది.
    మర్నాడు ఉదయాన్నే లేచి ఏడు గంటలకల్లా నగేంద్రబాల ఇంటికి వెళ్ళాడు జానకిరాం. ఇంట్లోకి వెళ్ళటానికి సిగ్గనిపించింది. తన భార్య విషయమైన సంగతులు ఆమె స్నేహితురాలి ద్వారా కనుక్కోవట మేమిటనిపించింది. చివరికి నా ప్రవర్తన ఈ రీతిగా మారిందేమా అనిపించిందతనికి. ఎవరికోసం ఈ సంప్రదింపులు, ఎవరి కోసం ఈ అన్వేషణ. ఈ జీవితంలోని అన్ని యదార్ధ విషయాలకూ తనే బాధ్యత వహిస్తూ ఉండి పరిస్థితుల ప్రాబల్యానికి తట్టుకోలేక స్వప్నా వస్థలో ఉన్నవాడిలా ఇట్లా ప్రవర్తించటమా? అర్ధంకాని ఈ మానసిక వ్యధ పోవటానికి ఈ నగేంద్రబాలతో సంప్రదింపులే మార్గదర్శకమౌతయ్యా లేక ఈ సంప్రదింపులతో అవహేళనపాలవుతానా?
    ఆలోచించుకుని లోపలికి వెళ్ళ బుద్ధి పుట్టక వెనక్కు తిరిగాడు జానకిరాం.
    "వచ్చి వెళుతున్నారేం. ఎవరు మీరు"
    వెనక్కు తిరిగి చూశాడు. నగేంద్రబాల ఏదో చెప్పబోయి ఆగాడు.
    "లోపలికొచ్చి కూర్చోండి మాట్లాడుదురు గాని" మర్యాదగా ఆహ్వానించింది నగేంద్రబాల. ఇంట్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగా నిల్చుంది నగేంద్రబాల.
    "మీ పేరు"
    "మీ పేరు నగేంద్రబాల కదూ"
    ఆశ్చర్యపడుతూ తల ఊపింది.
    "మీ స్నేహితురాలు గౌతమి కులాసాగా ఉన్నదా"
    మరీ ఆశ్చర్య పడింది నగేంద్రబాల.
    "మీరెవరో చెప్పనేలేదు. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వేస్తున్నారో నాకు తెలీటం లేదు."
    "ఏమీ లేదు. ఊరికినే తెల్సుకుందామని అడుగు తున్నాను. ఉద్యోగం చెయ్యాలనే కాంక్ష, ఆసక్తి ఆమెకు ఎక్కువనుకుంటాను. ఉద్యోగం చేస్తూ జీవించగలననే ధైర్యం ఆమెకున్నది కదూ" అన్నాడు ముభావకంగా.
    పొంగారిన సంతోషాతిశయంతో లోపలికి వెళ్ళి తల్లితో రెండు మాటలు మాట్లాడి కాఫీ తెచ్చి జానకిరాంకు ఇచ్చింది.
    "ఈ కాఫీ తీసుకోండి" మర్యాద ఉట్టిపడుతూ అన్నది.
    కాఫీ తాగాడు జానకిరాం. పక్కగా నిల్చుని అతని ముఖ కవళికల్ని కనిపెడుతున్నది నగేంద్రబాల.
    "ఉద్యోగం చేస్తూనే జీవించాలనీ, భర్తను దూరం చేసుకోవాలనీ గౌతమి ఎప్పుడూ అనుకోటం లేదు. తన ఉద్యోగం తాత్కాలికమేనని భర్త పిలుపుకోసం, ఆదరణ కోసం ఆమె నిత్యమూ ఎదురు చూస్తున్నదనీ నాకు తెల్సు, కానీ ఏ దుష్ట గ్రహమో ఆ భార్యా భర్తల్ని తాత్కాలికంగా విడదీసింది. ఆ రోజున ఆవిధంగా వచ్చేసినందుకు తన అవివేకాన్ని, విచారాన్ని వ్యక్త పరుస్తూ భర్తకు ఉత్తరం కూడా రాసింది. కాని వారి జాబు మాత్రం ఇంత వరకూ రాలేదు." అన్నది నగేంద్ర బాల.
    చకితుడైనాడు జానకిరాం.
    "తనంతట తానుగా తప్పు చేసినప్పుడు భర్తను క్షమార్పణ కోరుకుని తన తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం లేకుండా, ఒక్క ఉత్తరం రాసి తన బాధ్యత తీరి పోయిందనుకోటం సమజసంగా ఉందంటారా"
    నగేంద్రబాల మనస్సులోనే నవ్వుకుంది.
    "ఆ భార్యా భర్తల వ్యక్తిత్వాలు వాళ్ళకు తెల్సినంతగా నాకు తెలియవేమో. ఉద్యోగం మానేసి వచ్చెయ్యమని ఈ నాడు చెపితే సంతోషంగా రాజీనామా ఇచ్చి భర్త వెంట బయల్దేరి వచ్చేస్తుంది గౌతమి. ఆమె మనస్సు వెన్నెలాంటిది. చిలికితేగాని వెన్న రాదుకదా. ఆ నేర్పు అ భర్త మానసిక పధంలో లేకపోవచ్చు. కాకపోయినా పురుషులతో బాటుగా స్త్రీలుకూడా ఎగబడి ముందుకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో ఎమ్మే ఫస్టు క్లాసులో ప్యాసయి ఏ ఉద్యోగమూ చెయ్యనని శపథం పట్టి, తనకున్న విజ్ఞానాన్ని, చదువునూ భూస్థాపితం చేసి గోరీ కట్టబూనటం చదువుకున్న ఏ మగవారూ చేయవలసిన పని కాదు. అది ఏరకమయిన వ్యక్తి త్వానికి చెందుతుందో ఆ పరమాత్మునికే ఎరుక. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో" అన్నది నగేంద్రబాల.
    దెబ్బ తిన్నవానిలా తలెత్తి చూశాడు జానకిరాం. తల వంచుకుని అటువైపే చూస్తున్నది నగేంద్రబాల.
    "అంటే ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేని భర్తను ఈ ఒక్క మిషతో గౌతమి దూరం చేసుకో దల్చుకుంటే ఆమె వ్యక్తిత్వానికి అది గీటు రాయి వంటిదే అవుతుందేమో?" వ్యంగ్యంగా అన్నాడు.
    "ఎన్నటికీ కాదు. అనేక కారణాంతరాల వల్ల అలాంటి జీవితం గడిపే స్త్రీల విషయం నేను చెప్పటంలేదు. గౌతమి భావం మాత్రం అది కాదు. తన జీవితం భర్త సమక్షంలోనే వెళ్ళబుచ్చుకో వాలనే ఎప్పుడూ తాపత్రయపడుతుంది. భర్త ఆజ్ఞానుసారం, అతని ఇష్టా ఇష్టాలనే ఆధారం చేసుకుని ఆడది జీవించవలసినా, ఆవిడకూ ఒక వ్యక్తిత్వమూ, గౌరవమూ సంఘంలో ఉంటయ్యి. ఆ వ్యక్తిత్వానికి విఘాతం కలిగినప్పుడో, దెబ్బ తగిలినప్పుడో తాత్కాలికంగానైనా విరక్తి చెందటమనేది ఉప్పు, కారం తినే ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. భార్యా భర్తల్లోనే ఏ ఒకరైనా అదె కారణాన్ని ఆధారంగా తీసుకుని సంసారాన్ని పాడు చేసుకోకూడదు. సహనమనేది ఆడదానికి ఆభరణమైనా, ఆ ఆభరణాన్ని మగవాడు పాడు చెయ్యకుండా, అమ్ముకోకుండా కాపాడుకోవాలి. అప్పుడే సహనానికి సహజత్వం వస్తుంది. అది లోపించిననాడు ఆ సంసారం తమంతట తాముగానే పాడు చేసుకున్న వారవుతారు. ఇందుకు తార్కాణం గౌతమి సంసార జీవితమే. అందుకు ఆ భార్యా భర్తలిద్దరూ కారకులే. తప్పు ఇద్దరిలోనూ ఉన్నది." అన్నది నగేంద్రబాల ఉద్వేగంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS