Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 36


    పైన మూతగా ఉంచిన రాతిపలకలో మంచి పనివాడితనం కన్పిస్తోంది.
    బహుశా చలినించి, శత్రువులయిన అడవి జంతువులు ముట్టడించినప్పుడూ దానిలో దూరిపోయి అర్ధమానవుడు తనను తాను రక్షించుకుంటాడు.
    అది భూమినించి తొలిచిన తొట్టి కావటంనించి లోపల వెచ్చగానే ఉంది. సమాధిలాంటి అలాంటి గుహను తొలిచేందుకు అర్ధమానవునికి చాలా కాలం పట్టి ఉంటుంది.
    భయంకరమయిన అలవిమాలిన జంతువులు వెన్నాడి వస్తే ఉపాయంగా దానిలో తలదాచుకుంటాడతడు. అతన్ని తరుముతూ వచ్చినది పులి అయినా సింహమయినా రాతిపలక మూసేస్తే అతనిని ఏమి చేయలేవు.
    కాస్సేపు పోరాడి వెళ్ళిపోతాయి.
    అటువంటి మేధస్సే ప్రకృతిలోని యితర జంతువుల నించి మనిషిని ఉన్నతుడుగా మలిచింది.
    చలినించి రక్షణగా కూడా అది పనికి వస్తుంది.
    దానిలోపల అర్ధమానవుడు కాళ్ళుముడుచుకుని పడుకున్నాడు. అతడు గాఢసుషుప్తిలో ఉన్నాడు.
    రక్తం బాగాపోవటంనించి అతడు శక్తిహీనుడు అయ్యాడు. చలికి తట్టుకోలేక ఒక రాత్రివేళ లేచి దానిలో విశ్రాంతి కోసం పరుండి పోయినాడు.
    పై మూత తొలగించిన అలికిడి కాగానే అతనికి రవంత నిద్రాభంగమైంది. కనులు విప్పిచూచాడు అర్ధమానవుడు. ముందుగా మాలతి కన్పించడంతో లేచి కూర్చున్నాడు. మాలతి చేయి అందించింది.
    గాయాలు యింకా పచ్చిగా ఉన్నాయి.
    ఫిజో కొన్ని ఆకు పసరులు తీసుకువచ్చాడు. గాయానికి కట్టుకట్టి అర్ధమానవుడికి సేవలుచేశారు. ఒకవారం రోజుల తరువాత గాయాలు తగ్గుముఖం పట్టాయి.
    తనకు బాధనించి బయటపడేందుకు సాయంచేస్తే జంతువులు అయినా కృతజ్ఞతగా ఉంటాయి. అర్ధమానవుడిలో అంతకు మించిన వివేచన ఉన్నది.
    అందునించి మాలతి ఫిజోలపట్ల అతడు కృతజ్ఞతా బద్దుడయినాడు. పూటపూట వేటతెచ్చి అందించిన ఫిజో సోదరునిలా కన్పించాడు.
    మరొకవారంపోయాక తిరుగు ప్రయాణానికి వారు సమాయత్తమయినారు. ప్రాణాపాయస్థితినించి కోలుకున్న తరువాత అర్ధమానవునిలో కొన్ని మార్పులు వచ్చాయి.
    తనతోపాటుగా ఉన్న యిరువురూ తనవారే అని అతడు భావించగలుగుతున్నాడు.
    ఒకరోజు సుప్రభాతాన్ని సుముహూర్తంగా నిర్ణయించింది మాలతి. ఆరోజు ఏవారమయిందీ, ఎన్నో తారీకయిందీ వారికి జ్ఞాపకం లేవు.
    తాము అక్కడకు వచ్చి ఎన్నినాళ్ళయిందీ ఖచ్చితంగా గుర్తుకు రాలేదు. చివరి నిముషం వరకూ మాలతి ఫిజోభయపడుతూనే ఉన్నారు.
    అర్ధమానవుడికి భాషరాదు. నేర్పితే కొన్ని మాటలు వచ్చాయి. కాని ఆ మాటల అర్ధాలేమిటో అతనికి వివరంగా తెలియవు.
    అందునించి అతనిని ఈ ప్రకృతి వదనంనుంచి ఎంత దూరంగా ఎంత జన సంకీర్ణమయినా దేశాలలోకి తీసుకుపోతున్నదీ అతనికి తెలియచేయలేకపోయినారు.
    తీరా ప్రయాణమయాక ఆప్యాయంగా అర్ధమానవుడి చేయి అందుకుంది. మైత్రీ పూర్వకమయిన ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయినాడతను.
    వారి ప్రయాణం ప్ర్రారంభమయింది.
    బహుకాలం ఒంటరిగా జీవించిన అనుభవాలకు స్వస్తి చెప్పి జనావాసాలకు అతని ప్రయాణం ఆరంభమయింది.
    చీకటి గుహనించి వెలుగు నిండిన జనపదాలకు ప్రకృతి ఒడినించి ప్రజా సమూహాల మధ్యకు ఆమె చేయి పుచ్చుకొని సాగివచ్చాడు అర్ధమానవుడు.
    
                         14
    
    శారీరకమయిన బాధలనించి అర్ధమానవుడు మరొకరి మీద ఆధారపడవలసి వచ్చింది. బెబ్బులితో పోరాటంలో అతడు అధికాధికంగా రక్తాన్ని కోల్పోయినాడు.
    గాయాలు తగ్గుముఖం పట్టినాయి. కాని శారీరకంగా సంపూర్ణ శక్తివంతుడు కాలేకపోయినాడు. తన పనులకు మరొకరి మీద ఆధారపడటం ప్రారంభించాక మనిషి ఒక రకంగా సోమరిఅవుతాడు.
    ఆసోమరితనంతో వాస్తవమయినా విలువల్ని కోల్పోయినా చాలా సుఖం కన్పిస్తుంది. సుఖజీవనం ఒకసారి రుచి చూచాక అది వ్యసనంగా మారుతుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS