Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 36

 

    ఈ హైదరాబాద్ నగరంలో అవసరానికి టాక్సీలన్నా దొరికి ఎడవ్వు. అరగంటలో తను అక్కడికి చేరగలడా?
    గదికి తాళం వేసి రోడ్డు మీద కాలుపెట్టిన ముకుందానికి ఓ అనుమానం కలిగింది.
    ఇంతా చేసి తనను స్త్రీ కాదని తెలిసి కున్న సుధారాణి సినిమాల్లోని హీరోయిన్ లాగ కోపంతో తాను చేసిన మోసాన్ని గురించి అర్ధగంట అనర్గళంగా ఉపన్యాసం దంచి, తుపుక్కున ముఖం మీద ఊసి , గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోతే? తనకు క్షమాపణ చెప్పుకొనే అవకాశాన్ని కూడా యివ్వకపోతే ?
    ముకుందానికి గుండెకాయ గొంతులోకి ఎగబాకినట్టయింది.
    అలా ఎప్పటికీ జరగదు. తను అనవసరంగా భయపడుతున్నాడు. అనుకొన్నాడు , మొండి కెత్తిన వాడిలాగా.
    ఆ అమ్మాయికి తన కధలంటే మహా ఇష్టం. చాలామంది స్టూడెంట్స్ కు కధలు రాసేవాళ్ళంటే ఇష్టం ........మహా పిచ్చి.
    పిచ్చికీ, ప్రేమకూ, అట్టే భేదం లేదని రాసింది తనేనా? కాదు .........ఎవరో పోనియ్ ....గుర్తు లేదులే.
    ముకుందం తనకు తానే సరి చెప్పుకుంటూ గొంతులోకి ఎగబాకిన గుండెకాయను యధాస్థానంలోకి పంపించే ప్రయత్నం చేయ్యసాగాడు.
    పెళ్ళి చేసుకోవడం అంటూ జరిగితే తను ప్రేమించి గాని పెళ్ళి చేసుకోకూడదని ఏనాడో నిర్ణయించుకున్నాడు. అమ్మా నాన్నా కుదిర్చిన ఏ అప్పలమ్మ మెళ్ళోనో తను చస్తే తాళి కట్టడు.
    ఒకవేళ సుధారాణికి తన రూపం నచ్చకపోతే తను పెద్ద చదువులు చదవలేదనీ , చిన్న గుమాస్తా అనీ తెలిసి చిన్నచూపు చూస్తే?
    ఎంత మనస్సును మభ్య పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నా ఏదో అనుమానం తేలు పిల్లలా కొండి ఎత్తుకొని ఆతని బుర్రలో అశాంతిగా తిరుగుతూనే ఉంది.
    ముకుందం ఊపిరి గట్టిగా పీల్చుకొని నడక వేగం హెచ్చించాడు.
    రూపం ఎందుకు? కోసుకుతినటానీకా? ఈ రోజుల్లో పెద్ద ఉద్యోగాలు చెయ్యడం గొప్పకాదు. అంతా ఇన్ ప్లుయన్స్. డిగ్రీలు ఎందుకు? ఎం.ఏ. చదినవాణ్ణి తాజమహల్ ఎవరు కట్టించార్రా అంటే, గుడ్లు మిటకరించుకొని చూస్తాడు. సమాజంలో విశిష్టస్థానం సంపాదించాలి. ఒక ప్రత్యేకతను సంపాదించుకోవాలి. తను రచయిత. ఈనాడు రచయిత లకూ, కళాకారులకూ, కవులకూ వున్న గౌరవం ఎవరికుంది? లోకంలో ఎందరు 'విగ్రహం పుష్టి - నైవేద్యం నష్టీ ' గాళ్ళు లేరు? బుర్ర నిండా వుంది బురదే అయినా పెద్దవాళ్ళ అండతో పెద్ద కుర్చీలు సంపాదించిన మొద్దబ్బాయిలూ , మొద్దమ్మాయిలూ ఎంతమంది లేరు? కాని రచయిత కావడం మాటలా? అందరికీ సాధ్యపడేదా? అసలు తన సుధారాణి .........రాణీ అంటేనే బాగుంది .....తను అలాగే పిలుస్తాడు.
    ఆ ఏమిటి తను అనుకుంటున్నది? తన రాణి ఆరాధిస్తున్నది తన రూపాన్ని, హోదానూ కాదుగా? తనలోని రచయితను ఆమె ఆరాధిస్తున్నది. తను రచయిత . ఆమెకు కావాల్సింది తను రచయితగానే.
    మొండిగా ఎదురుతిరుగుతున్న మనస్సును సమాధాన పర్చుకోసాగాడు.
    ముకుందం ఆలోచనలతో తల మునకలైపోతూ పబ్లిక్ గార్డెన్స్ లో ప్రవేశించాడు.
    ఆ బెంచీ ........అదే తన పక్కనే తన రాణీ కూర్చోబోయే ఆ బెంచీ ........తన ప్రణయజీవితంలోని మొదటి క్షణాన్ని ప్రసాదించబోయే ఆ బెంచీ అంటే తన కెంతో ఇష్టం. మొదట ఉద్యోగం దొరక్క బాధపడే రోజుల్లో, అంత పెద్ద గార్డెన్ లో ఎక్కడా చోటు లేనట్టు పెడగా, ఒంటిగా , మారు మూలగా వున్న ఆ బెంచీని తన జీవితంతో పోల్చుకొనేవాడు. ఆ బెంచీ కింద రోజులకొద్దీ కూర్చొని తన సోదను వెళ్ళబోసుకోనేవాడు. తనకు అది కష్టాలలో సానుభూతి చూపిస్తూ తనకు ఆశ్రయం ఇచ్చినట్లు ఊహించుకొనేవాడు.
    దూరంగా తనను చూసి "వస్తున్నారా? నీ కోసమే ఎదురు చూస్తున్నాను" అంటూ ఆ బెంచీ తనను ఆహ్వానిస్తున్నట్లు విచిత్రమైన అనుభూతిని పొందేవాడు. ఆకలి కడుపుతో ఎన్నో రాత్రుళ్ళు అ బెంచీ మీద మగత నిద్రలో గడిపాడు. ఆ బెంచీమీదనే ఉద్యోగం దొరికాక కూడా తాను దాని మీద ఏర్పడిన అనుబంధాన్ని తెంచుకోలేకపోయాడు. రోజూ సాయంత్రం ఆ బెంచిమీద గడపకపోతే తనకు పిచ్చెత్తినట్టుంటుంది. తన మొదటి కధ కూడా ఆ బెంచీ మీద కూర్చొనే రాశాడు. తన ప్రణయ జీవితంలో మొదటి ఘట్టం కూడా ..........
    ఆలోచిస్తూ ఆ బెంచీని సమీపించిన ముకుందం కరెంట్ షాక్ తగినట్టు త్రుళ్ళి పడ్డాడు. ఏనాడూ లేనిది ఆ బెంచి మీద మరో యువకుడు కూర్చొని వున్నాడు. ముకుందం నీళ్ళు కారిపోయాడు. టైం చూసుకున్నాడు. ఆరూ పదిహేను అయింది. ముకుందానికి ఏడుపొచ్చినంత పనయింది.
    ఆరుగంటలకే రాణీ వచ్చి ఆ బెంచీ మీద ఎవరో యువకుడు ఉండటం చూసి వెళ్ళిపోయిందేమో? అప్పుడే వస్తుందా? ఎందుకయినా మంచిది కాసేపు అక్కడ కూర్చుని చూస్తె సరి.
    బెంచీ కేసి నడుస్తున్న ముకుందాన్ని ఆ యువకుడు కుతూహలంగా చూస్తున్నాడు. ముకుందం ఆప్రయత్నంగానే చిరునవ్వు నవ్వాడు.
    "నాకు వీడెక్కడ దాపురించాడు." అన్నట్లు ఆ యువకుడు ముఖం చిట్లించుకొని తల తిప్పుకున్నాడు.
    ముకుందానికి అతని మీద పట్టరాని కోపం వచ్చింది. తన బెంచీ మీద వచ్చి కూర్చొని తన ప్లానంతా పాడుచేసింది కాకుండా పైగా తనను చూసి ముఖం చిట్లించుకొంటున్నాడు.
    ముకుందానికి అతన్ని చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది. చెట్టుకు కట్టి చింత బరికతో కొట్టాలనిపించింది.
    వీడెవడో పానకంలో పుడకగాడు తన మధుర స్వప్నాన్ని చెరిపేశాడు. "ఓ భగవంతుడా! ఇప్పుడు నీదే భారం ! ఇంతవరకూ తెచ్చి నన్ను దగా చెయ్యకు భగవాన్" అనుకొంటూ మనస్సులో భగవంతుడిని ధ్యానించుకొన్నాడు ముకుందం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS